ఇదేం బాల్యం
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. గుండె గుబులుని గంగకు వదిలి.. ముందు వెనుకలు ముంగిట వదిలి.. గదులను వదిలి, ముడులను వదిలి.. గడబిడలన్నీ గాలికి వదిలి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది’ సాహితి గారు రాసిన ఈ పాట వినగానే పెద్దవాళ్లందరికీ ఏ బాదరబందీలు లేని బాల్యంలోకి ఎగిరిపోవాలనిపిస్తుంటుంది. నిజం చెప్పండి.. ఈ తరం బాల్యంలో మీరు ఇమడగలరా..? బాల్యం అంటే బాధ్యతలెరుగని జీవితమని ఏదో మాటవరుసకు అంటున్నాం. కానీ, ఒక్కసారి ఇప్పటి బాల్యంలోకి తొంగి చూడండి.. కఠోరమైన వాస్తవం మిమ్మల్ని పలకరిస్తుంది. పేదరికం ముసురుకున్న చిన్నారుల గురించి కాదు నేను మాట్లాడుతున్నది. మన ఇంట్లో.. అపురూపంగా పెరుగుతున్న బాల్యం గురించి.
గదులను వదిలి ముడులను వదిలి మన పిల్లలు ఎగిరిపోగలరేమో అని చిన్నారులను అడిగి చూడండి. పుస్తకాల బరువుకు నడుం వంగిపోతోందని రోజూ బాధపడే మనం ఆ వ్యవస్థను మార్చడానికి ముందుకురాము. పాఠశాలల్లో ఆటస్థలాలు లేవని ఏకరువు పెడతామే గానీ అది పిల్లల హక్కు అని గట్టిగా వాదించం. అవే పాఠశాలలకు పిల్లలను సంచుల్తో సహా బస్సుల్లో, ఆటోల్లో కుక్కి మరీ పంపిస్తాం. ఈ బాల్యానికి ఎగిరే స్థలం ఏది..? కనీసం నేల మీద ఆడుకునే ప్రదేశం ఎక్కడుంది ?
బ్రాండెడ్ సంకెళ్లు..
ముందు వెనుకలు గాలికి వదిలి మన పిల్లలు ఎగిరిపోగలరేమో అడిగి చూడండి. వారు ఎగురగలరేమో కానీ, కట్టి పడేసింది మనమే. బ్రాండెడ్ బట్టలు, వస్తువులు లేనిదే బాల్యం అందంగా ఉండదని మనమే ముచ్చటపడతాం. ట్యాబ్‌లు, ప్యాడ్లు, ఫోన్లు, యాప్‌లు ఇవన్నీ స్మార్ట్ అని ప్రకటించే పెద్దరికం వీటిని వాడే పిల్లలు కూడా స్మార్ట్ అని సర్టిఫికెట్ ఇవ్వగలరా..? బొటన వేలు, చూపుడు వేలు మాత్రమే చలాకీగా ఉండే స్మార్ట్‌నెస్ మన పిల్లల్లో ఉందని మురిసిపోదామా..?
పందెం కోళ్లు..
ర్యాంకుల పందెంలో పరుగెత్తుతున్న బాల్యం.. జీవిత పాఠాలు నేర్చుకునేది ఎప్పుడని ఆలోచించం. పౌల్ట్రీ ఫామ్స్‌లో కోళ్లలా అటూ ఇటూ సంచరించేందుకు వీల్లేని గదులు కేటాయించి.. కేవలం దాణా తింటూ వెనుక నుంచి గుడ్డు పెట్టే బ్రాయిలర్ కోడి జీవితం మన పిల్లల బాల్యం. అందుకే గుండెల్లో గుబులు పుట్టించే బాల్యం నుంచి త్వరగా ‘పెద్ద’వాళ్లమయిపోవాలనే ఆరాటంలో మన పిల్లలు అనవసరమైన పెద్దరికం పోకడలన్నీ అలవాటు చేసుకుంటున్నారు.
13 ఏళ్లు రాకుండానే ఈ-మెయిల్, ఫేస్బుక్, వాట్సప్‌లు తెరిచేస్తున్నారు. తెలిసీ తెలియని వయసులోనే ఇంటర్నెట్ వలలో చిక్కుకుపోతున్నారు. రెండు నిమిషాలు కళ్లలోకి కళ్లు పెట్టి నోరారా మాట్లాడేందుకు ఇష్టపడని టీనేజర్లు ప్రతి ఇంట్లో కనిపిస్తారు. కానీ, ప్రతిక్షణం సామాజిక నెట్‌వర్క్‌లో స్టేటస్ అప్డేట్ చేయడంలో మాత్రం ముందుంటారు. ఇంట్లో దొరకని ఐడెంటిటీ కోసం బయట వర్చువల్ ప్రపంచంలో పాకులాడే బాల్యం తయారవడానికి కారణం మనం కాదా!
మసితనం మనకొద్దు..
‘ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ’ అని ఇప్పుడు పాడుతున్నది పెద్దలు కాదు తడబడుతున్న బాల్యం. ర్యాంకులే పరమావధిగా, బ్రాండులే గుర్తింపుగా, గాడ్జెట్లే ఆసరాగా భావించే తరాన్ని తయారు చేసిన పెద్దలందరికీ నమస్కారం. దయచేసి విద్యారంగంలో మార్పులకు స్వాగతం పలకండి. మార్కెట్ ఉధృతిలో బాల్యం కొట్టుకుపోకుండా కాపాడండి. పసితనంలోనే అమాయకత్వం కోల్పోయే మసకబారే బాల్యం మనకొద్దు.
we want happy children.