ముంభాయ్ మూవీ | Real life stories in Bollywood Industry | Sakshi
Sakshi News home page

ముంభాయ్ మూవీ

Published Thu, Nov 3 2016 11:29 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

ముంభాయ్ మూవీ

ముంభాయ్ మూవీ

ముంబై గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ అరెస్ట్ అయి అప్పుడే ఏడాది గడిచిపోయింది.  2015 అక్టోబర్ 26న ‘ఇంటర్‌పోల్’ పోలీసులు అతడిని ఇండోనేషియాలోని బాలి దీవిలో అరెస్టు చేసి నవంబర్ 6న ఇండియాకు తరలించారు. ముంబైలో అతడి ప్రాణాలకు ముప్పు ఉండడంతో ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంచారు. అప్పటి నుండి అతడు జైల్లోనే ఉంటున్నాడు.

మరోవైపు అతని పూర్వ మిత్రుడు ప్రస్తుత ప్రధాన విరోధి దావూద్ ఇబ్రహీమ్ పాకిస్తాన్‌లో తల దాచుకుంటూ భారత ప్రభుత్వ వేట నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విశేషం ఏమంటే ఈ అండర్‌వరల్డ్ డాన్‌ల వెంట చట్టం ఎలా పరిగెత్తిందో బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా అంతే పరిగెత్తింది. వారి జీవితాల ఆధారంగా సినిమాలు తీస్తూనే ఉంది.

 
డాన్‌లు లేని హిందీ సినిమాలను ఊహించడం కష్టం. మీట నొక్కితే తెరుచుకునే తలుపులు, క్లబ్ డాన్సులూ, హెలికాప్టర్లు ఇలాంటి సినిమాటిక్ డాన్‌లను నేల మీదకు దించి చూపిన తొలి సినిమా ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’) అనే చెప్పాలి. ఆ తర్వాత విధు వినోద్ చోప్రా తీసిన ‘పరిందా’ డాన్‌ల వాస్తవిక జీవితాన్ని చూపించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ప్రవేశంతో హిందీలో దాదాపుగా సూటూ బూటూ వేసుకునే డాన్‌లు అంతమై, నిజమైన డాన్‌ల కథలు తెర మీదకు వచ్చాయి.

తాజాగా సోనాక్షి సిన్హా ‘హసీనా’ పేరున తయారయ్యే సినిమాలో దావూద్ ఇబ్రహీం చెల్లెలుగా నటించనుండగా అర్జున్ రాంపాల్ హీరోగా గ్యాంగ్‌స్ట్టర్ అరుణ్ గావ్లీ జీవిత కథ ఆధారంగా రూపొందనున్న సినిమా వచ్చే సంవత్సరం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో బాలీవుడ్‌ను ప్రభావితం చేసిన డాన్‌లూ, వారి వల్ల వచ్చిన సినిమాలూ క్లుప్తంగా...
 
ఛోటా రాజన్

అసలు పేరు రాజేంద్ర సదాశివ నికల్జే. 1970లలో బ్లాక్ టిక్కెట్‌లు అమ్ముతూ, అప్పటి ముంబై డాన్ రాజన్ నాయర్ (బడా రాజన్) అనుచరుడిగా చేరి, క్రమంగా గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు. 1980, 90లలో ముంబైని ఛోటా రాజన్ గడగడలాడించాడు. రాజన్‌ని చంపిన ప్రత్యర్థి గ్యాంగ్‌పై పగ తీర్చుకుని ఛోటా రాజన్‌గా పేరుమోశాడు. కొన్నాళ్లు దావూద్ ఇబ్రహీంతో కలిసి పని చేసిన ఛోటా రాజన్ ముంబై పేలుళ్ల తర్వాత అతడి నుంచి విభేదించి, విడిపోయాడు. చివరకు ఇది ఒకరిని మరొకరు వేటాడే పరిస్థితికి తెచ్చింది.

మహేశ్ మంజ్రేకర్ ‘వాస్తవ్’, రామ్ గోపాల్ వర్మ ‘సత్య’ సినిమాలు ఛోటా రాజన్ జీవితం నుంచి తీసుకున్న శకలాల ఆధారంగా తీసినవే. ఆ తర్వాత రామ్‌గోపాల్ వర్మ ‘కంపెనీ’ సినిమా తీసి దావూద్, ఛోటా రాజన్‌ల మధ్య ఉన్న వైరాన్ని కొంచెం కల్పిత కథ ఆధారంగా చూపించాడు. ఇందులో దావూద్‌ను పోలిన పాత్రలో అజయ్ దేవ్‌గణ్, ఛోటా రాజన్‌ను  పోలిన పాత్రలో వివేక్ ఓబెరాయ్ నటించారు.
 
కరీమ్ లాలా

అసలు పేరు అబ్దుల్ కరీమ్ షేర్‌ఖాన్. ఆఫ్ఘనిస్థాన్‌లో పుట్టాడు. 1930లలో ఇండియా వచ్చి, తోటి పఠాన్‌లతో ఒక గ్యాంగ్‌ను ఏర్పరచుకుని, సెటిల్‌మెంట్‌లు మొదలుపెట్టాడు. జూద గృహాలు నడిపాడు. బంగారం, వెండి, ఎలాక్ట్రానిక్ వస్తువులు స్మగ్లింగ్ చేశాడు. డ్రగ్స్ అమ్మాడు. ఇలాంటి ఒక డాన్‌ని చూడడం బొంబాయికి అదే మొదటిసారి. అప్పటికే ఫీల్డులో ఉన్న హాజీ మస్తాన్, వరదరాజన్ ముదలియార్‌లతో సమానంగా నగరాన్ని తన చెప్పుచేతల్లోకి తీసుకున్నాడు. 1970లలో ఈ ముగ్గురి ధాటికి ముంబై తల్లడిల్లింది.

అందుకే 1974లో వచ్చిన ‘జంజీర్’ సినిమాలో లాలాను పోలిన ‘షేర్ ఖాన్’ పాత్ర మనకు కనిపిస్తుంది. దానిని ధరించిన ప్రాణ్‌కు చాలా పేరు వచ్చింది. 1985లో లాలా మేనల్లుడు సమద్‌ఖాన్‌ని దావూద్ ఇబ్రహీం చంపేయడంతో లాలా ప్రాభవం తగ్గడం ప్రారంభమయింది. 2002లో తొంభై ఏళ్ల వయసులో కరీమ్ లాలా చనిపోయాడు.
 
వరదరాజన్ ముదలియార్

కమలహాసన్ ‘నాయకన్’ సినిమా స్టోరీ ముదలియార్ జీవిత కథే. తమిళనాడు తీరప్రాంతం తూత్తుక్కుడి (ట్యుటికోరన్) నుంచి ముంబై వచ్చిన ముదలి యార్ ఓడరేవు కూలీగా జీవితం ప్రారంభించాడు. కొన్నాళ్లు  హాజీ మస్తాన్ సహాయంతో రేవులోని రవాణా సామగ్రిని దొంగిలించేవాడు. ఆ తర్వాత గుడుంబా కాచి అమ్మాడు. ముంబైలోని మాతుంగ, ధారవి, సయాన్-కొలివాడ ప్రాంతాల్లోని తమిళుల నాయకుడిగా ముదలియార్ చాలా గట్టి పాత్ర పోషించాడు.

1980ల మధ్యలో అతడి గ్యాంగ్ కదలికలను ప్రభుత్వం బలంగా నియంత్రించడంతో ముంబై నుంచి చెన్నై వెళ్లిపోయాడు. 1988లో మరణించాడు. మణిరత్నం తీసిన ‘నాయకన్’ సినిమా చూశాక, ముదలియార్ మీద ప్రేమ పెరగడం, ‘కొంచెం ఎక్కువ గొప్పగానే చూపించారు’ అని కామెంట్ చేయడం ఖాయం.
 
అబు సలేమ్
ఇతడి మీద నేరుగా బాలీవుడ్ సినిమా లేకపోయినా ఇతడు బాలీవుడ్‌ను గడగడలాడించేడమే కాదు బాలీవుడ్ నటి మోనికా బేడీని తన ప్రియురాలిగా చేసుకున్నాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న సలేమ్‌ది ఉత్తర ప్రదేశ్‌లోని ఔరంగాబాద్.  ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేసి ముంబై చేరుకున్నాడు. అంధేరీలో ఒక టెలిఫోన్ బూత్ నడిపి, చిన్నాచితక నేరాల వల్ల పోలీసుల రికార్డుకు ఎక్కాడు. 1980లలో దావూద్ సోదరుడు అనీస్‌తో పరిచయం అయ్యాక ‘గన్ రన్నర్’గా మారాడు.

గన్ రన్నర్ అంటే దేశంలోకి అక్రమంగా తుపాకులను తెప్పించేవాడని అర్థం. 1993 ముంబై పేలుళ్ల నిందితులలో సలేమ్ ఒకడు. సుభాష్ ఘయ్, రాజీవ్ రాయ్ వంటి వారిని డబ్బు కోసం బెదిరించాడు. టి-సీరీస్ యజమాని గుల్షన్ కుమార్ హత్య వెనుక సలేమ్ హస్తం ఉందంటారు. 1988లో దావూద్ గ్యాంగ్ నుంచి విడిపోయి దేశం విడిచిన సలేమ్ 2002లో మోనికా బేడీతో  లిస్బన్‌లో అరెస్ట్ అయ్యాడు. 2005లో అతడిని ఇండియాకు రప్పించారు.
 
హాజీ మస్తాన్

జీవితంలో ఎప్పుడూ బుల్లెట్ పేల్చని మాఫియా లీడర్‌గా హాజీమస్తాన్ ఒక వెలుగు వెలిగాడు. అసలు పేరు మస్తాన్ హైదర్ మీర్జా. ఊరు తమిళనాడులోని పణైకుళం. ‘దీవార్’లో అమితాబ్ క్యారెక్టర్, ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయ్’లో అజయ్ దేవగణ్ క్యారెక్టర్... ఆ వెలుగును ఇప్పటికీ సన్నగిల్లకుండా ఉంచాయి! 1934లో ఎనిమిదేళ్ల వయసులో తండ్రితో కలిసి ముంబై వచ్చిన మస్తాన్ టీనేజ్ వచ్చాక ఓడ రేవులో కూలీగా చేరాడు. ఖరీదైన వాచీల స్మగ్లింగ్ మొదలు పెట్టి బంగారపు అచ్చులు, ట్రాన్సిస్టర్లు స్మగుల్ చేశాడు.

ఆ తర్వాత గుడుంబాలోకి దిగాడు. అలా మస్తాన్ సంపన్నుడయ్యాడు. హిందీలో చాలా సినిమాలకు ఫైనాన్స్ చేసిన మస్తాన్ కొన్ని స్వయంగా నిర్మించాడు కూడా. మధుబాలకు గొప్ప ఫ్యాన్ అయిన హాజీ మస్తాన్ ఆమెను చేసుకోలేక, అచ్చు అలాగే ఉన్న సోనా అనే అమ్మాయిని వివాహం చేసుకుని ఆమెతోనే జీవితం గడిపాడు. 1970లలో అరెస్ట్ అయ్యాక మస్తాన్ క్షీణదశ మొదలైంది. 1994లో చనిపోయాడు.
 
అరుణ్ గావ్లీ
అరుణ్ గావ్లీ కుటుంబం మధ్య ముంబైలోని బైకులాలో ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాలకు వీళ్ల కుటుంబం పాలు పోస్తుండేది. గావ్లీ నేర కార్యకలాపాలలో దిగాక ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు. 1980లలో గ్యాంగ్‌స్టర్ రామ్ నాయక్ ద్వారా దావూద్ ఇబ్రహీమ్‌కి నమ్మకస్తుడయ్యాడు. ఆ తర్వాత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకుని ఎమ్మెల్యే అయ్యాడు!  2012 నాటి ఒక నేరానికి సంబంధించి గావ్లీ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతని జీవితం ఆధారంగా అర్జున్ రామ్‌పాల్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతోంది.
 
దావూద్ ఇబ్రహీం

మోస్ట్ నొటోరియస్! పేరు మోసిన మాఫియా డాన్. దావూద్ తండ్రి ఓ పోలీస్ కానిస్టేబుల్. హాజీ మస్తాన్ తన తండ్రిని ఎంతగా అవమాన పరిచేవాడో కళ్లారా చూస్తూ పెరిగాడు. మస్తాన్‌పై కసి పెంచుకున్నాడు. పథకం ప్రకారం మస్తాన్‌ని మించిన డాన్ అయ్యాడు. మొదట పోలీసులతో సత్సంబంధాలు పెట్టుకుని వారి సహాయంతో కరీమ్ లాలా గ్యాంగ్‌లో ఒక్కొక్కరినీ హతమారుస్తూ వచ్చాడు. అలా హాజీ మస్తాన్ రెక్కలు కత్తిరించాడు. భారీ నేరాలకు పాల్పడ్డాడు. బలవంతపు వసూళ్లు, హవాలా వ్యాపారం చేశాడు.

1993 నాటి ముంబై వరుస పేలుళ్ల వెనుక పథక రచన దావూదే అంటారు. ఎస్. హుస్సేన్ రాసిన ‘బ్లాక్ ఫ్రైడే’ ఈ పేలుళ్ల మీద వచ్చిన పుస్తకమే. అదే పేరుతో అనురాగ్ కాశ్యప్ సినిమా కూడా తీశారు. దావూద్ 1984లో దుబాయ్ పారిపోయాడు. ప్రస్తుతం అతడు పాకిస్తాన్‌లో ఉన్నట్లు పోలీసుల దగ్గర సమాచారం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement