ముంబై: ఓ గ్యాంగ్‌స్టర్ బృందం తనను చంపేస్తానని బెదిరించిందని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. బెదిరింపుల అంశంపై వెంటనే ముంబైలో పోలీసులకు ఆయన ఫిర్యాదుచేశారు. ముంబైలో ఉండే సంజయ్‌రౌత్ ఢిల్లీకొస్తే ఏకే47 తుపాకీతో కాల్చిపడేస్తామని హెచ్చరిస్తూ ఆయనకు వాట్సాప్‌లో సందేశం పంపారు. ఈ ఘటనలో ముంబై పోలీసులు పుణేకు చెందిన 23 ఏళ్ల రాహుల్ తలేకర్‌ను అరెస్ట్‌చేశారు.
కంజుర్‌మార్గ్ పోలీస్‌స్టేషన్‌లో రౌత్ సోదరుడు, ఎమ్మెల్యే సునీల్ ఇచ్చిన ఫిర్యాదు, పోలీసు అధికారి శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. సంజయ్ రౌత్‌కు రాహుల్ తలేకర్ ముందుగా ఫోన్‌లో బెదిరించేందుకు ప్రయత్నించాడు. అది కుదరకపోవడంతో వాట్సాప్‌లో బెదిరిస్తూ మెసేజ్ చేశాడు. ‘రౌత్ హిందువులకు శత్రువు. నువ్వు ఢిల్లీలో కనిపించావంటే ఏకే47తో చంపేస్తా. పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే నీకు పడుతుంది. లారెన్స్ నుంచి వచ్చిన హెచ్చరిక ఇది.
నీ, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ల మరణం తథ్యం. ఇది ఫిక్స్’ అని హెచ్చరించాడు. మూసేవాలాను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బృందం చంపేసిందని ఆరోపణలు ఉన్న విషయం తెల్సిందే. దీంతో మెసేజ్‌లో పేర్కొన్న లారెన్స్‌ను లారెన్స్ బిష్ణోయ్‌గా పోలీసులు భావిస్తున్నారు. తలేకర్‌ను అరెస్ట్‌చేసిన పోలీసులు అతనిని విచారిస్తున్నారు.
సోషల్‌మీడియా ద్వారా బిష్ణోయ్ గురించి తెల్సుకుని, మద్యం తాగిన మైకంలో అతను రౌత్‌కు బెదిరింపు సందేశం పంపినట్లు కేసు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు వార్తలొచ్చాయి. పాత్రా చావల్ కేసులో అరెస్టయి కస్టడీలో ఉన్నప్పుడు తనకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని, వీటిని భయపడేది లేదని రౌత్ స్పష్టంచేశారు. రౌత్‌ను హత్య చేస్తామని బెదిరింపులు రావడాన్ని మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్రమైన అంశంగా పరిగణించాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే డిమాండ్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment