డాన్ అబూ సలేంతో పెళ్లికి యువతి పోరాటం | 'Let me marry Salem, or I'll kill myself' | Sakshi
Sakshi News home page

డాన్ అబూ సలేంతో పెళ్లికి యువతి పోరాటం

Published Mon, Jun 29 2015 9:48 AM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM

అబూ సలేంతో కౌసర్ ( ఈ ఫొటో జూన్ 7న 'ముంబై మిర్రర్' పత్రికలో ప్రచురితమైంది. కానీ దీనిని మార్ఫింగ్ చేశారని యువతి ఆరోపిస్తోంది)

అబూ సలేంతో కౌసర్ ( ఈ ఫొటో జూన్ 7న 'ముంబై మిర్రర్' పత్రికలో ప్రచురితమైంది. కానీ దీనిని మార్ఫింగ్ చేశారని యువతి ఆరోపిస్తోంది)

థానే: మీరు చదివింది నిజమే. రకరకాల కేసుల్లో దోషిగా తేలి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తోన్న మాఫియా డాన్ అబూ సలేంతో పెళ్లి జరిపించాలంటూ 25 ఏళ్ల యువతి చిన్నపాటి పోరాటానికి దిగింది. ఈమేరకు ప్రత్యేక అనుమతి కోరుతూ ముంబై టాడా కోర్టును ఆశ్రయించింది. అతనితో నిఖా జరిపించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.

 

ఒకప్పుడు ఒకటిగా జీవించిన మోనికా బేడీనే ప్రస్తుతం అబూ సలేంకు దూరంగా ఉంటోంటే.. కొత్త సంచలనానికి తెరలేపిన ఈ మహిళ ఎవరు? అసలెందుకు అతణ్ని పెళ్లాడాలనుకుంటోంది? అంటే..

ధానే జిల్లా మంబ్రా పట్టణానికి చెందిన సయ్యద్ బహార్ కౌసర్ (25) కామర్స్ గ్రాడ్యుయేట్. తన పనేదో తాను చేసుకునే రకం. ఉన్నట్టుండి ఓ రోజు పోలీసులు ఆమె ఇంటికొచ్చి.. గ్యాంగ్స్టర్ అబూ సలేంకూ నీకూ సంబంధమేంటని ప్రశ్నించారు. సమాధానం రికార్డుచేసుకుని వెళ్లిపోయారు.

అంతటితో ఆగిపోకుండా లక్నో, ఆజంగఢ్, గుజరాత్, తదితర ప్రాంతాల్లో ఉంటోన్న కౌసర్ బంధువులందరి దగ్గరికీ వెళ్లి 'ఫలానా మీ బందువుల అమ్మాయికి మాఫియా డాన్ అబూ సలేంకు మధ్య ఉన్న సంబంధం గురించి మీకేమైనా తెలుసా?' అంటూ వివరాలు సేకరించారు. 2014లో అబూను ముంబై నుంచి లక్నోకు తరలిస్తుండగా రైలులోనే ఫోన్ ద్వారా నిఖా చేసుకున్నారని పోలీసుల ఆరోపణ. సీన్ కట్ చేస్తే..

ప్రస్తుతం కౌసర్ గురించి వాళ్ల బంధువులందరూ అదో రకంగా మాట్లాడుకుంటున్నారట. దీంతో ఆమెను పెళ్లి చేసుకునేందుకు యువకులెవరూ ముందుకు రావట్లేదట. 'మార్ఫింగ్ ఫొటోలు చూపించి పోలీసులు నా జీవితాన్ని నాశనం చేశారు. వాళ్లు ఆరోపిస్తున్నట్లు అబూ సలేంతో సంబంధాన్ని కొనసాగించడం తప్ప ప్రస్తుతం నాకు వేరేదారిలేదు. ఇప్పటికే చాలా అవమానాలు పడ్డాను. ఏదైతేనేం ఆయన్ని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నా' అంటూ టాడా కోర్టుకు రాసిన లేఖలో తన గోడు వెల్లడించింది కౌసర్. తమ నిఖాకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ముంబైలోని మ్యారేజ్ రిజిస్ట్రార్ ను ఆదేశించాలని జడ్జిగారిని కోరింది. తల్లి, సోదరుడు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు.

ఇదంతా సరే ఇంతకీ మీకు నిజంగానే గ్యాగ్స్టర్తో సంబంధం ఉందా? అని కౌసర్ను ప్రశ్నిస్తే.. 'సంబంధం ఉందన్న పోలీసుల ఆరోపణతో నా జీవితమే మారిపోయింది. అప్పుడు నిజంగా సంబంధం ఉన్నా లేకున్నా పెద్ద తేడాలేదు కదా!' అని సమాధానమిచ్చింది. ఆమె విజ్ఙప్తిపై న్యాయమూర్తి ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement