Abu Salem
-
మాఫియా డాన్‌తో ప్రేమాయణం.. జైలుకెళ్లిన ఈ నటి గుర్తుందా?
ఒకప్పుడు బాలీవుడ్లో మాఫియా డాన్ల హవా కొనసాగేది. దర్శక నిర్మాతలతో పాటు హీరోహీరోయిన్లతో కూడా వాళ్లకు పరిచయం ఉండేది. ఆ పరిచయం కొందరికి వరంగా మారితే..మరికొందరికి మాత్రం శాపంగా మారింది. మాఫియా డాన్‌తో ప్రేమలో పడి కెరీర్‌ని నాశనం చేసుకోవడమే కాదు.. జైలుకు కూడా వెళ్లింది ఓ హీరోయిన్. ఆ హీరోయిన్ పేరే మోనికా బేడి(Monica Bedi). పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లా చబ్బేవాల్ గ్రామంలో జన్మించిన ఈ బ్యూటీ ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆమె తల్లిదండ్రులు 1979లో నార్వేలోని డ్రామెన్‌కి మారారు.డాన్‌తో ప్రేమలో..మోనికా బేడి కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో మాఫియా డాన్ అబు సలేంతో ప్రేమలో పడింది. అది కూడా విచిత్రంగానే జరిగింది. అబు ఎవరనేది కూడా మొదట్లో మోనికాకు తెలియదు. అతను డాన్ అనే విషయం తెలియకుండానే ప్రేమలో పడిపోయానని ఓ ఇంటర్వ్యూలో మెనికా చెప్పింది. ‘దుబాయ్‌లో ఈవెంట్ కోసం నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది అబు సలేం. ఈవెంట్ కోసం నేను దుబాయ్ వెళ్లినప్పుడు మొదటి సారిగా అబుని కలిశాను. చాలా బాగా చూసుకున్నాడు. అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడేవాడు. అలా 9 నెలల పాటు ఫోన్లోనే మాట్లాడుకున్నాం. అతని మాటలు, కేరింగ్ నచ్చి ప్రేమలో పడిపోయాను.అతని కోసం దుబాయ్ కూడా వెళ్లాను. ప్రేమలో ఉన్నప్పుడు గంటకోసారి ఫోన్ చేసేవాడు. అయితే అతను వ్యాపారవేత్త అనే నాకు తెలుసు. దుబాయ్‌లో బిజినెస్ చేస్తున్నాంటే నాతో చెప్పాడు. అతను డాన్ అనే విషయం నాకు తెలియదు. పేరు కూడా మార్చి చెప్పాడు’ అని మెనికా చెప్పింది.ఐదేళ్లు జైలు శిక్ష!అబుతో ప్రేమలో పడిన తర్వాత మెనికా ఇండస్ట్రీకి దూరం అవుతూ వచ్చింది. సినిమాలు తగ్గించి ఎక్కువ సమయం అతనితోనే గడిపింది. 2002లో సెప్టెంబరు 2002లో, నకిలీ పత్రాలపై దేశంలోకి ప్రవేశించినందుకు పోర్చుగల్ లో ఆమెతో పాటు అబూ సలేం అనే భారతీయ గ్యాంగ్‌స్టర్ అరెస్టు చేశారు. ఆ తరువాత ఆమె ఐదేళ్లు జైలు శిక్ష సైతం అనుభవించింది. ఇలా మాఫియా డాన్‌తో పరిచయమే ఆమె కెరీర్‌ని నాశనం చేసింది. లేదంటే మెనికా బాలీవుడ్లో ఓ స్టార్ హీరోయిన్గా కొనసాగేది. తెలుగులోనూ సినిమాలు..శ్రీకాంత్ హీరోగా నటించి తాజ్ మహల్ సినిమాతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన మోనికా.. త తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. షారుఖ్, సల్మాన్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ నటించింది. అలాగే తెలుగులో శివయ్య , సోగ్గాడి పెళ్ళాం, సర్కస్ సత్తిపండు, చూడాలని వుంది (1998) సినిమాలతో అలరించింది. హిందీ బిగ్‌బాస్ సీజన్ 2 తో పాటు పలు టీవీ షోల్లో పాల్గొంది. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ప్రస్తుతం మెనికా ఎక్కడ ఉంది, ఏం చేస్తుందనే విషయాలు మాత్రం బయటకు రావడం లేదు. View this post on Instagram A post shared by Monica Bedi (@memonicabedi) -
అబూ సలేంకు ముంబై స్పెషల్ కోర్టు ఊరట
ముంబై: ముంబై(1993) బాంబు పేలుళ్ల నిందితుడు అబూ సలేంను ఊరట లభించింది. తలోజా సెంట్రల్ జైలు నుంచి మరో జైలుకు తరలించవద్దని ముంబై స్పెషల్ కోర్టు ఆదేశించింది. జైలు మరమ్మత్తుల్లో భాగంగా అబు సలేంను మరో జైలుకు తరలించాలని జైలు అధికారులు భావించారు. అయితే దీనిపై అబు సలేం ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా నిన్న (మంగళవారం) విచారణ జరిపింది. తనకు ప్రాణభయం ఉందని, అందుకే మరో జైలుకు తనను తరలించవద్దని కోరారు. అబూ సలేంపై ఇప్పటికే రెండు సార్లు దాడులు జరిగినట్లు ఆయన తరఫు న్యాయవాదులు తారఖ్ సయ్యద్, అలిషా పారెఖ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రత్యేక కోర్టు జడ్జీ బీడీ షెల్కే అబు సలేంను మరో జైలకు తరలించవద్దని జైలు అధికారులను ఆదేశించారు. తదుపరి విచారణను జూన్ 19వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.సలేం, అతని స్నేహితురాలు మోనికా బేడిలను సెప్టెంబర్ 20, 2002న ఇంటర్‌పోల్ అధికారులు లిస్బన్లో అరెస్ట్ చేశారు. 2004లో తమకు అప్పగించేందుకు ఇండియా అనుమతి పొందింది. సెప్టెబంర్ 11, 2005న ఇండియన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నాయ. 2005 నుంచి అబు సలేం తలోజా సెంట్రల్ జైలులోని ‘అండా సెల్’ లో ఉంటున్నారు.ప్రస్తుతం అబు సలేం ఉంటున్న తలోజా సెంట్రల్ జైల్లోని ‘అండా’ సెల్ చాలా భద్రతతో కూడినది. ఇలాంటి ‘అండా’ సెల్స్ కేవలం సెంట్రల్‌జైలులో మాత్రమే ఉంటాయి. అందులో ఒకటి నవీ ముంబైలో ఉన్న తలోజా సెంట్రల్ జైలు. -
మాకే పాఠాలు చెప్తున్నారా? కేంద్రంపై సీరియస్
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ అబూ సలేం జైలు శిక్ష వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై వాదనల సందర్భంగా సుప్రీం కోర్టు, కేంద్ర హోంశాఖపై, హోం శాఖ సెక్రటరీపై మండిపడింది. కేంద్ర మంత్రిత్వ శాఖ అభ్యర్థనను తొందరపాటుగా అభివర్ణిస్తూనే.. నిర్ణయాత్మకంగా కేంద్రం వ్యవహరించడం మంచిదికాదని గురువారం అత్యున్నత న్యాయస్థానం మందలించింది. అభ్యర్థన పిటిషన్‌పై ఏం చేయాలో హోం సెక్రటరీ మాకు చెప్పే ప్రయత్నంగా అఫిడవిట్‌ను చూస్తే అనిపిస్తుంది. ఆయన మాకు చెప్పడం కాదు. అది అర్థం చేసుకోండి. మేం ఏం చేయాలో అది చేస్తాం. సమస్యను సరైన సమయంలో పరిష్కరించమని మాకు చెప్పడానికి హోం కార్యదర్శి ఎవరు?. అసలు హోం మంత్రిత్వ శాఖ తన అఫిడవిట్లో.. ‘ఇది సరైన సమయం కాదు’ అనే లైన్‌ను ఎందుకు చేర్చారు అని అభ్యంతరం వ్యక్తం చేశారు జస్టిస్ ఎస్కే కౌల్. 1993 బాంబే పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న అబూ సలేంని.. పోర్చుగల్ నవంబర్ 11, 2005లో బారత్‌కు అప్పగించింది. ఆ సమయంలో 25 ఏళ్లకు మించి జైలు శిక్ష విధించబోమని పోర్చుగల్ న్యాయస్థానాలకు భారత్ చెప్పింది. ఆ మాట ప్రకారం.. 2030, నవంబర్ 10న శిక్షా కాలం ముగుస్తుంది. అయితే తన శిక్షాకాలం ఒప్పందానికి విరుద్ధంగా ఉందంటూ సలేం సుప్రీం కోర్టులో అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశాడు. దీనికి ప్రతిస్పందనగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తరపున కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా.. మంగళవారమే ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పుడే స్పందించడం తొందరపాటు చర్య అవుతుందని ఓ లైన్లో పేర్కొన్నారాయన. అబూ సలేం పిటిషన్‌పై స్పందించడానికి ఇంకా సమయం ఉందని, ఇది సరైన సమయం కాదని అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. ఇది న్యాయస్థానానికి ఆగ్రహం తెప్పించింది. న్యాయవ్యవస్థకు ఉపన్యాసాలు ఇవ్వవద్దు. మీరు నిర్ణయించుకోవాల్సిన విషయాన్ని నిర్ణయించమని మీరు మాకు చెప్పినప్పుడు మేము దానిని దయతో పరిగణనలోకి తీసుకోం. సరైన సమయం కాదని మీరెలా చెప్తారు.. అని జస్టిస్ ఎస్కే కౌల్, హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శిపై మండిపడ్డారు. ఇక 2017లో అబూ సలేంను దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది ఇక్కడి న్యాయస్థానం. ముంబైలో 1993 మార్చి 12న రెండు గంటల వ్యవధిలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో 257 మంది దుర్మరణం చెందగా.. 700 మంది గాయపడ్డారు. చదవండి: ఉచిత పథకాలపై నిర్ణయం ఓటర్లదే!. సుప్రీంలో.. -
ప్రముఖ దర్శకుడికి బెదిరింపులు
ముంబై : అబు సలేం గ్యాంగ్‌కు చెందిన సభ్యుడిగా చెప్పుకుంటూ ఓ వ్యక్తి 35 కోట్ల రూపాయలు ఇవ్వాలని తనను డిమాండ్ చేశాడని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ మంజ్రేకర్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేష్ మంజ్రేకర్ ఫిర్యాదును స్వీకరించి దోపిడీ నిరోధక పోలీస్ విభాగానికి బదలాయించినట్టు అధికారులు తెలిపారు. తన మొబైల్ ఫోన్‌కు అబూ సలేం గ్యాంగ్ సభ్యుడి నంటూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి రూ. 35 కోట్లు డిమాండ్ చేస్తూ మెసేజ్‌లు వచ్చాయని రెండురోజుల కిందట మంజ్రేకర్ దాదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు. సున్నితమైన కేసు కావడం, దోపిడీ, బెదిరింపుల ఆరోపణలు రావడంతో ఈ కేసును ముంబై పోలీస్‌కు చెందిన దోపిడీ నిరోధక విభాగానికి బదలాయించామని వెల్లడించారు. ఇక జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకులు మహేష్ మంజ్రేకర్ నిర్ధేశకత్వంలో తెరకెక్కిన వాస్తవ్, అస్తివ, విరుద్ధ్ వంటి సినిమాలకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి.. కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన 34 ఏళ్ల వ్యక్తి అబూ సలేం ముఠా సభ్యుడిగా పేర్కొంటూ మహేష్ మంజ్రేకర్‌ను బెదిరించినట్టు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు మహారాష్ట్రలోని ఖేడ్ జిల్లాకు చెందిన మిలింద్ తుసంకర్‌గా పోలీసులు గుర్తించారు. తుసంకర్‌ను పోలీస్ కస్టడీకి తరలించారు. బెదిరింపులు, దోపిడీ యత్నం ఆరోపణలతో తుసంకర్పై కేసు నమోదు చేశారు. చదవండి : నాకు, నా ఫ్యామిలీకి ముప్పు : రియా -
పెళ్లి కోసం పెరోల్.. తోసిపుచ్చిన హైకోర్టు
ముంబై : గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు ముంబై హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పెళ్లి కోసం తనకు 45 రోజుల పెరోల్ ఇవ్వాలని అబూ సలేం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వీకే తహిల్ రామిణి, న్యాయమూర్తి ఎంఎస్ సోనక్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం అతడి పిటిషన్‌ను తోసిపుచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా అబూ సలేంకు పెరోల్ ముంజూరు చేయలేమని ధర్మాసనం పేర్కొంది. ఓ కేసు విచారణ నిమిత్తం లక్నోకు తరలించేటప్పడు ముంబ్రాకు చెందిన కౌసర్ బాహర్ అనే మహిళతో ప్రేమలో పడ్డానని.. ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చానని అబూసలేం గతంలో వెల్లడించాడు. కౌసర్ కూడా తనకు అతన్ని పెళ్లి చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపారు. తాను చాలా ఏళ్లుగా జైలులో ఉన్నానని, ఒక మహిళకు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చానని, అందువల్ల తనకు పెరోల్ కల్పించాలని అబూ సలేం తన పిటిషన్లో పేర్కొన్నాడు. గతంలో పలు కేసుల్లో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పులను అతడి లాయర్ ఫర్హానా షా ధర్మాసనం ముందు ఉంచారు. వీటన్నింటిని పరిశీలించిన న్యాయస్థానం అతడి అభ్యర్థనను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది. ముంబై అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడైన అబూ సలేంను, గతేడాది టాడా ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసిన సంగతి విదితమే. కాగా అతడు ప్రస్తుతం తలోజా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. -
‘సంజు’ టీంకు షాకిచ్చిన గ్యాంగ్‌స్టర్
సాక్షి, ముంబై : సంజయ్ దత్ జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన సినిమా ‘సంజు’ . పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. కాగా ఈ సినిమాలో సంజయ్ దత్ వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపించేందుకు మాత్రమే దర్శకుడు తాపత్రయ పడ్డారని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ అబూ సలేం కూడా సంజు మేకర్స్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్న సీన్ 15 రోజుల్లోగా తొలగించాలని, లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తప్పవంటూ’ తన లాయర్ ప్రశాంత్ పాండే ద్వారా అబూ సలేం ‘సంజు’ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించాడు. సంజయ్ దత్‌ను కలవనేలేదు.. ‘1993 ముంబై పేలుళ్ల కేసుకు సంబంధించి తనకు అబూ సలేం ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరఫరా చేశాడని రణ్‌బీర్ కపూర్ చేత చెప్పించారు. అసలు నా క్లైంట్(అబూ సలేం) సంజయ్ దత్‌ను ఒక్కసారి కూడా కలవలేదు, ఎటువంటి ఆయుధాలు సరఫరా చేయలేదు. కాబట్టి ఆయన పరువుకు భంగం కలిగించేలా చిత్రీకరించిన ఈ సీన్‌ను 15 రోజుల్లోగా తొలగించాలి. అదే విధంగా అబూ సలేంకు బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాలి. లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని’ ప్రశాంత్ పాండే నోటీసులో పేర్కొన్నారు. కాగా ముంబై అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడైన అబూ సలేంను దోషిగా నిర్ధారించిన టాడా ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. -
‘బలవంతంగా శాకాహారిగా మారుస్తున్నారు’
ముంబై : డీ గ్యాంగ్ సభ్యుడు, ముంబై పేలుళ్ల కేసులో శిక్ష పడి ముంబైలోని తలోజ జైల్లో ఊచలు లెక్కపెడుతున్న గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు చికెన్ కావాలని డిమాండ్ చేశాడు. తనకు చికెన్ పెట్టట్లేదని, శాకాహారిగా మార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని పోర్చుగీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. తనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేసిన అబూ సలేంను పరీక్షించేందుకు మంగళవారం పోర్చుగీసు నుంచి అధికారులు, వైద్యులు వచ్చారు. సలేంను జైల్లో కలిసిన సమయంలో వారితో పాటు జైలు ఐజీ, తలోజ జైలు ఎస్పీ, ఒక సీబీఐ అధికారితో పాటు, అబూ సలేం తరపున న్యాయవాది సబా ఖురేషీ కూడా ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం మీడియాతో మాట్లాడిన సబా ఖురేషీ.. అబూ సలేంకు ఇచ్చే ఆహారంలో నాణ్యత లేదని, అతను బలవంతంగా శాకాహారం తినాల్సివస్తుందని అన్నారు. అతను ఉన్న గదిలో సూర్యరశ్మి సరిపడా ఉండటం లేదని, ఉపయోగించే టాయిలెట్ చాలా చిన్నదిగా, అపరిశుభ్రంగా ఉన్న కారణంగా అతను అనారోగ్యానికి గురౌవుతున్నాడని ఆమె తెలిపారు. అబూకు మోకాలి నొప్పులు, కంటి చూపు సమస్యలు ఉన్నాయని వాటి కోసమే వైద్యులు పరీక్షించారని వెల్లడించారు. ఒక సంవత్సరకాలంగా అతనితో మాట్లాడేందుకు కొంతమంది భద్రతా సిబ్బందికి అధికారులు అనుమతి ఇచ్చారని, కానీ అతని కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జైల్ ఎస్పీ సదానంద్ గైక్వాడ్ మాట్లాడుతూ.. అబూ సలేం కోరినట్టు తాము అతనికి చికెను ఇవ్వలేమని స్పష్టం చేశారు. వైద్యులు సూచిస్తే మాత్రం, కోడిగుడ్లను ఆహారంలో ఇస్తామని తెలిపారు. ఇతర ఖైదీలు ఉండే గదులు, అబూ సలేం ఉండే గది ఒకే తరహాలో ఉంటాయని ఆయన వెల్లడించారు. వాటిలో స్వచ్ఛమైన గాలి, వెలుతురు ప్రసరిస్తాయని తెలిపారు. అయినా అబూ సలేం ఏదో ఒక కారణంతో అనారోగ్యం అంటూ ఫిర్యాదులు చేస్తాడని అన్నారు. అతడు చేసే ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. -
గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు ఏడేళ్ల జైలు..
న్యూఢిల్లీ : గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలో అతనికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ గురువారం కోర్టు తీర్పునిచ్చింది. 2002లో గ్రేటర్ కైలాష్కు చెందిన అశోక్ గుప్తా అనే వ్యాపారవేత్తను తనకు 5 కోట్లు ఇవ్వాల్సిందిగా అబూ సలేం డిమాండ్ చేశాడు. ఒకవేళ డబ్బులు చెల్లించనట్లు అయితే నీ కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించడంతో.. అబూ సలేంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇంతకాలం కోర్టులో వాదనలు జరుగుతూ వచ్చాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మే 26న అబూ సలేంను దోషిగా తెల్చింది. తాజాగా నేడు అతనికి శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ముంబై అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడైన అబూ సలేంకు, గతేడాది టాడా ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసిన సంగతి విదితమే. -
హీనాతో పెళ్లి.. అబూ సలేంకి ఝలక్
సాక్షి, ముంబై : ముంబై పేలుళ్ల దోషి.. మాజీ డాన్ అబూ సలేంకు ఝలక్ తగిలింది. వివాహం కోసం అతను దాఖలు చేసుకున్న పెరోల్‌ను పోలీసులు తోసిపుచ్చారు. మే 5వ తేదీన సయ్యద్ బహర్ కౌసర్ అలియాస్ హీనాను పెళ్లి చేసుకునేందుకు సలేం సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో 45 రోజుల పెరోల్ కోసం నవీ ముంబై కమిషనర్‌ను సలీం అభ్యర్థించాడు. అయితే పోలీసులు మాత్రం సలేం అభ్యర్థనను తిరస్కరించారు. ఈ విషయాన్ని తలోజా జైలు సూపరిడెంట్ శుక్రవారం ధృవీకరించారు. కాగా, హీనా తొలిసారిగా 2014లో సలీంతోపాటు రైల్లో ప్రయాణించి(ముంబై నుంచి లక్నోకు) వార్తల్లో నిలిచారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో సలేం దోషిగా తేలటంతో.. ప్రత్యేక న్యాయస్థానం అతనికి జీవిత ఖైదును విధించింది. అప్పటి నుంచి తలోజా జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. కాగా, అబూ సలేంతో పెళ్లి జరిపించాలంటూ ముంబ్రాకు చెందిన 25 ఏళ్ల హీనా అప్పట్లో న్యాయ పోరాటానికి సైతం దిగింది. ఈమేరకు ప్రత్యేక అనుమతి కోరుతూ ముంబై టాడా కోర్టును ఆశ్రయించింది. అతనితో నిఖా జరిపించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది కూడా. అయితే కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. సలేంకు మరణశిక్ష విధించకపోవటానికి కారణం ఇదే... -
అబూ సలేంకు జీవిత ఖైదు
తాహిర్, ఫిరోజ్‌లకు మరణశిక్ష.. కరీముల్లాకూ యావజ్జీవం 1993 ముంబై పేలుళ్ల కేసులో టాడా కోర్టు తీర్పు ముంబై: 1993 నాటి ముంబై వరుసపేలుళ్ల కేసులో గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు ప్రత్యేక టాడా కోర్టు యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది. ఈ దారుణ మారణకాండలో క్రియాశీలకంగా వ్యవహరించిన.. తాహిర్ మర్చంట్, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్లకు మరణశిక్ష విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేరపూరిత కుట్రలో భాగస్వాములైన కరీముల్లాఖాన్‌కు యావజ్జీవ శిక్ష, రియాజ్ సిద్దిఖీకి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసు విచారణను గత జూన్ 16న పూర్తిచేసి వీరిని దోషులుగా ప్రకటించిన కోర్టు గురువారం శిక్షలు ఖరారు చేసింది. ఫిరోజ్ ఖాన్‌కు రూ. 4.75 లక్షలు, కరీముల్లా ఖాన్‌కు రూ. 8.88 లక్షలు, తాహిర్ మర్చంట్‌కు రూ. 4.85 లక్షలు, అబూ సలేంకు రూ. 8.51 లక్షలు, రియాజ్ సిద్దిఖీకి రూ. 10వేల జరిమానా విధించింది. ఈ కేసులో దోషిగా తేలిన మరో సూత్రధారి ముస్తఫా దోసాజూన్ 28 జేజే ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. సరైన ఆధారాల్లేనందున అబ్దుల్ ఖయ్యూమ్‌ను విడుదల చేస్తున్నట్లు కోర్టు గతంలోనే ప్రకటించింది. ఈ కేసులో దోషులుగా పేర్కొన్న అందరిపైనా నేరపూరిత కుట్ర, భారత ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించటం, హత్య తదితర అభియోగాలున్నాయి. కాగా, కోర్టు తీర్పును యావద్భారతం స్వాగతించింది. పోర్చుగల్‌తో ఒప్పందం కారణంగా.. ముంబై పేలుళ్ల వ్యూహం అమల్లో గ్యాంగ్‌స్టర్ అబూ సలేం క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే ఘటన తర్వాత ఆయన విదేశాలకు పారిపోయారు. 2002, సెప్టెంబర్ 20న పోర్చుగల్‌లోని లిస్బన్లో ఇంటర్‌పోల్ అబూసలేం, మోనికా బేడీలను అరెస్టు చేసింది. అప్పటినుంచి అబూ సలేంను అప్పగించే విషయంలో భారత్, పోర్చుగల్ దేశాల మధ్య చర్చలు జరిగాయి. 2005లో పోర్చుగీస్ అధికారులు సలేంను భారత్‌కు అప్పగించారు. ఇరుదేశాల మధ్య కుదిరిన నేరస్తుల అప్పగింత ఒప్పందాల ప్రకారం ఆ దేశం అప్పగించిన ఏ దోషికైనా మరణశిక్ష విధించరాదు. అందుకే సలేంకు గురువారం కోర్టు మరణశిక్ష విధించకుండా యావజ్జీవంతో సరిపెట్టింది. కుట్ర అమల్లో అబూ సలేం కీలకం జూన్ 16న తీర్పు సందర్భంగా.. అబూ సలేం ఈ దాడిలో ప్రధాన సూత్రధారి అని ప్రాసిక్యూషన్ వాదించింది. ఇందుకు తగ్గట్లుగా ఆధారాలు చూపించింది. దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీం, ముస్తఫా దోసాలకు అత్యంత సన్నిహితుడైన సలేం తీసుకొచ్చిన ఆయుధాల ద్వారానే తీవ్రమైన విధ్వంసం జరిగిందని కోర్టు కూడా నిర్ధారించింది. జనాలను భయభ్రాంతులకు గురిచేశారని.. అమాయకులను హతమార్చారని మండిపడింది. 24 ఏళ్ల క్రితం నాటి పేలుళ్ల ఘటనలోనే వీరు దోషులైనా.. విచారణ ప్రారంభమయ్యాక వేర్వేరు సందర్భాల్లో వీరు అరెస్టయినందున.. ప్రధాన కేసులో భాగంగా కాకుండా ఈ ఏడుగురి కేసును కోర్టు ప్రత్యేకంగా విచారించింది. భారత్ ఉగ్రపోరుకు ఫలితమిది తీర్పును బీజేపీ, కాంగ్రెస్ స్వాగతించాయి. ఉగ్రవాదులు, కుట్రదారులు, వారికి సాయం చేసే వారిపై భారత్ చేస్తున్న పోరాటానికి ఇది ప్రతిఫలమని బీజేపీ పేర్కొంది. ‘ఉగ్రవాదాన్ని మోదీ ప్రపంచ ప్రధాన ఎజెండాగా మార్చి దీనిపై పోరాటంలో అన్ని దేశాలను ఒకేతాటిపైకి తెస్తున్నారు. ఈ తీర్పు ఉగ్రవాదులు, కుట్రదారులెవరినీ భారత్ వదిలిపెట్టదని స్పష్టం చేసింది’ బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ‘ఉగ్రవాదంపై భారత్ పోరు కొనసాగుతూ ఉంటుంది. అబూ సలేంకు జీవిత ఖైదుతో ఈ కేసులో న్యాయమే గెలిచింది. తర్వాత శిక్షలు పడాల్సింది దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్లకే ’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా పేర్కొన్నారు. అసలేం జరిగింది? 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చేశారు. దీనికి ప్రతీకారంగా దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు దావూద్ ఇబ్రహీం అనుచరులు వ్యూహం రచించారు. 1993 మార్చి12న ముంబైలో ఆర్డీఎక్స్ సాయంతో పలుచోట్ల భారీ విధ్వంసం సృష్టించారు. 13చోట్ల బాంబులను పేల్చారు. ఈ మారణకాండలో 257 మంది మృతి చెందగా.. 700 మందికి గాయాలయ్యాయి. ఈ కేసు విచారణ సందర్భంగా 189 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్, మహ్మద్ అహ్మద్ దోసా సహా 35 మంది సూత్రధాబరులు, పాత్రధారులు పాక్ సహా పలు దేశాలకు పారిపోయారు. టైగర్ మెమన్ సోదరుడు పేలుళ్ల అమల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన యాకూబ్ మెమన్ను జూలై 30, 2015న నాగ్‌పూర్ జైల్లో ఉరితీశారు. శిక్ష పడిన దోషులు వీళ్లే.. తాహిర్ మర్చంట్: ముంబై పేలుళ్ల పథకంలో ఈయన పాత్ర కీలకం. దుబాయ్‌లో జరిగిన ఈ నేరపూరిత కుట్ర వ్యూహరచన సమావేశాల్లో పాల్గొన్నాడు. దాడులకు పాల్పడేందుకు యువకులను గుర్తించి, వారిని రెచ్చగొట్టి, ఉగ్ర శిక్షణ నిమిత్తం వారిని పాకిస్తాన్‌కు తీసుకెళ్లాడు. దావూద్తోపాటుగా ఫిరోజ్, యాకూబ్ మెమన్, టైగర్ మెమన్‌లతో కలిసి కుట్ర అమల్లోనూ భాగమ య్యాడు. ఈ దాడులకోసం ఆయుధాలను సంపాదించేందుకు, భారత్‌లో అక్రమ ఆయుధాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు నిధులు సేకరించాడు. ఫిరోజ్ అబ్దుల్ ఖాన్: పాకిస్తాన్ నుంచి ఆయుధాలు, విస్ఫోటక వస్తువులు భారత్ చేరటంలో ఈయన పాత్ర కీలకం. కస్టమ్స్ అధికారులు, ఏజెంట్లతో మాట్లాడి బోట్ల ద్వారా ఈ సామగ్రి క్షేమంగా భారత్‌కు చేరవేశాడు. పేలుళ్లు మొదలయ్యేంతవరకు అన్ని ఏర్పాట్లలోనూ క్రియాశీలకంగా వ్యవహరించాడు. బాబ్రీ మసీదు విధ్వంసం ఘటనతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన ఫిరోజ్.. విధ్వంస ఏర్పాట్లలో ఎక్కడా లోటు జరగకుండా ప్రతిక్షణం సమీక్షించాడు. ఇందుకే అతణ్ణి ప్రధాన కుట్రదారుగా కోర్టు భావించింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారేందుకూ ఫిరోజ్ సిద్ధపడ్డాడు. అయితే కోర్టు దీన్ని తిరస్కరించింది. కుట్రలో దోషుల పాత్రకు సంబంధించి వీలైనన్ని ఆధారాలున్నందున అప్రూవర్‌గా అంగీకరించబోమని స్పష్టం చేసింది. అబూ సలేం: ముంబై పేలుళ్ల విధ్వంసానికి కావాల్సిన ఆయుధాలను గుజరాత్‌లోని దిఘి నుంచి ముంబైకి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించాడు. జనవరి 16న 1993లో గుజరాత్‌లోని బరూచ్‌కు వెళ్లిన అబూ సలేం.. అక్కడినుంచి మారుతీ వ్యాన్‌లో ఆయుధాలను (6 ఏకే 56 రైఫిళ్లు, బుల్లెట్లు, 100 హ్యాండ్ గ్రనేడ్లు) ముంబైకి తరలించాడు. వాటిని ముంబైలో రియాజ్ సిద్దిఖీకి చేరవేశాడు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇంటికెళ్లి ఆయనకు రెండు రైఫిళ్లు, కొన్ని బుల్లెట్లు, గ్రనేడ్లు దాచమని ఇచ్చాడు. రెండ్రోజుల తర్వాత వాటిని వెనక్కు తీసుకున్నాడు. కరీముల్లా ఖాన్: పేలుళ్ల వ్యూహం అమలుకు సంబంధించిన సమావేశాలకు హాజరయ్యాడు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో దాచిన ఆయుధాలు, డిటొనేటర్లు, గ్రనేడ్లు, ఆర్డీఎక్స్‌లను పేలుళ్లకు ముందు ముంబైలో సరైన వ్యక్తులకు చేరవేయటంలో కీలకంగా వ్యవహరించాడు. దీంతోపాటుగా దుబాయ్ మీదుగా పాకిస్తాన్‌కు వెళ్లి ఆయుధ ఉగ్ర శిక్షణ పొందాడు. రియాజ్ సిద్దిఖీ: గుజరాత్‌నుంచి ముంబైకి ఆయుధాలు, విస్ఫోటక సామాగ్రిని తీసుకురావటం కోసం వ్యాన్‌ను ఏర్పాటుచేశాడు. దీంతోపాటుగా పలు సందర్భాల్లో దోషులకు అవసరమైన సాయం చేశాడు. -
నేరము-శిక్ష
-
ముంబై పేలుళ్ల కేసు: దోషులకు శిక్షలు ఖరారు
సాక్షి,న్యూఢిల్లీ: ముంబై అల్లర్ల కేసులో దోషులకు టాడా ప్రత్యేక కోర్టు గురువారం శిక్షలు ఖరారు చేసింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న అబూ సలేంకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. సలేంతోపాటు మరో నలుగురికి కూడా కోర్టు శిక్షలు ఖరారు చేసేసింది. అండర్ వరల్డ్ డాన్, గ్యాంగ్ స్టర్ అయిన సలేంను పోర్చుగల్ నుంచి భారత్ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడి చట్టాల్లో మరణశిక్ష లేకపోవటంతో ఒప్పందం ప్రకారం ఇక్కడ కూడా సలేంకు అలాంటి శిక్ష విధించే అవకాశం లేకుండా పోయింది. మరో ఇద్దరు దోషులు తెహీర్ మర్చంట్, ఫెరోజ్ ఖాన్ లకు తీవ్ర ఆరోపణల దృష్ట్యా మరణ శిక్షలను ఖరారు చేసేసింది. కరీముల్లా ఖాన్ కు యావజ్జీవ శిక్ష, రియాజ్ సిద్ధిఖీకి 10 ఏళ్ల శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. కేసు ప్రధాన సూత్ర ధారి ముస్తఫా దోసాతోపాటు మరో ఆరుగురిని దోషిగా తేలుస్తూ కోర్టు ఈ యేడాది జూన్ 16న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వంపై యుద్ధం, కుట్రపూరిత నేరం తదితర ఆరోపణలు వీరిపై రుజువయ్యాయి. కానీ, ముస్తఫా గుండెపోటుతో జైల్లోనే మృతి చెందాడు. నిందితులో చాలా మట్టుకు మరణ శిక్ష ఖాయమని కేసు వాదిస్తున్న న్యాయవాది దీపక్ సాల్వీ తీర్పు వెలువడటానికి ముందు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తనపై ఉన్న మిగతా కేసుల దృష్ట్యా తనని ఢిల్లీ జైలుకు తరలించాలని సలేం టాడా కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. దోషులు ఎవరేం చేశారంటే... ముస్తఫా దోసా: భారత్‌కు ఆర్డీఎక్స్ను తీసుకురావటంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. దీంతోపాటుగా కొందరు యువకులను పాకిస్తాన్‌కు పంపి ఆయుధాల వినియోగంలో శిక్షణనిప్పించాడు. అబూ సలేం: ఆయుధాలను గుజరాత్‌నుంచి ముంబైకి తరలించాడు. ఈ కేసులో దోషిగా శిక్ష పూర్తిచేసుకున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు కూడా 1993 జనవరి 16న సలేం ఏకే 56 ఆయుధాలతోపాటు 250 రౌండ్ల బుల్లెట్లు, కొన్ని గ్రనేడ్లను అందించాడు. తిరిగి జనవరి 18న సంజయ్‌దత్ ఇంటికొచ్చి వీటిని అబూసలేం తీసుకెళ్లాడు. తాహిర్ మర్చంట్: పాకిస్తాన్‌కు ఉగ్ర శిక్షణకు వెళ్లాల్సిన యువకులను గుర్తించి వారిని రెచ్చగొట్టాడు. భారత్‌లో అక్రమంగా ఆయుధ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు నిధులను సేకరించాడు. ఫిరోజ్ అబ్దుల్ ఖాన్: ఆయుధాలను తీసుకోవటంలో కస్టమ్స్ అధికారులు, ఏజెంట్లతో మాట్లాడి.. వాటిని జాగ్రత్తగా అనుకున్న లక్ష్యాలకు చేర్చాడు. దీంతోపాటుగా వ్యూహాల్లో భాగస్వామిగా ఉన్నాడు. గతేడాది మే చివర్లో విచారణ సందర్భంగా అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమయ్యాడు. రియాజ్ సిద్దిఖీ: అబూసలేం ఆయుధాలు తరలించేందుకు వాహనాన్ని సమకూర్చటంతోపాటుగా పలు సందర్భాల్లో దోషులకు సహాయంగా వెళ్లాడు. కరీముల్లా ఖాన్: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో దాచిన ఆయుధాలు, డిటోనేటర్లు, గ్రనేడ్లను సరైన వ్యక్తులకు చేరవేయటంలో కీలకంగా వ్యవహరించాడు. దుబాయ్ మీదుగా పాకిస్తాన్‌కు వెళ్లి ఆయుధ శిక్షణ పొందాడు. టైమ్‌లైన్: 12 మార్చి, 1993: గంట వ్యవధిలో 13 చోట్ల బాంబులు పేలి 257 మంది మృతి, 713 మందికి గాయాలు. 19 ఏప్రిల్, 1993: ఏకే–56 రైఫిల్‌ను, 9ఎంఎం పిస్టల్‌ను, తుటాలను అక్రమంగా కలిగి ఉన్నాడనే అభియోగంపై సినీనటుడు సంజయ్‌దత్ అరెస్టు. 15 రోజులకే బెయిల్‌పై విడుదల. 4 నవంబరు 1993: ముంబై క్రైంబ్రాంచ్ ప్రాథమిక చార్జిషీట్ దాఖలు. 189 మందిపై అభియోగాలు. 117వ నిందితుడిగా సంజయ్‌దత్. 19 నవంబరు 1993: ఈ కేసు సీబీఐకి అప్పగింత. 10 ఏప్రిల్ 1994: 26 మందిని నిర్దోషులుగా తేల్చిన టాడా కోర్టు. ఏప్రిల్ 1995 – సెప్టెంబరు 2003: టాడా కోర్టులో విచారణ. అప్రూవర్లుగా మారిన నిందితులు మహ్మద్ జమీల్, ఉస్మాన్ జానకనన్. జూన్ 13 2003: అబూసలేం, ముస్తఫా దోసా సహా ఏడుగురు నిందితులను ప్రధాన కేసునుంచి వేరుచేసి.. విచారణ జరపాలని కోర్టు నిర్ణయం. సెప్టెంబరు 12, 2006: టాడా కోర్టు తీర్పు. యాకూబ్ మెమన్‌తో సహా 12 మందికి మరణశిక్ష, మరో 20 మందికి జీవిత ఖైదు 31 జులై, 2007: సంజయ్‌దత్‌కు ఆరేళ్ల జైలుశిక్ష 21 మార్చి 2013: యాకూబ్ మెమన్‌కు మరణశిక్షను ఖరారు చేసిన సుప్రీం. మరో 10 మంది మరణశిక్ష.. యావజ్జీవ కారాగారశిక్షగా మార్పు. 29 జులై, 2015: యాకూబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. 30 జులై, 2015: నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో యాకూబ్ మెమన్‌కు ఉరి అమలు 25 ఫిబ్రవరి, 2016: సత్ప్రవర్తన కారణంగా 8 నెలల శిక్ష తగ్గి జైలునుంచి సంజయ్‌దత్ విడుదల. 16 జూన్, 2017: అబూసలేంతో సహా మొత్తం ఆరుగురిని దోషులుగా తేల్చిన టాడా కోర్టు. 07, సెప్టెంబర్, 2017: ముస్తాఫా చనిపోవటంతో మిగిలిన దోషులకు శిక్షలు ఖరారు చేసేసింది. -
ముంబై కేసు: నిందితులకు శిక్షలు ఖరారు
-
ముంబై పేలుళ్ల కేసు.. జడ్జిమెంట్ డే
ముంబై: మారణహోమం సృష్టించి వందల మంది ప్రాణాలను బలితీసుకున్న ముంబై పేల్లుళ్ల కేసు నిందితులకు శిక్షలు ఖరారు చేసేందుకు టాడా(ఉగ్ర కార్యకలపాల నిరోధక చట్టం) ప్రత్యేక న్యాయస్థానం సిద్ధమయ్యింది. గ్యాంగ్ స్టర్ అబూ సలేంతో సహా ఐదుగురికి సెప్టెంబర్ 7న శిక్షలు ఖరారు చేయనున్నట్లు సమాచారం. పేలుళ్ల కేసులో ఆరుగురిని నిందితులుగా పేర్కొంటూ జూన్ 16, 2017న కోర్టు తీర్పు వెలువరించింది. ముస్తఫా డొస్సా, అబూ సలేం, కరీముల్లా ఖాన్, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్, రియాజ్ సిద్ధిఖీ మరియు తహీర్ మర్చంట్లను దోషులుగా పేర్కొంటూ మరో నిందితుడు అబ్దుల్ ఖయ్యూమ్ ను నిర్దోషిగా పేర్కొంది. అయితే శిక్షలు మాత్రం ఖరారు చేయకపోవటంతో వాదనలు ఇంకా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కొద్ది రోజులకే జూన్ 28న ప్రధాన దోషి ముస్తఫా డొస్సా గుండెపోటుతో మృతి చెందాడు. ఇక మిగిలిన వారి శిక్షలు ఖరారు చేసేందుకు సెప్టెంబర్ 7న ముహుర్తం ఖరారైందని తెలుస్తోంది. నేరపూరిత కుట్ర, ప్రభుత్వం వ్యతిరేకంగా యుద్ధానికి పిలుపునివ్వటం, హత్య నేరాలు వారిపై రుజువు అయ్యాయి. తుది తీర్పు సమయంలో దోషుల శిక్ష విషయంలో క్షమాగుణం ప్రదర్శించకుండా కఠిన శిక్షలు ప్రాసిక్యూషన్ కోరింది కూడా. ముస్తాఫాతో సహా నలుగురికి మరణశిక్షలు, అబూతోపాటు రియాజ్ కు జీవిత కాల ఖైదు విధించాలని విజ్నప్తి చేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి శిక్షలు విధించబోతున్నారన్న ఆసక్తి నెలకొంది. మార్చి 12,1993 న జరిగిన పేలుళ్లలో సుమారు 275 మంది ప్రాణాలు బలితీసుకున్న ఈ మారణకాండపై తుదితీర్పు 2300-2400 పేజీలతో కోర్టు సిద్ధం చేయటం విశేషం. -
పెళ్లి చేసుకునేందుకు మాఫియా డాన్ పిటిషన్
ముంబయి: అతి దారుణమైన ముంబయి పేలుళ్ల కేసు (1993, మార్చి 12)లో ప్రధాన నిందితుడిగా ఉన్న పెళ్లి చేసుకునేందుకు అండర్ వరల్డ్ డాన్,గ్యాంగ్‌స్టర్ అబు సలేం పెళ్లి చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. 257 మంది చనిపోవడానికి, 713మంది గాయాలపాలవడానికి కారణమైన సలేం ముంబ్రా మహిళను పెళ్లి చేసుకునేందుకు రిజిష్ట్రార్ కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతి కోరాడు. 1993నాటి ముంబయి పేలుళ్లకు కీలక సూత్రదారి అయిన అబూ సలేంను 2005లో పోర్చుగల్ నుంచి భారత్‌కు అరెస్టు చేసి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాదాపు అరడజను కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడిని కోర్టు దోషిగా కూడా తేల్చింది. అయితే, సలేం 2015లో తొలిసారి పెళ్లి అనుమతి కోసం పిటిషన్ పెట్టుకున్నాడు. అయితే, అప్పట్లో అతడి పిటిషన్ పెండింగ్‌లో పడింది. తాజాగా సోమవారం అతడు మరోసారి వివాహం చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతడి వివాహం చేసుకునేందుకు తాత్కాలిక బెయిల్‌కు అనుమతినిస్తూ ముంబయి, ఢిల్లీ కోర్టులు ఇచ్చిన ఆదేశాలను తాజా పిటిషన్లో పేర్కొన్నాడు. గతంలో ఈ పిటిషన్ టాడా కోర్టులో పెండింగ్‌లో ఉంది. -
అబూసలేం, ముస్తఫా దోషులే!
ముంబై పేలుళ్ల కేసులో టాడా ప్రత్యేక కోర్టు నిర్ధారణ ► మరో నలుగురినీ దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం ► సోమవారం నుంచి శిక్షలపై విచారణ ప్రారంభం! ముంబై: 1993 నాటి ముంబై పేలుళ్ల కేసులో సూత్రధారి ముస్తఫా దోసా, గ్యాంగ్‌స్టర్ అబూ సలేం సహా ఆరుగురిని టాడా ప్రత్యేక కోర్టు శుక్రవారం దోషులుగా నిర్ధారించింది. అబ్దుల్ ఖయ్యూం అనే మరో నిందితుడిని సరైన ఆధారాల్లేనందున నిర్దోషిగా ప్రకటించింది. 24 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో వీరికి విధించాల్సిన శిక్షలపై వాదనలు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. రియాజ్ సిద్దిఖీ మినహా మిగిలిన ఐదుగురు అబూసలేం, ముస్తఫా , కరీముల్లా ఖాన్, ఫిరోజ్, అబ్దుల్ రషీద్ ఖాన్, తాహిర్ మర్చంట్లను నేరపూరిత కుట్ర, భారత శిక్షాస్మృతి, టాడా కింద హత్యానేరంతోపాటు వివిధ కేసులు, విధ్వంసక సామాగ్రి, ఆయుధాలు కలిగి ఉండటం, ప్రజల ఆస్తులను విధ్వంసం చేసిన కేసుల్లో దోషులుగా ప్రకటించారు. సిద్దిఖీ మాత్రం అబూసలేం, ఇతరులకు ఆయుధాలు సరఫరా చేయటంలో సహకరించిన నేరంలో టాడా చట్టాల కింద దోషిగా తేల్చారు. వీరంతా తొలి విడత విచారణ చివర్లో అరెస్టయినందున వీరి విచారణను కోర్టు ప్రధాన కేసు నుంచి వేరుగా చేసి విడిగా విచారించింది. దుబాయ్ మీదుగా పాక్‌కు.. 257 మందిని పొట్టనపెట్టుకున్న 24 ఏళ్ల క్రితం జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి రెండో విడత విచారణలో భాగంగా టాడా కోర్టు తాజా తీర్పునిచ్చింది. 2007 నాటి తొలి æవిడత విచారణలో కోర్టు 100 మందిని దోషులుగా, 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. 750 మంది ప్రాసిక్యూషన్ సాక్షులు, 50 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు రికార్డు చేసింది. సీబీఐ విచారణలో సలేంతోపాటుగా ముగ్గురు తమ నేరాన్ని అంగీకరించారు బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలో టైగర్ మెమన్, యాకూబ్ మెమన్, మహ్మద్ దోసా, ముస్తఫా దోసాతో సహా పలువురు ఈ దాడులకు కుట్ర పన్నారు. ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం ముస్తఫా, టైగర్ మెమన్, ఛోటా షకీల్‌లు పాకిస్తాన్లో ఉగ్ర శిక్షణ క్యాంపులు నిర్వహించారు. భారత్ నుంచి దుబాయ్ మీదుగా పాకిస్తాన్‌కు యువకులను తీసుకెళ్లి వారికి ఆయుధ శిక్షణనిచ్చారు. దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్, టైగర్ మెమన్లు ఇంకా పరారీలోనే ఉన్నారు. వీరంతా పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నట్లు భావిస్తున్నారు. ప్రపంచలోనే ఆర్డీఎక్స్ (సైక్లోట్రైమిథిలిన్ ట్రైనైట్రమిన్)ను భారీ సంఖ్యలో వినియోగించిన తొలి ఉగ్రదాడి ఇదే. ఆనాటి ఘటనలో 27 కోట్ల విలువైన ఆస్తులు ధ్వంసం మయ్యాయి. దావూద్‌నూ శిక్షించండి 1993 నాటి ఘటనకు ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీంను భారత్‌కు తీసుకొచ్చి శిక్ష విధించినపుడే అసలైన న్యాయం జరిగినట్లని ముంబై పేలుళ్ల బాధితులు, బంధువులు తెలిపారు. దావూద్‌ను ఉరితీస్తేనే న్యాయం గెలిచినట్లని పేలుళ్లలో తల్లిని కోల్పోయిన తుషార్ప్రీతి తెలిపారు. దోషులు ఏం చేశారు? ముస్తఫా దోసా: భారత్‌కు ఆర్డీఎక్స్ను తీసుకురావటంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. దీంతోపాటుగా కొందరు యువకులను పాకిస్తాన్‌కు పంపి ఆయుధాల వినియోగంలో శిక్షణనిప్పించారు. అబూ సలేం: ఆయుధాలను గుజరాత్‌నుంచి ముంబైకి తరలించాడు. ఈ కేసులో దోషిగా శిక్ష పూర్తిచేసుకున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు కూడా 1993 జనవరి 16న సలేం ఏకే 56 ఆయుధాలతోపాటు 250 రౌండ్ల బుల్లెట్లు, కొన్ని గ్రనేడ్లను అందించాడు. తిరిగి జనవరి 18న సంజయ్‌దత్ ఇంటికొచ్చి వీటిని అబూసలేం తీసుకెళ్లాడు. తాహిర్ మర్చంట్: పాకిస్తాన్‌కు ఉగ్ర శిక్షణకు వెళ్లాల్సిన యువకులను గుర్తించి వారిని రెచ్చగొట్టాడు. భారత్‌లో అక్రమంగా ఆయుధ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు నిధులను సేకరించాడు. ఫిరోజ్ అబ్దుల్ ఖాన్: ఆయుధాలను తీసుకోవటంలో కస్టమ్స్ అధికారులు, ఏజెంట్లతో మాట్లాడి.. వాటిని జాగ్రత్తగా అనుకున్న లక్ష్యాలకు చేర్చాడు. దీంతోపాటుగా వ్యూహాల్లో భాగస్వామిగా ఉన్నాడు. గతేడాది మే చివర్లో విచారణ సందర్భంగా అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమయ్యాడు. రియాజ్ సిద్దిఖీ: అబూసలేం ఆయుధాలు తరలించేందుకు వాహనాన్ని సమకూర్చటంతోపాటుగా పలు సందర్భాల్లో దోషులకు సహాయంగా వెళ్లాడు. కరీముల్లా ఖాన్: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో దాచిన ఆయుధాలు, డిటోనేటర్లు, గ్రనేడ్లను సరైన వ్యక్తులకు చేరవేయటంలో కీలకంగా వ్యవహరించాడు. దుబాయ్ మీదుగా పాకిస్తాన్‌కు వెళ్లి ఆయుధ శిక్షణ పొందాడు. ముంబై పేలుళ్ల కేసు ముఖ్యాంశాలు ♦ బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్లు ముంబైలో వరుస బాంబుపేలుళ్లకు కుట్ర పన్నారు. 1993 మార్చి 12వ తేదీన ముంబై బాంబులతో దద్దరిల్లింది. ఆర్డీఎక్స్ను పేలుళ్లకు ఉపయోగించారు. ప్రధాన కూడళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో... మొత్తం 13 చోట్ల బాంబులను పేల్చారు. ఈ పేలుళ్లలో 257 మంది చనిపోగా, 713 మంది గాయపడ్డారు. ♦ మొత్తం 189 మందిపై అభియోగాలు నమోదు కాగా.. విచారణ ఆరంభంలోనే 26 మందిని టాడా ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తేల్చింది. తర్వాత మరో నలుగురిని వేర్వేరు కోర్టులు నిర్దోషులుగా ప్రకటించాయి. ♦ నిందితుల్లో 35 మంది పరారీలో ఉన్నారు. వారిలో దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్, మహ్మద్ అహ్మద్ ఉమర్ దోసా ముఖ్యులు. ♦ పేలుళ్ల కుట్రకు వ్యూహం రచించినప్పటినుంచీ.. ఆర్డీఎక్స్, ఆయుధాల అక్రమ రవాణా, బాంబులు అమర్చే వారిని గుర్తించి వారికి పని అప్పజెప్పడం, డబ్బులు ముట్టజెప్పడం దాకా అన్నింటినీ టైగర్ మెమన్ పర్యవేక్షించాడు. పేలుళ్ల తర్వాత దుబాయ్‌కి పారిపోయాడు. ఇతని సోదరుడు, సహనిందితుడు యాకూబ్ మెమన్ను 2015 జులై 30న ఉరితీశారు. టైమ్‌లైన్: 12 మార్చి, 1993: గంట వ్యవధిలో 13 చోట్ల బాంబులు పేలి 257 మంది మృతి, 713 మందికి గాయాలు. 19 ఏప్రిల్, 1993: ఏకే–56 రైఫిల్‌ను, 9ఎంఎం పిస్టల్‌ను, తుటాలను అక్రమంగా కలిగి ఉన్నాడనే అభియోగంపై సినీనటుడు సంజయ్‌దత్ అరెస్టు. 15 రోజులకే బెయిల్‌పై విడుదల. 4 నవంబరు 1993: ముంబై క్రైంబ్రాంచ్ ప్రాథమిక చార్జిషీట్ దాఖలు. 189 మందిపై అభియోగాలు. 117వ నిందితుడిగా సంజయ్‌దత్. 19 నవంబరు 1993: ఈ కేసు సీబీఐకి అప్పగింత. 10 ఏప్రిల్ 1994: 26 మందిని నిర్దోషులుగా తేల్చిన టాడా కోర్టు. ఏప్రిల్ 1995 – సెప్టెంబరు 2003: టాడా కోర్టులో విచారణ. అప్రూవర్లుగా మారిన నిందితులు మహ్మద్ జమీల్, ఉస్మాన్ జానకనన్. జూన్ 13 2003: అబూసలేం, ముస్తఫా దోసా సహా ఏడుగురు నిందితులను ప్రధాన కేసునుంచి వేరుచేసి.. విచారణ జరపాలని కోర్టు నిర్ణయం. సెప్టెంబరు 12, 2006: టాడా కోర్టు తీర్పు. యాకూబ్ మెమన్‌తో సహా 12 మందికి మరణశిక్ష, మరో 20 మందికి జీవిత ఖైదు 31 జులై, 2007: సంజయ్‌దత్‌కు ఆరేళ్ల జైలుశిక్ష 21 మార్చి 2013: యాకూబ్ మెమన్‌కు మరణశిక్షను ఖరారు చేసిన సుప్రీం. మరో 10 మంది మరణశిక్ష.. యావజ్జీవ కారాగారశిక్షగా మార్పు. 29 జులై, 2015: యాకూబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. 30 జులై, 2015: నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో యాకూబ్ మెమన్‌కు ఉరి అమలు 25 ఫిబ్రవరి, 2016: సత్ప్రవర్తన కారణంగా 8 నెలల శిక్ష తగ్గి జైలునుంచి సంజయ్‌దత్ విడుదల. 16 జూన్, 2016: అబూసలేంతో సహా మొత్తం ఆరుగురిని దోషులుగా తేల్చిన టాడా కోర్టు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ముంబై భారీ పేలుళ్ల కేసులో తీర్పొచ్చింది
ముంబయి: ముంబై పేలుళ్ల కేసులో టీడా కోర్టు తీర్పును వెలువరించింది. అబూసలేంతో సహా మొత్తం ఏడుగురుని దోషులుగా టాడా కోర్టు దోషులుగా ప్రకటించింది. హత్య, కుట్ర కేసు కింద విధించనున్న శిక్షపై స్పష్టత రావాల్సి ఉంది. 1993 మార్చి 12న ముంబయిలో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 257మంది మృతి చెందగా వందలాది మంది గాయాలపాలయ్యారు. ఈ పేలుళ్లకు సూత్రదారి అయిన దావూద్ ఇబ్రహీం పాక్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇబ్రహీంకు కీలక అనుచరుడైన గ్యాంగ్‌స్టర్ అబూ సలేంతోపాటు ఆరుగురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై అభియోగాలు నమోదుచేయగా తాజాగా శుక్రవారం టాడా కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా తీర్పు వెలువరించిన న్యాయస్థానం తొలుత ముస్తాఫా దోసాను దోషిగా ప్రకటించింది. ఇతడిపై ఆయుధాలు దిగుమతి చేసేందుకు సహకరించడంతోపాటు పేలుళ్ల కుట్ర అమలుచేసేందుకు ముంబయి, దుబాయ్ నగరాల్లో ఏర్పాటుచేసిన సమావేశాల్లో పాల్గొన్నట్లు అభియోగాలు ఉన్నాయి. ఆ సమావేశాల్లో దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమాన్ కూడా ఉన్నాడు. అలేగే, మరో నిందితుడు ఫిరోజ్ ఖాన్, తాహిర్ మర్చంట్‌ను కూడా కోర్టు దోషిగా ప్రకటించింది. వీరిపై కుట్రను అమలుచేయడం కోసం భారత్‌లో మహ్మద్ దోసా నిర్వహించిన సమావేశంలో పాల్గొనడంతోపాటు పెద్ద మొత్తంలో ఆయుధాలను దొంగ మార్గంలో తరలించేందుకు సహాయం చేసిన ఆరోపణలు ఉన్నాయి. తాహిర్పై మాత్రం ఆయుధాలను బాంబులు పేల్చే నైపుణ్యం నేర్చుకునే మనుషులను ముంబయి నుంచి పాక్ పంపించినట్లు ఆరోపణలున్నాయి. అలాగే, కరీముల్లాఖాన్ను, ఖయ్యూం షేక్‌ను, రియాజ్ సిద్ధిఖీని కూడా కోర్టుదోషులుగా ప్రకటించింది. చివరిగా కీలక నిందితుడిగా భావిస్తున్న అబూసలేంను కోర్టు దోషిగా పేర్కొంది. -
నెలరోజులు జైల్లో ఉంటా..: ఐఏఎస్ అధికారి
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఐఏఎస్ అధికారికి చిత్రమైన కోరిక కలిగింది. గుణ జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న నియాజ్ ఖాన్ కొన్నాళ్లు జైలుకు వెళ్తానని అడుగుతున్నారు. ఏదో నేరం చేసి జైలుకు వెళ్లడం కాదు.. జైల్లో ఉన్న మాఫియా డాన్ అబూ సలేం కథ రాద్దామని తాను అనుకుంటున్నానని, అందుకోసం తనకు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజేష్ జైన్‌ను కోరారు. నియాజ్ ఖాన్ ప్రస్తుతం ఓ నవల రాస్తున్నారు. అందుకోసం ఒక నెల రోజుల పాటు అబూ సలేంతో పాటు జైల్లో ఉంటానని అడుగుతున్నారు. అబూ సలేం జీవితం మీద ఎక్కువగా దృష్టిపెట్టి తన ఐదో నవల రాస్తున్నానని, అతడి క్యారెక్టర్‌ను పరిశీలించడానికి, అతడి రోజువారీ జీవితం గురించి తెలుసుకోడానికి నెల రోజుల పాటు జైల్లో సలేంతో గడిపేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరానని ఖాన్ చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియని కలెక్టర్ రాజేష్ జైన్.. ఆ లేఖను భోపాల్‌లోని తన సీనియర్లకు పంపారు. 'లవ్ డిమాండ్స్ బ్లడ్' అనే పేరుతో ఖాన్ తన ఐదో నవల రాస్తున్నారు. ఇది థ్రిల్లర్‌గా ఉండబోతోంది. దాన్ని పూర్తి చేయడానికే అబూ సలేం జీవితాన్ని సమగ్రంగా తెలుసుకోవాలని ఆయన భావిస్తున్నారు. 1995లో జరిగిన ప్రదీప్ జైన్ అనే బిల్డర్ హత్య కేసులో అబూసలేం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అతడిపై దాదాపు 54 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒకనాటి బాలీవుడ్ నటి మోనికా బేడీ అతడి ప్రియురాలు. -
ముంభాయ్ మూవీ
ముంబై గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ అరెస్ట్ అయి అప్పుడే ఏడాది గడిచిపోయింది. 2015 అక్టోబర్ 26న ‘ఇంటర్‌పోల్’ పోలీసులు అతడిని ఇండోనేషియాలోని బాలి దీవిలో అరెస్టు చేసి నవంబర్ 6న ఇండియాకు తరలించారు. ముంబైలో అతడి ప్రాణాలకు ముప్పు ఉండడంతో ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంచారు. అప్పటి నుండి అతడు జైల్లోనే ఉంటున్నాడు. మరోవైపు అతని పూర్వ మిత్రుడు ప్రస్తుత ప్రధాన విరోధి దావూద్ ఇబ్రహీమ్ పాకిస్తాన్లో తల దాచుకుంటూ భారత ప్రభుత్వ వేట నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విశేషం ఏమంటే ఈ అండర్‌వరల్డ్ డాన్ల వెంట చట్టం ఎలా పరిగెత్తిందో బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా అంతే పరిగెత్తింది. వారి జీవితాల ఆధారంగా సినిమాలు తీస్తూనే ఉంది. డాన్లు లేని హిందీ సినిమాలను ఊహించడం కష్టం. మీట నొక్కితే తెరుచుకునే తలుపులు, క్లబ్ డాన్సులూ, హెలికాప్టర్లు ఇలాంటి సినిమాటిక్ డాన్లను నేల మీదకు దించి చూపిన తొలి సినిమా ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’) అనే చెప్పాలి. ఆ తర్వాత విధు వినోద్ చోప్రా తీసిన ‘పరిందా’ డాన్ల వాస్తవిక జీవితాన్ని చూపించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ప్రవేశంతో హిందీలో దాదాపుగా సూటూ బూటూ వేసుకునే డాన్లు అంతమై, నిజమైన డాన్ల కథలు తెర మీదకు వచ్చాయి. తాజాగా సోనాక్షి సిన్హా ‘హసీనా’ పేరున తయారయ్యే సినిమాలో దావూద్ ఇబ్రహీం చెల్లెలుగా నటించనుండగా అర్జున్ రాంపాల్ హీరోగా గ్యాంగ్స్ట్టర్ అరుణ్ గావ్లీ జీవిత కథ ఆధారంగా రూపొందనున్న సినిమా వచ్చే సంవత్సరం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో బాలీవుడ్‌ను ప్రభావితం చేసిన డాన్లూ, వారి వల్ల వచ్చిన సినిమాలూ క్లుప్తంగా... ఛోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ నికల్జే. 1970లలో బ్లాక్ టిక్కెట్లు అమ్ముతూ, అప్పటి ముంబై డాన్ రాజన్ నాయర్ (బడా రాజన్) అనుచరుడిగా చేరి, క్రమంగా గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు. 1980, 90లలో ముంబైని ఛోటా రాజన్ గడగడలాడించాడు. రాజన్ని చంపిన ప్రత్యర్థి గ్యాంగ్‌పై పగ తీర్చుకుని ఛోటా రాజన్‌గా పేరుమోశాడు. కొన్నాళ్లు దావూద్ ఇబ్రహీంతో కలిసి పని చేసిన ఛోటా రాజన్ ముంబై పేలుళ్ల తర్వాత అతడి నుంచి విభేదించి, విడిపోయాడు. చివరకు ఇది ఒకరిని మరొకరు వేటాడే పరిస్థితికి తెచ్చింది. మహేశ్ మంజ్రేకర్ ‘వాస్తవ్’, రామ్ గోపాల్ వర్మ ‘సత్య’ సినిమాలు ఛోటా రాజన్ జీవితం నుంచి తీసుకున్న శకలాల ఆధారంగా తీసినవే. ఆ తర్వాత రామ్‌గోపాల్ వర్మ ‘కంపెనీ’ సినిమా తీసి దావూద్, ఛోటా రాజన్ల మధ్య ఉన్న వైరాన్ని కొంచెం కల్పిత కథ ఆధారంగా చూపించాడు. ఇందులో దావూద్‌ను పోలిన పాత్రలో అజయ్ దేవ్‌గణ్, ఛోటా రాజన్‌ను పోలిన పాత్రలో వివేక్ ఓబెరాయ్ నటించారు. కరీమ్ లాలా అసలు పేరు అబ్దుల్ కరీమ్ షేర్‌ఖాన్. ఆఫ్ఘనిస్థాన్‌లో పుట్టాడు. 1930లలో ఇండియా వచ్చి, తోటి పఠాన్లతో ఒక గ్యాంగ్‌ను ఏర్పరచుకుని, సెటిల్మెంట్లు మొదలుపెట్టాడు. జూద గృహాలు నడిపాడు. బంగారం, వెండి, ఎలాక్ట్రానిక్ వస్తువులు స్మగ్లింగ్ చేశాడు. డ్రగ్స్ అమ్మాడు. ఇలాంటి ఒక డాన్ని చూడడం బొంబాయికి అదే మొదటిసారి. అప్పటికే ఫీల్డులో ఉన్న హాజీ మస్తాన్, వరదరాజన్ ముదలియార్లతో సమానంగా నగరాన్ని తన చెప్పుచేతల్లోకి తీసుకున్నాడు. 1970లలో ఈ ముగ్గురి ధాటికి ముంబై తల్లడిల్లింది. అందుకే 1974లో వచ్చిన ‘జంజీర్’ సినిమాలో లాలాను పోలిన ‘షేర్ ఖాన్’ పాత్ర మనకు కనిపిస్తుంది. దానిని ధరించిన ప్రాణ్‌కు చాలా పేరు వచ్చింది. 1985లో లాలా మేనల్లుడు సమద్ఖాన్ని దావూద్ ఇబ్రహీం చంపేయడంతో లాలా ప్రాభవం తగ్గడం ప్రారంభమయింది. 2002లో తొంభై ఏళ్ల వయసులో కరీమ్ లాలా చనిపోయాడు. వరదరాజన్ ముదలియార్ కమలహాసన్ ‘నాయకన్’ సినిమా స్టోరీ ముదలియార్ జీవిత కథే. తమిళనాడు తీరప్రాంతం తూత్తుక్కుడి (ట్యుటికోరన్) నుంచి ముంబై వచ్చిన ముదలి యార్ ఓడరేవు కూలీగా జీవితం ప్రారంభించాడు. కొన్నాళ్లు హాజీ మస్తాన్ సహాయంతో రేవులోని రవాణా సామగ్రిని దొంగిలించేవాడు. ఆ తర్వాత గుడుంబా కాచి అమ్మాడు. ముంబైలోని మాతుంగ, ధారవి, సయాన్-కొలివాడ ప్రాంతాల్లోని తమిళుల నాయకుడిగా ముదలియార్ చాలా గట్టి పాత్ర పోషించాడు. 1980ల మధ్యలో అతడి గ్యాంగ్ కదలికలను ప్రభుత్వం బలంగా నియంత్రించడంతో ముంబై నుంచి చెన్నై వెళ్లిపోయాడు. 1988లో మరణించాడు. మణిరత్నం తీసిన ‘నాయకన్’ సినిమా చూశాక, ముదలియార్ మీద ప్రేమ పెరగడం, ‘కొంచెం ఎక్కువ గొప్పగానే చూపించారు’ అని కామెంట్ చేయడం ఖాయం. అబు సలేమ్ ఇతడి మీద నేరుగా బాలీవుడ్ సినిమా లేకపోయినా ఇతడు బాలీవుడ్‌ను గడగడలాడించేడమే కాదు బాలీవుడ్ నటి మోనికా బేడీని తన ప్రియురాలిగా చేసుకున్నాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న సలేమ్ది ఉత్తర ప్రదేశ్‌లోని ఔరంగాబాద్. ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేసి ముంబై చేరుకున్నాడు. అంధేరీలో ఒక టెలిఫోన్ బూత్ నడిపి, చిన్నాచితక నేరాల వల్ల పోలీసుల రికార్డుకు ఎక్కాడు. 1980లలో దావూద్ సోదరుడు అనీస్‌తో పరిచయం అయ్యాక ‘గన్ రన్నర్’గా మారాడు. గన్ రన్నర్ అంటే దేశంలోకి అక్రమంగా తుపాకులను తెప్పించేవాడని అర్థం. 1993 ముంబై పేలుళ్ల నిందితులలో సలేమ్ ఒకడు. సుభాష్ ఘయ్, రాజీవ్ రాయ్ వంటి వారిని డబ్బు కోసం బెదిరించాడు. టి-సీరీస్ యజమాని గుల్షన్ కుమార్ హత్య వెనుక సలేమ్ హస్తం ఉందంటారు. 1988లో దావూద్ గ్యాంగ్ నుంచి విడిపోయి దేశం విడిచిన సలేమ్ 2002లో మోనికా బేడీతో లిస్బన్లో అరెస్ట్ అయ్యాడు. 2005లో అతడిని ఇండియాకు రప్పించారు. హాజీ మస్తాన్ జీవితంలో ఎప్పుడూ బుల్లెట్ పేల్చని మాఫియా లీడర్‌గా హాజీమస్తాన్ ఒక వెలుగు వెలిగాడు. అసలు పేరు మస్తాన్ హైదర్ మీర్జా. ఊరు తమిళనాడులోని పణైకుళం. ‘దీవార్’లో అమితాబ్ క్యారెక్టర్, ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయ్’లో అజయ్ దేవగణ్ క్యారెక్టర్... ఆ వెలుగును ఇప్పటికీ సన్నగిల్లకుండా ఉంచాయి! 1934లో ఎనిమిదేళ్ల వయసులో తండ్రితో కలిసి ముంబై వచ్చిన మస్తాన్ టీనేజ్ వచ్చాక ఓడ రేవులో కూలీగా చేరాడు. ఖరీదైన వాచీల స్మగ్లింగ్ మొదలు పెట్టి బంగారపు అచ్చులు, ట్రాన్సిస్టర్లు స్మగుల్ చేశాడు. ఆ తర్వాత గుడుంబాలోకి దిగాడు. అలా మస్తాన్ సంపన్నుడయ్యాడు. హిందీలో చాలా సినిమాలకు ఫైనాన్స్ చేసిన మస్తాన్ కొన్ని స్వయంగా నిర్మించాడు కూడా. మధుబాలకు గొప్ప ఫ్యాన్ అయిన హాజీ మస్తాన్ ఆమెను చేసుకోలేక, అచ్చు అలాగే ఉన్న సోనా అనే అమ్మాయిని వివాహం చేసుకుని ఆమెతోనే జీవితం గడిపాడు. 1970లలో అరెస్ట్ అయ్యాక మస్తాన్ క్షీణదశ మొదలైంది. 1994లో చనిపోయాడు. అరుణ్ గావ్లీ అరుణ్ గావ్లీ కుటుంబం మధ్య ముంబైలోని బైకులాలో ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాలకు వీళ్ల కుటుంబం పాలు పోస్తుండేది. గావ్లీ నేర కార్యకలాపాలలో దిగాక ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు. 1980లలో గ్యాంగ్‌స్టర్ రామ్ నాయక్ ద్వారా దావూద్ ఇబ్రహీమ్‌కి నమ్మకస్తుడయ్యాడు. ఆ తర్వాత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకుని ఎమ్మెల్యే అయ్యాడు! 2012 నాటి ఒక నేరానికి సంబంధించి గావ్లీ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతని జీవితం ఆధారంగా అర్జున్ రామ్‌పాల్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతోంది. దావూద్ ఇబ్రహీం మోస్ట్ నొటోరియస్! పేరు మోసిన మాఫియా డాన్. దావూద్ తండ్రి ఓ పోలీస్ కానిస్టేబుల్. హాజీ మస్తాన్ తన తండ్రిని ఎంతగా అవమాన పరిచేవాడో కళ్లారా చూస్తూ పెరిగాడు. మస్తాన్‌పై కసి పెంచుకున్నాడు. పథకం ప్రకారం మస్తాన్‌ని మించిన డాన్ అయ్యాడు. మొదట పోలీసులతో సత్సంబంధాలు పెట్టుకుని వారి సహాయంతో కరీమ్ లాలా గ్యాంగ్‌లో ఒక్కొక్కరినీ హతమారుస్తూ వచ్చాడు. అలా హాజీ మస్తాన్ రెక్కలు కత్తిరించాడు. భారీ నేరాలకు పాల్పడ్డాడు. బలవంతపు వసూళ్లు, హవాలా వ్యాపారం చేశాడు. 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల వెనుక పథక రచన దావూదే అంటారు. ఎస్. హుస్సేన్ రాసిన ‘బ్లాక్ ఫ్రైడే’ ఈ పేలుళ్ల మీద వచ్చిన పుస్తకమే. అదే పేరుతో అనురాగ్ కాశ్యప్ సినిమా కూడా తీశారు. దావూద్ 1984లో దుబాయ్ పారిపోయాడు. ప్రస్తుతం అతడు పాకిస్తాన్లో ఉన్నట్లు పోలీసుల దగ్గర సమాచారం ఉంది. -
ప్రయాణం మధ్యలో.. భార్యతో డాన్ ఎంజాయ్
మాఫియా డాన్లు అరెస్టయినా, వాళ్లకు కావల్సిన సర్వసుఖాలు అందుతాయన్నది అందరికీ తెలిసిందే. కొన్నిసార్లు జైళ్లే వాళ్లకు ఫైవ్ స్టార్ హోటళ్లలా మారిపోతే, మరికొన్నిసార్లు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. సరిగ్గా ఇలాగే చేస్తున్నాడు గ్యాంగ్‌స్టర్ అబూ సలేమ్. తరచు విచారణల కోసం లక్నో, ఢిల్లీ వెళ్లేటప్పుడు మధ్యలో రైల్వేస్టేషన్లలోని వెయిటింగ్ రూంలో తన భార్యను కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి మిడ్ డే పత్రిక కొన్ని ఫొటోలను బయటపెట్టింది. అబూసలేమ్ తన భార్య సయ్యద్ బహార్ కౌసర్ (26)తో పాటు పలువురు కుటుంబ సభ్యులను కూడా వెయిటింగ్ రూమ్‌లలో కలుస్తున్నట్లు ఈ ఫొటోల ద్వారా తెలుస్తోంది. అక్కడే సెల్ఫోన్లలో మాట్లాడుతూ కూడా కనిపించాడు. ప్రస్తుతం తలోజా జైల్లో ఉన్న అబూసలేంను విచారణ కోసం వేర్వేరు నగరాలకు పోలీసులు తీసుకెళ్తుంటారు. సరిగ్గా ఇదే అంశాన్ని సలేం తనకు అవకాశంగా మార్చుకున్నాడు. రైల్వేస్టేషన్ వెయిటింగ్ రూంలలో తన భార్యను, ఇతర కుటుంబ సభ్యులను కలిశాడు. ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అబూ సలేంను తాను పెళ్లిచేసుకుంటానని, అందుకు అనుమతి ఇవ్వాలని కౌజర్ గత జూన్ నెలలో కోర్టును కోరింది. మధ్యలో ఒకసారి అతడిని పెళ్లి చేసుకోవడం వల్ల తన జీవితం నాశనం అయ్యిందంటూ మీడియాకు ఎక్కింది. కానీ తాజా ఫొటోలు చూస్తే మాత్రం.. ఇద్దరూ ఎంచక్కా ఉన్నట్లు తెలుస్తోంది. భార్యాభర్తలు చెట్టపట్టాలు వేసుకున్నప్పటి ఫొటోలను మిడ్ డే ప్రచురించింది. వీళ్లిద్దరి పెళ్లి ఒక కదులుతున్న రైల్లో బంధువులు, ఎస్కార్ట్ పోలీసుల సమక్షంలో జరిగినట్లు మీడియా కథనాలు వచ్చాయి. వాళ్లే అబూసలేంకు సెల్‌ఫోన్ కూడా ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. -
మాఫియా డాన్‌కు జైల్లో రాచమర్యాదలు
జైల్లో తనను చిత్రహింసలు పెడుతున్నారని, జీవితాన్ని దుర్భరంగా మార్చారని బయటకు చెబుతున్న అండర్ వరల్డ్ డాన్ అబూ సలేం.. నిజానికి జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. అక్కడ అతగాడికి సొంత పనిమనిషి ఉన్నాడు, తోటి ఖైదీలకు పార్టీలు ఇస్తుంటాడు. దాని కోసం ఒకోసారి ఇంటి నుంచి ఆహారం తెప్పిస్తే.. కొన్నిసార్లు కేఎఫ్‌సీ నుంచి చికెన్ కూడా స్మగుల్ చేయించుకుంటున్నాడు. ఈ విషయాలన్నింటినీ అబూసలేంను గతంలో చిత్రహింసలు పెట్టారన్న ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న తలోజా జైలు సూపరింటెండెంట్ హరిలాల్ జాదవ్ వెల్లడించారు. జాదవ్ తనను హింసించారంటూ టాడా కోర్టులో అబూసలేం 16 పేజీల అఫిడవిట్ దాఖలు చేశాడు. దాంతో జైళ్ల ఐజీ బిపిన్ కుమార్ సింగ్ ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే, సలీం వ్యాఖ్యలను ఖండిస్తూ.. విచారణ కమిటీకి జాదవ్ 5 పేజీల సమాధానం ఇచ్చారు. అందులో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. హత్యానేరానికి జీవితఖైదు అనుభవిస్తున్న అబూసలేం సాగిస్తున్న అరాచకాల పుట్టను అందులో వివరించారు. రాజా ఉత్తలింగం నాడార్ అనే ఖైదీ ఇతడి కోసం దుస్తులు ఉతకడం, అన్నం వడ్డించడం, టీ చేయడం, అతడి సెల్ శుభ్రం చేయడం, గిన్నెలు కడగడం లాంటి పనులన్నీ చేస్తాడని జాదవ్ చెప్పారు. ఇవన్నీ కూడా నిజమేనని నాడార్ కూడా చెప్పాడు. 2010 జూలై వరకు ఆర్థర్ రోడ్డు జైల్లో ఉన్న అబూ సలేంపై.. అప్పట్లో దావూద్ ఇబ్రహీం అనుచరుడైన ముస్తఫా దోసా అనే ఖైదీ దాడి చేశాడు. దాంతో సలేంను తలోజా జైలుకు తరలించారు. అప్పటినుంచి సలేంకు 25 మంది పోలీసులతో భద్రత కల్పించాలని కోర్టు సూచించినా.. సిబ్బంది కొరత కారణంగా జైలు అధికారులు ఆ స్థాయి భద్రత కల్పించలేకపోయారు. దానికి బదులుగా అతడి సెల్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటుచేసి, ఇద్దరు పోలీసులను కాపలా పెట్టారు. అయితే, ఇది తన భద్రత కోసం కాదని.. తన మీద నిఘా కోసమే పెట్టారంటూ అబూసలేం ఆరోపించాడు. -
దావూద్ చిక్కేనా!
సెంట్రల్ డెస్క్: అబూ సలేం, చోటా రాజన్ దొరికారు. ఇప్పు డు అందరి దృష్టి మాఫియా దందాను విస్తరించి ఒకప్పుడు ముంబైని శాసించిన ‘బిజినెస్‌మన్’పై పడింది. భారత్ మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్స్‌లో మొదటివాడైన దావూద్ ఇబ్రహీంను భారత్‌కు పట్టితేవడం సాధ్యమేనా? ఐఎస్ఐ నీడలో పాకిస్తాన్‌లోని కరాచీలో దావూద్ సురక్షితంగా ఉన్నాడు. ఇటీవలే అతని భార్య భారత్‌లోని ఓ టీవీ ఛానల్ విలేకరితో మాట్లాడింది కూడా. దావూద్ పడుకున్నాడని, అతని భార్యను మాట్లాడుతున్నానని స్పష్టంగా చెప్పింది. అయితే పాకిస్తాన్ మాత్రం ఎప్పటిలాగే పాతపాటే పాడింది. తమ దేశంలో దావూద్ లేడని చెప్పింది. మరోవైపు భారత్ మాత్రం గట్టి ఆధారాలు పాక్‌కు అందజేశామంటోంది. కానీ ఈ ఏడాది మే నెలలో పార్లమెంటులో సమాధానం చెప్పాల్సి వచ్చినపుడు మాత్రం దావూద్ ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి అతన్ని వెనక్కితెచ్చే ప్రక్రియను ప్రారంభించలేకపోతున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. భారత నిఘా వ్యవస్థల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దావూద్‌కు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయడం లేదని మాజీ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. భద్రతను కల్పించడమే కాకుండా తరచూ మకాం మార్చాల్సిందిగా దావూద్‌కు ఐఎస్ఐ సలహాలిస్తోంది. అతని కదలికలన్నీ ఐఎస్ఐ కనుసన్నల్లోనే జరుగుతాయని చెబుతారు. కరాచీలో పలు వ్యాపారాల్లో దావూద్ భారీ పెట్టుబడులు కూడా పెట్టినట్లు సమాచారం. ఒసామా బిన్ లాడెన్‌తో సన్నిహిత సంబంధాలు నెరిపాడని చెప్పి... అమెరికా 2003లో దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించింది. అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి చేయడం ద్వారా పాక్ మెడలు వంచితే... దావూద్‌ను భారత్‌కు తెప్పించడం సాధ్యపడొచ్చు. లాడెన్‌ను అమెరికా హతమార్చినపుడు రాజకీయంగా తీవ్ర ఇరకాటాన్ని ఎదుర్కొన్న పాక్ పాలకులు... మరోసారి అలాంటి పరిస్థితిని కోరుకుంటారా? దావూద్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిచ్చిన ఐఎస్ఐ... తమ రహస్యాలు బయటపడటానికి అంగీకరిస్తుందా? -
డాన్ అబూ సలేంతో పెళ్లికి యువతి పోరాటం
థానే: మీరు చదివింది నిజమే. రకరకాల కేసుల్లో దోషిగా తేలి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తోన్న మాఫియా డాన్ అబూ సలేంతో పెళ్లి జరిపించాలంటూ 25 ఏళ్ల యువతి చిన్నపాటి పోరాటానికి దిగింది. ఈమేరకు ప్రత్యేక అనుమతి కోరుతూ ముంబై టాడా కోర్టును ఆశ్రయించింది. అతనితో నిఖా జరిపించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. ఒకప్పుడు ఒకటిగా జీవించిన మోనికా బేడీనే ప్రస్తుతం అబూ సలేంకు దూరంగా ఉంటోంటే.. కొత్త సంచలనానికి తెరలేపిన ఈ మహిళ ఎవరు? అసలెందుకు అతణ్ని పెళ్లాడాలనుకుంటోంది? అంటే.. ధానే జిల్లా మంబ్రా పట్టణానికి చెందిన సయ్యద్ బహార్ కౌసర్ (25) కామర్స్ గ్రాడ్యుయేట్. తన పనేదో తాను చేసుకునే రకం. ఉన్నట్టుండి ఓ రోజు పోలీసులు ఆమె ఇంటికొచ్చి.. గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకూ నీకూ సంబంధమేంటని ప్రశ్నించారు. సమాధానం రికార్డుచేసుకుని వెళ్లిపోయారు. అంతటితో ఆగిపోకుండా లక్నో, ఆజంగఢ్, గుజరాత్, తదితర ప్రాంతాల్లో ఉంటోన్న కౌసర్ బంధువులందరి దగ్గరికీ వెళ్లి 'ఫలానా మీ బందువుల అమ్మాయికి మాఫియా డాన్ అబూ సలేంకు మధ్య ఉన్న సంబంధం గురించి మీకేమైనా తెలుసా?' అంటూ వివరాలు సేకరించారు. 2014లో అబూను ముంబై నుంచి లక్నోకు తరలిస్తుండగా రైలులోనే ఫోన్ ద్వారా నిఖా చేసుకున్నారని పోలీసుల ఆరోపణ. సీన్ కట్ చేస్తే.. ప్రస్తుతం కౌసర్ గురించి వాళ్ల బంధువులందరూ అదో రకంగా మాట్లాడుకుంటున్నారట. దీంతో ఆమెను పెళ్లి చేసుకునేందుకు యువకులెవరూ ముందుకు రావట్లేదట. 'మార్ఫింగ్ ఫొటోలు చూపించి పోలీసులు నా జీవితాన్ని నాశనం చేశారు. వాళ్లు ఆరోపిస్తున్నట్లు అబూ సలేంతో సంబంధాన్ని కొనసాగించడం తప్ప ప్రస్తుతం నాకు వేరేదారిలేదు. ఇప్పటికే చాలా అవమానాలు పడ్డాను. ఏదైతేనేం ఆయన్ని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నా' అంటూ టాడా కోర్టుకు రాసిన లేఖలో తన గోడు వెల్లడించింది కౌసర్. తమ నిఖాకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ముంబైలోని మ్యారేజ్ రిజిస్ట్రార్ ను ఆదేశించాలని జడ్జిగారిని కోరింది. తల్లి, సోదరుడు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇదంతా సరే ఇంతకీ మీకు నిజంగానే గ్యాగ్స్టర్తో సంబంధం ఉందా? అని కౌసర్‌ను ప్రశ్నిస్తే.. 'సంబంధం ఉందన్న పోలీసుల ఆరోపణతో నా జీవితమే మారిపోయింది. అప్పుడు నిజంగా సంబంధం ఉన్నా లేకున్నా పెద్ద తేడాలేదు కదా!' అని సమాధానమిచ్చింది. ఆమె విజ్ఙప్తిపై న్యాయమూర్తి ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే. -
అదృష్టం లిఫ్ట్ లాంటిది!
‘‘హార్డ్‌వర్క్ మెట్లదోవ లాంటిది. అదృష్టం లిఫ్ట్ లాంటిది. కొన్నిసార్లు లిఫ్ట్ ఫెయిల్ అవుతుంది. కానీ, మెట్లు మనల్ని పైపైకి తీసుకెళతాయి. నేనెప్పుడూ మెట్లనే నమ్ముకుంటా’’ అంటున్నారు మోనికా బేడీ. చేసిన సినిమాల కన్నా మాఫియా డాన్ అబూ సలేం ప్రియురాలిగానే ఎక్కువ ప్రాచుర్యం పొందారామె. తెలుగులో తాజ్‌మహల్, సోగ్గాడి పెళ్లాం.. ఇలా రెండు, మూడు చిత్రాల్లో నటించిన మోనికా హిందీ చలనచిత్ర సీమలో కొన్ని చిత్రాలు చేశారు. పాస్‌పోర్ట్ కుంభకోణం, మాఫియాతో సంబంధాల వల్ల జైలు శిక్షనూ అనుభవించారు. గతం గతః అనుకుని, భవిష్యత్తు గురించి బంగారు కలలు కంటున్నారు మోనికా. ఇటీవల పంజాబీ చిత్రం ‘రోమియో రాంఝా’లో డీఎస్పీగా పవర్ఫుల్ రోల్ చేశారామె. అలాగే, బుల్లితెర కోసం ‘బంధన్’ అనే షో చేస్తున్నారు. ఇది కాకుండా ‘సరస్వతీచంద్ర’ అనే ధారావాహికలో నెగటివ్ టచ్ ఉన్న రోల్ చేశారు. కథకు కీలకమైనవి అయితే, సినిమాల్లో కూడా ఈ తరహా పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని మోనికా తెలిపారు. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు అవకాశం వస్తే, తప్పకుండా చేస్తానని పేర్కొన్నారు. -
అబూసలేం పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం
న్యూఢిల్లీ: మాఫీయా డాన్ అబూసలేం పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నకిలీ పాస్‌పోర్టు కేసులో ఏడేళ్ల జైలుశిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. 2001లో ఈ నేరానికి పాల్పడినందుకు అబూ సలేంతోపాటు బాలీవుడ్ నటి మోనికా బేడీని సెప్టెంబర్ 2002లో పోర్చుగల్‌లోని లిస్బన్లోని ఓ షాపింగ్ మాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు నిందితులను నవంబర్ 11, 2005లో భారత్‌కు తీసుకు వచ్చారు. 2007లో మౌనికా బేడీని భోపాల్ కోర్టు నిర్ధోషిగా ప్రకటించడంతో మోనికా బేడి జైలు నుంచి విడుదల అయ్యింది. హైదరాబాద్ సీబీఐ నాంపల్లి కోర్టు అబూ సలేంకు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే అబూసలెం రైలులో వివాహం చేసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. -
అబుసలేంను థానే జైలుకు తరలింపు
హైదరాబాద్ : నకిలీ పాస్‌పోర్టుల కేసులో ఏడేళ్లు శిక్ష పడిన మాఫియా డాన్ అబూసలేంను పోలీసులు మహరాష్ట్ర థానే జైలుకు తరలించారు. ఇప్పటికే అబూ సలేం 6 సంవత్సరాల 10 రోజులు జైలుశిక్ష అనుభవించాడు. పన్నెండేళ్ల తర్వాత అబూసలేం కేసులో నాంపల్లి కోర్టు గురువారం తుది తీర్పును వెల్లడించింది. అబూసలేంపై 120 (బి), 490, 471 సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారమే ఈ కేసులో అబూసలేంను దోషిగా నిర్థారించారు. ఇదే కేసులో సినీ నటి మోనికా బేడి మూడేళ్ల జైలుశిక్ష అనుభవించింది. -
మాఫియాడాన్‌కు ఏడేళ్ల శిక్ష
-
మాఫియా డాన్ అబూ సలేంకు ఏడేళ్ల జైలుశిక్ష
నకిలీ పాస్ పోర్టుల కేసులో మాఫియా డాన్ అబూ సలేంకు నాంపల్లి క్రిమినల్ కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. పన్నెండేళ్ల తర్వాత అబూ సలేం కేసులో కోర్టు తుది తీర్పును వెల్లడించింది. అబూసలేంపై 120 (బి), 490, 471 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారమే నకిలీ పాస్ పోర్ట్ కేసులో అబూ సలేంను దోషిగా నిర్ఱారించారు. ఇప్పటికే అబూ సలేం 6 సంవత్సరాల 10 రోజులు జైలుశిక్ష అనుభవించారు. ఇదే కేసులో సినీ నటి మోనికా బేడి మూడేళ్ల జైలుశిక్ష అనుభవించింది. -
అబూసలేం దోషి
సాక్షి, హైదరాబాద్: నకిలీ పాస్‌పోర్టు కేసులో మాఫియా డాన్ అబూసలేంను దోషిగా సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. అబూసలేంకు విధించే శిక్ష ఈనెల 28న ఖరారవుతుందని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రమణ నాయుడు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో 39 మంది సాక్షుల వాంగ్మూలాలను, 60 డాక్యుమెంట్లను పరిశీలించి అనంతరం, భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని 420, 419, 471, 468 రెడ్‌విత్ 120(బి) సెక్షన్ల కింద అబూసలేంను దోషిగా నిర్ధారించినట్టు కోర్టు సోమవారం పేర్కొంది. కర్నూలు చిరునామాతో రమిల్‌కమిల్ మాలిక్ అన్న పేరుతో అబూసలేం, అతని భార్య సమీరాజుమానీ, ప్రియురాలు సినీ నటి మోనికాబేడీ 2001లో నకిలీ పాస్‌పోర్టులను పొందారు. అనంతరం వారు పోర్చుగల్‌కు పరారయ్యారు. వారిపై రెడ్‌కార్నర్ నోటీసులు జారీ కావడంతో పోర్చుగల్ రాజధాని లిస్బన్లో 2002 సెప్టెంబర్‌లో అక్కడి పోలీసులు వారిని అరెస్టు చేశారు. అనంతరం 2005 నవంబర్ 11న వారిని పోర్చుగల్ నుంచి సీబీఐ అధికారులు మనదేశానికి తీసుకొచ్చారు. ఇదే కేసులో మోనికాబేడీకి కోర్టు గతంలో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. నిందితులుగా ఉన్న కర్నూలు ఎస్పీ కార్యాలయ ఉద్యోగి శ్రీనివాస్, హెడ్‌కానిస్టేబుల్ సత్తార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహ్మద్ యూనస్, పోస్టుమన్ గోకారీ సాహెబ్‌లకు ఇప్పటికే సీబీఐ కోర్టు శిక్ష విధించింది. కేసులో రెండో నిందితురాలైన అబూసలేం భార్య సమీరా జుమానీ ఆచూకీని వరకు సీబీఐ కనిపెట్టదు. దీనితో ఆమెపై విచారణ పెండింగ్‌లో ఉంది. ఇక, ముంబై జైల్లోని అబూసలేంను సోమవారం ప్రత్యేక కోర్టులో హాజరుపర్చాల్సి ఉన్నా...భద్రతా కారణాల రీత్యా హాజరుపర్చలేదు. ఈనెల 28న శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో అబూసలేంను కోర్టులో హాజరుపర్చనున్నారు. -
అబూసలేంను దోషిగా నిర్ధారించిన సిబిఐ కోర్టు
హైదరాబాద్: నకిలీ పాస్‌పోర్టు కేసులో అండర్ వరల్డ్ డాన్ అబూసలేంను సిబిఐ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ నెల 28న కోర్టు శిక్ష ఖరారు చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని అజామ్‌ఘర్ జిల్లాకు చెందిన అబూసలేం కర్నూలు వాసిగా నకిలీ పత్రాలు సృష్టించి పాస్‌పోర్టు పొంది విదేశాలకు పారిపోయాడు. దాంతో అతని పేరు మోస్టు వాంటెడ్ జాబితో చేరింది. 2002 సెప్టెంబర్ 20న పోర్చ్గల్లో సినీనటి మోనికాబేడీతోపాటు అతనిని అరెస్టు చేశారు. 2004లో ఇతర కేసుల విచారణ నిమిత్తం పోర్చ్‌గల్ కోర్టు అతనిని భారతదేశం పంపడానికి అనుమతి ఇచ్చింది. అబూసలేంపై దాదాపు 50 కేసులు ఉన్నాయి. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో కూడా అతను నిందితుడు. -
నగల దుకాణ దోపిడీ భగ్నం
ఠాణే: నగరంలోని ఓ నగల దుకాణంలో దోపిడీని పోలీసులు నిలువరించారు. గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో అరెస్టయిన ఇద్దరు నిందితుల్లో గ్యాంగ్‌స్టర్ అబూ సలేం మాజీ సహచరుడు రాజేశ్ హాతణ్‌కర్ ఉన్నాడని నౌపాడా పోలీసు స్టేషన్ సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ జేడీ మోరే శుక్రవారం తెలిపారు. రద్దీగా ఉండే నౌపాడ ప్రాంతంలోని ఓ నగల దుకాణంలో ముఠా సభ్యులు దాడి చేయాలన్న నిర్ణయించుకున్నారన్న సమాచారం ఆధారంగానే అక్కడ కాపు కాశామని తెలిపారు. అక్కడకు చేరుకున్న ఐదుగురిలో ముగ్గురు తప్పించుకోగా, ఇద్దరి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అబూ సలేం మాజీ సహచరుడైన కుర్లాకు చెందిన రాజేశ్ హాతణ్‌కర్ , కల్వాకు చెందిన సచిన్ కేదర్‌గా గుర్తించామన్నారు. వీరి నుంచి కత్తులు, తుపాకులను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఇదే ముఠా రెండు రోజుల క్రితం చరాయి ప్రాంతంలో ఓ నగల దుకాణాన్ని లూటీ చేసేందుకు యత్నించి విఫలమైందని తెలిపారు. ఠాణే, ముంబైలోని వివిధ పోలీసు స్టేషన్లలో రాజేశ్‌పై అనేక కేసులు నమోదై ఉన్నాయన్నారు. 12 హత్య కేసులు, పది దోపిడీ, 30 బెదిరింపు కేసులు ఉన్నాయని చెప్పారు. 2006-07 మధ్యలో రాజేశ్ జైల్లో ఉన్న సమయంలో అబూ సలేంతో ఏదో విషయంలో గొడవపడి దాడి చేశాడన్నారు. ముంబైకి చెందిన ఔషధ విక్రేత ముఖేశ్ మెహతాను హత్య చేశాడని చెప్పారు. ఇలా పలువురు ప్రముఖులను అతను అంతమొందించాడని తెలిపారు. అనేక మంది వ్యాపారులను బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడని చెప్పారు. అబూ సలేంకు ఒకప్పుడు నమ్మకంగా వ్యవహరించిన రాజేశ్ ఆ తర్వాతి క్రమంలో అతడి నుంచి దూరంగా వెళ్లిపోయాడని తెలిపారు.ఆ తర్వాత దొంగతనాలను ఎంచుకొని నగల దుకాణాలను కేంద్రంగా చేసుకున్నాడని చెప్పారు. సచిన్ కేదారిపై కూడా వివిధ కేసులు ఉన్నాయన్నారు. ఇదిలాఉండగా పారిపోయిన ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. -
అబూసలేం పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : మాఫీయా డాన్ అబూసలేం పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. భారత చట్టాల ప్రకారం విచారణ ఎదుర్కోవల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. పోర్చుగల్ కోర్టు ఆదేశాలు ఇక్కడ వర్తించవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భారత దేశంలో తనపై వివిధ కేసుల్లో జరుగుతున్న విచారణలను కొట్టివేయాలంటూ అబూ సలేం సుప్రీంకోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల న్యాయ పోరాటం తర్వాత సలేం, సినీ నటి మోనికా బేడీని 2005, నవంబర్ 11న పోర్చుగల్ నుంచి భారత్‌కు తరలించారు. సలేం ప్రస్తుతం ముంబయిలోని ఆర్థర్ రోడ్డు జైల్లో ఉన్నాడు. ఒక వేళ నేరం రుజువయిన పక్షంలో సలేంకు మరణ శిక్ష విధించడం కానీ, 25 ఏళ్లకన్నా ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచడం కానీ చేయబోమని అతడి అప్పగింత సమయంలో పోర్చుగల్ ప్రభుత్వానికి భారత్ హామీ ఇచ్చింది. పోర్చుగల్ కోర్టుకు ఇచ్చిన హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అటార్నీ జనరల్ జిఇ వాహనవతి చెప్తూ,ట్రయల్ కోర్టు సలేంపై మోపిన అదనపు అభియోగాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతిని కూడా కోరారు.