పలు దేశాల్లో కరోనా కల్లోలం మళ్లీ మొదలు | New Covid Cases Worldwide Russia Sets Record Cases | Sakshi
Sakshi News home page

పలు దేశాల్లో కరోనా కల్లోలం మళ్లీ మొదలు

Published Sun, Oct 31 2021 3:32 PM | Last Updated on Sun, Oct 31 2021 4:05 PM

New Covid Cases Worldwide Russia Sets Record Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కల్లోలం మళ్లీ మొదలైంది. యూకే, చైనా, రష్యా, అమెరికా, సింగపూర్, ఐరోపాలో ముఖ్యంగా తూర్పు ఐరోపా దేశాల్లో కోవిడ్‌ కేసుల వృద్ధి నమోదవుతున్నాయి. యూకే తదితర చోట్ల కేసుల పెరుగుదలకు కరోనా తాజా వైరస్‌ వేరియెంట్‌ మ్యుటేషన్‌ ఏవై. 4.2 కారణమని వెల్లడైంది. రష్యా, యూకే, సింగపూర్‌, చైనాల్లో భారీగా కొత్త వేరియెంట్‌ కేసులు భారీ స్థాయిలో నమోదు కావడం మళ్లీ కలవరపెడుతోంది. రష్యాలో రోజుకు 40వేలకు పైగా కేసులు నమోదు కావడం, క్రమెపీ పెరుగుతూ పోవడంతో అక్కడ మరోసారి భయానక పరిస్థితి నెలకొంది. యూకేలో 50వేలకు పైగా ఏవై. 4.2 కేసులు రావడం, జూలై నెల తర్వాత అత్యధిక కేసులు రావడంతో ఆందోళన కల్గిస్తోంది. 

అయితే ఈ రకం మ్యుటేషన్‌ భారత్‌లో చాలా తక్కువగా ఉన్నట్లు చెబుతున్నా తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 18 కేసులు గుర్తించారు. అయితే దీని వ్యాప్తి, తీవ్రత అంతగా లేనట్లు పేర్కొంటున్నారు. 

పలు రాష్ట్రాల్లో కేసులు నెమ్మదిగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా నవంబర్‌ 30 దాకా జాతీయ స్థాయిలో కోవిడ్‌ ‘కంటైన్మెంట్‌’చర్యలను పొడిగిస్తూ రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటిదాకా పాటిస్తూ వచ్చిన కరోనా నియంత్రణ చర్యలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులను కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా ఆదేశించారు. ప్రస్తుత పండుగల సీజన్‌లో అన్ని జాగ్రత్తలు పాటించి కేసుల పెరుగుదల, వ్యాప్తి జరగకుండా చూడాలని సూచించారు. ఇటీవల హరియాణా, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్‌లో కేసులు పెరుగుతున్నట్లు అధికారిక గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. ప్రస్తుతం అన్ని కార్యకలాపాలు మామూలైపోవడంతో గుంపులుగా చేరడం, ఇంటా, బయట, బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా తిరగడం, మాస్క్‌లు, ఇతర జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల కేసులు పెరిగే ప్రమాదముందని వైద్య నిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 

దేశంలో ఏవై.4.2 వేరియెంట్‌ చాలా తక్కువ 
భారత్‌లో ఏవై. 4.2కు సంబంధించి 18 స్వీక్వెన్సింగ్‌ తీసినట్లు తాజా నివేదికలను బట్టి తెలుస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, జమ్మూ కశ్మీర్, తెలంగాణలో ఈ కేసులు నమోదయ్యాయి. అయిత మన దగ్గర ఒక శాతం కంటే తక్కువగా ఉంది. గత జూన్‌ మధ్యలోనే దీనికి సంబంధించిన కేసు బయటిపడిందని చెబుతున్నారు. అప్పటినుంచి పెద్ద మొత్తంలో కేసులు లేవు కాబట్టి పెద్దగా ప్రభావం చూపలేదనే భావించాలి. యూకే, తదితర దేశాల్లో ఈ రకం స్ట్రెయిన్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ఈ దేశాల్లో టీకా కార్యక్రమం విషయంలో ప్రాంతీయ అసమానతలు ఎక్కువగా ఉండటంతో ఒకే రకమైన వ్యాక్సినేషన్‌ జరగకపోవడం కారణం కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్‌లో మాత్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఒకే రకంగా టీకాలు వేయడం కలిసొచ్చే అంశం. మన దగ్గర జనసాంద్రత ఎక్కువగా ఉన్నందున ప్రస్తుత పండుగల సీజన్‌లో మాస్క్‌ వేసుకోవడం, ఇతర జాగ్రత్తలు తీసుకుని కరోనా ప్రమాదకరమైన మ్యుటేషన్లుగా మారకుండా అప్రమత్తంగా ఉండాలి. 
– డా.కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ 
విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రి
 

వారం నుంచి మళ్లీ పెరుగుతున్నాయి.. 
వారం రోజుల నుంచి కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దసరా తర్వాత పరిస్థితిలో మార్పు కన్పిస్తోంది. ప్రస్తుత పండుగల సీజన్‌లో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి. టీకాలు వేసుకున్నా కోమార్బిడిటీస్‌ ఉన్న వారిలో సమస్య తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. వ్యాక్సిన్‌ తీసుకోని వారిలోనే మరణాలు పెరుగుతున్నాయి. మేం సీసీఎంబీతో కలసి రెగ్యులర్‌గా శ్యాంపిల్స్‌పై జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేస్తున్నాం. మన దగ్గర ఇంకా డెల్టా వేరియెంటే బలంగా ఉంది. ప్రస్తుతం కేసులు వస్తున్నా అవి సీరియస్‌గా మారడం లేదు. మరో 3 నెలలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 
– డా.విశ్వనాథ్‌ గెల్లా, డైరెక్టర్‌ పల్మనాలజీ, స్లీప్‌ డిజార్డర్స్, ఏఐజీ హాస్పిటల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement