Farmers Cooperative Society
-
రబీకి సమాయత్తం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రబీ సాగుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సబ్సిడీ విత్తనాలు, ఎరువు లను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు సమాయత్తమవుతోంది. ఈ సీజన్లో 29వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసింది. సాధారణంగా రబీలో ఎక్కువగా శనగ, వేరుశనగ, వరి, మొక్కజొన్న పంటలు సాగవుతాయి. సుమారు 11 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని లెక్కతేల్చారు. ఇప్పటివరకు శనగ, వేరుశనగ విత్తనాలు కొంతమేర మండల స్థాయిలో అందుబాటులో ఉంచారు. మిగతా పంటలతో పోల్చితే ఈ రెండు పంటలు సీజన్ ఆరంభంలోనే సాగుచేస్తారు. ఆ తర్వాతే వరి తదితర పంటలు సాగవుతాయి. విత్తన సబ్సిడీ ఖరారు.. ఆయా విత్తనాలపై సబ్సిడీ ఖరారైంది. శనగ విత్తనాలను 50 శాతం సబ్సిడీపై రైతులు కొనుగోలు చేయవచ్చు. క్వింటా శనగ విత్తనాల ధర రూ.6,500. ఇందులో సబ్సిడీపోను (రూ.3,250) మిగిలిన మొత్తాన్ని రైతు వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. వేరుశనగ క్వింటా ధర రూ.6,400గా నిర్ణయించారు. రైతులకు 35 శాతం రాయితీపై వీటిని విక్రయిస్తారు. ఇక వరి ధాన్యం రకాన్ని బట్టి ధరలో స్వల్ప మార్పులు ఉన్నాయి. ధరతో సంబంధం లేకుండా క్వింటాపై రూ.500 రాయితీ పొందవచ్చు. విత్తనాలు అవసరం ఉన్న రైతులు స్థానిక వ్యవసాయ విస్తరణాధికారులను ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం తీసుకుని కలవాలి. రైతులకు కావాల్సిన విత్తన రకం, పరిమాణాన్ని అతను ఆన్లైన్లో నమోదు చేస్తారు. విత్తనాలు అందుబాటులో ఉన్న పీఏసీఎస్, డీసీఎంస్, ఆగ్రోస్ కేంద్రాలు, అగ్రి సేవా కేంద్రాల్లో రైతులు పొందవచ్చు. సబ్సిడీపై విత్తనాలు కావాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు, పట్టాదారు కా>ర్డు ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆధార్ ఉంటేనే సబ్సిడీపై ఎరువులు రబీ ప్రారంభంలో అవసరమయ్యే మేరకు ఎరువులు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ సీజన్లో వివిధ రకాల 24,580 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా. ఇందులో ఇప్పటి వరకు 17 వేల మెట్రిక్ టన్నులకు పైగా అన్ని పీఏసీఎస్, డీసీఎంఎస్, మన గ్రోమోర్ కేంద్రాలు, లైసెన్స్డ్ ప్రైవేటు డీలర్ల వద్ద అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. వీటిని ఈ–పాస్ విధానంలోనే విక్రయిస్తారు. పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తీసుకెళ్తేనే సబ్సిడీపై ఎరువులు విక్రయిస్తారు. ప్రతి డీలర్ తమ వద్ద అందుబాటులో ఉన్న ఎరువుల ధరలు తప్పనిసరిగా రైతులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాల్సి ఉంటుంది. విస్తృత చర్యలు రబీలో రైతులు పంటలు సాగు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఆయా రకాల విత్తనాలు, ఎరువులను క్షేత్రస్థాయిలోకి పంపించాం. ఎటువంటి కొరతా లేదు. ఎక్కడైనా తక్కువ పడితే అప్పటికప్పుడు రైతులకు సమకూర్చేలా చర్యలు తీసుకుంటాం. రోజువారీగా జరుగుతున్న విక్రయాలపై సమీక్షిస్తున్నాం. ఏమైనా ఇబ్బందులు ఉంటే స్థానిక ఏఈఓ లేదా మండల వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకెళ్లాలి. – గీతారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి -
ఉత్పత్తుల విక్రయాలకు సొంత బ్రాండ్
సాక్షి, హైదరాబాద్: కల్తీలేని పరిశుభ్రమైన ఆహార ఉత్పత్తుల విక్రయాలకు సొంత బ్రాండ్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. రోజు వారీ వినియోగించే బియ్యం, పప్పులు, అల్లం, వెల్లుల్లి, కారం, సుగంధ ద్రవ్యాలు తదితర ఆహార ఉత్పత్తులను ఆ బ్రాండ్‌పై సరఫరా చేయనుంది. వాటిని విక్రయించేలా సొంత ఔట్లెట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అందుకోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో పనిచేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. అలాగే పీపీపీ పద్ధతిలో ఫుడ్ పార్కులను ఏర్పాటు చేస్తారు. రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ విధివిధానాలు, రోజువారీ కార్యక్రమాలపై సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రతిపాదనలు తయారుచేసి తాజాగా ప్రభుత్వానికి నివేదించారు. ఆ నివేదికలో కార్పొరేషన్ లక్ష్యాలను, విధివిధానాలను వివరంగా తెలిపారు. ఆహార ఉత్పత్తులు, వాటి అనుబంధ విలువ ఆధారిత ఉత్పత్తుల గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ చేపట్టాలని సమితి నిర్ణయించింది. వాటిని సొంత బ్రాండ్‌పై విక్రయించనుంది. అలాగే రైతులు పండించిన పంటలకు మార్కెట్లో సరైన ధరరాని పక్షంలో జోక్యం చేసుకొని కనీస మద్దతు ధర కల్పించాలని ప్రతిపాదించింది. అందుకు సంబంధించి వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు, మార్క్‌ఫెడ్, ఆగ్రోస్, ఆయిల్‌ఫెడ్ తదితర సంస్థలతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. రైతు నుంచి వినియోగదారుని వరకు ఆహార ఉత్పత్తులు అందేలా గోదాములు, ప్యాకింగ్, కోల్డ్స్టోరేజీలన్నింటినీ అందుబాటులోకి తీసుకు వస్తారు. అలాగే ఆహార ఉత్పత్తులను సమీప రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేస్తారు. సమితుల ద్వారానే అమలు.. వ్యవసాయశాఖ చేపట్టే వివిధ పథకాల అమలంతా రైతు సమన్వయ సమితుల ద్వారానే జరగాలని ప్రతిపాదించారు. రైతుబంధు పథకం, రైతుబంధు బీమా పథకం, పంటల బీమా, రుణాలు, రైతు వేదికలుసహా ఇతర వ్యవసాయ పథకాలన్నింటినీ సమితి ద్వారా అమలుచేయాలనేది రైతు కార్పొరేషన్ ఉద్దేశం. ఈ కార్యక్రమాలపై విధానపరమైన నిర్ణయాలను మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) తీసుకుంటారు. ఆ పోస్టును ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇక క్షేత్రస్థాయిలో అమలును పర్యవేక్షించే కీలక బాధ్యతను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)కు అప్పగిస్తారు. అందుకోసం ఈడీ పోస్టును మంజూరు చేయాలని ప్రతిపాదించారు. జనరల్ మేనేజర్ పోస్టునే ఈడీగా మార్చాలని కూడా భావిస్తున్నారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టును కూడా ఏర్పాటు చేస్తారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఈడీకి సహకరిస్తారు. రైతులు పండించిన పంటల సరఫరా డిమాండ్‌ను పరిశీలించాల్సిన బాధ్యత డిప్యూటీ జనరల్ మేనేజర్‌దే. ఎగుమతులు ఎక్కడికి చేయాలో నిర్ధారించాలి. రైతు కార్పొరేషన్‌కు వ్యవసాయాధికారులను నియమిస్తారు. అలాగే అకౌంట్ ఆఫీసర్‌ను నియమిస్తారు. -
రైతు బంధు చెక్కు తిరిగిచ్చిన మంత్రి తలసాని
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం కొల్తూరు గ్రామ రెవెన్యూ పరిధిలో తమ కుటుంబానికి ఉన్న 20 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమికి సంబంధించి అందజేసిన రూ.81 వేల రైతు బంధు చెక్కులను పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తిరిగి ఇచ్చారు. కొల్తూరులో శనివారం జరిగిన రైతు బంధు కార్యక్రమంలో మంత్రి తలసాని తమ చెక్కులను రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నందారెడ్డికి అందజేశారు. రైతుల సంక్షేమం, అభివృద్ధికి రైతు బంధు చెక్కులు తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం కొల్తూరుకి చెందిన 600 మంది రైతులకు రూ.78.12 లక్షలకు సంబంధించిన 714 చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పంట కొనుగోలు సక్రమంగా జరగాలి: గుత్తా
సాక్షి, హైదరాబాద్: పంట ఉత్పత్తుల కొనుగోలును సక్రమంగా సకాలంలో జరిగేలా చూడాలని రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. జిల్లా రైతు సమితి సమన్వయకర్తలతో గురు వారం ఆయన తొలిసారిగా సమావేశ మ య్యారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లా డుతూ.. త్వరలో జిల్లా, మండల స్థాయి రైతు సమన్వయ సమితి సభ్యులకు ఏడు విడతలలో రెండ్రోజుల చొప్పున శిక్షణ కార్య క్రమం ఉంటుందన్నారు. రైతు వేదికల నిర్మాణానికి భూములను గుర్తించాలన్నారు. మరోవైపు కార్పొరేషన్ కార్యవర్గ సమావేశం కూడా జరిగింది. -
పెద్ద రైతులు పెట్టుబడి రాయితీ వదులుకోవాలి
నల్లగొండ: రాష్ట్రంలో ఆర్థికంగా బలంగా ఉన్న రైతులు ప్రభుత్వం అందించే పెట్టుబడి రాయితీని వదులుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం తొలిసారిగా ఆయన నల్లగొండలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న రైతులు పెట్టుబడి రాయితీ వదులుకుంటే ఆ నగదు మొత్తాన్ని రైతు సమన్వయ సమితి ఖాతాలో జమ చేస్తామన్నారు. తిరిగి రైతుల సంక్షేమానికే ఆ నిధులు ఖర్చు చేస్తామని తెలిపారు. ఓ రైతుగా స్వచ్ఛందంగా పెట్టుబడి రాయితీని వదులుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. అప్పుల బాధతో రైతులు బలవన్మరణాలకు పాల్పడవద్దని, అప్పులు తీర్చాలని ఎవరైనా ఒత్తిడికి గురిచేస్తే రైతులు సమన్వయ సమితుల దృష్టికి తీసుకురావాలని కోరారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర కార్పొరేషన్ వరకు రైతులు తమ సమస్యలను విన్నవించుకోవచ్చని చెప్పారు. రైతు సమస్యలకు సమన్వయ సమితులు పరిష్కార వేదికగా పనిచేస్తాయని ఆయన తెలిపారు. త్వరలో గ్రామ, మండల, జిల్లా కో ఆర్డినేటర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. సమన్వయ సమితుల లక్ష్యాలను సీఎం కేసీఆర్ కో ఆర్డినేటర్లకు వివరిస్తారని చెప్పారు. రాష్ట్ర కార్పొరేషన్ బోర్డు తొలి సమావేశాన్ని ఈ నెల 22న నిర్వహిస్తామని గుత్తా తెలిపారు. ఈ సమావేశంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మదర్‌డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, ఎంపీపీ పాశం రాంరెడ్డి పాల్గొన్నారు. -
రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా గుత్తా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతు సమన్వయ సమితిని లాభాపేక్షలేని సంస్థ(కార్పొరేషన్)గా నమోదు చేసినట్లు ఉత్తర్వులో పేర్కొంది. రైతు సమన్వయ సమితిలో ఐదుగురిని డైరెక్టర్లుగా నియమించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి డైరెక్టర్, చైర్మన్ హోదాలో ఉంటారు. వ్యవసాయ శాఖ కమిషనర్ ఎం.జగన్మోహన్ను రైతు సమన్వయ సమితి ఎండీగా, ఉద్యాన శాఖ డైరెక్టర్ ఎల్.వెంకట్రామిరెడ్డి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సి.హెచ్.వి.సాయిప్రసాద్‌ను రైతు సమన్వయ సమితి డైరెక్టర్లుగా నియమించారు. నియామక ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, విధి విధానాలను త్వరలో ఖరారు చేస్తామని తెలిపారు. కాగా, రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా నియమితులైన గుత్తా సుఖేందర్‌రెడ్డి మార్చి 12న బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలిసింది. -
‘పెట్టుబడి’కి పెద్దలెందుకు?!
సాక్షి, హైదరాబాద్: ఎకరానికి రూ.4 వేలు చొప్పున రైతులకు ఇచ్చే పెట్టుబడి సొమ్మును పెద్దలు స్వచ్ఛందంగా వదులుకునేలా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తనకూ పెట్టుబడి సొమ్ము వస్తుందని, అయితే, స్వచ్ఛందంగా వదులుకుం టానని రైతు సమితి సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం తెలిసిందే. దీంతో మం త్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారు లు, ఇతర పెద్దలు కూడా అదే బాటలో పయ నించేలా ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పేద, మధ్య తరగతి రైతులకు దక్కాల్సిన సొమ్మును పెద్దలు తీసుకుంటే విమర్శలు వస్తాయి. దీంతో పథకం నుంచి వారిని తప్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. మం త్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు స్వచ్ఛందంగా వదులుకునేలా చేస్తే మంచి పేరు వస్తుందని భావిస్తోంది. ఇలా చేయడం వల్ల ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు స్వచ్ఛందంగా వదులుకునే అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములున్న ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు కూడా ముందుకు వస్తారని భావిస్తున్నారు. మరోవైపు స్వచ్ఛందంగా పెట్టుబడిని వదులుకుంటామని లేఖలు అందజేసేలా సర్కారు ఆలోచిస్తోంది. వ్యవసాయ శాఖకు అలా లేఖలు పంపేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వదులుకున్న వారికి ప్రచారం.. రాష్ట్రంలో 1.65 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమికి చెందిన రైతులకు ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ నుంచి పెట్టుబడి సాయం అందించనుంది. అందుకోసం రైతులకు చెక్కు లను అందజేస్తుంది. ధనిక, పేద అనే సం బంధం లేకుండా అందరికీ పెట్టుబడి సాయం చేస్తానని ఇప్పటికే ప్రకటించింది. అయితే, 30–40 ఎకరాలకు మించి సాగు భూమి ఉన్న పెద్ద రైతులు, నేతలు, ఇతర ప్రముఖులను ఎలాగైనా పథకం నుంచి తప్పించే ఆలోచనలో సర్కారు ఉంది. వారిలో చైతన్యం కలిగించి స్వచ్ఛందంగా వదులుకునేలా ప్రచారం చేస్తారు. గ్యాస్ సబ్సిడీని ధనవంతులు స్వచ్ఛందంగా వదులుకునేలా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. ఇప్పుడు అదేవిధంగా రాష్ట్రంలోనూ పెట్టుబడి రాయితీని వదులుకునేందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలని నిర్ణయించారు. ముందుగా మంత్రులు, ఎమ్మెల్యేలతో ‘నాకు పెట్టుబడి రాయితీ వద్దు’ అని ప్రకటన చేయించి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తారు. సినిమా నటులనూ ప్రోత్సహిస్తారు. వారితో ప్రచారం చేయించేందుకు సర్కారు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇలా వచ్చే నెల రోజులపాటు స్వచ్ఛందంగా పెట్టుబడి వదులుకునేలా కార్యక్రమం నిర్వ హిస్తారు. అందుకోసం అవసరమైతే ప్రముఖులతో ఫోన్లో సంప్రదింపులు జరుపుతారు. స్వచ్ఛందంగా వదులుకున్న సొమ్మును రైతు కార్పొరేషన్లో జమ చేస్తారు. దాన్ని కార్పస్ ఫండ్‌గా ఏర్పాటు చేసి రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తారు. -
‘సమన్వయకర్తలు’ వీరే
సాక్షి, హైదరాబాద్: జిల్లా రైతు సమితుల సమన్వయకర్తల పేర్లను వ్యవసాయ శాఖ వెల్లడించింది. శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లా సమన్వయకర్తగా గుండెల్లి తిరుపతిని నియమించారు. పెద్దపల్లి జిల్లాకు కోట రాంరెడ్డి, జగిత్యాలకు చీటి వెంకటరావు, సిరిసిల్లకు గడ్డం నర్సయ్య, సిద్దిపేటకు వి.నాగిరెడ్డి, మెదక్‌కు టి.సోములు, సంగారెడ్డికి వెంకటరాంరెడ్డి, ఆదిలాబాద్‌కు అడ్డి భోజిరెడ్డి, మంచిర్యాలకు ఎం.గురవయ్య, ఆసిఫాబాద్‌కు బసవత్ కార్ విశ్వనాథ్, నిర్మల్‌కు ఎస్.వెంకటరాంరెడ్డి, నిజామాబాద్‌కు బనావత్ మంజుల, కామారెడ్డికి డి.అంజిరెడ్డి, వరంగల్ అర్బన్‌కు ఇ.లలితాయాదవ్, వరంగల్ రూరల్‌కు బొల్లె భిక్షపతి, భూపాలపల్లికి పల్లా బుచ్చయ్య, మహబూబాబాద్‌కు భుక్యా బాలాజీ, జనగామకు ఐ.రమణారెడ్డి, ఖమ్మంకు నల్లమల వెంకటేశ్వర్రావు, కొత్తగూడెంకు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, నల్లగొండకు ఇ.రాంచందర్ నాయక్, యాదాద్రికి కొల్పుల అమరేందర్ ముదిరాజ్, సూర్యాపేటకు ఎస్.ఎ.రజాక్, మహబూబ్‌నగర్‌కు ఎస్.బస్వరాజ్‌గౌడ్, నాగర్‌కర్నూలుకు పోకల మనోహర్, గద్వాలకు కె.వెంకటరాములు, వనపర్తికి పి.జగదీశ్వర్‌రెడ్డి, రంగారెడ్డికి వంగేటి లక్ష్మారెడ్డి, వికారాబాద్‌కు కె.మహేశ్‌రెడ్డి, మేడ్చల్‌కు నారెడ్డి నందారెడ్డి నియమితులయ్యారు. సమన్వయకర్తల్లో ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు 14 మంది, బీసీ వర్గాలకు చెందిన వారు 10 మంది, ఎస్సీ ఇద్దరు, ఎస్టీ ముగ్గురు, ముస్లిం వర్గానికి చెందిన వారు ఒకరు ఉన్నారు. రాష్ట్ర సమితిపై సీఎం కసరత్తు రాష్ట్ర సమన్వయ సమితి సభ్యుల ఎంపికపై ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. మొత్తం 42 మందిని నియమిస్తారు. సమితిని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. దానికి చైర్మన్‌గా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమచారం. రైతు సమితి కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుక్రవారం జరిగింది. రిజిస్ట్రేషన్ తర్వాత చైర్మన్‌గా గుత్తా పేరును ప్రకటిస్తారని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు శనివారం ప్రకటించకపోతే రైతు సదస్సు సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం గుత్తా పేరును ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటిస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. మరోవైపు రాష్ట్ర సమితిలో చోటుకోసం అనేకమంది ప్రయత్నాలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం 15 మంది పేర్లను తాత్కాలికంగా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ అయ్యాక కొత్త పాలక మండలిని ఎంపిక చేసినట్లు తీర్మానం చేసి దానికి సభ్యులను, చైర్మన్‌ను నియమిస్తారని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. -
మండల సభ్యులు కాకున్నా ‘జిల్లా’లో చోటు!
సాక్షి, హైదరాబాద్: గ్రామ, మండల రైతు సమితుల్లో సభ్యులు కాని వారికి కూడా జిల్లా సమితుల్లో చోటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాకుండా రాష్ట్ర స్థాయి రైతు సమితిలోనూ ఇతరులకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ప్రభుత్వం గతంలో జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. గ్రామ రైతు సమితిలో సభ్యులైన వారికే మండల సమితిలో చోటు కల్పించాలి. అలాగే మండల సమితి సభ్యుల నుంచే జిల్లా సమితిలోకి ఎంపిక చేయాలి. తాజా ఆదేశాల ప్రకారం మండల సమితిలో సభ్యుడు కాని వారిని కూడా జిల్లా సమితిలో నియమించేందుకు వీలు కలుగుతోంది. మంత్రుల నిర్ణయంతో.. ఇటీవల పలువురు మంత్రులు మండల సమితిలో సభ్యులు కానివారిని జిల్లా సమితుల్లో నియామకం కోసం ఎంపిక చేశారు. కానీ కలెక్టర్లు ఇది నిబంధనల ప్రకారం సాధ్యంకాదంటూ జాబితాలను ఆమోదించేందుకు నిరాకరించారు. కానీ రాజకీయంగా కీలకమైన అంశం కావడంతో, నిబంధనలను సవరించి వారికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ సవరణ ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్లు ఈ ఉత్తర్వుల ఆధారంగా పెండింగ్‌లో ఉన్న నాలుగు జిల్లాల సమితుల జాబితాను ఆమోదించి ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుతం జిల్లా రైతు సమన్వయ సమితుల జాబితా సీఎం వద్ద ఉంది. అందులో ఇంకా ఏవైనా మార్పులు చేర్పులు ఉంటాయా అన్న చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి విచక్షణ మేరకు.. రాష్ట్ర స్థాయి రైతు సమన్వయ సమితిలో అందరూ జిల్లా రైతు సమితి సభ్యులు ఉండాలన్న నిబంధన ప్రత్యేకంగా ఏమీలేదని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా సమితితో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి విచక్షణ మేరకు రాష్ట్ర రైతు సమన్వయ సభ్యులను నామినేట్ చేస్తారని పేర్కొంటున్నాయి. రాష్ట్ర సమితిలో 42 మంది సభ్యులుంటారు. వారిలో ఎందరిని జిల్లా సమితుల సభ్యుల నుంచి ఎంపిక చేస్తారు, సభ్యులుకాని వారిని ఎందరిని ఎంపిక చేస్తారన్న చర్చ జరుగుతోంది. ఇందులో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలకు కూడా అవకాశం కల్పించే నేపథ్యంలో.. రాష్ట్ర సమితి ఎలా ఉండబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. జిల్లా సమన్వయకర్తలపై కసరత్తు జిల్లా సమన్వయకర్తలుగా ఎవరు ఉంటారన్నది రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే జిల్లా సమితుల జాబితాలను దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి.. జిల్లా సమన్వయకర్తలుగా ఎవరిని నియమించాలన్న దానిపై మంత్రులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ పదవి కోసం ఒక్కో జిల్లా నుంచి ఏడెనిమిది మంది వరకు పోటీ పడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పలువురు ఆశావహులు హైదరాబాద్‌లో మకాం వేసి.. ముఖ్యమంత్రికి చెప్పించుకునేందుకు పైరవీలు కూడా చేస్తున్నట్లు తెలిసింది. ఇక రాష్ట్ర రైతు సమితిలో సభ్యత్వం కోసం పలువురు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొత్తంగా ప్రాంతీయ రైతు సదస్సుల నాటికి జిల్లా సమన్వయకర్తలు, సభ్యులతో సర్కారు ఉత్తర్వులు జారీ చేస్తుందని, రాష్ట్ర సమితి కూడా ఏర్పాటవుతుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. -
రైతు కార్పొరేషన్ రెడీ!?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతు కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందా..? ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి చైర్మన్‌గా త్వరలో రాష్ట్ర రైతు సమితి ఏర్పాటు కానుందా..? పరిస్థితులు అందుకు అవుననే సమాధానం చెబుతున్నాయి. ‘రైతులకు పెట్టుబడి పథకం’అమలుతీరుపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం.. జిల్లా సమన్వయ సమితులను త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు ఇటీవల అందజేసిన నివేదికలో సిఫార్సు చేసింది. దీంతో జిల్లా సమితులతోపాటు రాష్ట్ర రైతు కార్పొరేషన్ కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో రైతు కార్పొరేషన్ చైర్మన్ చాంబర్‌నూ సిద్ధం చేయడం ఇందుకు ఊతమిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇదంతా జరిగినట్లు తెలిసింది. ఎంపీ గుత్తా సూచనల మేరకు వాస్తు ప్రకారంగా చాంబర్‌ను తీర్చిదిద్దారని.. ఆయన అనుచరుల కనుసన్నల్లోనే చాంబర్, మీటింగ్ హాలు సిద్ధమైందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో త్వరలోనే గుత్తాకు చైర్మన్ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం ఊపందుకుంది. కార్పొరేషన్ పర్యవేక్షణలో..: పెట్టుబడి పథకం కింద రైతులకు ఎకరాకు రూ. 4 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వచ్చే మే 15 నాటికి చెక్కుల రూపంలో ఈ సొమ్మును సర్కారు అందించనుంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు సమన్వయ సమితుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియను చేపడతారని సమాచారం. అంతేకాదు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని పర్యవేక్షణలోనే పథకం అమలయ్యే అవకాశముందన్న ప్రచారమూ జరుగుతోంది. గ్రామ, మండల రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ఇప్పటికే పూర్తయింది. లక్షన్నర మందికిపైగా రైతులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర స్థాయి సమితులను ఏర్పాటు చేయా ల్సి ఉంది. వీటిని ముఖ్యమంత్రే స్వయంగా పరిశీలించే అవకాశముంది. రాష్ట్రస్థాయి సమితిని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశాక దానికి చైర్మన్‌ను నియమిస్తారు. కార్పొరేషన్ పరిధిలోకి కిందిస్థాయి సమితులను ఎలా తీసుకురావాలని తర్జనభర్జన జరుగుతోంది. విత్తనం మొదలు గిట్టుబాటు వరకు..: రాష్ట్రస్థాయి సమితి మూలధనం రూ. 500 కోట్లని గతంలో సీఎం పేర్కొన్న నేపథ్యంలో కార్పొరేషన్‌కు విస్తృత అధికారాలే ఉండే అవకాశం ఉంది. కార్పొరేషన్‌కు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించడంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కార్పొరేషన్‌ను కంపెనీ యాక్టు కిందే ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. విత్తనం మొదలు పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర వచ్చే వరకూ రైతులకు అండగా ఉండాలన్నదే కార్పొరేషన్ ముఖ్య ఉద్దేశం. పంటకు గిట్టుబాటు ధర రాకుంటే కార్పొరేషనే కొనుగోలు చేస్తుంది. అందుకు అవసరమైన నిధులు కంపెనీ యాక్టు ద్వారానే వస్తాయంటున్నారు. కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రత్యేకంగా చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఉత్తర్వు సరిపోతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. -
సాగుభూమి లేని ‘సమితి’ సభ్యులపై వేటు
సాక్షి, హైదరాబాద్: సాగుభూమి లేకున్నా రైతు సమన్వయ సమితి సభ్యులుగా ఎంపికైన వారిపై వేటు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి కలెక్టర్లకు లేఖ రాశారు. ‘రైతు సమన్వయ సమితుల ఏర్పా టుకు జారీచేసిన ఉత్తర్వుల్లో సాగు భూమి లేని రైతులను సభ్యులుగా తీసుకోకూ డదని నిబంధన పెట్టుకున్నాం. కానీ అనేక చోట్ల ఆ నిబంధనను ఉల్లంఘించినట్లు మా దృష్టికి వచ్చింది. కాబట్టి గ్రామ, మండల సమన్వయ సమితుల జాబితాను మరోసారి సమగ్రంగా పరిశీలించి సాగుభూమి లేని రైతు లెవరైనా ఉంటే వారిని తొలగించండి..’ అని ఆ లేఖలో సూచించారు. ఈ మేరకు అర్హత లేకున్నా ఎంపికైన వందలాది మంది రైతులను తొలగించేందుకు రంగం సిద్ధమవు తున్నట్లు తెలుస్తోంది. ‘కార్పొరేషన్’ యోచనతో డిమాండ్ రైతు సమన్వయ సమితులను కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొస్తామని సీఎం ప్రకటించ డంతో సమితుల్లో చేరేం దుకు డిమాండ్ మరింతగా పెరిగింది. గుత్తా సుఖేందర్‌రెడ్డిని చైర్మన్‌గా నియమి స్తారని భావిస్తుండగా.. డైరెక్టర్లుగా కొందరు టీఆర్ఎస్ సీనియర్లకు చోటు లభిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సమితికి పోటీ పెరిగింది. రాజకీయ ఒత్తిళ్లతో ఎంపికలు రైతులను సంఘటితపర్చి వారికి అవసరమైన సేవలు అందించేందుకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. గ్రామ సమితిలో 15 మంది, మండల, జిల్లా సమితుల్లో 24 మంది చొప్పున, రాష్ట్రస్థాయి సమితిలో 42 మంది సభ్యులు ఉంటారు. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్ష మందికి పైగా గ్రామ, మండల సమితులకు సభ్యు లను, సమన్వయకర్తలను నియమించారు. ఇక జిల్లా, రాష్ట్రస్థాయి సమితులను ఏర్పాటు చేయాలి. అయితే అధికార పార్టీ నేతల ప్రతిపాదనల మేరకే గ్రామ, మండల సమితి సభ్యులను మంత్రులు ఎంపిక చేశారు. కొందరికి సాగుభూమి లేకపోయినా రాజ కీయ అవసరాల రీత్యా జాబితాల్లో చేర్చారు. కానీ దీనివల్ల అసలుకే మోసం వస్తుందన్న భావనతో అర్హత లేనివారిపై వేటేయాలని నిర్ణయించారు. -
దండోరా వేశారు.. దమ్మిడీ రాలేదు
దేశంలోనే నా నిర్ణయం చరిత్రాత్మకం ఇప్పుడు చాలా రాష్ట్రాలు దీన్ని ఆదర్శంగా తీసుకుని రుణ ఉపశమన పథకాన్ని ప్రకటిస్తున్నాయి. మూడో విడతకు రూ.3,600 కోట్లు ఇస్తున్నాం. 36.72 లక్షల ఖాతాలకు పది శాతం వడ్డీతో జమ చేస్తున్నాం. ఇంకా అవసరమైన, అర్హుౖలైన వారికి కూడా ఇస్తాం.. చివరి రైతు వరకు న్యాయం చేయడమే నా లక్ష్యం. – ఈనెల 9న కర్నూలు జిల్లా తంగడంచ గ్రామం వద్ద సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రుణమాఫీ మూడో విడత నిధుల కోసం లక్షలాది మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు కూడా రైతుల ఖాతాలకు ఆ సొమ్ము జమ అయినట్లు సమాచారం లేదు. కృష్ణా జిల్లాలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు సహా కొన్ని బ్యాంకుల్లో నగదు జమ అయినట్లు చెబుతున్నా, అది వాస్తవం కాదని రైతులు వాపోతున్నారు. కేవలం రూ.3,600 కోట్ల నిధులు విడుదల చేయడానికి మూడు నాలుగు నెలలుగా కిందా మీదా పడుతుండటంలో ఆంతర్యం ఏమిటని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ఆర్భాటంగా చెక్కు ఇచ్చిన చంద్రబాబు.. రైతులను ఎందుకిలా ఇబ్బందులపాలు చేస్తున్నారని నిలదీస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రకాల పంట, బంగారు రుణాలను పూర్తిగా, బేషరతుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీ దస్త్రంపై తొలి సంతకం అంటూ హడావిడి చేసి కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారు. తద్వారా ఖాతాల వడపోత అంటూ పంట రుణాల వర్గీకరణ చేయించి.. ప్రతి రైతు కుటుంబానికి రూ.1.5 లక్షలు మాత్రమే అంటూ కోత వేశారు. మొత్తం రూ.87,612 కోట్ల రుణాలను కేవలం రూ.24,500 (10 శాతం వడ్డీతో సహా) కోట్లకు పరిమితం చేశారు. దీన్నయినా ఒక్కసారే ఇచ్చారా అంటే అదీ లేదు. ఐదు విడతలుగా ఇస్తామన్నారు. ఇస్తామన్న సమయానికి ఇవ్వకుండా, ఇచ్చినట్లు ఆర్భాటంగా ఊరూరా ప్రచారం చేసుకుంటున్నారు. తప్పు బ్యాంకులపైకి నెట్టేసే యత్నం రుణమాఫీ మూడవ విడత నిధులు తమ ఖాతాల్లో జమ కాలేదని రైతుల నుంచి ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వస్తుండటంతో తప్పును అధికారులు, బ్యాంకులపైకి నెట్టి వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిజంగా నిధులు విడుదల చేసి ఉంటే సమస్య ఎక్కడ ఉందో చూసి కాసులిచ్చే మార్గం సుగమం చేసేది. ప్రభుత్వం ఇచ్చిన బాండ్లతో అన్నదాతలు చెప్పులరిగేలా బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఈసడింపులకు గురవుతున్నారు. బ్యాంకు అధికారులు రుణ మాఫీ బాండ్లను కొన్నిచోట్ల కంప్యూటర్లలో నమోదు చేసుకుంటున్నా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతున్న పరిస్థితి లేదు. నిజానికి ఇప్పటికే ఈ నిధులు జమ కావాలి. అలవి మాలిన హామీ ఇచ్చి ప్రస్తుతం నానా తంటాలు పడుతున్న ప్రభుత్వం కాలయాపనే ఉద్దేశంగా రుణమాఫీ మూడో విడత నిధుల విడుదలను సాగదీస్తోందని రైతు సంఘాల నేతలు, రైతులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. వాస్తవానికి మూడో విడత నిధుల కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.3,600 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ నిధులను ఇంత వరకు విడుదల చేయలేదు. వడ్డీకీ సరిపోని మాఫీ సొమ్ము బాబు అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో రైతుల రుణాలు రూ.87,612 కోట్లకు పైగా ఉన్నాయి. వాటిని పూర్తిగా మాఫీ చేయకపోవడంతో ఆ తర్వాత ఏటా రూ.14 వేల కోట్ల చొప్పున 4 ఏళ్లలో రూ.56 వేల కోట్లు వడ్డీ, అపరాధ వడ్డీగా రైతులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికి చంద్రబాబు ప్రభుత్వం రైతుల ఖాతాలకు జమ చేసింది కేవలం రూ.11 వేల కోట్ల చిల్లర మాత్రమే. ఆ మొత్తం రైతులు చెల్లించిన వడ్డీ లో ఐదో వంతుకూ సరిపోలేదన్న మాట. ఇలా రైతులకు పంటల బీమా రాకుండా చేసింది. రైతుల్ని బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా నిలబెట్టింది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం రూ.24,500 కోట్లను మాఫీ చేసినట్టు ఘనంగా చెప్పుకుంటున్నారు. చెబుతున్నదొకటి.. చేస్తోంది మరొకటి.. జూలైలోనే రైతు సాధికార సంస్థకు రూ.వెయ్యి కోట్లు జమ చేశామని, మరో రూ.16 వేల కోట్లను సెప్టెంబర్‌లో ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని జూలైలో వ్యవసాయ శాఖకు విడుదల చేసిన నిధుల కేటాయింపుల వివరాలే చెబుతున్నాయి. (జీవో ఆర్టీ నంబర్ 1567, 6 వపేజీ) ఆర్థిక సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా విడగొట్టి ప్రతి మూడు నెలల కాలానికి ఎంతెంత కేటాయింపులు చేశారో ఓ పత్రాన్ని విడుదల చేస్తుంటారు. అలా విడుదల చేసిన దాని ప్రకారం తొలి త్రైమాసికానికి రుణ ఉపశమనానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రెండో త్రైమాసికానికి రూ.1,260 కోట్లు, మూడో త్రైమాసికానికి రూ.1,260 కోట్లు, చివరి త్రైమాసికానికి రూ.1,080 కోట్లు కేటాయించారు. ఈ లెక్కన చూసినా డిసెంబర్‌లోగా రూ.2,520 కోట్లు మాత్రమే విడుదల అవుతాయి. కానీ ఆ సమయానికి వాస్తవంగా ఇవ్వాల్సింది రూ.3,600 కోట్లు. మార్చి నెలాఖరుకు కానీ ఈ మేరకు వచ్చే పరిస్థితి లేదు. ఈ లెక్కన చూసుకుంటే డిసెంబర్ వరకు రైతుల ఖాతాలకు నామమాత్రంగా కూడా నిధులు జమ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వం సర్ది చెప్పుకోవడానికి అన్నట్లు రూ.2,520 కోట్లను ఇచ్చినా అది కొందరికే అందుతుంది. అందరికీ జమ కావాలంటే మార్చి దాకా ఆగాల్సిందే. ఇవి గాక నాలుగు, ఐదు విడతల సొమ్ము ఇంకా రైతులకు అందాల్సి ఉంది. పది రోజులైనా.. పైసా రాలేదు గత శుక్రవారం (13వ తేదీ) నుంచి పాత కడపలోని ఎస్బీఐ చుట్టూ తిరుగుతున్నా.. సోమవారం ఉదయం ఎట్టకేలకు నా బాండ్ పత్రాన్ని బ్యాంకులో అప్లోడ్ చేశారు. దీంతో పాటు బాండ్, ఆధార్, పాస్‌పుస్తకం జిరాక్స్ కూడా ఇమ్మంటే ఇచ్చాను. బాండ్ ఒరిజినల్ మీద స్టాంప్ వేసిస్తూ 72 గంటల తర్వాత డబ్బులు జమ అవుతాయని చెప్పారు. ఇప్పటి వరకు నయా పైసా జమ కాలేదు. మళ్లీ బ్యాంకుకు వెళ్లి అడిగితే, ‘వస్తాయిలే పోవయ్యా.. మాకు రానిదే ఎక్కడి నుంచి ఇవ్వాలి’అని విసుక్కుంటున్నారు. – పి.మల్లీశ్వరరెడ్డి, పాతగిరియపల్లి గ్రామం, పెండ్లిమర్రి మండలం, వైఎస్సార్ జిల్లా -
సమితులకు ‘పత్తి’ బాధ్యత!
రైతు సమితులకు తొలి బాధ్యత అప్పజెప్పిన సర్కారు సాక్షి, హైదరాబాద్: పత్తి దళారులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రైతు సమన్వయ సమితులకు బాధ్యత అప్పగించింది. రైతు సమితులు ఏర్పాటయ్యాక అందు లోని సభ్యులకు ప్రభుత్వం తొలి బాధ్యత అప్పగించడం గమనార్హం. వచ్చే నెల నుంచి మార్కెట్లోకి పత్తి పెద్ద ఎత్తున తరలి రానుండటంతో ఆయా రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సమితి సభ్యులకు వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. ఇటీవల పత్తి కొనుగోళ్లపై జరిగిన వీడియో కాన్ఫరెన్సులో సమితి సేవలను వినియోగించుకుంటామని జిల్లా కలెక్టర్లు కోరారు. అందుకు వ్యవసాయ శాఖ అనుమతించింది. శాంతి భద్రతల సమస్య రాకుండా.. రైతులకు అవసరమైన సహకారం అందించడమే సమన్వయ సమితుల ప్రధాన బాధ్యత. ఇప్పటికే గ్రామ, మండల రైతు సమితులను ఏర్పాటు చేయగా.. త్వరలో జిల్లా, రాష్ట్ర స్థాయి సమితులు ఏర్పాటు కానున్నాయి. మొత్తం ఏర్పాటైతే అన్నింట్లో కలిపి దాదాపు 1.60 లక్షల మంది సభ్యులుంటారు. విత్తనం కొనుగోలు మొదలు, పండించిన పంటకు గిట్టుబాటు ధర అందే వరకు రైతు సమితులే ముందు వరుసలో ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గతేడాది ఖమ్మంలో మిర్చి కొనుగోళ్ల సందర్భంగా మార్కెట్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సమితులపై ఉంది. ఈసారి పత్తి భారీగా మార్కెట్లకు రానున్న నేపథ్యంలో.. ఒకేసారి అన్ని గ్రామాల రైతులు పత్తి తీసుకొస్తే శాంతి భద్రతల సమస్య రావొచ్చని, ఆ పరిస్థితి రాకుండా చూడాలని సర్కారు నిర్ణయించింది. అందు కోసం మార్కెట్ అధికారులతో సమితి సభ్యులు సమన్వ యం చేసుకుంటారు. తమ పరిధిలోని ఏ గ్రామాల రైతులు ఏ రోజున పత్తిని మార్కెట్‌కి తరలించాలో షెడ్యూల్ తయారు చేస్తారు. ఆ ప్రకారం గ్రామ సమితి సభ్యులు తమ షెడ్యూల్‌ను బట్టి పత్తి రైతులను మార్కెట్‌కు పంపిస్తారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో సక్రమంగా పత్తి కొనుగోలు చేస్తున్నారా, లేదా అనేది పర్యవేక్షిస్తారు. విక్రయించిన పత్తికి నిర్ణీత సమయంలో రైతుకు సొమ్ము అందుతున్నదో లేదో పర్యవేక్షిస్తారు. 490 మండల సమితుల ఏర్పాటు రాష్ట్రంలో ఇప్పటివరకు 490 మండల రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ఉత్తర్వులు జారీ అయ్యాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇంకా 69 మండల సమితుల ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. మొత్తం మండల సమితులకు ఉత్తర్వులు జారీ కాగానే జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితులు ఏర్పాటు కానున్నాయి. అవి దసరా తర్వాతే ఏర్పాటు కావచ్చొని సమాచారం. -
సమన్వయ సమితుల పేరిట రాజకీయం
- 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్‌దే అధికారం - ఇందిరమ్మ రైతుబాటలో కాంగ్రెస్ అగ్రనేతలు సాక్షిప్రతినిధి, కరీంనగర్: టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సమన్వయ సమితులు, భూరికార్డుల శుద్ధీకరణ పేరిట చీఫ్ పాపులారిటీ కోసం రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. సోమవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాగార్డెన్‌లో నిర్వహించిన ‘ఇందిరమ్మ రైతుబాట’కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ రికార్డులపై కాంగ్రెస్ కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి రాంచంద్ర కుంతియా, ఎస్సీసెల్ జాతీయ అధ్యక్షులు కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, రాష్ట్ర మీడియా కన్వీనర్ మల్లు రవి, కిసాన్ సెల్ రాష్ట్ర చైర్మన్ ఎం.కోదండరెడ్డి, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర నాయకులు, ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్లు, మండల, డివిజన్ కన్వీనర్లు, పార్టీ మండల అధ్యక్షులు పాల్గొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే భూసర్వే: కుంతియా రాజకీయ లబ్ధికోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన పేరిట గ్రామాల్లో గందరగోళానికి తెరలేపుతోందని ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా ఆరోపించారు. భూసంస్కరణల చట్టాలను తెచ్చి ఎంతోమంది పేదలకు భూములు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రపంచంలోనే మరెక్కడాలేని విధంగా దేశ చరిత్రలో మొదటిసారిగా భూ రికార్డుల ప్రక్షాళనకు పూనుకుంటున్నామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు. కాంగ్రెస్ హయాంలో భూసంస్కరణ చట్టాలను తెచ్చి లక్షలాది రైతు కూలీలకు భూపంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం: ఉత్తమ్ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తలు, దళిత బడుగు బల హీనవర్గాలపై దాడులు అధికమయ్యాయని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ‘ఖబడ్దార్.. కాంగ్రెస్ జోలికి వస్తే వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం’ అని హెచ్చరించారు. 2019లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనన్నారు. ‘మిర్చి పంటకు మద్దతు ధర కోసం ఖమ్మం మార్కెట్లో గిరిజన రైతులు ప్రశ్నిస్తే బేడీలు వేస్తారా? నేరెళ్ల దళితులను గొడ్లను బాధినట్లు బాదుతారా? ప్రాజెక్టుల ప్రజాభిప్రాయ సేకరణలో ప్రశ్నిస్తే పెద్దపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తారా? తస్మాత్ జాగ్రత్త’ అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి: జానారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఎండ గట్టేందుకు సిద్ధం కావాలని సీఎల్పీ నేత జానారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకుండా కొత్త పథకాలతో ప్రజల దృష్టిని మళ్లించేం దుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ తీరును ఎత్తిచూపాలన్నారు. భూశుద్ధీకరణ పేరిట గ్రామాల్లోకి వస్తున్న రెవెన్యూ యంత్రాంగానికి కాంగ్రెస్ కార్యకర్తలు పేద ప్రజల అర్జీలను సేకరించి పరిష్కరించే దిశగా ముందుండాలన్నారు. ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించడంతోపాటు గ్రామాల్లో గందర గోళాన్ని నెలకొల్పేం దుకే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పేరిట సీఎం అధికార యంత్రాంగాన్ని పుర మాయిస్తున్నాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క ఆరోపించారు. -
అధికారాలుండవ్!
రైతు సమితి సభ్యులపై సీఎం కేసీఆర్ స్పష్టీకరణ - రైతులకు సహకారం మాత్రమే అందిస్తారని వెల్లడి - తామూ రైతు కమిటీలు వేస్తామని కాంగ్రెస్ అనడంపై మండిపాటు - దసరా నాటికల్లా 20 లక్షల గొర్రెలను పంపిణీ చేస్తాం.. - విదేశాలకు మాంసం ఎగుమతి చేసే రాష్ట్రంగా వృద్ధి చెందాలని ఆకాంక్ష - ప్రాజెక్టులకు ఈ ఏడాది రూ.45 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం - 100 సంచార పశు వైద్య శాలల వాహనాలను ప్రారంభించిన సీఎం - అత్యవసర సేవలకు 1962 నంబర్ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితుల్లోని సభ్యులకు ఎలాంటి అధికారాలు ఉండబోవని, వారు రైతులకు వారధులుగానే ఉంటారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ఎలాంటి అధికారం చలాయించరని, సహకారం మాత్రమే అందిస్తారని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర తెచ్చేందుకు, రైతులను సంఘటితం చేసేందుకు ఈ సమితులు విశేషంగా కృషి చేస్తాయని వెల్లడించారు. ఈ సమితులు ఇతరుల హక్కులను హరించడం లేదని, సమితులపై కొందరు కోర్టుకు వెళ్లడం ‘విపరీత ధోరణి’ అని మండిపడ్డారు. ‘ప్రభుత్వం కమిటీలు వేస్తే తామూ ప్రత్యామ్నాయంగా కమిటీలు వేస్తామని కొన్ని పార్టీల (కాంగ్రెస్) వారు అంటున్నారు. వాళ్లకు దేవుడు ఏం తెలివి ఇచ్చిండో వాళ్లకే తెలియాలి. ఎక్కడైనా ప్రభుత్వం కమిటీలు వేస్తుంది. కానీ వాళ్లు (కాంగ్రెస్) కూడా కమిటీలు వేస్తామంటే జనం నవ్వుకుంటున్నారు’ అని సీఎం ఎద్దేవా చేశారు. అనవసరంగా రాద్ధాంతానికి పోయి ప్రగతి నిరోధకులుగా మారొద్దని హితవు పలికారు. పశుసంవర్ధక శాఖ చేపట్టిన సంచార పశు వైద్యశాలల వాహనాలను శుక్రవారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద కేసీఆర్ ప్రారంభించారు. వాహనాల లోపలి భాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ, 60 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీల పాలనల్లో రైతుల గురించి ఆలోచించే పరిస్థితే లేదన్నారు. మరో వందేళ్లయినా.. రైతుకు పెట్టుబడి పథకం కింద రూ.8 వేలు ఇచ్చే ఆలోచన కూడా చేయరని విమర్శించారు. ఇనుము ముక్కలు ఏరుకునే వారికి కూడా సంఘం ఉందని, కానీ రైతులకు లేదని అందుకే తాము సమితులు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వివరించారు. గ్రామీణ వ్యవస్థను పరిపుష్టం చేయాలన్న కొత్త పంథాలో ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు. మాజీ ప్రధాని దేవెగౌడ ప్రశంసించారు.. రైతులకు పెట్టుబడి పథకం కింద ఆర్థిక సాయం చేయడంపై మాజీ ప్రధాని దేవెగౌడ అభినందించారని కేసీఆర్ పేర్కొన్నారు. ‘నేను సీఎంగా పనిచేశా. ప్రధానిగా చేశా. కానీ పెట్టుబడి పథకం ఆలోచన రాలేదు. భారత దేశ రైతుల తరఫున మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. చంద్రశేఖర్‌రావు నేను హైదరాబాద్ వస్తా. మీ ఇంటికి వచ్చి అభినందిస్తా’ అని దేవెగౌడ అన్నట్లు సీఎం తెలిపారు. కానీ మాజీ ప్రధానిని రప్పించుకోవడం బాగుండ దని, తానే బెంగళూరు వస్తానని చెప్పినట్లు వివరిం చారు. సాగు నీటి ప్రాజెక్టుల కోసం బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయించామని, బ్యాంకుల సహకారం తో రూ.20 వేల కోట్లు రుణంగా తీసుకున్నామని తెలిపారు. అలా ఈ ఏడాది రూ.45 వేల కోట్లు ఖర్చు చేయడం దేశంలో రికార్డు అని సీఎం వివరించారు. కేంద్ర బడ్జెట్లోనూ ఇంత కేటాయించలేదన్నారు. మూడు ప్రాజెక్టులు.. కోటి ఎకరాలు.. రైతులకు నీరు, పెట్టుబడి, గిట్టుబాటు ధర కీలకమని సీఎం పేర్కొన్నారు. నీటి కోసం నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని, ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాదిలో కాళేశ్వరం నీళ్లు ఏడు జిల్లాలకు వచ్చే ఆస్కారముందని, పాలమూరు ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు త్వరలోనే పూర్తి కాబోతున్నాయని తెలిపారు. ఈ మూడు ప్రాజెక్టులు రాబోయే ఏడాదిన్నరలో పూర్తి చేసి కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసుకోవచ్చని వివరించారు. రాష్ట్రంలో 20 నుంచి 25 లక్షల వరకు బోరు బావులున్నాయని చెప్పారు. ‘పూర్తిస్థాయి కరెంటు ఇవ్వడానికి రెండు మూడేళ్లు పడుతుందని ఎన్నికల్లో చెప్పా. కానీ ఆరు నెలల్లోనే కరెంటు ఇచ్చాం. ఇప్పుడు కరెంటు ఉంటే వార్త కాదు. పోతేనే వార్త. 24 గంటల కరెంటు వద్దని పూర్వ నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ రైతులు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. అందరితో చర్చించాక చూద్దామని వారితో అన్నా’ అని సీఎం వివరించారు. మానవ వనరులు గుర్తించడంలో కొత్త ట్రెండ్ మానవ వనరులను గుర్తించడంలో రాష్ట్రంలో కొత్త ట్రెండ్ మొదలైందని కేసీఆర్ అన్నారు. ‘రాష్ట్రంలో 30 లక్షల మంది గొల్లకుర్మలుంటే, రోజుకు 650 లారీల గొర్రెలను దిగుమతి చేసుకోవడం శోచనీయం. అలాగే పాడి పశువులు దండిగా ఉన్నా గుజరాత్, కర్ణాటకల నుంచి రోజుకు 8 లక్షల లీటర్ల పాలు దిగుమతి చేసుకుంటున్నాం. ఇది ఒకరకంగా మనకు సిగ్గుచేటు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు పాడి–పంటను అభివృద్ధి చేస్తున్నాం. అందులో భాగంగానే రూ.5 వేల కోట్లతో గొర్రెలను పంపిణీ చేస్తున్నాం. ఇప్పటివరకు 18.74 లక్షల గొర్రెలను పంపిణీ చేశాం. ఇది దేశంలోనే ఆల్ టైం రికార్డు. దసరా నాటికి 20 లక్షల గొర్రెలను పంపిణీ చేస్తాం. 4 లక్షల యూనిట్లు అనుకుంటే, 7 లక్షల యూనిట్లకు దరఖాస్తులు వచ్చాయి. వారందరికీ గొర్రెలు ఇస్తాం. తెలంగాణలో ఎక్కువ గొర్రెలు పెంచడమే రూలు’ అని సీఎం పేర్కొన్నారు. దేశానికి అవసరమైన మాంసం, అంతర్జాతీయ స్థాయిలో మాంసం ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణను సీఎం ప్రశంసించారు. రూ.వెయ్యి కోట్లతో చేపల పెంపకం రాష్ట్రంలో చేపల పెంపకాన్ని రూ.వెయ్యి కోట్లతో పెద్ద ఎత్తున చేపడుతామని సీఎం అన్నారు. గతేడాది 27 కోట్ల చేపలను పంపిణీ చేస్తే, ఈసారి 70 కోట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గతంలో రాష్ట్రంలో చేప ఉత్పత్తి కేంద్రాలను ధ్వంసం చేశారని, హుసేన్సాగర్ కింద ఉన్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. అలాంటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను పునరుద్ధరించడంతోపాటు ప్రతీ రిజర్వాయర్ కింద చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌కు, కాల్ సెంటర్ ప్రతినిధికి మధ్య సంభాషణ కాల్ సెంటర్: నమస్తే.. పశు ఆరోగ్య సేవకు మేం ఏ విధంగా సహాయపడగలం సార్.. చెప్పండి సార్.. సీఎం: మీరు ఏ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నారమ్మా? కాల్ సెంటర్: చెప్పండి సార్ సీఎం: అమ్మా మీరు ఎక్కడున్నారు? ఎంత సేపట్లో రాగలుగుతారు? కాల్ సెంటర్: 30 నిమిషాల్లో రాగలుగుతాం.. మీ పశువుకు ఏమైందో చెప్పగలుగుతారా? సార్.. సీఎం: ఇక్కడ పశువు లేదమ్మా.. ఇది ప్రారంభోత్సవం.. కంగ్రాట్యులేషన్స్ గో హెడ్. కాల్ సెంటర్: ధన్యవాదాలు సార్.. 1962 నంబ ర్కు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు సార్.. 100 సంచార పశు వైద్యశాలలు ప్రారంభం దేశంలోనే 100 సంచార పశు వైద్యశాలల వాహనాలను ప్రారంభించడంపై సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. ఒక్క ఫోన్ కొడితే డాక్టరే రైతు ఇంటి ముంగిటకు వస్తారని, అన్ని పరిక రాలు, మందులు వాహనంలోనే ఉంటాయన్నా రు. సంచార వైద్య శాలల డిజైన్ మార్చాలని, నెలకు ఇంత దూరం తిరగాలన్న నిబంధన పెట్టా లని అధికారులకు ఆదేశించారు. రైతులు ఫోన్ చేసినప్పుడు సర్వీసులు అందిస్తూనే వ్యాక్సినేషన్ తదితర కార్యక్రమాలు చేయాలన్నారు. కార్యక్రమంలో మంత్రులు నాయిని, పోచారం, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం సంచార వైద్య శాల హెల్ప్‌లైన్ నంబర్ 1962కు ఫోన్ చేశారు. -
రైతు సమితులపై వివరణ ఇవ్వండి
-
రైతు సమన్వయ సమితులను రద్దు చేయాలి
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ నల్లగొండ టూటౌన్: రైతు సమన్వయ సమితులను తక్షణమే రద్దు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నల్లగొండలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జీఓ 39 పేరిట గ్రామాల్లో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు జన్మభూమి కమిటీలు వేసినట్లుగానే తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు సమన్వయ సమితులను వేస్తున్నారని, వీటి వలన ప్రభుత్వాల నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించే చర్యలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతు సమన్వయ సమితుల పేరిట ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని విమర్శించారు. రైతు సమన్వయ సమితులు, జీఓ 39ని రద్దు చేయాలని ఈనెల 14న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దేవుడి ఫొటో పక్కన వైఎస్సార్ ఫొటో పెట్టుకున్నారని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తిసాగు వేశారని, సీసీఐ కొనుగోలు కేంద్రాలు పెంచేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే ఆల్మట్టి నుంచి నీళ్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చే విధానాన్ని తమ పార్టీ తప్పుపడుతుందని చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఇరుగు సునీల్‌కుమార్, ఎండి.సలీం, జిల్లా ప్రధాన కార్యదర్శులు మేడిశెట్టి యాదయ్య, కట్టెబోయిన నాగరాజు తదితరులు ఉన్నారు. -
రైతు సమితులపై వివరణ ఇవ్వండి
కౌంటర్ దాఖలు చేయాలని సర్కారుకు హైకోర్టు ఆదేశం ► రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై పిల్ దాఖలు ► అవి రాజ్యాంగేతర యంత్రాంగమని ఆరోపణ సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైతు సమితులు రాజ్యాంగ విరుద్ధమంటూ, వాటితో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమవుతుందంటూ దాఖలైన పిల్ విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విచారణను మూడు వారాలకు వాయిదావేస్తూ.. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం మంగళ వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ అధికారం ప్రభుత్వానికి లేదు.. రైతు సమన్వయ సమితుల ఏర్పాటు నిమిత్తం జారీ చేసిన జీవో 39ను సవాలు చేస్తూ.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల రైతు చింపుల సత్యనారాయణరెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన యు.మనోహర్‌రెడ్డిలు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, న్యాయవాది బి.రచనారెడ్డిలు వాదనలు వినిపించారు. రైతులకు ఒక్కో సీజన్‌కు రూ.4 వేల చొప్పున ఆర్థిక సాయంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. తగిన సిఫా రసులు చేసే బాధ్యతలను రైతు సమన్వయ సమితులకు అప్పగించిందని కోర్టుకు వివరిం చారు. అయితే ఈ రైతు సమన్వయ సమితుల ను నామినేట్ చేసేది మంత్రులేనని.. ప్రజా విధులను నిర్వర్తించేందుకు ఇలా రాజ్యాంగేతర యంత్రాంగాన్ని సృష్టించే అధికారం ప్రభుత్వానికి లేదని నివేదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఇలా సమితులు ఏర్పాటు చేయకుండా రాజ్యాం గంలో ఎక్కడా నిషేధం లేదని, నిషేధముంటే చూపాలని పేర్కొంది. దీంతో రైతు సమన్వయ సమితుల్లోని సభ్యులను మంత్రులు నామినేట్ చేయడమన్నది అధికార దుర్వినియోగమే అవుతుందని న్యాయవాదులు వివరించగా... మంత్రులకు ఇలాంటి బాధ్యతలు అప్పగించ కూడదని ఏ చట్టంలో ఉందో చూపాలని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టులో కూర్చుని తాము ప్రభుత్వాన్ని నడపడం లేదని... కోర్టులు ఏ విషయాల్లో అయితే జోక్యం చేసుకోరాదో ఆ విషయాల్లో జోక్యం చేసుకో వాలంటూ కోరుతున్నారని పిటిషనర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమవుతోంది.. తిరిగి పిటిషనర్ల న్యాయవాదులు వాదనలు కొనసాగిస్తూ... గ్రామస్థాయిలో అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే పంచాయతీలు ఉన్నాయని, ఇప్పుడు రైతు సమితుల ఏర్పా టుతో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని కోర్టుకు నివేదిం చారు. అంతేగా కుండా ఈ రైతు సమన్వయ సమితులకు రూ.500 కోట్లు కేటాయించా రని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం ఈ రూ.500 కోట్లపై ప్రభుత్వ వివరణ కోరింది. దీనికి అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి సమా ధానమిస్తూ.. రైతులు పండించిన కొన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) దక్కడం లేదని, వారికి కనీస మద్దతు ధర అందించేందుకే రూ.500 కోట్లు కేటాయిం చామని వివరించారు. రాష్ట్రస్థాయిలో ఇంకా రైతు సమన్వయ సమితి ఏర్పాటు కాలేదని, అది ఏర్పాటయ్యే వరకు నిధులను వ్యయం చేయబోమన్నారు. గ్రామ, మండల రైతు సమన్వయ సమితుల సిఫారసుల మేరకు రాష్ట్ర స్థాయి సమితి తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. రైతు సమన్వయ సమితుల ఏర్పాటు వ్యవ హారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
గులాబీ ‘సమితి’లు!
♦ రైతు సమన్వయ సమితుల ఏర్పాటులో అధికార పార్టీ నేతలదే హవా ♦ ప్రభుత్వ మార్గదర్శకాలకూ తిలోదకాలు ♦ గ్రామసభల నిర్వహణ లేకుండానే జాబితాలు ♦ పారదర్శకంగా సాగని ప్రక్రియ ∙నేటితో ముగియనున్న గడువు మోర్తాడ్(బాల్కొండ): రైతు సమన్వయ సమితిల ఏర్పాటు ప్రక్రియకు శనివారంతో గడువు ముగియనుంది. సమితి సభ్యుల ఎంపికలో అధికార పార్టీ నేతలదే హవా కొనసాగుతోంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో ఎంపిక కసరత్తు జరుగుతోంది. సమితి సభ్యుల ఎంపిక రాజకీయాలకతీతంగా సాగాల ని, పారదర్శకత లోపించకూడదని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. గ్రామస్థాయి రైతు సమన్వయ సమితి ఎంపికకు గ్రామసభ నిర్వహించాలని స్పష్టం చేసింది. కానీ ఎక్కడ కూడా గ్రామసభలు నిర్వహించింది లేదు. ఒకటి, రెం డు నియోజకవర్గాల్లో గ్రామ సభలు నిర్వ హిం చినా, మిగతా నియోజకవర్గాల్లో మాత్రం మొ క్కుబడిగా కూడా నిర్వహించిన దాఖలాల్లేవు. ఏకపక్షంగా సభ్యుల ఎంపిక.. రైతు సమన్వయ సమితి సభ్యుల ఎంపిక ఏకపక్షంగానే సాగుతుందని, కేవలం అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలనే సమితి సభ్యులుగా ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామసభల ద్వారా సమన్వయ సమితి సభ్యులను ఎంపిక చేయాలని ప్రభుత్వం చేసిన సూచనను అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధులు పెడచెవిన పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. గ్రామ, మండల సమన్వయ సమితి సభ్యుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తూ.చ. తప్పకుండా పాటిస్తున్నామని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. అయితే, పలు గ్రామాల సమన్వయ సమితి సభ్యుల జాబితాలను అధికారపక్ష నేతలు వెల్లడించగా, ఏ జాబితాలోనూ ప్రతిపక్ష పార్టీల నాయకుల పేర్లు గానీ, రాజకీయ పార్టీలతో సంబంధం లేని రైతుల పేర్లు గానీ లేవు. ఈ జాబితాలను పరిశీలిస్తే రైతు సమన్వయ సమితి సభ్యుల ఎంపిక పూర్తిగా ఏకపక్షంగా సాగుతోందని స్పష్టమవుతోంది. సమన్వయ సమితికి అధికారాలెన్నో.. రైతు సమన్వయ సమితిలకు ప్రభుత్వం రానున్న రోజుల్లో అధికారాలను భారీ స్థాయిలో కట్టబెట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, పంటసాగుకు పెట్టుబడి సహాయం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం/పంటలను నిలువ ఉంచి రైతుబంధు పథకం ద్వారా రుణ సదుపాయం కల్పించడం.. తదితర అధికారాలను ప్రభుత్వం రైతు సమన్వయ సమితి సభ్యులకు బదలాయించనుంది. వ్యవసాయానికి సంబంధించి ఎన్నో అధికారాలను సమన్వయ సమితి సభ్యులకు ప్రభుత్వం అప్పగించనుండటంతో సమితి సభ్యులకు ప్రాధాన్యత పెరగనుంది. కానీ సభ్యుల ఎంపికలో పారదర్శకత లోపించడం వల్ల ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోననే సంశయం నెలకొంది. అధికార పార్టీకి వరంగా మహిళా రిజర్వేషన్.. సమన్వయ సమితి ఎంపిక ప్రక్రియలో చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. సమితిలో 15 మంది సభ్యులు ఉంటే, అందులో 50 శాతం మహిళలకు చోటు కల్పించాల్సిందే. ఈ నిబంధనను అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సమితిలో ప్రతిపక్ష పార్టీల నేతలకు, చురుగ్గా ఉండే రైతులకు చోటు కల్పిస్తే భవిష్యత్తులో తమకు ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో ‘మహిళ రిజర్వేషన్’ రూపంలో వారికి చెక్ పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలకు, చురుగ్గా ఉండే రైతుల స్థానంలో మహిళలకు చోటు కల్పించడం ద్వారా భవిష్యత్తులో తమ నిర్ణయాలకు ఎదురులేకుండా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా జాబితా రూపకల్పన.. జిల్లాలో 27 మండలాలు ఉండగా, 393 గ్రామ పంచాయతీలు, 452 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రెవెన్యూ గ్రామాల వారీగానే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. దీంతో జిల్లాలో గ్రామస్థాయిలో 452 సమన్వయ సమితిలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి గ్రామ సమితిలో 15 మంది చొప్పున సభ్యులు ఉంటారు. అంటే, జిల్లాలోని 452 రెవెన్యూ గ్రామాలకు గాను 6,780 మంది సభ్యులు ఉండనున్నారు. గ్రామస్థాయి సమన్వయ సమితిలో సభ్యులుగా ఎంపికైన వారినే మండల సమన్వయ సమితిలలో సభ్యులుగా కొనసాగించనున్నారు. గ్రామసభల ద్వారా సమన్వయ సమితి సభ్యులను ఎంపిక చేస్తే, ఇతర పార్టీల నాయకులతో ఇబ్బంది తలెత్తడం ఒక ఎత్తయితే అధికార పార్టీ నాయకుల మధ్యనే విభేదాలు తలెత్తే అవకాశం ఉందని ప్రజాప్రతినిధులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందువల్లే గ్రామాలలోని ముఖ్య నాయకులతో సమన్వయ సమితి సభ్యుల జాబితాలను రూపొందించి జిల్లాకు ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్న వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదం కోసం పంపించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. సమన్వయ సమితిల ఏర్పాటుకు శనివారంతో గడువు ముగియనుండటంతో ఆఖరు రోజునే జాబితాలన్నింటినీ ప్రభుత్వానికి పంపించడానికి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకటి రెండు చోట్ల మాత్రమే సమన్వయ సమితిల ఎంపిక కోసం సమావేశాలను నిర్వహించారు. మిగిలిన అన్ని చోట్ల మొక్కుబడిగానే సాగించారు. కొన్ని గ్రామాల్లోనైతే రహస్యంగానే ఎంపికను పూర్తి చేసి, చివరి రోజు వరకు గోప్యంగా ఉంచడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారు. -
టీఆర్ఎస్లో ‘సమితి’ పోరు
♦ కొత్త చిక్కులు తెచ్చిన రైతు సమన్వయ సమితులు ♦ వలస నాయకులకు చెక్ పెట్టేందుకు పాత నేతల వ్యూహాలు ♦ పోటీగా జాబితాలు తయారు.. ♦ అనుచరులతో చర్చించి తుదిరూపు ఇస్తున్న ఎమ్మెల్యేలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రామ రైతు సమన్వయ సమితుల సభ్యుల జాబితాల తయారీ బాధ్యత ఎమ్మెల్యేలదే కావడం కొత్త చిక్కులకు ఆస్కారం ఇస్తోంది. పార్టీలోకి వల సొచ్చిన శాసనసభ్యులు ఉన్న చోట వారు తయారు చేసిన జాబితాలను ముందు నుంచీ పార్టీలో కొనసాగుతున్న నాయకులు విభేదిస్తున్నారు. ఆ కూర్పుకు విరుగుడుగా గ్రామ సభలు నిర్వహించి అధికారికంగా ఓ జాబితాను సిద్ధం చేసి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి పంపుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో ఇదే తరహాలో కమిటీల ఏర్పాటులో రెండు జాబితాలు రూపుదిద్దుకోవడం అధికార యంత్రాంగానికి సంక్లిష్టంగా మారింది. అంతర్గత సంప్రదింపులతో.. రైతు సమన్వయ సమితులను గ్రామ సభల్లో ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఈ తంతు పూర్తి చేసి జాబితాను జిల్లా ఇన్చార్జి మంత్రి ద్వారా ప్రభుత్వానికి పంపాలని తెలిపింది. అయితే, గ్రూపు తగాదాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు గ్రామసభల నిర్వహణకు ఆసక్తి చూపడం లేదు. టీడీపీ, కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు గ్రామసభల జోలికి వెళ్ల కుండా.. తమ అనుచరులతో సంప్రదింపులు జరిపి జాబితాలకు తుదిరూపు ఇస్తున్నారు. గ్రామ సమన్వయ సమితుల ఏర్పాటుకు ఇంకా ఒక్క రోజే గడువు మిగిలి ఉన్నా.. సగం కమి టీలు కూడా కొలిక్కి రాలేదు. చాలా చోట్ల గుట్టుగా జాబితాలను తయారు చేసినా చివరి రోజే వీటిని అధికారులకు అప్పగించాలని ఉన్నారు. ఏకపక్షంగా జాబితాలు తయారు చేస్తే విమర్శలు వెల్లువెత్తుతాయని భావించి తమ ఆధిపత్యం ఉన్న పల్లెల్లో గ్రామసభలతో మమ అనిపిస్తున్నారు. ఈ క్రమంలో వలస నేతల పెత్తనానికి చెక్ పెట్టేందుకు పార్టీలో ముందు నుంచీ ఉన్న నేతలు కొత్త ఎత్తుగడ వేశారు. తమ ఏలుబడిలో ఉన్న గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి సమితులను ప్రకటిస్తున్నారు. ఈ వివరాలన్నింటినీ గ్రామ పంచాయతీ మినిట్స్ బుక్‌లో నమోదు చేస్తున్నారు. అనంతరం జాబితా తీర్మానం ప్రతులను కలెక్టర్ కార్యాలయంలో అందజేస్తున్నారు. ఈ తరహాలో వికారాబాద్ జిల్లా నవాబుపేట, చేవెళ్ల మండలాల పరిధిలోని పది గ్రామ పంచాయతీలు సమితులను గ్రామసభల్లో ఖరారు చేశాయి. యంత్రాంగానికి తలనొప్పులు అధికార పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు సమన్వయ సమి తులపై ప్రభావం చూపుతుండటం యంత్రాంగానికి చికాకు తెప్పిస్తోంది. కమిటీల ఎంపిక పూర్తిగా ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు నడుచుకోవాలని ప్రభుత్వ పెద్దలు అంతర్గత సంకేతాలు పంపగా.. తాజా పరిణామాలతో ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందోననే ఆందోళన వారిలో కనిపిస్తోంది. ప్రస్తుతా నికి ఈ పంచాయతీ గులాబీ గూటికే పరిమితమైనా.. విపక్షాలు కూడా ఇదే విరుగుడు మంత్రాన్ని పఠిస్తే సమితుల ఏర్పాటు క్లిష్టంగా మారే అవకాశముం దని అధికార వర్గాలు అంటున్నాయి. -
రైతు సమితుల పేరుతో రాజకీయం
మల్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతు సమన్వయ సమితుల పేరుతో ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని, రాజకీయ లబ్ధి కోసం రైతులను పావులుగా వాడుకుంటోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వం జీవో 39 ద్వారా రైతుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందన్నారు. చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ఈ జీవోపై ఇప్పటికే రైతులు కొందరు కోర్టులకు వెళ్లారని, ఏ కారణం చేతనైనా కోర్టులు ఆ ఉత్తర్వులను రద్దు చేస్తే దానికి రాజకీయాలు పులిమి.. కాంగ్రెస్‌పై విమర్శలు చేయవచ్చని టీఆర్ఎస్ చూస్తోందన్నారు. కాగా, ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యపై పీసీసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మీడియా ప్రతినిధులపై దాడులు సరికాదని, గౌరీ హత్య ప్రజా గొంతులను అణచివేసే కుట్ర అని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్లు రవి డిమాండ్ చేశారు. -
3,574 రైతు సమన్వయ సమితుల ఏర్పాటు
రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం నాటికి 3,574 గ్రామ రైతు సమన్వయ సమితులు ఏర్పాటైనట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ డాక్టర్ జగన్మోహన్ వెల్లడించారు. మొత్తం 10,733 రెవెన్యూ గ్రామాలుండగా.. ఐదు రోజులు గడిచినా ఇంకా తక్కువే ఏర్పాటు కావడంపై అధికారులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 331, ఆదిలాబాద్‌లో 326, నిజా మాబాద్‌లో 323, ఖమ్మం జిల్లాలో 297, మహబూబ్‌నగర్ జిల్లాలో 231, కామారెడ్డి జిల్లాలో 205 గ్రామ రైతు సమన్వయ సమితులు ఏర్పాటయ్యాయి. జగిత్యాల, యాదాద్రి జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ బోణీ కాలేదు. నల్లగొండ జిల్లాలో 11 మాత్రమే ఏర్పాటయ్యాయి. మండలంలో అన్ని గ్రామాల్లో సమితులు ఏర్పాటైతేనే మండల సమితిని ఏర్పాటు చేస్తారు. అలాగే జిల్లాలోని గ్రామ, మండల సమితులు పూర్తయ్యా కే జిల్లా సమితులు ఏర్పాటవుతాయి. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క మండలంలోనూ అన్ని గ్రామాలకు సమితులు ఏర్పాటు కాలేదు. కాగా, సమితులు ఏర్పాటు చేయడానికి ఇంకా 4 రోజులు మాత్రమే గడువు ఉండటంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. -
మంత్రుల అధికారిక పర్యటనలు బంద్!
రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై దృష్టి - ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వద్దన్న సీఎం - మందకొడిగా సాగుతున్న తీరుపై అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు సమన్వయ సమితిల ఏర్పాటును అధికార టీఆర్ఎస్ నాయకత్వం కీలకంగా భావిస్తోంది. నిర్ణీత గడువులోగా వాటి ఏర్పాటును పూర్తి చేయా లని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మంత్రులపై ఒత్తిడి పెంచుతున్నారు. సమి తుల ఏర్పాట్లు పూర్తయ్యేవరకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అధికారిక పర్యటనలు పెట్టుకోవ ద్దని హుకుం జారీ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మందకొడిగా సాగుతున్న రైతు సమన్వయ సమితిల ఏర్పాట్ల తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచా రం. కాగా, ఈనెల 7వ తేదీన జరగాల్సిన మంత్రి కేటీఆర్ నల్లగొండ పర్యటనను కూడా రద్దు చేసుకోవాలని ఆదేశించారని తెలిసింది. దీంతో ఆ జిల్లాలో మంత్రి పర్యటన వాయిదా పడినట్లు ఎమ్మెల్యేలు, పార్టీ కేడర్‌కు మంగళవారం సమాచారం కూడా ఇచ్చారు. అధికారిక గణాంకాల మేరకు 10వేల 733 రెవెన్యూ గ్రామాల్లో అంతే సంఖ్యలో సమన్వయ సమితిలు ఏర్పాటు కానున్నాయి. కాగా, ఇప్పటి వరకు వీటిలో కనీసం పావు వంతుకూడా ఏర్పాటు కాకపోవడం గమనార్హం. ‘నామినేటెడ్’ విధానంతో పార్టీ శ్రేణులకు అవకాశం? గ్రామ రైతు సమితిలో 15 మంది, మండల సమితిలో 24 మంది, జిల్లా సమితిలో 24 మంది, రాష్ట్ర రైతు సమన్వయ సమితిలో 42 మంది చొప్పున సభ్యులను తీసుకోవా లని నిర్ణయించారు. అదీ నామినేటెడ్ విధానంలో నియమించనుండడం, పూర్తి బాధ్యత మంత్రులకే అప్పజెప్పడంతో ఈ సమితుల్లో సభ్యులుగా రైతులైన టీఆర్ఎస్ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలకే పదవులు దక్కను న్నాయి. మొత్తంగా లక్షా 60వేల మందికి సభ్యులుగా అవకాశం వస్తోంది. మారిన నిబంధనల నేపథ్యంలో గ్రామ రైతు సమన్వయ సమితుల్లోని సభ్యుల నుంచే మండల కమిటీలు, అందులో నుంచి జిల్లా కమిటీల్లోకి, జిల్లా సమితుల నుంచే రాష్ట్ర సమితి సభ్యులను ఎంపిక చేయనున్నారు. వీటి వల్ల గ్రామగ్రామాన రైతుల్లో బలపడేందుకు ఉపకరిస్తుందన్న ఆశ పార్టీలో ఉంది. ఈ కారణంగానే మంత్రులు ఎట్టి పరిస్థితిల్లో తమకు అప్పజెప్పిన జిల్లాలకే పరిమితం కావాలని, అధికారిక కార్యక్ర మాలు ఏమీ పెట్టుకోకుండా రైతు సమ న్వయ సమితిల ఏర్పాటు ప్రక్రియను 9వ తేదీలోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశిం చారని చెబుతున్నారు. క్లిష్టంగా మారిన ఎంపిక ప్రక్రియ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పాటు కానున్న సమితిల ద్వారా పార్టీ కేడర్‌కు పదవులు దక్కనున్నాయి. ఇందులో సభ్యుల ఎంపిక బాధ్యతను పాత జిల్లాల వారీగా మంత్రులకు అప్పజెప్ప డంతో గ్రామాల వారీగా సంబంధిత నియో జకవర్గ ఎమ్మెల్యేల నుంచి జాబితాలు తీసుకుంటున్నారు. ఒక్కో గ్రామ సమితిలో 15 మంది సభ్యులను ఎంపిక చేయాల్సి ఉండడం, ఒక్కో రెవిన్యూ గ్రామ పరిధిలో ప్రధానమైనవి అనుకునే పెద్ద గ్రామాలూ ఉండడంతో సభ్యులను ఎంపిక చేయడం కొంత క్లిష్టంగా మారిందంటున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీపై పట్టు చిక్కించుకునేం దుకు ఈ సమన్వయ సమితిలు ఎంతగానో ఉపయోగపడతాయన్న ఆశకూడా పార్టీ వర్గాల్లో ఉంది. దీంతో భవిష్యత్ రాజకీయా లను దృష్టిలో పెట్టుకునే వీరిని ఎంపిక చేస్తున్నారు. దీంతో సహజంగానే ఎంపిక ఆలస్యమవుతోందని చెబుతున్నారు. అసం తృప్తులు బయటపడి రచ్చ జరగకుండా వీరందరినీ ముందే ఎంపిక చేసి, జాబితా లు సిద్ధంగా పెట్టుకుని ఆఖరి రోజున ప్రకటించే వ్యూహంతో ఉన్నారని అంటున్నారు. -
గ్రామ సభ్యుల్లోంచే మండల సభ్యులు
రైతు సమన్వయ సమితుల ఏర్పాటులో కీలక మార్పులు సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, సభ్యుల నియామక ప్రక్రియకు సంబంధించి నెలకొన్న గందరగోళంపై వ్యవసాయ శాఖ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు కలెక్టర్లకు స్పష్టతనిస్తూ ఆ శాఖ కార్యదర్శి పార్థసారథి లేఖ రాశారు. అలాగే కొన్ని కీలక మార్పులు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ రైతు సమన్వయ సమితిలో 15 మంది.. మండల, జిల్లా సమితుల్లో 24 మంది చొప్పున సభ్యులుండగా వారిని మంత్రులే నామినేట్ చేస్తారని ఇదివరకు పేర్కొన్నారు. అయితే తాజా ఉత్తర్వుల ప్రకారం.. మండల రైతు సమన్వయ సమితి సభ్యులను వివిధ గ్రామాలకు ఎంపికైన∙సమితి సభ్యుల నుంచే ఎంపిక చేయనున్నారు. జిల్లా సమన్వయ సమితి సభ్యులను మండల సమితి సభ్యుల నుంచి నియమిస్తారు. ఇప్పటివరకు గ్రామ, మండల, జిల్లా కమిటీలకు ఆమోదం తెలిపే అధికారం వ్యవసాయ శాఖ కార్యదర్శికే ఉండేది. అయితే గ్రామ, మండల రైతు సమన్వయ సమితులను మంత్రులు నామినేట్ చేశాక, వాటిని ఆమోదిస్తూ ఉత్తర్వులిచ్చే బాధ్యత కలెక్టర్లకు అప్పగించినట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా సమితులను ఆమోదించే అధికారం వ్యవసాయ శాఖ కమిషనర్‌కు అప్పగించినట్లు వివరించారు. ఇప్పటివరకు 2,274 సమితులే.. రైతు సమన్వయ సమితుల ఏర్పాటు మందకొడిగా సాగుతోంది. ప్రక్రియ ప్రారంభమై 4 రోజులైనా 2,274 సమితులే ఏర్పాటయ్యాయి. ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిడులు, పార్టీ కార్యకర్తల విన్నపాలతో ప్రక్రియ ఆలస్యమవుతున్నట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు. నామినేషన్‌కు సంబంధించి చివరి రోజు (9వ తేదీ) వరకు ఆగాలని మంత్రులు భావిస్తున్నారు. -
రేపట్నుంచే రైతు సమన్వయ సమితులు
- మొదటి రోజు పలుచోట్ల నామినేటెడ్ సభ్యులతో సమావేశాలు - అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసే ప్రక్రియ శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. గ్రామ, మండల, జిల్లాస్థాయి రైతు సమన్వయ సమితులను 9వ తేదీ నాటికి పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటిరోజున అన్ని జిల్లాల్లోని కొన్ని ముఖ్యమైన గ్రామాలను ఎంపిక చేసి వాటిల్లో సమన్వయ సమితి సభ్యులను నామినేట్ చేసి లాంఛనంగా సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహన్ తెలిపారు. ఎంపిక చేసిన గ్రామాల్లో సమావేశాలకు మంత్రులు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యేలా ప్రణాళిక రచించినట్లు ఆయన వివరించారు. తొమ్మిది రోజుల్లో అన్ని రెవెన్యూ గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో సమన్వయ సభ్యులను మంత్రులు నామినేట్ చేస్తారు. వాటికి సమన్వయకర్తలను కూడా ఏర్పాటు చేయనున్నారు. మండల, జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసే సమన్వయ సమితుల్లో గ్రామాల్లో నియమితులైన సభ్యులను కూడా నామినేట్ చేసే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అయితే అది మంత్రులపై ఆధారపడి ఉందని వివరించాయి. గ్రామ సమన్వయ సమితిలో 15 మంది, మండల, జిల్లా సమితుల్లో 24 మంది సభ్యులను నామినేట్ చేస్తారు. రాష్ట్ర సమన్వయ సమితిలో 42 మంది సభ్యులుంటారు. ఆయా సభ్యుల నుంచే సమన్వయకర్తలను నియమిస్తారు. రాష్ట్ర సమన్వయ సమితిని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా నియమించనున్నారు. దాని సమన్వయకర్తకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది. ఆయన కార్పొరేషన్ చైర్మన్ స్థాయిని కలిగి ఉంటారని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఇది పూర్తిగా సీఎం పరిధిలోది కాబట్టి ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆ వర్గాలు వివరించాయి. వ్యవసాయశాఖ అధికారులకు నేడు సీఎం శిక్షణ సమన్వయ సమితుల ఏర్పాటు తర్వాత వాటి నిర్వహణ, పెట్టుబడి పథకం అమలు తదితర అంశాలపై వ్యవసాయశాఖ అధికారులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం వ్యవసాయాధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల యంలో మండల స్థాయి ఏవోలు మొదలు రాష్ట్రస్థాయి అధికారుల వరకు ఈ శిక్షణలో పాల్గొంటారు. సహకా ర, ఉద్యానశాఖ అధికారులు కూడా పాల్గొంటారు. -
‘పెట్టుబడి’కి తొలి అడుగు
రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సంఘాల ఏర్పాటుకు మార్గదర్శకాలు సాక్షి, హైదరాబాద్: రైతు పెట్టుబడి పథకానికి మొదటి అడుగు పడింది. ఈ పథకాన్ని అమలు చేయడం సహా ఇతరత్రా అనేక కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ, మండల, జిల్లాస్థాయి రైతు సమన్వ య సమితుల ఏర్పాటును వచ్చేనెల 9వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది. సమన్వయ సమితులు, వాటి సమన్వయ కర్తలను నియమించే (నామినేట్) బాధ్యతను మంత్రులకు అప్పగిస్తూ మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ల్లా, మండల, జిల్లా సమితులు, వాటి సమన్వయకర్తలను మం త్రులు నామినేట్ పద్ధతిలో నియమిస్తారు. రాష్ట్రస్థాయి సమన్వయ సమితిని సీఎం నియమించనున్నారు. అన్నింట్లోనూ సభ్యులుగా ఉండే వారంతా తప్పనిసరిగా గ్రామాల్లో వ్యవసాయం చేస్తూ ఉండాలి. సమితుల్లో నియమితులయ్యే సభ్యుల్లో మూడో వంతు మహిళలు ఉండాలి. అన్ని సామాజిక వర్గాల నుంచి సభ్యులను నియమించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. 13 మంది మంత్రులకు అన్ని జిల్లాల్లో గ్రామ, మండల, జిల్లా రైతు సమన్వయ సమితులను నియమించే బాధ్యత అప్పగిం చారు. వచ్చేనెల 9 నాటికి పూర్తిచేసి ఆ వివరాలను ప్రభుత్వానికి పంపిస్తే సీఎం పరిశీలించాక వారందరినీ నామినేట్ చేస్తున్నట్లు మరో ఉత్తర్వు వస్తుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. గ్రామ రైతు సమితికి 15 మంది ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ రైతు సమన్వయ సమితిని నియమిస్తారు. ఒక్కో దాంట్లో 15 మంది సభ్యులను నియమిస్తారు. మండల, జిల్లా రైతు సమన్వయ సమితిలో 24 మంది సభ్యుల చొప్పున నియమిస్తారు. ఇక రాష్ట్ర రైతు సమన్వయ సమితిలో 42 మంది సభ్యులు ఉంటారు. ప్రతీ సమితిలో మూడో వంతు మహిళలు ఉంటారు. ఆ ప్రకారం గ్రామ సమన్వయ సమితిలో ఐదుగు రు, జిల్లా, మండల రైతు సమన్వయ సమితిలో 8 మంది, రాష్ట్ర రైతు సమన్వయ సమితిలో 14 మంది చొప్పున మహిళలు ఉంటారు. సమన్వ య సమితుల ఏర్పాటుకు రాష్ట్రస్థాయి నోడల్ విభాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ వ్యవహరిస్తుంది. ఆ శాఖ కమిషనర్ రాష్ట్ర నోడల్ ఆఫీసర్‌గా ఉంటారు. కలెక్టర్లు జిల్లా నోడల్ ఆఫీసర్లుగా ఉంటారు. వారికి జిల్లా వ్యవసాయాధికారులు తోడ్పడాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. మంత్రులకు ఆయా రైతు సమితులను నియమించే బాధ్యత అప్పగించినా.. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, వ్యవసాయాధికారులు సమితుల్లో సభ్యులను నియమించడంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయి సమితికి రూ.500 కోట్లు వ్యవసాయరంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు పంట కాలనీలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో ఏ పంట ఎంతెంత ఉత్పత్తి చేయాలో ఆ ప్రకారమే పంట కాలనీలు ఉంటాయి. ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు పండించడం కాకుండా పంట కాలనీల ప్రకారమే శాస్త్రీయంగా వ్యవసాయం చేయాలి. ఆ ప్రకారం ఉత్పాదకత పెంచడం, పండిన పంటకు మార్కెట్ వసతి కల్పించడం చేస్తారు. అందులో భాగంగా రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం నామినేట్ చేసే రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రూ.500 రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా, పండించిన పంట ఉత్పత్తులకు గ్రామాలు, మండలాల్లో వ్యాపారులతో బేరమాడేలా చేసేందుకు ఈ రివాల్వింగ్ ఫండ్ ఉపయోగపడుతుందని మార్గదర్శకాల్లో వివరించారు. రైతులకు రూ.4 వేలు 2018–19 వ్యవసాయ ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ప్రభుత్వం.. రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇస్తుందని ఉత్తర్వుల్లో పార్థసారథి పేర్కొన్నారు. రైతులు రబీలో పంటలు వేసుకుంటే అప్పుడూ కూడా ఈ పెట్టుబడి సాయాన్ని అందజేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే రైతు సమగ్ర సర్వే నిర్వహించారు. సీఎం ఆదేశం మేరకు రైతుల సంఖ్యను సమగ్రంగా గుర్తించేందుకు మరోసారి రెవెన్యూ సర్వే చేస్తారు. తర్వాత గ్రామ సభల్లో ఆ వివరాలను చర్చకు పెడతారు. అనంతరం ఫిర్యాదులు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు మొత్తం భూమి వివరాలు సేకరిస్తారు. వ్యవసాయేతర భూములను, వివాదాస్పద భూములను పెట్టుబడి పథకం నుంచి మినహాయిస్తారు. పథకాన్ని కలెక్టర్ల ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అమలు చేస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. సమితుల ఏర్పాటులో ఏ జిల్లాకు ఏ మంత్రి.. పోచారం శ్రీనివాస్‌రెడ్డి– నిజామాబాద్, కామారెడ్డి కడియం శ్రీహరి– జనగాం, వరంగల్ రూరల్, అర్బన్ ఈటల రాజేందర్– కరీంనగర్, పెద్దపల్లి కె.టి.రామారావు– రాజన్న సిరిసిల్ల, జగిత్యాల టి.హరీశ్‌రావు– సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జోగు రామన్న– ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎ.ఇంద్రసేనారెడ్డి– నిర్మల్, మంచిర్యాల పి.మహేందర్‌రెడ్డి– రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జి.జగదీశ్‌రెడ్డి– నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి తుమ్మల నాగేశ్వర్రావు– ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సి.లక్ష్మారెడ్డి– మహబూబ్‌నగర్ జూపల్లి కృష్ణారావు– నాగర్‌కర్నూలు, వనపర్తి, జోగుళాంబ గద్వాల అజ్మీరా చందూలాల్– జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ సభ్యులుగా ఎందరు...? (రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం..) ► రాష్ట్రంలో 10,434 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఈ లెక్కన మొత్తం గ్రామ రైతు సమన్వయ సభ్యుల సంఖ్య– 1,56,510. అందులో మహిళా సభ్యులు 52,170 మంది ► రూరల్ మండలాల సంఖ్య 559. ఆ ప్రకారం అన్ని మండల రైతు సమితుల్లో సభ్యుల సంఖ్య–13,416. అందులో 4,472 మంది మహిళలు. ► 30 జిల్లాలకు జిల్లా స్థాయి సమన్వయ సమితులుంటాయి. వాటిలో సభ్యుల సంఖ్య– 720 మంది. వాటిల్లో 240 మంది మహిళలు ఉంటారు ► రాష్ట్రస్థాయిలో ఉండే సభ్యుల సంఖ్య 42. వాటిల్లో మహిళలు 14 మంది. ► అన్ని సమితుల్లో ఉండే మొత్తం సభ్యుల సంఖ్య–1,70,688. వాటిల్లో ఉండే మహిళా సభ్యుల సంఖ్య– 56,896. వీరి నుంచే సమన్వయకర్తలను నియమిస్తారు. -
రెవెన్యూ శాఖలో ‘పెట్టుబడి’ చిక్కుముడి..
- వీఆర్వో, వీఆర్ఏలను వ్యవసాయ శాఖలో విలీనం చేస్తారని ప్రచారం - రూ.4 వేల పెట్టుబడి పథకం అమలుకు గ్రామాల్లో రైతు సంఘాలు - దీంతో వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ మనుగడపై సందేహాలు - తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంఘాలు.. త్వరలో ఆందోళన బాట సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వే, రికార్డుల ప్రక్షాళన వంటి కీలక కార్యక్రమాలు జరుగుతున్న వేళ రెవెన్యూ శాఖలో విచిత్రకర పరిస్థితులు నెలకొన్నాయి. శాఖాపరంగా క్షేత్రస్థాయిలో కీలకమైన వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను రెవెన్యూ శాఖ నుంచి తప్పించి వ్యవసాయ శాఖలో విలీనం చేస్తారని జరుగుతున్న ప్రచారం పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది. దీంతో డిప్యూటీ కలెక్టర్ల నుంచి వీఆర్ఏల వరకు అన్ని సంఘాలు ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. అసలేం జరుగుతోంది? వాస్తవానికి గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవహారాల్లో గ్రామ రెవెన్యూ అధికారులుగా వీఆర్వోలు, సహాయకులుగా వీఆర్ఏలు విధులు నిర్వహిస్తున్నారు. జనన, మరణ సర్టిఫికెట్ల నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక వరకు వీరే పర్యవేక్షిస్తున్నారు. భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల వ్యవహారాల్లోనూ వీరి భాగస్వామ్యం ఉంటోంది. అయితే వచ్చే ఖరీఫ్ నుంచి ఎకరానికి రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఇప్పుడు భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతోంది. తర్వాత భూములన్నింటినీ రీ సర్వే చేయనున్నారు. దీని ఆధారంగా రాష్ట్రంలోని ప్రతి భూ కమతానికి ప్రత్యేక సర్వే నంబర్, పాసుబుక్కులు ఇచ్చి పెట్టుబడి పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. అయితే ఈ పథకం అమలు కోసం ప్రతి గ్రామంలో 6–12 మంది సభ్యులతో రైతు చైతన్య సంఘాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సంఘమే గ్రామంలో జరిగే ప్రతి భూ లావాదేవీని పర్యవేక్షిస్తుంది. మ్యుటేషన్ల నుంచి క్రయ, విక్రయ లావాదేవీల వరకు ఈ సంఘమే రెవెన్యూ శాఖకు సిఫారసు చేయాల్సి ఉంటుంది. సంఘం సిఫారసు చేసిన లావాదేవీలను తహసీల్దార్, సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులకు రైతులు వెళ్లే అవసరం లేకుండానే పూర్తి చేయాలి. అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను పరిశీలించి రికార్డులను సరి చేసుకున్న తర్వాత పాసుబుక్కులను నేరుగా రైతుకు తహసీల్దార్ కార్యాలయమే కొరియర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి వీఆర్వోలు, వీఆర్ఏల సహకారంతో తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ పని జరుగుతోంది. ఇప్పుడు రైతు సంఘం సిఫారసు కీలకం కానుందనే ప్రతిపాదనే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలకు మంగళం పాడతారనే ప్రచారానికి కారణమవుతోంది. విలీనాన్ని ఒప్పుకోబోం.. భవిష్యత్తులో జరిగే భూ లావాదేవీల్లో రైతు సంఘం సిఫారసు కీలకమే అయినా వీఆర్వోలు, వీఆర్ఏల వ్యవస్థలకు ప్రమాదం లేదని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు చెపుతున్నారు. పెట్టుబడి సాయం పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రెవెన్యూ, వ్యవసాయ శాఖలు, రైతు సంఘాలు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందని, వీఆర్వో, వీఆర్ఏలు రెవెన్యూ వ్యవస్థలోనే ఉంటారని అంటున్నారు. భూ లావాదేవీల సిఫారసులు రైతు సంఘాల ద్వారానే జరిగినా, వాటి అమలు రెవెన్యూ శాఖ ద్వారానే జరగాలని, దీంతోపాటు వీఆర్వోలు నిర్వహించే ఇతర బాధ్యతలు కూడా ఉంటాయని చెబుతున్నారు. కానీ రెవెన్యూ సంఘాలు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెవెన్యూ శాఖలో కీలకమైన వీఆర్వో, వీఆర్ఏలను వ్యవసాయ శాఖలో విలీనం చేసే ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, రెవెన్యూ సర్వీసెస్, వీఆర్వో, వీఆర్ఏ సంఘాల నేతలు సోమవారం సమావేశమై తీర్మానించడం గమనార్హం. రెవెన్యూ శాఖలోనే ఉంటాం చంద్రబాబు హయాంలో మమ్మల్ని పంచాయతీరాజ్‌లోకి పంపినప్పుడు రెవెన్యూ రికార్డులకు జరిగిన నష్టాన్ని గమనంలో ఉంచుకోవాలి. ఎంపీడీవోల ఆధీనంలో ఉన్నప్పుడు సర్పంచ్‌లు, ఎంపీడీవోలు, ఎమ్మార్వోలలో ఎవరి దగ్గర పనిచేయాలో అర్థమయ్యేది కాదు. ఈ వ్యవస్థలోకి వచ్చిన తొమ్మిదేళ్లకు మళ్లీ వ్యవసాయ శాఖ అంటున్నారు. దీన్ని అంగీకరించేది లేదు. రెవెన్యూ శాఖలోనే పనిచేయాలనేది మా అందరి అభిమతం. – గోల్కొండ సతీశ్, తెలంగాణ వీఆర్వోల సంఘం అధ్యక్షుడు -
ఎవరి ప్రయోజనాల కోసం రైతు సంఘాలు!
రాజకీయ జోక్యం ఉండకూడదు: కోదండరాం హన్మకొండ: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రైతు సంఘాలు ఎవరి ప్రయోజనం కోసమని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. హన్మకొండలో తెలంగాణ నవ నిర్మాణవేదిక ఆధ్వర్యంలో ‘వ్యవసాయ సంక్షోభం– కారణాలు– పరిష్కారం’ అంశంపై ఆదివారం జరిగిన సదస్సు లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రైతు సంఘాలు ఓట్ల కోసం పని చేస్తాయా.. రైతు సమస్యలపై పనిచేస్తాయా.. అని ప్రశ్నించారు. రైతు సంఘాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కావాల్సిన మేర కేటాయింపులు లేవన్నారు. రైతులకు ప్రయోజనంలేని పాలీహౌస్‌లకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. వీటి స్థానంలో చిన్నచిన్న పనిముట్లు ఇస్తే బాగుంటుంద న్నారు. వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు ఇజ్జత్‌గా బతికే పరిస్థితులు లేవన్నారు. అప్పుల కోసం బ్యాంకులకు వెళ్లే రైతులను బ్యాంకర్లు చిన్నచూపు చూస్తున్నారని, గట్టిగా మాట్లాడినా, ప్రశ్నించినా గెంటివేస్తున్నట్లు రైతులే చెబుతున్నారని కోదండరాం తెలిపారు. హైదరాబాద్‌లో ఈ నెల 17 నుంచి 28 వరకు స్వేచ్ఛా వాణిజ్య విధానంపై అంతర్జాతీయ సమావేశం జరగనుందన్నారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం అనే ఒప్పందంపై సదస్సు ఉంటుందని, 16 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు. ఈ ఒప్పందంతో ఇక్కడి రైతులకు ఎంతో నష్టం జరగుతుందన్నారు. -
ఏడాది చివరికల్లా రైతు సమాఖ్యలు
గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి సంఘాలపై సన్నాహాలు - ఈ సంఘాల ద్వారానే ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి పథకం - మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న వ్యవసాయ శాఖ - ఆదర్శ రైతులతో సీఎం మూడు విడతల భేటీ సాక్షి, హైదరాబాద్: రైతు సమాఖ్యలను ఈ ఏడాది చివరి నాటికి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఏర్పాటు చేయనున్న సమాఖ్యలకు సంబంధించి మార్గదర్శకాలు ఖరారు చేసే పనిలో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి రైతుకు ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి ప్రోత్సాహకం ఇవ్వాలన్న నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వం ఈ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రైతు సమగ్ర సర్వే పూర్తి చేసి, వాటి వివరాలను విశ్లేషిస్తోంది. సన్నచిన్నకారు, మధ్య తరగతి, ధనిక రైతుల వివరాలను ఈ సర్వే ద్వారా గుర్తించి.. ఆ వివరాల ఆధారంగా ఆర్థికంగా ఎంతెంత కేటాయించాల్సి ఉంటుందో కచ్చితమైన నిర్ణయానికి వస్తారు. అలాగే జిల్లాకు 100 మంది చొప్పున ఆదర్శ రైతులను సర్కారు గుర్తించింది. అలా రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది రైతులతో త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేస్తారు. వారికి దిశానిర్దేశం చేస్తారు. అయితే 3 వేల మందితో ఒకేసారి కాకుండా మూడు విడతలుగా ఆయన సమావేశమవుతారు. 3 వేల మందితో ఒకేసారి ప్రగతి భవన్లో సమావేశం నిర్వహించడానికి వీలుకాదని, అందుకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం ‘సాక్షి’కి తెలిపారు. భేటీల తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఎన్నికలు లేకుండానే సమాఖ్యలు వచ్చే ఏడాది మే 15వ తేదీ నాటికి రైతులకు ప్రోత్సాహకం అందజేయాలంటే.. గ్రామ, జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమాఖ్యలను త్వరగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సమాఖ్యలను ఈ ఏడాది చివరి నాటికల్లా ఏర్పాటు చేస్తామని పోచారం తెలిపారు. వాటికి తోడుగా సమన్వయ కమిటీలు కూడా ఉంటాయని అంటున్నారు. దీనికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే రైతు సమాఖ్యలకు ఎలాంటి ఎన్నికలూ ఉండబోవని పోచారం స్పష్టంచేశారు. సంఘాల ఏర్పాటుతోపాటు వాటి అధ్యక్షులను కూడా ప్రభుత్వమే ఎంపిక చేస్తుంది. మరోవైపు వాటిని రిజిస్ట్రేషన్ చేసే అవకాశమూ లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలన్నీ రైతు సంఘాల ద్వారానే జరుగుతాయి. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఏర్పాటయ్యే సమాఖ్యల వల్ల వ్యవసాయ యంత్రాంగంపై అధ్యక్షుల పెత్తనం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయనే వాదనలున్నాయి. ‘సీఎం అంత పవర్‌ఫుల్‌గా రాష్ట్ర రైతు సమాఖ్య అధ్యక్షుడు ఉండాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే కిందిస్థాయి నుంచి కూడా వీరు చాలా కీలకంగా ఉంటారు. దీనివల్ల తమపై రైతు సంఘాల అధ్యక్షులు పెత్తనం చెలాయిస్తారనే ఆందోళన వ్యవసాయ ఉద్యోగుల్లో నెలకొంది. -
సదావర్తి సత్రం భూములు మాకే దక్కాలి
అధికారులకు ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలు సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఉన్న రూ.1,000 కోట్ల విలువైన భూములను ఎలాగైనా కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏడాది కాలంగా మరుగున పడి ఉన్న ఈ వ్యవహారాన్ని అకస్మాత్తుగా తెరపైకి తెచ్చారు. సత్రం భూములు తమకు దక్కేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి దేవాదాయ శాఖ అధికారులకు తాజాగా మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సదావర్తి సత్రం భూములపై బుధవారం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో సమావేశం జరిగింది. కమిషనర్ అనూరాధ, సత్రం ఫౌండర్ ట్రస్టీ సభ్యుడు వాసిరెడ్డి సుధాస్వరూప్, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సత్రం భూముల అమ్మకంపై హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు త్వరగా పరిష్కారమై, తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై చర్చించారు. ఏడాది కిత్రం జరిగిన వేలం కథ సదావర్తి సత్రానికి చెన్నై సమీపంలో 83.11 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి విక్రయానికి గతేడాది మార్చి 28వ తేదీన దేవాదాయ శాఖ అధికారులు వేలం పాట నిర్వహించారు. టీడీపీ పెద్దలకు కేవలం రూ.22.44 కోట్లకు వేలంలో కట్టబెట్టేందుకు పావులు కదిపారు. నిబంధనలన్నీ పక్కన పెట్టి వేలం ప్రక్రియను పూర్తి చేశారు. ఈ–వేలం విధానం జోలికే వెళ్లలేదు. అతి తక్కువ ధరకు వేలంలో భూమిని దక్కించుకున్న 8 మంది సభ్యుల బృందంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ భార్య, మరో ఇద్దరు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఉండడం గమనార్హం. -
సత్రం భూములు కొంటే.. తప్పేంటి?
చౌకగా వచ్చాయి కాబట్టే కొన్నాం : రామానుజయ సాక్షి, విశాఖపట్నం: ‘‘సదావర్తి సత్రానికి చెందిన భూములు చౌకగా వస్తున్నాయి కాబట్టే కొనుగోలు చేశాం.. దాంట్లో తప్పేముంది’’ అని రాష్ర్ట కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ ప్రశ్నించారు. వేలంలో ఇతర పాటదారులు, మీడియా సమక్షంలోనే ఈ భూములను తన కుమారుడు సొంతం చేసుకున్నాడని స్పష్టం చేశారు. ఆయన గురువారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు. ఆక్రమణదారుల నుంచి భూములను పరిరక్షించుకోలేక సత్రం పాలకవర్గం వేలం నిర్వహించిందన్నారు. వీటి విలువ మార్కెట్లో భారీగానే ఉన్నప్పటికీ వివాదాల కారణంగా తక్కువ ధరకే వేలం వేశారని చెప్పారు. 83 ఎకరాల విక్రయానికి వేలం నిర్వహించారని వెల్లడించారు. ఇతర పాటదారుల మాదిరిగానే తన కుమారుడు కూడా పాల్గొని, భూములను సొంతం చేసుకున్నాడని చెప్పారు. ఈ వ్యవహారాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. -
సదావర్తి భూములు కొనుగోలు చేశాం
కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ సాక్షి, విజయవాడ బ్యూరో: చెన్నైలో సదావర్తి సత్రం భూములను తాము కొనుగోలు చేసిన మాట నిజమేనని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ తెలిపారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. సదావర్తి సత్రం భూముల వేలం పాటలో తన కుమారుడు, అతని వ్యాపార భాగస్వాములు పాల్గొనడం నిజమేనని ఒప్పుకొన్నారు. కానీ సత్రం భూముల వివరాలు పూర్తిగా తెలియక ఆ వ్యవహారంలోకి వెళ్లి ఇరుక్కుపోయామన్నారు. సత్రం భూములు అన్యాక్రాంతమయ్యాయని, కోర్టు వివాదాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆ భూముల విలువ ఎకరం రూ. 6.5 కోట్లుంటుందని దేవాదాయ శాఖాధికారి తేల్చిన విషయం తెలియదా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదు. -
'రుణాలు చెల్లించకపోతే ఆస్తుల జప్తుచేస్తాం'
-రైతు సేవా సహకార సంఘం చైర్మన్ స్వామికురుమ -ఘట్కేసర్లో పాలకవర్గ సమావేశం ఘట్కేసర్ టౌన్(రంగారెడ్డి జిల్లా) మొండి బకాయిలు చెల్లించని వారికి ఇప్పటికే నోటీసుల ఇచ్చామని.. అయినా చాల మంది రుణాలు చెల్లించేందుకు ముందుకు రావడం లేదని రైతు సేవా సహకార సంఘం చైర్మన్ గొంగల్ల స్వామికురుమ, ఉపాధ్యక్షుడు ఎలిమినేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మొండి బకాయిలను వసూలు చేసేందుకు సదరు వ్యక్తుల ఆస్తులను జప్తు చేయనున్నట్లు స్పష్టంచేశారు. మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో మంగళవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 ఎకరాల భూమి గల రైతులకు రూ.10 లక్షల వరకు రుణం సౌకర్యం కల్పిస్తామన్నారు. మొండి బకాయిల ఖాతాలను సెటిల్ చేయడానికి సంఘం చట్టం 71 ప్రకారం ప్రత్యేకాధికారి హరిని నియమించారన్నారు. కార్యక్రమంలో డెరైక్టర్లు పన్నాల విజయలక్ష్మి, లక్ష్మమ్మ, పన్నాల ప్రభాకర్‌రెడ్డి, కొంతం అంజిరెడ్డి, ఆకిటి నర్సింహ్మారెడ్డి, మహేందర్, జవాది సత్తయ్య, బొక్క ప్రభాకర్‌రెడ్డి, రాజునాయక్, ఎండీ వెంకట్‌నారాయణ పాల్గొన్నారు. -
దారుణం
జిల్లావ్యాప్తంగా రుణాల కోసం 11,904 మంది కాపుల వినతి 53 మందికే యూనిట్ల కేటాయింపు 20,269 బీసీ దరఖాస్తుల్లో 334 మందికే మంజూరు కాపు కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసిన ప్రతిఒక్కరికీ రుణాలిస్తామని నిరాహారదీక్ష సందర్భంగా కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభానికి హామీ ఇచ్చిన తెలుగుదేశం సర్కారు ఇప్పుడు మాట తప్పింది. దరఖాస్తుదారుల్లో కేవలం 20 శాతం మందికే రుణాలివ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ రుణాలు కూడా పూర్తిస్థాయిలో ఇచ్చే పరిస్థితి కానిపించడం లేదు. అదేవిధంగా బీసీ కొర్పొరేషన్ కింద వినతులిచ్చినా వారికీ చుక్కెదురవుతోంది. చిత్తూరు: కాపులందరికీ కార్పొరేషన్ ద్వారా రుణాలిస్తామని ముద్రగడ పద్మనాభం దీక్ష సందర్భంగా చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని నట్టేట ముంచారు. కాపు కార్పొరేషన్‌కు రూ. వెయ్యి కోట్ల నిధులు ఇస్తామని తక్షణం రూ.500 కోట్లు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో కార్పొరేషన్‌కు సంబంధించి ప్రత్యేక కార్యాలయాలను ప్రారంభించింది. అర్హులైన కాపులందరూ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం చేసింది. 50 శాతం సబ్సిడీ లభిస్తుండడంతో జిల్లావ్యాప్తంగా సోమవారం నాటికి 11,904 మంది కాపులు రుణాల ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి రూ.73 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంది. దరఖాస్తులు చేసుకున్న వారిలో కేవలం 2,462 మందికి మాత్రమే రుణాలివ్వాలని ఈ నెల 12 నసమావేశమైన బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం రూ.14.72 కోట్లను కేటాయించింది. జిల్లావ్యాప్తంగా రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారిలో ఈ సంఖ్య 20 శాతం మంది మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరానికి మరో నెల మాత్రమే గడువుంది. గడువు లోపు ప్రభుత్వం చెప్పిన మేరకు లబ్ధిదారులను ఎంపిక చేసి రుణాలు మంజూరు చేయడం అసాధ్యం. ఇప్పటివరకు 53 మందికి రూ.37 లక్షల రుణాన్ని కాపు కార్పొరేషన్ మంజూరు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ముందు ప్రకటించినట్లు జిల్లా కేంద్రంలో కాపు కార్పొరేషన్‌కు సంబంధించి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇంతవరకు కార్యాలయాన్ని ప్రారంభించలేదు. దానికి ప్రత్యేక అధికారులను నియమించలేదు. కేవలం బీసీ కార్పొరేషన్ అధికారులే కాపు కార్పొరేషన్ రుణాల మంజూరు వ్యవహారాలను చూస్తున్నారు. దీంతో దరఖాస్తుల పరిశీలన సైతం సక్రమంగా ముందుకు సాగడం లేదు. దీంతో అధికారులు వివిధ రకాల కారణాలతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై కాపులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేం చెప్పినవారికే రుణాలు ఇవ్వాలి కాపు రుణాలను తాము చెప్పినవారికే ఇవ్వాలంటూ జన్మభూమి కమిటీలు బ్యాంకర్లను బెదిరిస్తున్నాయి. అర్హులను గుర్తించి రుణాలిస్తామని అధికారులు చెప్పినా వారు వినడంలేదు. ఏకంగా కాపు కార్పొరేషన్, బ్యాంకులకు వెళ్లి అధికారులను బెదిరిస్తున్నారు. మంగళవారం పెనుమూరు కార్పొరేషన్ బ్యాంకుకు వెళ్లిన జన్మభూమి కమిటీసభ్యులు తాము చెప్పినట్లు రుణాలివ్వకపోతే ఉద్యోగం మానుకుని వెళ్లమంటూ అక్కడి మేనేజర్‌ను బెదిరించడం గమనార్హం. బీసీ రుణాలూ హుళక్కే అర్హులైన బీసీలందరికీ రుణాలిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. రుణాల మంజూరులో బీసీలను వంచిం చింది. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం జిల్లావ్యాప్తంగా 20,269 మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు కేవలం 334 మందికి రూ.3.8 కోట్ల బ్యాంకు రుణాలిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంకా నెల రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ గడువులో మిగి లిన వారికి రుణాలిచ్చే పరిస్థితి లేదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి 8,377 మంది రూ.75.78 కోట్లు రుణాలిచ్చేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా ఇందులో కేవలం 334 మందికి మాత్రమే రుణాలిచ్చారు. ఇక బీసీ ఫెడరేషన్ పరిధిలో 2015-16 సంవత్సరానికి గాను 411 రూట్ల పరిధిలో 6,165 మంది లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీ కింద రుణాలిస్తామని చెప్పిన బ్యాంకులు కేవలం 221 గ్రూపులకు మాత్రమే మొక్కుబడిగా రుణాలిచ్చి చేతులు దులుపుకున్నాయి. -
లోకేష్‌ను కలిసిన వడ్డెల్లి
నందిగామ రూరల్ : కాపు కార్పొరేషన్ డెరైక్టర్‌గా ఇటీవల నియమితుడైన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు వడ్డెల్లి సాంబశివరావు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆదేశాలు, సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని లోకేష్‌కు చెప్పినట్లు సాంబశివరావు శుక్రవారం వివరించారు. -
రైతు సహకార సంస్థలకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్స్ స్కీమ్
హైదరాబాద్: రైతు సహకార సంస్థలు/కంపెనీలకు మరింత సాధికారత క ల్పించే లక్ష్యంతో స్మాల్ ఫార్మర్స్ అగ్రి-బిజినెస్ కన్సార్షియం (ఎస్‌ఎఫ్‌ఏసీ) ప్రారంభించిన ఈక్విటీ గ్రాంట్, క్రెడిట్ గ్యారంటీ ఫండ్స్ స్కీమ్ పట్ల అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్రంలో క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కన్సార్షియం ప్రకటించింది. అర్హత కలిగిన సంస్థలు వాటి వాటాదారుల మూలధనానికి సమాన మొత్తంలో, 10 లక్షల పరిమితికి లోపు గ్రాంట్ పొందేందుకు ఈక్విటీ గ్రాంట్ ఫండ్ స్కీమ్ వీలు కల్పిస్తుంది. ఆయా సంస్థల రుణ విశ్వసనీయతను పెంచడం, సభ్యులు తమ వాటా పెంచుకునేట్లు చేయడమే ఈక్విటీ గ్రాంట్ స్కీమ్ లక్ష్యం. -
ఎత్తిపోతలు వద్దు.. పోలవరమే ముద్దు
పోలవరం : ‘ఎత్తిపోతల పథకం నిర్మించొద్దు.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణమే ముద్దు’ అంటూ ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రైతు సంఘాలు, నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, రైతులు పెద్దపెట్టున నినదించారు. పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించే ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోలవరం మండలం పట్టిసీమ వద్ద సోమవారం రైతులు నిరసన దీక్ష ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని రైతుల సంఘాల ప్రతినిధులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు శిబిరం వద్దకు చేరుకుని రైతులకు మద్దతు ప్రకటించారు. ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని విరమించుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించేంత వరకూ రైతులకు తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పట్టిసీమ వద్ద రహదారిపై ప్రభుత్వ నిర్ణయూనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలవరం ప్రాజెక్టు సాధన సమితి అధ్యక్షుడు ఎంవీ సూర్యనారాయణరాజు సర్కారు తీరును ఎండగట్టారు. ఈ అంశంపై కడవరకూ పోరాడేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘం తూర్పుగోదావరి జిల్లా శాఖ అధ్యక్షుడు కొవ్వూరి త్రినాథరెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మిస్తారని, ఆ తరువాత ఎడమ ప్రధాన కాలువకు కూడా ఎత్తిపోతల పెట్టుకోమంటారని ్ఞఅన్నారు. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్లక్ష్యానికి గురవుతుందన్నారు. గడచిన 30 ఏళ్లలో ఐదేళ్లకు ఒకసారి మాత్రమే గోదావరికి వరద వచ్చిందన్నారు. గోదావరిలో 2014 జూన్, జూలై నెలల్లో కేవలం 8 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే ఉందన్నారు. ఈ నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా తోడేస్తే గోదావరి జిల్లాల్లోని డెల్టా పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకం నిర్మించిన తరువాత వరద సమయంలోనే నీటిని తోడతారన్న గ్యారంటీ లేదన్నారు. భారతీయ ఆగ్రో ఎకనమిక్ రీసెర్చ్ సెంటర్ డెరైక్టర్ తిక్కిరెడ్డి గోపాలకృష్ణ మాట్లాడుతూ 80 శాతం రైతులు నిరాకరిస్తే ప్రభుత్వం భూములు సేకరించే అవకాశం లేదన్నారు. పోలవరం కుడికాలువ నిర్మాణానికి 175 కిలోమీటర్ల పొడవునా భూసేకరణ జరగాల్సి ఉండగా, ఇప్పటికి 100 కిలోమీటర్ల మేర మాత్రమే జరిగిందన్నారు. మిగిలిన భూములు వివాదాల్లో ఉన్నాయన్నారు. పోలవరం కుడి ప్రధాన కాలువపై రామిలేరు, తమ్మిలేరు, గుండేరు వాగులు అడ్డంగా ప్రవహిస్తున్నాయన్నారు. వీటిపై వంతెనలు నిర్మించలేదన్నారు. ఈ పరిస్థితుల్లో పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి ఏం చేస్తారన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమీలు, భారతీయ కిసాన్ సంఘ్ తూర్పు గోదావరి జిల్లా శాఖ కార్యదర్శి వోరెల్ల వెంకటానందం, రైతు కార్యాచరణ సమితి అధ్యక్షుడు కలిదిండి గోపాలకృష్ణరాజు, కార్యదర్శి మంతెన కృష్ణంరాజు, ప్రాజెక్టు కమిటీ పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ ఆర్.సత్యనారాయణరాజు, తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కొవ్వూరి సుధాకర్, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర డెరైక్టర్ సిరపరపు శ్రీనివాసరావు, మాజీఎమ్మెల్యే పూనెం సింగన్నదొర, పోలవరం మండల వైసీపీ కన్వీనర్ సుంకర వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కొణతాల ప్రసాద్, సంకురు బాబూరావు, నాళం గాంధి, వివిధ సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.