సాక్ష్యం చెబుతున్న భావన రాకూడదు | High Court says Children need to register witnesses in friendly environment | Sakshi
Sakshi News home page

సాక్ష్యం చెబుతున్న భావన రాకూడదు

Published Sun, Mar 4 2018 2:53 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

High Court says Children need to register witnesses in friendly environment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోర్టుల్లో బాలల సాక్ష్యాలు నమోదు చేసేప్పుడు స్నేహపూర్వక వాతావరణం ఉండాలని, కోర్టుల్లో సాక్ష్యం చెబుతున్నారనే భావన బాలల్లో లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. బాలల న్యాయం చట్టం (జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌) నిబంధనల మేరకు జిల్లాల్లో బాలల స్నేహపూర్వక కోర్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

బాల్య వివాహాలు, లైంగిక వేధింపు నేరాల నుంచి బాలల్ని రక్షించేందుకు ఈ చర్యలు అవసరమని కోర్టు పేర్కొంది. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లోని బాలల హక్కుల కమిషన్‌ల్లో ఖాళీల భర్తీకి కేంద్ర, రాష్ట్రాలన్నీ ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యాన్ని విచారణ జరిపింది. కోర్టు రాష్ట్రాలు బాలల హక్కుల పరిరక్షణకు వివిధ చర్యలు తీసుకోవాలని గత నెల 9న ఆదేశించింది. దీనికి అనుగుణంగా సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ రాసిన లేఖను విచారించిన ఉమ్మడి హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. బాలబాలికలతో స్నేహపూర్వక విచారణలు జరిపేందుకు తీసుకునే చర్యల గురించి తెలియజేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ.. ప్రతివాదులైన రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, హోం/శిశు సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులు, జైళ్ల శాఖల డైరెక్టర్‌ జనరళ్లు, న్యాయ సేవాధికార సంస్థల రాష్ట్ర సభ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement