‘పెట్టుబడి’కి తొలి అడుగు | The first step towards 'investment' | Sakshi
Sakshi News home page

‘పెట్టుబడి’కి తొలి అడుగు

Published Mon, Aug 28 2017 1:31 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

‘పెట్టుబడి’కి తొలి అడుగు - Sakshi

‘పెట్టుబడి’కి తొలి అడుగు

రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం
గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సంఘాల ఏర్పాటుకు మార్గదర్శకాలు
 
సాక్షి, హైదరాబాద్‌: రైతు పెట్టుబడి పథకానికి మొదటి అడుగు పడింది. ఈ పథకాన్ని అమలు చేయడం సహా ఇతరత్రా అనేక కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ, మండల, జిల్లాస్థాయి రైతు సమన్వ య సమితుల ఏర్పాటును వచ్చేనెల 9వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది. సమన్వయ సమితులు, వాటి సమన్వయ కర్తలను నియమించే (నామినేట్‌) బాధ్యతను మంత్రులకు అప్పగిస్తూ మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.

ల్లా, మండల, జిల్లా సమితులు, వాటి సమన్వయకర్తలను మం త్రులు నామినేట్‌ పద్ధతిలో నియమిస్తారు. రాష్ట్రస్థాయి సమన్వయ సమితిని సీఎం నియమించనున్నారు. అన్నింట్లోనూ సభ్యులుగా ఉండే వారంతా తప్పనిసరిగా గ్రామాల్లో వ్యవసాయం చేస్తూ ఉండాలి. సమితుల్లో నియమితులయ్యే సభ్యుల్లో మూడో వంతు మహిళలు ఉండాలి. అన్ని సామాజిక వర్గాల నుంచి సభ్యులను నియమించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. 13 మంది మంత్రులకు అన్ని జిల్లాల్లో గ్రామ, మండల, జిల్లా రైతు సమన్వయ సమితులను నియమించే బాధ్యత అప్పగిం చారు. వచ్చేనెల 9 నాటికి పూర్తిచేసి ఆ వివరాలను ప్రభుత్వానికి పంపిస్తే సీఎం పరిశీలించాక వారందరినీ నామినేట్‌ చేస్తున్నట్లు మరో ఉత్తర్వు వస్తుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.
 
గ్రామ రైతు సమితికి 15 మంది
ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ రైతు సమన్వయ సమితిని నియమిస్తారు. ఒక్కో దాంట్లో 15 మంది సభ్యులను నియమిస్తారు. మండల, జిల్లా రైతు సమన్వయ సమితిలో 24 మంది సభ్యుల చొప్పున నియమిస్తారు. ఇక రాష్ట్ర రైతు సమన్వయ సమితిలో 42 మంది సభ్యులు ఉంటారు. ప్రతీ సమితిలో మూడో వంతు మహిళలు ఉంటారు. ఆ ప్రకారం గ్రామ సమన్వయ సమితిలో ఐదుగు రు, జిల్లా, మండల రైతు సమన్వయ సమితిలో 8 మంది, రాష్ట్ర రైతు సమన్వయ సమితిలో 14 మంది చొప్పున మహిళలు ఉంటారు. సమన్వ య సమితుల ఏర్పాటుకు రాష్ట్రస్థాయి నోడల్‌ విభాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ వ్యవహరిస్తుంది. ఆ శాఖ కమిషనర్‌ రాష్ట్ర నోడల్‌ ఆఫీసర్‌గా ఉంటారు. కలెక్టర్లు జిల్లా నోడల్‌ ఆఫీసర్లుగా ఉంటారు. వారికి జిల్లా వ్యవసాయాధికారులు తోడ్పడాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. మంత్రులకు ఆయా రైతు సమితులను నియమించే బాధ్యత అప్పగించినా.. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, వ్యవసాయాధికారులు సమితుల్లో సభ్యులను నియమించడంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.
 
రాష్ట్రస్థాయి సమితికి రూ.500 కోట్లు
వ్యవసాయరంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు పంట కాలనీలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో ఏ పంట ఎంతెంత ఉత్పత్తి చేయాలో ఆ ప్రకారమే పంట కాలనీలు ఉంటాయి. ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు పండించడం కాకుండా పంట కాలనీల ప్రకారమే శాస్త్రీయంగా వ్యవసాయం చేయాలి. ఆ ప్రకారం ఉత్పాదకత పెంచడం, పండిన పంటకు మార్కెట్‌ వసతి కల్పించడం చేస్తారు. అందులో భాగంగా రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం నామినేట్‌ చేసే రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రూ.500 రివాల్వింగ్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా, పండించిన పంట ఉత్పత్తులకు గ్రామాలు, మండలాల్లో వ్యాపారులతో బేరమాడేలా చేసేందుకు ఈ రివాల్వింగ్‌ ఫండ్‌ ఉపయోగపడుతుందని మార్గదర్శకాల్లో వివరించారు.
 
రైతులకు రూ.4 వేలు
2018–19 వ్యవసాయ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వం.. రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇస్తుందని ఉత్తర్వుల్లో పార్థసారథి పేర్కొన్నారు. రైతులు రబీలో పంటలు వేసుకుంటే అప్పుడూ కూడా ఈ పెట్టుబడి సాయాన్ని అందజేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే రైతు సమగ్ర సర్వే నిర్వహించారు. సీఎం ఆదేశం మేరకు రైతుల సంఖ్యను సమగ్రంగా గుర్తించేందుకు మరోసారి రెవెన్యూ సర్వే చేస్తారు. తర్వాత గ్రామ సభల్లో ఆ వివరాలను చర్చకు పెడతారు. అనంతరం ఫిర్యాదులు స్వీకరిస్తారు. సెప్టెంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 15 వరకు మొత్తం భూమి వివరాలు సేకరిస్తారు. వ్యవసాయేతర భూములను, వివాదాస్పద భూములను పెట్టుబడి పథకం నుంచి మినహాయిస్తారు. పథకాన్ని కలెక్టర్ల ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అమలు చేస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు.
 
సమితుల ఏర్పాటులో ఏ జిల్లాకు ఏ మంత్రి..
పోచారం శ్రీనివాస్‌రెడ్డి– నిజామాబాద్, కామారెడ్డి
కడియం శ్రీహరి– జనగాం, వరంగల్‌ రూరల్, అర్బన్‌
ఈటల రాజేందర్‌– కరీంనగర్, పెద్దపల్లి
కె.టి.రామారావు– రాజన్న సిరిసిల్ల, జగిత్యాల
టి.హరీశ్‌రావు– సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట
జోగు రామన్న– ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్‌
ఎ.ఇంద్రసేనారెడ్డి– నిర్మల్, మంచిర్యాల
పి.మహేందర్‌రెడ్డి– రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్‌
జి.జగదీశ్‌రెడ్డి– నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి
తుమ్మల నాగేశ్వర్‌రావు– ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం
సి.లక్ష్మారెడ్డి– మహబూబ్‌నగర్‌
జూపల్లి కృష్ణారావు– నాగర్‌కర్నూలు, వనపర్తి, జోగుళాంబ గద్వాల
అజ్మీరా చందూలాల్‌– జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌
 
సభ్యులుగా ఎందరు...? 
(రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం..)
రాష్ట్రంలో 10,434 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఈ లెక్కన మొత్తం గ్రామ రైతు సమన్వయ సభ్యుల సంఖ్య– 1,56,510. అందులో మహిళా సభ్యులు 52,170 మంది
రూరల్‌ మండలాల సంఖ్య 559. 
ఆ ప్రకారం అన్ని మండల రైతు సమితుల్లో సభ్యుల సంఖ్య–13,416. అందులో 4,472 మంది మహిళలు. 
► 30 జిల్లాలకు జిల్లా స్థాయి సమన్వయ సమితులుంటాయి. వాటిలో సభ్యుల సంఖ్య– 720 మంది. వాటిల్లో 240 మంది మహిళలు ఉంటారు
రాష్ట్రస్థాయిలో ఉండే సభ్యుల సంఖ్య 42. వాటిల్లో మహిళలు 14 మంది.
అన్ని సమితుల్లో ఉండే మొత్తం సభ్యుల సంఖ్య–1,70,688. వాటిల్లో ఉండే మహిళా సభ్యుల సంఖ్య– 56,896. వీరి నుంచే సమన్వయకర్తలను నియమిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement