
ముంబై: ముంబై(1993) బాంబు పేలుళ్ల నిందితుడు అబూ సలేంను ఊరట లభించింది. తలోజా సెంట్రల్ జైలు నుంచి మరో జైలుకు తరలించవద్దని ముంబై స్పెషల్ కోర్టు ఆదేశించింది.
జైలు మరమ్మత్తుల్లో భాగంగా అబు సలేంను మరో జైలుకు తరలించాలని జైలు అధికారులు భావించారు. అయితే దీనిపై అబు సలేం ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా నిన్న (మంగళవారం) విచారణ జరిపింది. తనకు ప్రాణభయం ఉందని, అందుకే మరో జైలుకు తనను తరలించవద్దని కోరారు. అబూ సలేంపై ఇప్పటికే రెండు సార్లు దాడులు జరిగినట్లు ఆయన తరఫు న్యాయవాదులు తారఖ్ సయ్యద్, అలిషా పారెఖ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రత్యేక కోర్టు జడ్జీ బీడీ షెల్కే అబు సలేంను మరో జైలకు తరలించవద్దని జైలు అధికారులను ఆదేశించారు. తదుపరి విచారణను జూన్ 19వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
సలేం, అతని స్నేహితురాలు మోనికా బేడిలను సెప్టెంబర్ 20, 2002న ఇంటర్‌పోల్ అధికారులు లిస్బన్‌లో అరెస్ట్ చేశారు. 2004లో తమకు అప్పగించేందుకు ఇండియా అనుమతి పొందింది. సెప్టెబంర్ 11, 2005న ఇండియన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నాయ. 2005 నుంచి అబు సలేం తలోజా సెంట్రల్ జైలులోని ‘అండా సెల్’ లో ఉంటున్నారు.
ప్రస్తుతం అబు సలేం ఉంటున్న తలోజా సెంట్రల్ జైల్‌లోని ‘అండా’ సెల్ చాలా భద్రతతో కూడినది. ఇలాంటి ‘అండా’ సెల్స్ కేవలం సెంట్రల్‌జైలులో మాత్రమే ఉంటాయి. అందులో ఒకటి నవీ ముంబైలో ఉన్న తలోజా సెంట్రల్ జైలు.
Comments
Please login to add a commentAdd a comment