ముంబై పేలుళ్ల కేసు: దోషులకు శిక్షలు ఖరారు | TADA court declared the quantum of sentence for Mumbai blasts Convicts | Sakshi
Sakshi News home page

ముంబై పేలుళ్ల కేసు: దోషులకు శిక్షలు ఖరారు

Published Thu, Sep 7 2017 2:47 PM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM

ముంబై పేలుళ్ల కేసు: దోషులకు శిక్షలు ఖరారు

ముంబై పేలుళ్ల కేసు: దోషులకు శిక్షలు ఖరారు

సాక్షి,న్యూఢిల్లీ: ముంబై అల్లర్ల కేసులో దోషులకు టాడా ప్రత్యేక కోర్టు గురువారం శిక్షలు ఖరారు చేసింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న అబూ సలేంకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. సలేంతోపాటు మరో నలుగురికి కూడా కోర్టు శిక్షలు ఖరారు చేసేసింది. 
 
అండర్ వరల్డ్ డాన్, గ్యాంగ్ స్టర్‌ అయిన సలేంను పోర్చుగల్ నుంచి భారత్‌ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడి చట్టాల్లో మరణశిక్ష లేకపోవటంతో ఒప్పందం ప్రకారం ఇక్కడ కూడా సలేంకు అలాంటి శిక్ష విధించే అవకాశం లేకుండా పోయింది. మరో ఇద్దరు దోషులు తెహీర్ మర్చంట్, ఫెరోజ్‌ ఖాన్‌ లకు తీవ్ర ఆరోపణల దృష్ట్యా మరణ శిక్షలను ఖరారు చేసేసింది. కరీముల్లా ఖాన్‌ కు యావజ్జీవ శిక్ష,  రియాజ్‌ సిద్ధిఖీకి 10 ఏళ్ల శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది.
 
కేసు ప్రధాన సూత్ర ధారి ముస్తఫా దోసాతోపాటు మరో ఆరుగురిని దోషిగా తేలుస్తూ కోర్టు ఈ యేడాది జూన్‌ 16న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వంపై యుద్ధం, కుట్రపూరిత నేరం తదితర ఆరోపణలు వీరిపై రుజువయ్యాయి. కానీ, ముస్తఫా గుండెపోటుతో జైల్లోనే మృతి చెందాడు. నిందితులో చాలా మట్టుకు మరణ శిక్ష ఖాయమని కేసు వాదిస్తున్న న్యాయవాది దీపక్ సాల్వీ తీర్పు వెలువడటానికి ముందు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తనపై ఉన్న మిగతా కేసుల దృష్ట్యా తనని ఢిల్లీ జైలుకు తరలించాలని సలేం టాడా కోర్టుకు విజ్ఞప్తి చేశాడు.
 
దోషులు ఎవరేం చేశారంటే...
ముస్తఫా దోసా: భారత్‌కు ఆర్డీఎక్స్‌ను తీసుకురావటంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. దీంతోపాటుగా కొందరు యువకులను పాకిస్తాన్‌కు పంపి ఆయుధాల వినియోగంలో శిక్షణనిప్పించాడు.
 
అబూ సలేం: ఆయుధాలను గుజరాత్‌నుంచి ముంబైకి తరలించాడు. ఈ కేసులో దోషిగా శిక్ష పూర్తిచేసుకున్న బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు కూడా 1993 జనవరి 16న సలేం ఏకే 56 ఆయుధాలతోపాటు 250 రౌండ్ల బుల్లెట్లు, కొన్ని గ్రనేడ్లను అందించాడు. తిరిగి జనవరి 18న సంజయ్‌దత్‌ ఇంటికొచ్చి వీటిని అబూసలేం తీసుకెళ్లాడు.
 
తాహిర్‌ మర్చంట్‌: పాకిస్తాన్‌కు ఉగ్ర శిక్షణకు వెళ్లాల్సిన యువకులను గుర్తించి వారిని రెచ్చగొట్టాడు. భారత్‌లో అక్రమంగా ఆయుధ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు నిధులను సేకరించాడు.
 
ఫిరోజ్‌ అబ్దుల్‌ ఖాన్‌: ఆయుధాలను తీసుకోవటంలో కస్టమ్స్‌ అధికారులు, ఏజెంట్లతో మాట్లాడి.. వాటిని జాగ్రత్తగా అనుకున్న లక్ష్యాలకు చేర్చాడు. దీంతోపాటుగా  వ్యూహాల్లో భాగస్వామిగా ఉన్నాడు. గతేడాది మే చివర్లో విచారణ సందర్భంగా అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమయ్యాడు.
 
రియాజ్‌ సిద్దిఖీ: అబూసలేం ఆయుధాలు తరలించేందుకు వాహనాన్ని సమకూర్చటంతోపాటుగా పలు సందర్భాల్లో దోషులకు సహాయంగా వెళ్లాడు.
 
కరీముల్లా ఖాన్‌: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో దాచిన ఆయుధాలు, డిటోనేటర్లు, గ్రనేడ్లను  సరైన వ్యక్తులకు చేరవేయటంలో కీలకంగా వ్యవహరించాడు. దుబాయ్‌ మీదుగా పాకిస్తాన్‌కు వెళ్లి ఆయుధ శిక్షణ పొందాడు.
 
టైమ్‌లైన్‌:
12 మార్చి, 1993: గంట వ్యవధిలో 13 చోట్ల బాంబులు పేలి 257 మంది మృతి, 713 మందికి గాయాలు.

19 ఏప్రిల్, 1993: ఏకే–56 రైఫిల్‌ను, 9ఎంఎం పిస్టల్‌ను, తుటాలను అక్రమంగా కలిగి ఉన్నాడనే అభియోగంపై సినీనటుడు సంజయ్‌దత్‌ అరెస్టు. 15 రోజులకే బెయిల్‌పై విడుదల.

4 నవంబరు 1993: ముంబై క్రైంబ్రాంచ్‌ ప్రాథమిక చార్జిషీట్‌ దాఖలు. 189 మందిపై అభియోగాలు. 117వ నిందితుడిగా సంజయ్‌దత్‌.

19 నవంబరు 1993: ఈ కేసు సీబీఐకి అప్పగింత.

10 ఏప్రిల్‌ 1994: 26 మందిని నిర్దోషులుగా తేల్చిన టాడా కోర్టు.

ఏప్రిల్‌ 1995 – సెప్టెంబరు 2003: టాడా కోర్టులో విచారణ. అప్రూవర్లుగా మారిన నిందితులు మహ్మద్‌ జమీల్, ఉస్మాన్‌ జానకనన్‌.

జూన్‌ 13 2003: అబూసలేం, ముస్తఫా దోసా సహా ఏడుగురు నిందితులను ప్రధాన కేసునుంచి వేరుచేసి.. విచారణ జరపాలని కోర్టు నిర్ణయం.

సెప్టెంబరు 12, 2006: టాడా కోర్టు తీర్పు. యాకూబ్‌ మెమన్‌తో సహా 12 మందికి మరణశిక్ష, మరో 20 మందికి జీవిత ఖైదు

31 జులై, 2007: సంజయ్‌దత్‌కు ఆరేళ్ల జైలుశిక్ష

21 మార్చి 2013: యాకూబ్‌ మెమన్‌కు మరణశిక్షను ఖరారు చేసిన సుప్రీం. మరో 10 మంది మరణశిక్ష.. యావజ్జీవ కారాగారశిక్షగా మార్పు.

29 జులై, 2015: యాకూబ్‌ మెమన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ.

30 జులై, 2015: నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో యాకూబ్‌ మెమన్‌కు ఉరి అమలు

25 ఫిబ్రవరి, 2016: సత్ప్రవర్తన కారణంగా 8 నెలల శిక్ష తగ్గి జైలునుంచి సంజయ్‌దత్‌ విడుదల.

16 జూన్, 2017: అబూసలేంతో సహా మొత్తం ఆరుగురిని దోషులుగా తేల్చిన టాడా కోర్టు.

07, సెప్టెంబర్, 2017: ముస్తాఫా చనిపోవటంతో మిగిలిన దోషులకు శిక్షలు ఖరారు చేసేసింది.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement