rigorous imprisonment
-
అమెరికా విలేఖరికి 16 ఏళ్ల జైలు శిక్ష
యెకటేరిన్‌బర్గ్ (రష్యా): అమెరికా కోసం రహస్య పత్రాలు సేకరిస్తూ గూఢచర్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ప్రఖ్యాత వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు చెందిన 32 ఏళ్ల రిపోర్టర్ ఇవాన్ గెర్‡్షకోవిచ్కు రష్యా న్యాయస్థానం 16 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీనిని పూర్తిగా కల్పిత సాక్ష్యాలతో సృష్టించిన తప్పుడు కేసుగా అమెరికా అభివర్ణించింది. శుక్రవారం రష్యాలోని సెవెర్డ్లోవోస్క్ ప్రాంతీయ కోర్టు జడ్జి ఆండ్రీ మినియేవ్ ఈ తీర్పు చెప్పారు. తీర్పుకు ముందు నీవేమైనా చెప్పేది ఉందా? అని జడ్జి ప్రశ్నించగా లేదు అని ఇవాన్ సమాధానమిచ్చారు. ఇవాన్‌కు 18 ఏళ్ల శిక్ష విధించాలని ప్రభుత్వ లాయర్లువాదించగా జడ్జి 16 ఏళ్ల శిక్ష వేశారు. శిక్ష ఖరారుపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ‘‘ జర్నలిస్ట్, అమెరికన్ పౌరుడు అయినందుకే ఇవాన్‌ను బంధించి జైలుపాలుచేశారు. ఐరాస కూడా ఇదే మాట చెప్పింది. అతడిని విడిపించేందుకు అమెరికా తన ప్రయత్నాలు ఇకమీదటా కొనసాగిస్తుంది. పాత్రికేయ వృత్తి నేరం కాబోదు’ అని అన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక అమెరికా జర్నలిస్ట్‌ను రష్యా అరెస్ట్చేయడం ఇదే తొలిసారి. యురాల్వగోన్జవోడ్ సిటీలో రష్యా యుద్ధట్యాంకుల తయారీ, రిపేర్ల రహస్య సమాచారాన్ని ఇవాన్ సేకరిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడని ఆరోపిస్తూ 2023 మార్చి 29న ఇవాన్‌ను అరెస్ట్చేయడం తెల్సిందే. -
HYD: కంచే చేను మేసింది.. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో పదిమందికి జైలుశిక్ష
సాక్షి, హైదరాబాద్: కంచే చేను మేసింది. ఎవరూ గమనించలేదనుకుంది. కానీ, ఎట్టకేలకు పాపం పండింది. తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన ఓ బ్యాంక్ మేనేజర్‌తో పాటు పదిమంది దోషులకు న్యాయస్థానం కఠిన కారాగార శిక్షలు విధించింది. తొమ్మిదేళ్ల కిందటి నాటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫ్రాడ్ కేసులో బుధవారం ఎట్టకేలకు శిక్షలు ఖరారు చేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మోసం కేసులో పదిమందికి జైలు శిక్షలు ఖరారు అయ్యాయి. మొత్తం పది మంది దోషుల్లో ఐదుగురికి ఏడేళ్ల శిక్ష, నలుగురికి మూడేళ్ల శిక్ష, మిగిలిన ఒకరికి ఏడాదిశిక్ష ఖరారు చేసింది. శిక్షతో పాటు దోషులకు జరిమానా సైతం విధించింది. ఇక ఈ కేసులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నష్టానికి కారణమైన ఆరు కంపెనీలకు జరిమానా సైతం విధించింది. ప్రైవేట్ కంపెనీలతో కుమ్మక్కై దాదాపు అయిదు కోట్ల రూపాయలు(రూ.4.57 కోట్లు) నకిలీ ఖాతాలకు మళ్లించిన స్కామ్ ఇది. ఈ కేసులో సికింద్రాబాద్ బ్రాంచ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సీనియర్ మేనేజర్ శరత్ బాబు జెల్లీతో పాటు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుహాస్ కళ్యాణ్ రామ్‌దాసి కూడా దోషులుగా నిర్దారణ అయ్యారు. మొత్తం పది మంది దోషులతో పాటు ఆరు కంపెనీలకు సైతం జరిమానా విధించింది సీబీఐ కోర్టు. శరత్, సుహాస్‌లు ప్రైవేట్ కంపెనీలతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై 2013 మార్చిలో.. సీబీఐ కేసు నమోదు చేసింది. 2012 -13 మధ్యకాలంలో.. దాదాపు రూ.5 కోట్లకు వర్కింగ్ క్యాపిటల్ లిమిట్లను మంజూరు చేయడం ద్వారా ఆ నిధులను మంజూరైన వాటి కోసం కాకుండా నకిలీ.. కల్పిత పత్రాలపై మళ్లించినట్లు తేలింది. తద్వారా బ్యాంక్‌కు నష్టం వాటిల్లింది. ఈ కేసులో 2014 ఆగష్టులో నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. విచారణలో నిందితులను దోషులుగా నిర్ధారించి ఇప్పుడు శిక్షలు ఖరారు చేసింది సీబీఐ కోర్టు. ఇదీ చదవండి: ఐటీ దాడుల్లో బయటపడ్డ రూ.100 కోట్ల నల్లధనం -
కరోనా టెస్ట్ పేరిట నీచం.. ల్యాబ్‌టెక్నీషియన్‌కు పదేళ్ల శిక్ష
కరోనా టెస్టుల పేరిట నీచంగా వ్యవహరించిన ఒక ల్యాబ్‌టెక్నీషియన్‌కు ఎట్టకేలకు కఠిన కారాగార శిక్ష పడింది. శాంపిల్ కలెక్షన్ పేరుతో అసభ్యకర రీతిలో వ్యవహరించిన కేసులో.. పదిహేడు నెలల తర్వాత ఎట్టకేలకు బాధితురాలికి న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అమరావతి (మహారాష్ట్ర)కి చెందిన యువతి.. స్థానికంగా ఓ మాల్లో పని చేస్తోంది. కరోనా మొదటి వేవ్ సమయంలో ఆమె పనిచేసే మాల్లో పాతిక మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో మిగతా ఎంప్లాయిస్‌తో కలిసి ఆమె సైతం పరీక్షలకు వెళ్లింది. అయితే ఆమెకు పాజిటివ్ వచ్చిందని.. మరిన్ని టెస్టుల కోసం బద్నేరాలోని ల్యాబ్‌కు రావాలంటూ సదరు ల్యాబ్‌టెక్నీషియన్(నిందితుడు) ఆ యువతి రప్పించుకున్నాడు. స్వాబ్ సేకరణలో భాగంగా ఈసారి శాంపిల్ సేకరణ ప్రైవేట్ పార్ట్ నుంచి చేయాలని చెప్పి.. నీచంగా ప్రవర్తించాడు. అయితే ఈ విషయంలో అనుమానం వచ్చిన యువతి.. తన సోదరుడికి చెప్పింది. వాళ్లు ఓ డాక్టర్‌ను సంప్రదించగా.. కొవిడ్-19 స్వాబ్ టెస్ట్ ముక్కు, నోటి నుంచి మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో బాధితురాలు బద్నేరా పోలీసులను ఆశ్రయించింది. అయినా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో పెద్ద ఎత్తున్న నిరసనలు చెలరేగాయి. దీంతో జులై 30, 2020న నిందితుడిని బద్నేరా పోలీసులు అత్యాచార ఆరోపణలపై అరెస్ట్ చేశారు. సుమారు పదిహేడు నెలల విచారణ తర్వాత.. అమరావతి జిల్లా కోర్టు 12 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించి.. ఐపీసీ సెక్షన్ల 354, 376 ప్రకారం.. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. -
గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు ఏడేళ్ల జైలు..
న్యూఢిల్లీ : గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలో అతనికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ గురువారం కోర్టు తీర్పునిచ్చింది. 2002లో గ్రేటర్ కైలాష్కు చెందిన అశోక్ గుప్తా అనే వ్యాపారవేత్తను తనకు 5 కోట్లు ఇవ్వాల్సిందిగా అబూ సలేం డిమాండ్ చేశాడు. ఒకవేళ డబ్బులు చెల్లించనట్లు అయితే నీ కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించడంతో.. అబూ సలేంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇంతకాలం కోర్టులో వాదనలు జరుగుతూ వచ్చాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మే 26న అబూ సలేంను దోషిగా తెల్చింది. తాజాగా నేడు అతనికి శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ముంబై అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడైన అబూ సలేంకు, గతేడాది టాడా ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసిన సంగతి విదితమే. -
గుట్కాలమ్మితే పదేళ్లు జైల్లోనే..
ముంబై: ఇప్పటికే పొగాకు ఉత్పత్తులను, గుట్కాలను నిషేధించిన మహారాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇకనుంచి వీటిని ఎవరైనా కలిగి ఉన్నట్లుగుర్తించినా, అమ్మినా వారికి పదేళ్ల కఠినకారాగార శిక్ష విధిస్తామని హెచ్చరించింది. వీరందరిని ఐపీసీ సెక్షన్ 328(విష పదార్థాలతో హానీ చేయడం వంటి నేరాలు) కింద కేసులు నమోదు చేస్తామని ప్రకటించింది. ఇలాంటి కేసులను నాన్ బెయిలబుల్ కేసులుగా కూడా మారుస్తామని తెలిపింది. వీటితోపాటు, వీటి విక్రయాలు జరుపుతున్న షాపులకు లైసెన్సులను కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం గుట్కాల విక్రయాలు బాగా తగ్గిపోయాయని, వాటిని పూర్తిగా రూపుమాపేందుకు, మున్మందు అవి అందుబాటులో ఉండకుండా చేసేందుకే తాజాగా నిర్ణయాలు తీసుకోనున్నామనిన ప్రకటించింది. తమ రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమని ఈ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. -
సామూహిక అత్యాచారం: నిందితులకు జైలు శిక్ష
16 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులు రాన్ సింగ్ (65), శ్రీభగవాన్ (44)లకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యూఢిల్లీ అడిషనల్ సెషన్స్ జడ్జ్ ఎం.సి.గుప్తా తీర్పు వెలువరించారు. అంతేకాకుండా ఒకొక్కరికి రూ. 30 వేల జరిమాన విధించారు. ఉద్యోగం పేరుతో బాలికకు రప్పించి ఆమెపై అత్యాచారం చేయడం హేయమైన చర్యగా జడ్జి అభివర్ణించారు. నిందితులలో రాన్ సింగ్ ఓ కంపెనీలో గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానని బంధువుల అమ్మాయికి భరసా ఇచ్చాడు. అందుకోసం న్యూఢిల్లీ వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఆ క్రమంలో ఆ యువతి న్యూఢిల్లీలోని రాన్ సింగ్ రూమ్‌కు వెళ్లింది. దాంతో ఉద్యోగంపై మరో వ్యక్తితో మాట్లాడాలని చెప్పి ఆ యువతిని కారులో ఫామ్ హౌస్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ సింగ్‌తోపాటు, మరో వ్యక్తి శ్రీభగవాన్ యువతిపై అత్యాచారం జరిపారు. దాంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో పోలీసులు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. ఘటనపై విచారణ జరిపిన కోర్టు శనివారం శిక్షను ఖరారు చేసింది. 2003, డిసెంబర్ 6న యువతిపై అత్యాచార ఘటన చోటు చేసుకుంది.