న్యూఢిల్లీ : గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలో అతనికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ గురువారం కోర్టు తీర్పునిచ్చింది. 2002లో గ్రేటర్ కైలాష్‌కు చెందిన అశోక్ గుప్తా అనే వ్యాపారవేత్తను తనకు 5 కోట్లు ఇవ్వాల్సిందిగా అబూ సలేం డిమాండ్ చేశాడు. ఒకవేళ డబ్బులు చెల్లించనట్లు అయితే నీ కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించడంతో.. అబూ సలేంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి ఇంతకాలం కోర్టులో వాదనలు జరుగుతూ వచ్చాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మే 26న అబూ సలేంను దోషిగా తెల్చింది. తాజాగా నేడు అతనికి శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ముంబై అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడైన అబూ సలేంకు, గతేడాది టాడా ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసిన సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment