అబూ సలేంకు జీవిత ఖైదు
తాహిర్, ఫిరోజ్‌లకు మరణశిక్ష.. కరీముల్లాకూ యావజ్జీవం
1993 ముంబై పేలుళ్ల కేసులో టాడా కోర్టు తీర్పు
ముంబై: 1993 నాటి ముంబై వరుసపేలుళ్ల కేసులో గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు ప్రత్యేక టాడా కోర్టు యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది. ఈ దారుణ మారణకాండలో క్రియాశీలకంగా వ్యవహరించిన.. తాహిర్ మర్చంట్, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్‌లకు మరణశిక్ష విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేరపూరిత కుట్రలో భాగస్వాములైన కరీముల్లాఖాన్‌కు యావజ్జీవ శిక్ష, రియాజ్ సిద్దిఖీకి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసు విచారణను గత జూన్ 16న పూర్తిచేసి వీరిని దోషులుగా ప్రకటించిన కోర్టు గురువారం శిక్షలు ఖరారు చేసింది.
ఫిరోజ్ ఖాన్‌కు రూ. 4.75 లక్షలు, కరీముల్లా ఖాన్‌కు రూ. 8.88 లక్షలు, తాహిర్ మర్చంట్‌కు రూ. 4.85 లక్షలు, అబూ సలేంకు రూ. 8.51 లక్షలు, రియాజ్ సిద్దిఖీకి రూ. 10వేల జరిమానా విధించింది. ఈ కేసులో దోషిగా తేలిన మరో సూత్రధారి ముస్తఫా దోసాజూన్ 28 జేజే ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. సరైన ఆధారాల్లేనందున అబ్దుల్ ఖయ్యూమ్‌ను విడుదల చేస్తున్నట్లు కోర్టు గతంలోనే ప్రకటించింది. ఈ కేసులో దోషులుగా పేర్కొన్న అందరిపైనా నేరపూరిత కుట్ర, భారత ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించటం, హత్య తదితర అభియోగాలున్నాయి. కాగా, కోర్టు తీర్పును యావద్భారతం స్వాగతించింది.
పోర్చుగల్‌తో ఒప్పందం కారణంగా..
ముంబై పేలుళ్ల వ్యూహం అమల్లో గ్యాంగ్‌స్టర్ అబూ సలేం క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే ఘటన తర్వాత ఆయన విదేశాలకు పారిపోయారు. 2002, సెప్టెంబర్ 20న పోర్చుగల్‌లోని లిస్బన్‌లో ఇంటర్‌పోల్ అబూసలేం, మోనికా బేడీలను అరెస్టు చేసింది. అప్పటినుంచి అబూ సలేంను అప్పగించే విషయంలో భారత్, పోర్చుగల్ దేశాల మధ్య చర్చలు జరిగాయి. 2005లో పోర్చుగీస్ అధికారులు సలేంను భారత్‌కు అప్పగించారు. ఇరుదేశాల మధ్య కుదిరిన నేరస్తుల అప్పగింత ఒప్పందాల ప్రకారం ఆ దేశం అప్పగించిన ఏ దోషికైనా మరణశిక్ష విధించరాదు. అందుకే సలేంకు గురువారం కోర్టు మరణశిక్ష విధించకుండా యావజ్జీవంతో సరిపెట్టింది.
కుట్ర అమల్లో అబూ సలేం కీలకం
జూన్ 16న తీర్పు సందర్భంగా.. అబూ సలేం ఈ దాడిలో ప్రధాన సూత్రధారి అని ప్రాసిక్యూషన్ వాదించింది. ఇందుకు తగ్గట్లుగా ఆధారాలు చూపించింది. దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీం, ముస్తఫా దోసాలకు అత్యంత సన్నిహితుడైన సలేం తీసుకొచ్చిన ఆయుధాల ద్వారానే తీవ్రమైన విధ్వంసం జరిగిందని కోర్టు కూడా నిర్ధారించింది. జనాలను భయభ్రాంతులకు గురిచేశారని.. అమాయకులను హతమార్చారని మండిపడింది. 24 ఏళ్ల క్రితం నాటి పేలుళ్ల ఘటనలోనే వీరు దోషులైనా.. విచారణ ప్రారంభమయ్యాక వేర్వేరు సందర్భాల్లో వీరు అరెస్టయినందున.. ప్రధాన కేసులో భాగంగా కాకుండా ఈ ఏడుగురి కేసును కోర్టు ప్రత్యేకంగా విచారించింది.
భారత్ ఉగ్రపోరుకు ఫలితమిది
తీర్పును బీజేపీ, కాంగ్రెస్ స్వాగతించాయి. ఉగ్రవాదులు, కుట్రదారులు, వారికి సాయం చేసే వారిపై భారత్ చేస్తున్న పోరాటానికి ఇది ప్రతిఫలమని బీజేపీ పేర్కొంది. ‘ఉగ్రవాదాన్ని మోదీ ప్రపంచ ప్రధాన ఎజెండాగా మార్చి దీనిపై పోరాటంలో అన్ని దేశాలను ఒకేతాటిపైకి తెస్తున్నారు. ఈ తీర్పు ఉగ్రవాదులు, కుట్రదారులెవరినీ భారత్ వదిలిపెట్టదని స్పష్టం చేసింది’ బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ‘ఉగ్రవాదంపై భారత్ పోరు కొనసాగుతూ ఉంటుంది. అబూ సలేంకు జీవిత ఖైదుతో ఈ కేసులో న్యాయమే గెలిచింది. తర్వాత శిక్షలు పడాల్సింది దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్‌లకే ’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా పేర్కొన్నారు.
అసలేం జరిగింది?
1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చేశారు. దీనికి ప్రతీకారంగా దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు దావూద్ ఇబ్రహీం అనుచరులు వ్యూహం రచించారు. 1993 మార్చి12న ముంబైలో ఆర్డీఎక్స్ సాయంతో పలుచోట్ల భారీ విధ్వంసం సృష్టించారు. 13చోట్ల బాంబులను పేల్చారు.
ఈ మారణకాండలో 257 మంది మృతి చెందగా.. 700 మందికి గాయాలయ్యాయి. ఈ కేసు విచారణ సందర్భంగా 189 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్, మహ్మద్ అహ్మద్ దోసా సహా 35 మంది సూత్రధాబరులు, పాత్రధారులు పాక్ సహా పలు దేశాలకు పారిపోయారు. టైగర్ మెమన్ సోదరుడు పేలుళ్ల అమల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన యాకూబ్ మెమన్‌ను జూలై 30, 2015న నాగ్‌పూర్ జైల్లో ఉరితీశారు.
శిక్ష పడిన దోషులు వీళ్లే..
తాహిర్ మర్చంట్: ముంబై పేలుళ్ల పథకంలో ఈయన పాత్ర కీలకం. దుబాయ్‌లో జరిగిన ఈ నేరపూరిత కుట్ర వ్యూహరచన సమావేశాల్లో పాల్గొన్నాడు. దాడులకు పాల్పడేందుకు యువకులను గుర్తించి, వారిని రెచ్చగొట్టి, ఉగ్ర శిక్షణ నిమిత్తం వారిని పాకిస్తాన్‌కు తీసుకెళ్లాడు. దావూద్‌తోపాటుగా ఫిరోజ్, యాకూబ్ మెమన్, టైగర్ మెమన్‌లతో కలిసి కుట్ర అమల్లోనూ భాగమ య్యాడు. ఈ దాడులకోసం ఆయుధాలను సంపాదించేందుకు, భారత్‌లో అక్రమ ఆయుధాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు నిధులు సేకరించాడు.
ఫిరోజ్ అబ్దుల్ ఖాన్: పాకిస్తాన్ నుంచి ఆయుధాలు, విస్ఫోటక వస్తువులు భారత్ చేరటంలో ఈయన పాత్ర కీలకం. కస్టమ్స్ అధికారులు, ఏజెంట్లతో మాట్లాడి బోట్ల ద్వారా ఈ సామగ్రి క్షేమంగా భారత్‌కు చేరవేశాడు. పేలుళ్లు మొదలయ్యేంతవరకు అన్ని ఏర్పాట్లలోనూ క్రియాశీలకంగా వ్యవహరించాడు.
బాబ్రీ మసీదు విధ్వంసం ఘటనతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన ఫిరోజ్.. విధ్వంస ఏర్పాట్లలో ఎక్కడా లోటు జరగకుండా ప్రతిక్షణం సమీక్షించాడు. ఇందుకే అతణ్ణి ప్రధాన కుట్రదారుగా కోర్టు భావించింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారేందుకూ ఫిరోజ్ సిద్ధపడ్డాడు. అయితే కోర్టు దీన్ని తిరస్కరించింది. కుట్రలో దోషుల పాత్రకు సంబంధించి వీలైనన్ని ఆధారాలున్నందున అప్రూవర్‌గా అంగీకరించబోమని స్పష్టం చేసింది.
అబూ సలేం: ముంబై పేలుళ్ల విధ్వంసానికి కావాల్సిన ఆయుధాలను గుజరాత్‌లోని దిఘి నుంచి ముంబైకి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించాడు. జనవరి 16న 1993లో గుజరాత్‌లోని బరూచ్‌కు వెళ్లిన అబూ సలేం.. అక్కడినుంచి మారుతీ వ్యాన్‌లో ఆయుధాలను (6 ఏకే 56 రైఫిళ్లు, బుల్లెట్లు, 100 హ్యాండ్ గ్రనేడ్లు) ముంబైకి తరలించాడు. వాటిని ముంబైలో రియాజ్ సిద్దిఖీకి చేరవేశాడు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇంటికెళ్లి ఆయనకు రెండు రైఫిళ్లు, కొన్ని బుల్లెట్లు, గ్రనేడ్లు దాచమని ఇచ్చాడు. రెండ్రోజుల తర్వాత వాటిని వెనక్కు తీసుకున్నాడు.
కరీముల్లా ఖాన్: పేలుళ్ల వ్యూహం అమలుకు సంబంధించిన సమావేశాలకు హాజరయ్యాడు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో దాచిన ఆయుధాలు, డిటొనేటర్లు, గ్రనేడ్లు, ఆర్డీఎక్స్‌లను పేలుళ్లకు ముందు ముంబైలో సరైన వ్యక్తులకు చేరవేయటంలో కీలకంగా వ్యవహరించాడు. దీంతోపాటుగా దుబాయ్ మీదుగా పాకిస్తాన్‌కు వెళ్లి ఆయుధ ఉగ్ర శిక్షణ పొందాడు.
రియాజ్ సిద్దిఖీ: గుజరాత్‌నుంచి ముంబైకి ఆయుధాలు, విస్ఫోటక సామాగ్రిని తీసుకురావటం కోసం వ్యాన్‌ను ఏర్పాటుచేశాడు. దీంతోపాటుగా పలు సందర్భాల్లో దోషులకు అవసరమైన సాయం చేశాడు.