దావూద్ చిక్కేనా!
సెంట్రల్ డెస్క్: అబూ సలేం, చోటా రాజన్ దొరికారు. ఇప్పు డు అందరి దృష్టి మాఫియా దందాను విస్తరించి ఒకప్పుడు ముంబైని శాసించిన ‘బిజినెస్‌మన్’పై పడింది. భారత్ మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్స్‌లో మొదటివాడైన దావూద్ ఇబ్రహీంను భారత్‌కు పట్టితేవడం సాధ్యమేనా? ఐఎస్‌ఐ నీడలో పాకిస్తాన్‌లోని కరాచీలో దావూద్ సురక్షితంగా ఉన్నాడు. ఇటీవలే అతని భార్య భారత్‌లోని ఓ టీవీ ఛానల్ విలేకరితో మాట్లాడింది కూడా. దావూద్ పడుకున్నాడని, అతని భార్యను మాట్లాడుతున్నానని స్పష్టంగా చెప్పింది. అయితే పాకిస్తాన్ మాత్రం ఎప్పటిలాగే పాతపాటే పాడింది. తమ దేశంలో దావూద్ లేడని చెప్పింది.
మరోవైపు భారత్ మాత్రం గట్టి ఆధారాలు పాక్‌కు అందజేశామంటోంది. కానీ ఈ ఏడాది మే నెలలో పార్లమెంటులో సమాధానం చెప్పాల్సి వచ్చినపుడు మాత్రం దావూద్ ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి అతన్ని వెనక్కితెచ్చే ప్రక్రియను ప్రారంభించలేకపోతున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. భారత నిఘా వ్యవస్థల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దావూద్‌కు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయడం లేదని మాజీ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. భద్రతను కల్పించడమే కాకుండా తరచూ మకాం మార్చాల్సిందిగా దావూద్‌కు ఐఎస్‌ఐ సలహాలిస్తోంది.
అతని కదలికలన్నీ ఐఎస్‌ఐ కనుసన్నల్లోనే జరుగుతాయని చెబుతారు. కరాచీలో పలు వ్యాపారాల్లో దావూద్ భారీ పెట్టుబడులు కూడా పెట్టినట్లు సమాచారం. ఒసామా బిన్ లాడెన్‌తో సన్నిహిత సంబంధాలు నెరిపాడని చెప్పి... అమెరికా 2003లో దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించింది. అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి చేయడం ద్వారా పాక్ మెడలు వంచితే... దావూద్‌ను భారత్‌కు తెప్పించడం సాధ్యపడొచ్చు. లాడెన్‌ను అమెరికా హతమార్చినపుడు రాజకీయంగా తీవ్ర ఇరకాటాన్ని ఎదుర్కొన్న పాక్ పాలకులు... మరోసారి అలాంటి పరిస్థితిని కోరుకుంటారా? దావూద్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిచ్చిన ఐఎస్‌ఐ... తమ రహస్యాలు బయటపడటానికి అంగీకరిస్తుందా?