
నెలరోజులు జైల్లో ఉంటా..: ఐఏఎస్ అధికారి
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఐఏఎస్ అధికారికి చిత్రమైన కోరిక కలిగింది. గుణ జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న నియాజ్ ఖాన్ కొన్నాళ్లు జైలుకు వెళ్తానని అడుగుతున్నారు. ఏదో నేరం చేసి జైలుకు వెళ్లడం కాదు.. జైల్లో ఉన్న మాఫియా డాన్ అబూ సలేం కథ రాద్దామని తాను అనుకుంటున్నానని, అందుకోసం తనకు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజేష్ జైన్‌ను కోరారు. నియాజ్ ఖాన్ ప్రస్తుతం ఓ నవల రాస్తున్నారు. అందుకోసం ఒక నెల రోజుల పాటు అబూ సలేంతో పాటు జైల్లో ఉంటానని అడుగుతున్నారు. అబూ సలేం జీవితం మీద ఎక్కువగా దృష్టిపెట్టి తన ఐదో నవల రాస్తున్నానని, అతడి క్యారెక్టర్‌ను పరిశీలించడానికి, అతడి రోజువారీ జీవితం గురించి తెలుసుకోడానికి నెల రోజుల పాటు జైల్లో సలేంతో గడిపేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరానని ఖాన్ చెప్పారు.
దీంతో ఏం చేయాలో తెలియని కలెక్టర్ రాజేష్ జైన్.. ఆ లేఖను భోపాల్‌లోని తన సీనియర్లకు పంపారు. 'లవ్ డిమాండ్స్ బ్లడ్' అనే పేరుతో ఖాన్ తన ఐదో నవల రాస్తున్నారు. ఇది థ్రిల్లర్‌గా ఉండబోతోంది. దాన్ని పూర్తి చేయడానికే అబూ సలేం జీవితాన్ని సమగ్రంగా తెలుసుకోవాలని ఆయన భావిస్తున్నారు. 1995లో జరిగిన ప్రదీప్ జైన్ అనే బిల్డర్ హత్య కేసులో అబూసలేం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అతడిపై దాదాపు 54 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒకనాటి బాలీవుడ్ నటి మోనికా బేడీ అతడి ప్రియురాలు.