గంగుబాయి, ఆలియా భట్
గంగుబాయి కథ ఒక సినిమాకు తక్కువ కాదు. అందుకే అది ఇప్పుడు సినిమా అయ్యింది. గుంగుబాయి కతియావాడి ముంబై కామాటిపురాకు మకుటం లేని మహారాణి. కరీం లాలా అనే మాఫియా డాన్‌కు రాఖీ కట్టడంతో అతని అండ దొరికి కామాటిపురాను ఏలింది. అయితే ఆమె జీవితాంతం వేశ్యలకు సాయం చేయడానికే చూసింది. అందుకే నేటికీ ఆమె విగ్రహం కామాటిపురాలో ఉంది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ జూలై 30న రిలీజవుతుందని టాక్. ఆలియా భట్ హీరోయిన్‌గా నటించిన గంగుబాయి బయోపిక్ కూడా అదే డేట్‌కు రిలీజ్ కానుంది. ఆ కలెక్షన్ల క్లాష్ కంటే గుంగుబాయి చరిత్రే ఎక్కువ ఆసక్తికరం.
చరిత్ర నిక్షిప్తం చేసుకున్న కథలు ఎన్నో. మనల్ని ఆశ్చర్యపరిచేవి, సంతోషపెట్టేవి, బాధ పెట్టేవి, గర్వపడేలా చేసేవి, సామాజిక పరిణామాలను తెలియ చేసేవి... ఒకప్పుడు సినిమాలంటే కల్పిత కథలు. నేడు చరిత్ర నుంచి ఏరుతున్న పుటలు. దర్శకుడు సంజయ్ లీలాబన్సాలీ అలాంటి మరొక పుటను వెతికి పట్టుకున్నాడు. దాని పేరు ‘గుంగుబాయి కతియావాడీ’. 1960లలో ముంబై రెడ్‌లైట్ ఏరియా అయిన కామాటిపురాలో చక్రం తిప్పిన మేడమ్ గంగుబాయి కతియావాడీ. ఇప్పుడు ఆమె బయోపిక్ దాదాపుగా పూర్తి కావచ్చింది. గుంగుబాయిగా ఆలియాభట్ నటించింది.
ఇంటి నుంచి పారిపోయి
గుంగుబాయి కథ ఆసక్తికరమైనది. ఆమెది గుజరాత్‌లోని కతియావాడీ. వాళ్లది లాయర్ల కుటుంబం అని చెబుతారు. గంగుబాయి చిన్న వయసులో సినిమాల పిచ్చిలో పడింది. అంతే కాదు వాళ్ల నాన్న దగ్గర క్లర్క్‌గా పని చేసే కుర్రాడి ప్రేమలో కూడా పడింది. ఇద్దరూ కలిసి ముంబై పారిపోయారు. వాళ్లిద్దరూ కొన్నాళ్లు కాపురం చేశారని అంటారు. కాని ముంబైలాంటి మహా నగరిలో ఆ కుర్రాడు బెంబేలెత్తాడు. గుంగుబాయిని కామాటిపురాలోని ఒక వేశ్యాగృహంలో 500 రూపాయలకు అమ్మేసి పారిపోయాడు. అక్కడి నుంచే గంగుబాయి జీవితం అనూహ్యమవుతూ వచ్చింది.
ప్రతిఘటన... లొంగుబాటు
వేశ్యావాటికలో గంగుబాయి వారాల తరబడి ఏడ్చింది. కాని తుదకు వృత్తిని అంగీకరించక తప్పలేదు. అయితే ఆమె రూపం, కొద్దో గొప్పో ఉన్న చదువు ఆమెను హైక్లాస్ క్లయింట్‌ల దగ్గరకు వెళ్లే వేశ్యను చేయగలిగాయి. వారి రాకపోకలు ఆమె కోసం సాగేవి. కాని సహజంగా నేరగాళ్లు కూడా చాలామంది వచ్చి పోతూ ఉండేవారు. అలా ఆమెకు ముంబై అండర్‌వరల్డ్ తెలిసింది. ఆ సమయంలోనే నాటి పెద్ద డాన్ అయిన కరీం లాలాకు చెందిన ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. ఇది ఆమెను చాలారోజుల పాటు అచేతనం చేసిందని అంటారు. తన మీద దాడి ఆమె సహించలేకపోయింది.
అయితే మెల్లగా కోలుకుని తనకు న్యాయం జరగాలని ఆశించి శుక్రవారం నమాజు ముగించుకుని వస్తున్న కరీం లాలాను కలిసింది. తనకు జరిగిన అన్యాయం, తాను అనుభవిస్తున్న వేదన చెప్పుకుంది. కరీం లాలా వెంటనే ఆమెకు ఊరడింపు ఇచ్చాడు. ఆమె రాఖీ కడితే కట్టించుకుని రక్ష ఇచ్చాడు. అంతే కాదు ‘కామాటిపురాలో గుంగుబాయికి ఎటువంటి కష్టం ఎవరు కలిగించినా వారి పని చూస్తా’ అని హెచ్చరించాడు. ఇది గంగుబాయికి పెద్ద వరం అయ్యింది. ఆమె కామాటిపురాలో తానే వేశ్యాగృహాల యజమానిగా ఎదగడం మొదలెట్టింది.
మహా ప్రాభవం
కామాటిపురాలో గంగుబాయికి అనేక వేశ్యాగృహాలు సొంతమయ్యాయి. ఆమె కట్టే ఖరీదైన చీరలు నాడు విశేషమయ్యాయి. నిజం బంగారు అంచు ఉండే చీరలు, నిజం బంగారు గుండీలు ఉండే జాకెట్లు ఆమె కట్టుకునేది. ఆమెకు ఆరోజుల్లోనే బెంట్లి కారు ఉండేది. అండర్ వరల్డ్ కూడా ఆమె గుప్పిట్లో ఉండేది. అయితే ఆమె బలవంతపు వ్యభిచారాన్ని ప్రోత్సహించలేదు. దీనిని వృత్తిగా స్వీకరించడానికి ఇష్టపడేవాళ్లే ఉండాలని భావించింది. ఎవరైనా ఈ కూపం నుంచి బయటపడాలనుకుంటే వారిని వెళ్లనిచ్చేది. అంతే కాదు వేశ్యల బాగోగులతోబాటు, వారికి పుట్టిన బిడ్డల బాగోగులు కూడా ఆమె చూసేది. అందువల్లే ఆమె విగ్రహం కామాటిపురాలో ఉంది. ఆమె ఫొటోలు నేటికి కామాటిపురాలోని వేశ్యాగృహాల్లో కనిపిస్తాయి.
సినిమాలో కథ
ఈ సినిమా కథను సంజయ్ లీలా బన్సాలీ పకడ్బందీగా తీస్తున్నాడని వినికిడి. ఆలియా భట్ ఈ క్యారెక్టర్‌ను చాలెంజింగ్‌గా తీసుకుని చేస్తోంది. అజయ్ దేవ్‌గణ్ ‘కరీం లాలా’ పాత్రను పోషిస్తున్నాడు. ఎన్నిసార్లు విన్నా వేశ్యల జీవితంలో విషాదమే ఉంటుంది. దీని గురించి ఎంతో సాహిత్యం వచ్చింది. సినిమాలూ వచ్చాయి. కాని గుంగుబాయి లాంటి వ్యక్తి గురించి వస్తుండటం వల్ల దీని గురించి కుతూహలం ఏర్పడింది. సినిమా విడుదల గురించి వస్తున్న వార్తలను బట్టి జూలై 30న దీనిని విడుదల చేయనున్నారు. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కూడా అదే రోజు కావచ్చని అంచనా. కనుక రెండు సినిమాలు కలెక్షన్ల పోటీని ఎదుర్కోవాలి.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment