సయ్యద్ బహర్ కౌసర్.. అబూ సలేం
సాక్షి, ముంబై : ముంబై పేలుళ్ల దోషి.. మాజీ డాన్ అబూ సలేంకు ఝలక్ తగిలింది. వివాహం కోసం అతను దాఖలు చేసుకున్న పెరోల్‌ను పోలీసులు తోసిపుచ్చారు. మే 5వ తేదీన సయ్యద్ బహర్ కౌసర్ అలియాస్ హీనాను పెళ్లి చేసుకునేందుకు సలేం సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో 45 రోజుల పెరోల్ కోసం నవీ ముంబై కమిషనర్‌ను సలీం అభ్యర్థించాడు.
అయితే పోలీసులు మాత్రం సలేం అభ్యర్థనను తిరస్కరించారు. ఈ విషయాన్ని తలోజా జైలు సూపరిడెంట్ శుక్రవారం ధృవీకరించారు. కాగా, హీనా తొలిసారిగా 2014లో సలీంతోపాటు రైల్లో ప్రయాణించి(ముంబై నుంచి లక్నోకు) వార్తల్లో నిలిచారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో సలేం దోషిగా తేలటంతో.. ప్రత్యేక న్యాయస్థానం అతనికి జీవిత ఖైదును విధించింది. అప్పటి నుంచి తలోజా జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు.
కాగా, అబూ సలేంతో పెళ్లి జరిపించాలంటూ ముంబ్రాకు చెందిన 25 ఏళ్ల హీనా అప్పట్లో న్యాయ పోరాటానికి సైతం దిగింది. ఈమేరకు ప్రత్యేక అనుమతి కోరుతూ ముంబై టాడా కోర్టును ఆశ్రయించింది. అతనితో నిఖా జరిపించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది కూడా. అయితే కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment