సాక్షి, హైదరాబాద్: గ్రామ, మండల రైతు సమితుల్లో సభ్యులు కాని వారికి కూడా జిల్లా సమితుల్లో చోటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాకుండా రాష్ట్ర స్థాయి రైతు సమితిలోనూ ఇతరులకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ప్రభుత్వం గతంలో జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. గ్రామ రైతు సమితిలో సభ్యులైన వారికే మండల సమితిలో చోటు కల్పించాలి. అలాగే మండల సమితి సభ్యుల నుంచే జిల్లా సమితిలోకి ఎంపిక చేయాలి. తాజా ఆదేశాల ప్రకారం మండల సమితిలో సభ్యుడు కాని వారిని కూడా జిల్లా సమితిలో నియమించేందుకు వీలు కలుగుతోంది.
మంత్రుల నిర్ణయంతో..
ఇటీవల పలువురు మంత్రులు మండల సమితిలో సభ్యులు కానివారిని జిల్లా సమితుల్లో నియామకం కోసం ఎంపిక చేశారు. కానీ కలెక్టర్లు ఇది నిబంధనల ప్రకారం సాధ్యంకాదంటూ జాబితాలను ఆమోదించేందుకు నిరాకరించారు. కానీ రాజకీయంగా కీలకమైన అంశం కావడంతో, నిబంధనలను సవరించి వారికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ సవరణ ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్లు ఈ ఉత్తర్వుల ఆధారంగా పెండింగ్‌లో ఉన్న నాలుగు జిల్లాల సమితుల జాబితాను ఆమోదించి ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుతం జిల్లా రైతు సమన్వయ సమితుల జాబితా సీఎం వద్ద ఉంది. అందులో ఇంకా ఏవైనా మార్పులు చేర్పులు ఉంటాయా అన్న చర్చ జరుగుతోంది.
ముఖ్యమంత్రి విచక్షణ మేరకు..
రాష్ట్ర స్థాయి రైతు సమన్వయ సమితిలో అందరూ జిల్లా రైతు సమితి సభ్యులు ఉండాలన్న నిబంధన ప్రత్యేకంగా ఏమీలేదని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా సమితితో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి విచక్షణ మేరకు రాష్ట్ర రైతు సమన్వయ సభ్యులను నామినేట్ చేస్తారని పేర్కొంటున్నాయి. రాష్ట్ర సమితిలో 42 మంది సభ్యులుంటారు. వారిలో ఎందరిని జిల్లా సమితుల సభ్యుల నుంచి ఎంపిక చేస్తారు, సభ్యులుకాని వారిని ఎందరిని ఎంపిక చేస్తారన్న చర్చ జరుగుతోంది. ఇందులో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలకు కూడా అవకాశం కల్పించే నేపథ్యంలో.. రాష్ట్ర సమితి ఎలా ఉండబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
జిల్లా సమన్వయకర్తలపై కసరత్తు
జిల్లా సమన్వయకర్తలుగా ఎవరు ఉంటారన్నది రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే జిల్లా సమితుల జాబితాలను దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి.. జిల్లా సమన్వయకర్తలుగా ఎవరిని నియమించాలన్న దానిపై మంత్రులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ పదవి కోసం ఒక్కో జిల్లా నుంచి ఏడెనిమిది మంది వరకు పోటీ పడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పలువురు ఆశావహులు హైదరాబాద్‌లో మకాం వేసి.. ముఖ్యమంత్రికి చెప్పించుకునేందుకు పైరవీలు కూడా చేస్తున్నట్లు తెలిసింది. ఇక రాష్ట్ర రైతు సమితిలో సభ్యత్వం కోసం పలువురు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొత్తంగా ప్రాంతీయ రైతు సదస్సుల నాటికి జిల్లా సమన్వయకర్తలు, సభ్యులతో సర్కారు ఉత్తర్వులు జారీ చేస్తుందని, రాష్ట్ర సమితి కూడా ఏర్పాటవుతుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.
మండల సభ్యులు కాకున్నా ‘జిల్లా’లో చోటు!
Published Thu, Feb 22 2018 3:49 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment