ప్రతీకాత్మక చిత్రం
వాషింగ్టన్/మాస్కో: మొట్టమొదటిసారిగా భారత్‌లో వెలుగు చూసిన కోవిడ్–19 డెల్టా వేరియెంట్ (బి.1.617.2) ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. యూకే థర్డ్ వేవ్ గుప్పిట్లో చిక్కుకొని ఆంక్షల సడలింపుని వాయిదా వేసింది. రష్యా, ఇండోనేసియాలో డెల్టా వేరియెంట్ విజృంభిస్తోంది. ఈ వేరియెంట్ ప్రపంచ దేశాలకు ఒక ముప్పుగా పరిణమించిందని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు.
కోవిడ్–19పై వారాంతపు నివేదికను విడుదల చేసిన ఆమె 80 దేశాల్లో ఇప్పటికే ఈ వేరియెంట్ కేసులు ఉన్నాయని, మరో 12 దేశాల్లో డెల్టా కేసులు వెలుగు చూస్తున్నాయని చెప్పారు. యూకేలో వారం రోజుల్లోనే డెల్టా వేరియెంట్ కరోనా కేసులు 33,630 వెలుగు చూశాయని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ (పీహెచ్‌ఈ) వెల్లడించిన నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్‌ఓ కూడా దీని ప్రమాదాన్ని తన వారాంతపు నివేదికలో పొందుపరిచింది. ఇండోనేషియాలోని జకార్తాలో డెల్టా వేరియెంట్ కేసులు వస్తున్నాయి.
మాస్కోలో రోజుకి 9 వేల కేసులు
రష్యాలో కరోనా ముప్పు తొలిగిపోయిందని ప్రభుత్వం భావించిన వేళ డెల్టా వేరియెంట్ విజృంభణతో ఆ దేశం బెంబేలెత్తిపోతోంది. రాజధాని మాస్కోలో శుక్రవారం ఒక్కరోజే 9,056 కేసులు నమోదయ్యాయి. అందులో 89% డెల్టా వేరియెంటేనని నగర మేయర్ సెర్గెయి సొబ్‌యానిన్ తెలిపారు. గత రెండు వారాల నుంచి కేసులు పెరిగిపోతున్నాయని చెప్పారు. రష్యాలో మూడు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ 9.9% జనాభాకి మాత్రమే ఇప్పటివరకు వ్యాక్సినేషన్ పూర్తయింది. డెల్టా వేరియెంట్ మరింత విజృంభించకుండా వ్యాక్సినేషన్ మరింత ముమ్మరం చేయాలని వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
అమెరికాని కూడా డెల్టా వేరియెంట్ భయపెడుతోంది. ముఖ్యంగా అక్కడ యువతలో ఎక్కువ ప్రభావం చూపించడం ఆందోళన పెంచుతోంది. ఈ వేరియెంట్ అత్యంత ప్రమాదకరమైనదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. యువతకు ఈ వేరియెంట్‌తో ముప్పు పొంచి ఉందన్న ఆయన అందరూ వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అప్పుడే ఈ వైరస్‌ని కట్టడి చేయగలమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment