Farmer Empowerment
-
రైతు సంక్షేమ కార్యక్రమాలు భేష్
పెనుగంచిప్రోలు: ఏపీలో అమలవుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని ఇథియోపియా ప్రతినిధి బృందం పేర్కొంది. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇథియోపియా బృందంలోని ఆరుగురు సభ్యులు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో సాగవుతున్న డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించారు. రైతు పెద్ది మోహనరావుతో మాట్లాడి సాగు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహకాలు రైతులకు ఎంతో మేలు కలిగేలా ఉన్నాయన్నారు. ఆంధ్రా రైతులు రకరకాల ఉత్పత్తులు లాభసాటిగా పండిస్తున్నారన్నారు. ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు ఎన్నో రకాల సేవలందిస్తున్నాయని ప్రశంసించారు. ఇక్కడ వ్యవసాయ రంగంలో అమలవుతున్న ప్రతి కార్యక్రమం తమ దేశంలో రైతులకు అందించేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. ఇథియోపియో ప్రతినిధులు రోసి, ఎల్షడే, అబ్రహాం, ఆలీ, ఏడీఆర్ డాక్టర్ జీఎంవీ ప్రసాదరావు, డీడీఈ డాక్టర్ బి.ముకుందరావు, ఏడీ శివప్రసాద్, గరికపాడు కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
ప్రకృతి సాగులో ఏపీ ఆదర్శం
సాక్షి, అమరావతి : ప్రకృతి సాగులో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శమని కేంద్ర ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ సలహాదారు ఏకే యాదవ్ అన్నారు. ఏపీలో పెద్ద ఎత్తున చేపట్టిన ప్రకృతి సాగును ఆదర్శంగా తీసుకుని మణిపాల్ సహా ఈశాన్య రాష్ట్రాలు ముందుకు వెళుతున్నాయని చెప్పారు. ఆర్గానిక్ ఫుడ్ ఇండియా పోటీల్లో రాష్ట్రానికి నాలుగు ప్రతిష్టాత్మక పాన్ ఇండియా (జైవిక్ ఇండియా) అవార్డులు దక్కాయి. ఆగ్రాలో శనివారం జరిగిన జాతీయ స్థాయి కార్యక్రమంలో ఈ అవార్డులను కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి శివయోగి కాల్షద్‌తో కలిసి ఏకే యాదవ్ అందజేశారు. ఏపీ రైతు సాధికార సంస్థ తరఫున థీమెటిక్ లీడ్ ప్రభాకర్, మా భూమి సంఘ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నూకమ్ నాయుడు, నిట్టపుట్టు సంఘ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గంగరాజుతోపాటు వైఎస్సార్ జిల్లాకు చెందిన బండి ఓబులమ్మ ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఏకే యాదవ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రకృతి సాగు విస్తరణ దిశగా కేంద్రం తీసుకుంటున్న చర్యలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే స్ఫూర్తి అని చెప్పారు. తమ రాష్ట్రంలో కూడా ప్రకృతి సాగును ప్రోత్సహించే దిశగా కృషి చేస్తున్నట్లు కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ పేర్కొన్నారు. -
ఆలయాలకు 'ప్రకృతి' ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: ప్రముఖ ఆలయాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీతో రైతు సాధికార సంస్థ గతేడాది అక్టోబర్‌లో చేసుకున్న ఒప్పందం మేరకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం ప్రకృతి సిద్ధంగా పండించిన శనగలను మార్క్‌ఫెడ్ ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటిని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ పండించేలా ప్రకాశం, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల పరిధిలో ఎంపిక చేసిన రైతులకు రైతు సాధికార సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చారు. వీటిని కనీస మద్దతు ధర కంటే 10 శాతం అదనపు ధర చెల్లించి మరీ సేకరించారు. వాటి నమూనాలను థర్ట్ పార్టీ ఏజెన్సీ ద్వారా పరీక్షించి ధ్రువీకరించిన తర్వాత టీటీడీకి సరఫరా చేస్తున్నారు. ఇలా 10 నెలల్లో రూ.7.52 కోట్ల విలువైన 1,306 టన్నుల శనగలను టీటీడీకి సరఫరా చేశారు. టీటీడీ సూచన మేరకు స్వామివారి నైవేద్యం, ప్రసాదాలతో పాటు నిత్యాన్నదానం కోసం 2022–23 సీజన్లో 24,728 టన్నుల 12 రకాల ఉత్పత్తులను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 8 ఆలయాలకు ఉత్పత్తులు ఇదే స్ఫూర్తితో కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, ద్వారకా తిరుమల, సింహాచలం, పెనుగంచిప్రోలు, విజయవాడ కనకదుర్గ ఆలయాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సరఫరా చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆ ఆలయాల్లో ప్రసాదం, నైవేద్యం, నిత్యాన్నదానం కోసం రైతుల నుంచి సేకరించిన ఉత్పత్తులను ప్రోసెస్ చేసి ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా సరఫరా చేయనున్నారు. ఇందుకోసం గుర్తించిన రైతులకు రైతు సా«ధికార సంస్థ ద్వారా శిక్షణ ఇస్తారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వీరు పండించిన ఉత్పత్తులకు భారతీయ సేంద్రియ ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాల సంస్థకు చెందిన ఆర్గానిక్ సర్టిఫికేషన్ అండర్ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ (పీజీఎస్) ద్వారా సర్టిఫికేషన్ చేయించి మరీ ఆలయాలకు సరఫరా చేయనున్నారు. ఈ మేరకు దేవదాయ, వ్యవసాయ శాఖ మంత్రుల సమక్షంలో ఆయా దేవస్థానాలు, రైతు సాధికార సంస్థ, ఏపీ మార్క్‌ఫెడ్ మంగళవారం అవగాహన ఒప్పందం చేసుకోనున్నాయి. -
రైతే కేంద్రంగా పరిశోధనలు సాగాలి
సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్: రైతే కేంద్రంగా పరిశోధనలు జరగాలని, అన్నదాతల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, సిబ్బంది సమైక్యంగా కృషి చేయాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో జరిగే పరిశోధనలు, కనిపెట్టే అంశాలు రైతు సమగ్రాభివృద్ధికి దోహదపడాలని సూచించారు. అన్నదాతలను ఆత్మబంధువులుగా, అత్యంత ఆప్తులుగా పరిగణించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలలను సాకారం చేసేలా కలసికట్టుగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన, శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయాలు, ఏపీ వ్యవసాయ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రైతుల సాధికారతకు సమీకృత విధానాలపై నిర్వహిస్తున్న రెండురోజుల జాతీయ సదస్సు మంగళవారం గుంటూరు సమీపంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అధ్యక్షతన ప్రారంభమైన ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతే కేంద్రంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. రెండేళ్లలో ఆయన చేపట్టిన రైతుభరోసా కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాదిరిగా జగన్ రైతులు, ఇతర వర్గాల ప్రజల మనసుల్లో నిలవాలనుకుంటున్నారని చెప్పారు. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ శాస్త్రవేత్తల పరిశోధనలు క్షేత్రస్థాయికి చేరాలని సూచించారు. పశుసంవర్ధకశాఖ మంత్రి అప్పల రాజు మాట్లాడుతూ ఈ రంగాల్లో గ్రామీణ మహిళలు, యువతకు ఉపాధి చూపించే మార్గాలను అన్వేషించాలని సూచించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయ వర్సిటీ వీసీ విష్ణువర్ధన్‌రెడ్డి, వెటర్నరీ వర్సిటీ వీసీ డాక్టర్ వి.పద్మనాభరెడ్డి, వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ అరుణ్‌కుమార్, ఉద్యానశాఖ కమిషనర్ శ్రీధర్, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ శేఖర్‌బాబు, ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. త్రిమూర్తులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి విధాన పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త జి.రఘునాథరెడ్డి, వ్యవసాయ మిషన్ మెంబర్ కన్వీనర్ డాక్టర్ చంద్రశేఖరరెడ్డి, శాస్త్రవేత్త కె.గురవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతును రాజును చేసిన రాజన్న
ఏదైనా ఇవ్వడానికైనా, చేయడానికైనా మనసుండాలి. ఆ మంచి మనసున్న మారాజు కాబట్టే వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ ముఖ్యమంత్రీ చేయలేనివి చేయగలిగారు, ఇవ్వలేనివి ఇవ్వగలిగారు. ఒక తార్కిక ఆలోచనతో రైతులకు ఉచిత విద్యుత్ ఎవరైనా ఇచ్చారా? మహత్తరమైన ఆరోగ్యశ్రీ ఆలోచన అంతకుముందు ఎవరికైనా వచ్చిందా? కలలో కూడా సంకల్పించలేని జలయజ్ఞానికి ఏ నాయకుడైనా శ్రీకారం చుట్టారా? అందుకే రైతు సంక్షేమం కోసం అహరహం తపించిన ఆ మహా నాయకుడి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సముచితం. రైతు నాయకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రిగా, దేశ ఆర్థికమంత్రిగా, ప్రధానిగా రైతుల సంక్షేమం కోసం అనేక చట్టాల రూప కర్త అయిన చౌదరి చరణ్‌సింగ్ జయంతి డిసెంబర్ 23ను జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పేదవాడి పౌష్టికాహారం అయిన చేపల ఉత్పత్తిని పెంచడం కోసం హేరాలాల్ చౌదరి, కె.హెచ్.అలీ కున్హి శాస్త్ర వేత్తల బృందం 1957 జూలై 10న కృత్రిమ పద్ధతి ద్వారా చేప పిల్లల ఉత్పత్తి పెంచే విధానాన్ని కనుక్కొంది. నీలి విప్లవ విజయానికి కారణమైన ఆ పరిశోధన విజయవంతమైన రోజును జాతీయ మత్స్య రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినందున ఆయన జయంతి అయిన జూలై 8ని ప్రతి సంవత్సరం రైతు దినోత్సవంగా జరుపుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కేవలం ఐదేళ్ల మూడు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రైతు సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రీ చేయలేని పనులు చేశారు. 2004లో ఆయన సీఎంగా ప్రమాణం చేసే నాటికి వ్యవసాయ రంగం కుదేలైంది. వర్షాలు పడక, ప్రాజెక్టుల నుండి నీరు విడుదల కాక, ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోయి, రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎగతాళిగా మాట్లాడారు అప్పటి ముఖ్య మంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 22 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లుంటే 18 బ్యాంకులు దివాలా తీసిన పరిస్థితి. సీఎంగా వైఎస్ మే నెల రెండవ వారంలో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ మొదటి వారంలోనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు అనా«థలు కాకూడదని రెండు లక్షల రూపాయల పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. సాగునీటి వనరుల అభివృద్ధి మొదలైన కృష్ణదేవరాయల పాలన నుండి వైఎస్ ముఖ్య మంత్రి అయ్యేదాకా ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి వనరులు ఉన్న భూమి సుమారు 80 లక్షల ఎకరాలు మాత్రమే. ఇలాంటి పరిస్థితిలో లక్ష కోట్లతో కోటి ఎకరాలకు నీరు అందిస్తానని జలయజ్ఞం ప్రారంభించారు. జలయజ్ఞంలో మొదట ప్రారంభించిన ప్రాజెక్టు పులిచింతల. మొదట పూర్తయ్యింది నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్ ప్రాజెక్టు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా పేర్లు పెట్టి ఏమాత్రం కూడా పనులు జరగని హంద్రీ– నీవా, గాలేరు–నగరి సుజల స్రవంతులకు అవే పేర్లు కొనసాగించడం, ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతానికి జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టును చేపట్టి దానికి కమ్యూనిస్టు నాయకుడైన పూల సుబ్బయ్య పేరు పెట్టడం, కృష్ణా డెల్టా రైతుల చిరకాల స్వప్నమైన పులిచింతలకు కృష్ణా డెల్టా వాసి, ఆంధ్రప్రదేశ్ గర్వించే ఇంజనీర్ కె.ఎల్.రావు పేరు పెట్టడం ఆయన రాజకీయ విజ్ఞతకు నిదర్శనం. పోలవరం ప్రాజెక్టు కోసం గోదావరి జిల్లా వాసులు పోలవరం సాధనా సమితి పేరుతో అనేక ఉద్యమాలు చేసి చివరికి అది అసాధ్యం అనుకున్న తరుణంలో అన్ని అనుమతులు సాధించి, రాష్ట్రానికే వరమైన పోలవరంను మొదలు పెట్టడమే కాదు, సీఎంగా ఉండగానే 70 శాతం పూర్తి చేసిన గొప్పతనం ఆయనది. సాగునీటి వనరులకు ప్రధాన ఆధారం ఒకటి ప్రాజెక్టులయితే, రెండవది భూగర్భ జలాలు. ఒక ప్రాజెక్టు కట్టి ఒక ఎకరానికి నీరివ్వా లంటే ప్రభుత్వానికి లక్షలలో ఖర్చు అవుతుంది. కాల్వల నిర్వహణ ప్రభుత్వమే భరించాలి. అదే భూగర్భ జలాలకైతే రైతు స్వయంగా బోరు బావి ఏర్పాటు చేసుకుంటున్నాడు. సొంత ఖర్చుతో మోటార్లు కొనుక్కుంటున్నాడు. రైతు ఒక ఎకరంలో పంట పండించడం ద్వారా 40–60 పని దినాలు కల్పిస్తున్నాడు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కె టింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తున్నాడు. కాబట్టి వ్యవసా యానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని ఆయన సంకల్పిస్తే కొంతమంది ఎగతాళి చేశారు. అయినా సంకల్ప బలం గెలిచింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఆదర్శమై తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో అమలవుతోంది. వ్యవసాయ ఉత్పత్తి వ్యయం ఎక్కువ. రైతుకు ఆదాయం తాను పండించిన పంటను లాభసాటి ధరకు అమ్ముకుంటేనే వస్తుంది. పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధరలు లేవని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవి పెరిగేలా చేశారు. ఉదాహరణకు 1999 నుండి 2004 వరకు రాష్ట్రంలో ఎక్కువగా సాగు జరిగే ధాన్యానికి పెరిగిన మద్దతు ధర రూ. 490 నుండి 550. అంటే 12.5 శాతం పెరుగుదల. అదే 2004 నుండి 2009 వరకు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ. 550 నుండి 1,000 రూపాయలకు పెరిగింది. అంటే 82.5 శాతం పెరుగుదల. రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతోనే కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. అదీగాక కేంద్రం ప్రకటించిన రుణమాఫీలో సకాలంలో బకాయిలు చెల్లించిన రైతులకు లబ్ధి జరగలేదని గ్రహించి, రైతు సంఘాలు కూడా లేవనెత్తక ముందే, 36 లక్షల మంది రైతులకు ఐదు వేల రూపాయల చొప్పున రూ. 1,800 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. దేశంలో ఇలా చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్. సన్న, చిన్న కారు రైతులు, కౌలు రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణాలు విద్య, వైద్యం ఖర్చు. అందుకే గొప్ప పథకాలైన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104 అమలు చేశారు. రాష్ట్రంలో సరాసరి 65 శాతం మంది రైతుల భూకమతాల పరి మాణం 1.05 సెంట్లు. మరో 22 శాతం మంది రైతుల పరిమాణం 3.45 ఎకరాలు మాత్రమే. అంటే 87 శాతం మంది రైతులకు తెల్ల రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు, బలహీన వర్గాల గృహాలు కేటా యించి ఈ వర్గాలను కాపాడటం జరిగింది. 90 శాతం రాయితీతో పెద్ద ఎత్తున బిందుసేద్య పరికరాలు ఇచ్చారు. ఒక్క రూపాయి పన్ను పెంచలేదు, ఒక్క రూపాయి కొత్త పన్ను వెయ్యలేదు. సంక్షేమ పథ కాలన్నీ అర్హులందరికీ అందాయి. భూములు అమ్ముకోవలసిన అవ సరం రాలేదు. రైతులకు ఆదాయం పెరగడంతో వ్యవసాయ కార్మి కులు, చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారుల ఆదాయం పెరిగింది. అభివృద్ధి, సంక్షేమం తన రెండు కళ్లుగా పాలనగావించారు వైఎస్. నాన్న ఒక అడుగు వేస్తే, ఆయన వారసుడిగా తాను రెండు అడుగులు వేస్తానని ప్రకటించారు ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి. రైతు లకు ఉత్పత్తి వ్యయం తగ్గాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన రెండేళ్లలోనే రైతులకు రూ. 13,101 కోట్లు అందించిన పథకానికి వైఎస్సార్. రైతు భరోసా –పీఎంకిసాన్గా నామకరణం చేయడం జరి గింది. అలాగే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం, వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం, వైఎస్సార్ కాపరి బంధు పథకాలను రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తోంది. పశు నష్ట పరిహారం పథకం, జలకళ పథకం, ఆసరా పథకం, చేయూత పథకం, కాపునేస్తం పథకం, వాహనమిత్ర పథకం, లా నేస్తం పథకం, కల్యాణ కానుక పథకం, కంటి వెలుగు పథకం, సంపూర్ణ పోషణ పథకం, గిరి పుత్రిక పథకం, ఈబీసీ నేస్తం లాంటివాటిని వైఎస్సార్ పేరుతో కొనసాగిస్తూ ప్రభుత్వం ఆ మహానేత పరిచిన బాటలో నడుస్తోంది. ఎం.వి.ఎస్. నాగిరెడ్డి వ్యాసకర్త వైస్ చైర్మన్, ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ -
దరి చేరని ‘ధరణి’
సాక్షి, జూలపల్లి: మండలాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రకటనలకే పరిమితమైంది. భూముల క్రమబద్ధీకరణతో పాటు భూముల క్రయవిక్రయాలను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తహసీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేయడానికి సంకల్పించింది. ఈ విషయాన్ని ప్రకటించి జిల్లాలోని కొన్ని మండలాల్లో ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం లేదు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతో సంబంధం లేకుండా మండలాల్లోనే భూముల కొనుగోళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేసే ప్రకియ ఇంకా ప్రారంభం కాలేదు. ధరణి వెబ్సైట్ ద్వారా భూములకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉండగా ఆ ప్రక్రియ ఇంకా బాలరిష్టాలు దాటడం లేదు. ధరణి ప్రారంభమై ప్రభుత్వ అనుమతి వస్తే మం డలంలోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే వీలుకలిగే రైతులకు దూర, సమయ, వ్యయ భారం తగ్గుతుంది. అధికారులకు శిక్షణ ధరణి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చారు. పట్టణ ప్రజలకు పరిమితమైన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మండల కేంద్రాల్లో సైతం అందుబాటులోకి తీసుకుని రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం కాలేదు. నెలలు గడుస్తున్నా భూ రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రాలేదు. గతంలో ఆన్లైన్లో నమోదు కాని భూ వివరాలను భూరికార్డుల ప్రక్షాళన ఆనంతరం ఆన్లైన్లో నమోదు చేశారు. రిజిస్ట్రేషన్ విధానానికి ధరణి వెబ్‌సైట్‌ను రూపొందించారు. సబ్ రిజిస్ట్రార్ల ప్రకియపై ఇప్పటికే తహసీల్దార్‌తో పాటు కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. తహసీల్దార్ సబ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరించేందుకు వారికి ధరణి వెబ్‌సైట్‌పై అవగాహన కల్పించారు. మండలకేంద్రాల్లో వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో జిల్లా కేంద్రానికి వెళ్లి పనులు చేసిన సంఘటనలు ఉన్నాయి. నమోదు ప్రకియ పూర్తి కాక రిజిస్ట్రేషన్, రైతుబంధు, రైతుబీమా తదితర పనుల్లో జాప్యంపై రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధరణితో రైతులకు ఉపయోగం మండల కేంద్రంలోనే రిజిస్ట్రేషన్లు చేయడంతో రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. దళారుల ప్రమేయం ఉండదు. అలాగే తప్పుడు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండదు. భూ వివరాల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. మండల ప్రజల భూ వివరాలకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీంతో నకిలి రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టవచ్చు. సరళమైన దస్తావేజులతో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంటుంది. తహసీల్దార్ కార్యాలయంలోనే భూ రికార్డుల ప్రకియలో వివరాలు అన్లైన్లో నమోదు చేస్తారు. మండల పరిస్థితి ఇది మండలంలోని 7 రెవెన్యూ గ్రామాల్లో మొత్తం 11594 ఖాతాలుండగా 8136 ఖాతాలు పూర్తి చేయబడి పాస్ పుస్తకాలు అందుకున్నారు. ఇంకా 3458 మంది రైతులు వివిధ కారణాలతో తమ భూములు ఆన్లైన్లో నమోదు కాలేదు. మండలంలో అబ్బాపూర్ గ్రామంలో 625, జూలపల్లిలో 1137, కాచాపూర్‌లో 1040, కుమ్మరికుంటలో 957, పెద్దాపూర్‌లో 1379, తేలుకుంట 1363,వడ్కాపూర్‌లో 1635 ఖాతాలు డిజిటల్ సైన్ చేయడం జరిగింది. ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతుంది భూములు ఆన్లైన్ ప్రక్రి య కొనసాగుతోంది. దశాబ్దాలుగా భూముల రికార్డులు అస్తవ్యస్తంగా ఉండగా భూ ప్రక్షాళన తర్వాత కొలిక్కి వచ్చా యి. సాంకేతిక కారణాలతో జాప్యం జరుగుతోంది. మండలంలో రిజిస్ట్రేషన్ పనులకు సంబం ధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే వెంటనే సేవలు ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ విధానంతో రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం నూతనంగా ఇంటిగ్రెటేడ్ ల్యాండ్ రెవె న్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐఎల్ఆర్ఎమ్ఎస్)ను తీసుకుని రావడం జరిగింది. – రమేశ్, తహసీల్దార్, జూలపల్లి -
గ్రాసం కోసం పశువుల విలవిల
సాక్షి, ఇల్లందకుంట: వేసవి ముదిరే కొద్దీ కరువు మేఘాలు కమ్ముకొస్తున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో పశుగ్రాసం కొరత ఏర్పడింది. వర్షాభావంతో ఖరీఫ్‌లో పంటలు పండక గ్రాసానికి అవస్థలు తప్పడం లేదు. మూగజీవాలకు మేతకోసం ఇతర ప్రాంతాలకు ప్రతిరోజు వాహనాలపై కాపరులు తరలిస్తున్నారు. ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ద్వారా పశువుల మేత పెంపకానికి కార్యక్రమాలు చేస్తున్న క్షేత్రస్థాయిలో రైతులకు అందడం లేదు. పశు సంవర్ధక శాఖ పంపిణీ చేస్తున్న పశుగ్రాసం, విత్తనాపంపిణీ మొక్కుబడిగా మారింది. ఫలితంగా పశువులను రైతులు సంతలో విక్రయిస్తున్నారు. ఉపాధి, వాటర్‌షెడ్ పథకాల్లో భాగంగా పశుగ్రాసాన్ని పెంచేందుకు ముందుకు వచ్చిన రైతులకు సంబంధిత శాఖ సిబ్బంది నుంచి ప్రోత్సాహం కరువైంది. కొంతమంది రైతులే ఈ ప్రయోజనాన్ని పొందుతున్నారు. ముందస్తు సమాచారం లేక ఉచిత విత్తనాలు ఇతర రైతులకు అందలేదు. ఉపాధిహామీ పథకంలో పశుగ్రాసం పెంపకానికి చేపట్టిన కార్యక్రమం నివేదికలకే పరిమితమైంది. సమాచార లోపంతో రైతులకు ఉచిత విత్తనాలు కరువయ్యాయి. ఇప్పటికే మండలవ్యాప్తంగా పశుసందప తగ్గుముఖం పడుతోంది. ఇటు పశుగ్రాసం కొరత అన్నదాతను కలవరపెడుతోంది. ఎడ్లబండిలోడ్ వరి గ్రాసానికి రూ.వెయ్యికి పైగా, ట్రాక్టర్ వరి గ్రాసాన్ని రూ.6వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. మండలంలో పశు సంపదను కాపాడుకునేందుకు రైతులు కష్టాలు పడుతున్నారు. పశువులను పోషిస్తున్న రైతులు గ్రాసం కోసం అధిక ధరలు వెచ్చించి పశు సంపదను కాపాడుకుంటున్నారు. మొక్కుబడిగా విత్తనాల పంపిణీ ప్రభుత్వ పరంగా పశు సంవర్ధక, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో పంపిణీ చేసే గ్రాసం విత్త నాలు మొక్కుబడిగా అందిస్తున్నారు. అవి కూ డా పలుకుబడి ఉన్నవారికి ఇస్తున్నారు. విత్తనాల సరఫరా చేస్తున్న ట్లు ఎలాంటి సమాచారం ఇవ్వరూ. తీరా విషయం తెలుసుకొని వెళ్లే సరికి విత్తనాలు ఉండడం లేదు. - అంబటి రమేశ్, రైతు తక్కువకు అమ్ముతున్నం వేసవికాలం కరువు పరిస్థితులతో తక్కువ ధరలకు పశువులను విక్రయిస్తున్నాం. వేలకు వేలు డబ్బులు ఖర్చులు పెట్టినా గ్రాసం మార్కెట్లో దొరకడం లేదు. ప్రభుత్వం కల్పిస్తున్నా రాయితీలు అందడం లేదు చివరికీ పశుసంపద అంతరించి పోయే ప్రమాదం కనిపిస్తుంది. ఏంచేయాలో అర్థం కావడం లేదు. – చెన్నారెడ్డి, రైతు తిప్పలు పడుతున్నాం మూగజీవాలకు పశుగ్రాసం అందించేందుకు నా నా ఇబ్బందులు పడుతున్నాం. ఇతర ప్రాంతాల కు వేలాది రూపాయల డబ్బులు పెట్టి దిగుమతి చేసుకోవాల్సివస్తుంది. దీంతోఆర్థికంగా ఇబ్బందులుపడుతున్నాం. మా సమస్యపై అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి. – దార సదయ్య , రైతు -
మూడో ఏడాదిలోకి ‘మెదక్ జిల్లా’
మెదక్ నూతన జిల్లాగా అవతరించి నేటితో రెండేళ్లు పూర్తయింది. పలువురు అభివృద్ధి జరిగిందని ఆనందపడుతుంటే.. కొందరు మాత్రం మరిన్ని కష్టాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాటుకు ముందు ప్రతీ పనికి సంగారెడ్డికి పరుగులు తీయాల్సిన పరిస్థితి. దీంతో అభివృద్ధి ఆమడ దూరంలో ఉండేది. దూరాభారంతో ప్రజలకు అనేక ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రత్యేక జిల్లా కోసం డిమాండ్ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనతో మెదక్ ప్రాంత ప్రజల చిరకాల కల నెరవేరింది. 11 అక్టోబర్, 2016లో తెలంగాణ చిత్రపటంపై మెదక్ ప్రత్యేక జిల్లాగా అవతరించింది. అప్పటి నుంచి ప్రజలకు పాలన చేరువైంది. సాక్షి, మెదక్: ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయిన తర్వాత మెదక్ వడివడిగా అభివృద్ధి వైపు పయనిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా జిల్లా అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. దీంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసింది. జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. అలాగే కొత్తగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా శంకుస్థాపన చేశారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. జిల్లాను అధికారుల, సిబ్బంది కొరత వేధిస్తోంది. పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, 157 కొత్త పంచాయతీలను కూడా ఏర్పాటు చేసింది. కాగా ప్రతిపక్ష పార్టీలు మాత్రం మెదక్ జిల్లా ఏర్పడినా సమస్యలు మాత్రం ఎక్కడిక్కడే ఉన్నాయని విమర్శిస్తున్నాయి. యువతకు ఉపాధి కల్పన, ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం అమలులో అమలులో ప్రభుత్వం విఫలమైందని విపక్ష పార్టీలు చెబుతున్నాయి. భారీగా నిధులు .. నూతన కలెక్టరేట్‌ను రూ.60.62 కోట్లతో నిర్మిస్తున్నారు. ఆర్‌ఆండ్‌బీ, పంచాయతీరాజ్‌శాఖ ద్వారా జిల్లాలో రహదారుల, భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.300 కోట్ల నిధులు విడుదల చేసింది. రూ.47 కోట్ల వ్యయంతో బాలానగర్–నర్సాపూర్–మెదక్ జాతీయ రహదారి నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. సంగారెడ్డి–అకోలా జాతీయరహదారి నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. మెదక్ చుట్టూరా రింగ్‌రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మెదక్‌లో రూ.2.25 కోట్లతో ఆధునిక రైతుబజార్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మెదక్, నర్సాపూర్, తూప్రాన్‌లో మినీట్యాంక్‌బండ్‌ల నిర్మాణం సాగుతోంది. ఇటీవలే మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్ల యుడీఎస్ఎంటీ నిధులు మంజూరు చేసింది. రైతు సంక్షేమానికి ప్రాధాన్యం వ్యవసాయ ప్రధానమైన జిల్లాలో సాగునీటి రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. రైతు పొలాలకు సాగునీరు అందించేందుకు వీలుగా ఘనపురం ఎత్తు పెంచటంతోపాటు మిషన్‌కాకతీయ ద్వారా చెరువులు, కుంటల మరమ్మతులు చేస్తున్నారు. ఘనపురం ప్రాజెక్టు ఎత్తుపెంచేందుకు రూ.100 కోట్ల నిధులు కేటాయించగా పనులు కొనసాగుతున్నాయి. మిషన్‌కాకతీయ ద్వారా రూ.456 కోట్లతో 1893 చెరువులు, కుంటల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల భూసేకరణ జరుగుతోంది. మంజీరా నదిపై రూ.94 కోట్లతో 14 చెక్‌డ్యామ్‌లు నిర్మించనున్నారు. ప్రతిష్టాత్మకమైన కంటివెలుగు పథకానికి సీఎం కేసీఆర్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. ఎక్కడి పనులు అక్కడే.. కొత్త జిల్లా ఏర్పడినా.. అభివృద్ధి మాత్రం ఎక్కడవేసిన గొంగడి అక్కడే ఉందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. నిధుల విడుదల్లో జాప్యం, పర్యవేక్షణలోపం తదితర కారణాలతో జిల్లాలో పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. చాలాచోట్ల రహదారు నిర్మాణం పనులు ఆశించిన స్థాయిలో సాగని పరిస్థితి ఉంది. మిషన్‌భగీరథ పనులు కూడా పలు చోట్ల నత్తనడకన సాగుతున్నాయి. ఆగస్టు నాటికి ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఘనపురం ఆనకట్ట ఎత్తుపెంపు పనులు ముందుకు సాగడం లేదని, మిషన్ కాకతీయ పనులు ఆశించిన స్థాయిలో అమలు కాకపోవటంపైనా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ, యువతకు ఉపాధి, పరిశ్రమల ఏర్పాట్లులో ప్రభుత్వం విఫలమైందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఒక్క పరిశ్రమలేదు.. నర్సాపూర్: జిల్లా ఏర్పాటుతో సంతోషం మిగిలిందికాని ఎలాంటి అభివృద్ధి జరగకలేదు. ఇక్కడ ఉన్న పరిశ్రమలను తరలించారు. జిల్లా ఏర్పాటు తర్వాత ఒక్క పరిశ్రమ కూడ జిల్లాకు రాలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ జిల్లాకే తలమానికం కాగా ఎన్నికల్లో హామీ ఇచ్చి కొత్త జిల్లా ఏర్పడ్డాక సైతం వాటిని తెరిపించడంలో ప్రభుత్వం విఫలమైంది. జిల్లా కేంద్రంలోని అథ్లెటిక్ కేంద్రం ఇతర జిల్లాలకు తరలించారు. జిల్లా రైతులకు దక్కాల్సిన సింగూర్ జలాలు ఇతర జిల్లాకు తరలిపోయాయి. ఘనపురం ఆనకట్టకింద రైతులు పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు. నర్సాపూర్‌లోని పీజీ కళాశాలలో ఉన్న కోర్సులు తగ్గించారు. –ఎ మల్లేశం, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రజలకు ఒరిగిందేమీ లేదు నర్సాపూర్: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ప్రభుత్వ శాఖలలో ఉద్యోగుల భర్తీ చేయకపోవడంతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినప్పటికి డివిజన్ కేంద్రాల్లో ఉండాల్సిన ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేయలేదు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. –ఖాలెక్, సీపీఐ జిల్లా కార్యదర్శి అభివృద్ధిలో వెనుకబాటు నర్సాపూర్: కొత్త జిల్లా ఏర్పాటు చేసిన ప్రభుత్వం అభివృద్ధిని మాత్రం పట్టించుకోలే దు. రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తానని స్వయంగా ప్రకటించినప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదు. జిల్లా, డివిజన్, మండల ఏర్పాటులో అన్నిశాఖలలో ఉద్యోగులు ఖాళీలే దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల విభజనతో కొన్ని మండలాలు అటు ఇటుగా మారడంతో ప్రజలకు కొత్త చిక్కులు వచ్చాయి. – మాజీ ఎమ్మెల్యే సునీతారెడ్డి,డీసీసీ అధ్యక్షురాలు ప్రగతి వైపు అడుగులు నర్సాపూర్: కొత్త జిల్లా ఏర్పాటుతో జిల్లా వాసుల కల నెరవేరింది. పరిపాలన ప్రజల చెంతకు చేరింది. జిల్లా ప్రగతి వైపు పయనిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కొత్త జిల్లాలో జిల్లా కలెక్టర్, ఎస్సీ ప్రజలకు అందుబాటులో ఉండగా ప్రజల చెంతకు పరిపాలన వచ్చింది. పరిపాలనతోపాటు లాండ్ఆర్డర్ అందుబాటులో ఉంది. ప్రభుత్వం చేపట్టిన భూప్రక్షాళ, పాస్బుక్కుల పంపిణీ రైతుబంధు, రైతుబీమ తదితర అభివృద్ధి కార్యక్రమాలు సులభ తరమైయ్యాయి. –మురళీధర్‌యాదవ్, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు -
‘పెట్టుబడి’కి తొలి అడుగు
రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సంఘాల ఏర్పాటుకు మార్గదర్శకాలు సాక్షి, హైదరాబాద్: రైతు పెట్టుబడి పథకానికి మొదటి అడుగు పడింది. ఈ పథకాన్ని అమలు చేయడం సహా ఇతరత్రా అనేక కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ, మండల, జిల్లాస్థాయి రైతు సమన్వ య సమితుల ఏర్పాటును వచ్చేనెల 9వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది. సమన్వయ సమితులు, వాటి సమన్వయ కర్తలను నియమించే (నామినేట్) బాధ్యతను మంత్రులకు అప్పగిస్తూ మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ల్లా, మండల, జిల్లా సమితులు, వాటి సమన్వయకర్తలను మం త్రులు నామినేట్ పద్ధతిలో నియమిస్తారు. రాష్ట్రస్థాయి సమన్వయ సమితిని సీఎం నియమించనున్నారు. అన్నింట్లోనూ సభ్యులుగా ఉండే వారంతా తప్పనిసరిగా గ్రామాల్లో వ్యవసాయం చేస్తూ ఉండాలి. సమితుల్లో నియమితులయ్యే సభ్యుల్లో మూడో వంతు మహిళలు ఉండాలి. అన్ని సామాజిక వర్గాల నుంచి సభ్యులను నియమించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. 13 మంది మంత్రులకు అన్ని జిల్లాల్లో గ్రామ, మండల, జిల్లా రైతు సమన్వయ సమితులను నియమించే బాధ్యత అప్పగిం చారు. వచ్చేనెల 9 నాటికి పూర్తిచేసి ఆ వివరాలను ప్రభుత్వానికి పంపిస్తే సీఎం పరిశీలించాక వారందరినీ నామినేట్ చేస్తున్నట్లు మరో ఉత్తర్వు వస్తుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. గ్రామ రైతు సమితికి 15 మంది ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ రైతు సమన్వయ సమితిని నియమిస్తారు. ఒక్కో దాంట్లో 15 మంది సభ్యులను నియమిస్తారు. మండల, జిల్లా రైతు సమన్వయ సమితిలో 24 మంది సభ్యుల చొప్పున నియమిస్తారు. ఇక రాష్ట్ర రైతు సమన్వయ సమితిలో 42 మంది సభ్యులు ఉంటారు. ప్రతీ సమితిలో మూడో వంతు మహిళలు ఉంటారు. ఆ ప్రకారం గ్రామ సమన్వయ సమితిలో ఐదుగు రు, జిల్లా, మండల రైతు సమన్వయ సమితిలో 8 మంది, రాష్ట్ర రైతు సమన్వయ సమితిలో 14 మంది చొప్పున మహిళలు ఉంటారు. సమన్వ య సమితుల ఏర్పాటుకు రాష్ట్రస్థాయి నోడల్ విభాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ వ్యవహరిస్తుంది. ఆ శాఖ కమిషనర్ రాష్ట్ర నోడల్ ఆఫీసర్‌గా ఉంటారు. కలెక్టర్లు జిల్లా నోడల్ ఆఫీసర్లుగా ఉంటారు. వారికి జిల్లా వ్యవసాయాధికారులు తోడ్పడాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. మంత్రులకు ఆయా రైతు సమితులను నియమించే బాధ్యత అప్పగించినా.. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, వ్యవసాయాధికారులు సమితుల్లో సభ్యులను నియమించడంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయి సమితికి రూ.500 కోట్లు వ్యవసాయరంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు పంట కాలనీలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో ఏ పంట ఎంతెంత ఉత్పత్తి చేయాలో ఆ ప్రకారమే పంట కాలనీలు ఉంటాయి. ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు పండించడం కాకుండా పంట కాలనీల ప్రకారమే శాస్త్రీయంగా వ్యవసాయం చేయాలి. ఆ ప్రకారం ఉత్పాదకత పెంచడం, పండిన పంటకు మార్కెట్ వసతి కల్పించడం చేస్తారు. అందులో భాగంగా రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం నామినేట్ చేసే రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రూ.500 రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా, పండించిన పంట ఉత్పత్తులకు గ్రామాలు, మండలాల్లో వ్యాపారులతో బేరమాడేలా చేసేందుకు ఈ రివాల్వింగ్ ఫండ్ ఉపయోగపడుతుందని మార్గదర్శకాల్లో వివరించారు. రైతులకు రూ.4 వేలు 2018–19 వ్యవసాయ ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ప్రభుత్వం.. రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇస్తుందని ఉత్తర్వుల్లో పార్థసారథి పేర్కొన్నారు. రైతులు రబీలో పంటలు వేసుకుంటే అప్పుడూ కూడా ఈ పెట్టుబడి సాయాన్ని అందజేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే రైతు సమగ్ర సర్వే నిర్వహించారు. సీఎం ఆదేశం మేరకు రైతుల సంఖ్యను సమగ్రంగా గుర్తించేందుకు మరోసారి రెవెన్యూ సర్వే చేస్తారు. తర్వాత గ్రామ సభల్లో ఆ వివరాలను చర్చకు పెడతారు. అనంతరం ఫిర్యాదులు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు మొత్తం భూమి వివరాలు సేకరిస్తారు. వ్యవసాయేతర భూములను, వివాదాస్పద భూములను పెట్టుబడి పథకం నుంచి మినహాయిస్తారు. పథకాన్ని కలెక్టర్ల ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అమలు చేస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. సమితుల ఏర్పాటులో ఏ జిల్లాకు ఏ మంత్రి.. పోచారం శ్రీనివాస్‌రెడ్డి– నిజామాబాద్, కామారెడ్డి కడియం శ్రీహరి– జనగాం, వరంగల్ రూరల్, అర్బన్ ఈటల రాజేందర్– కరీంనగర్, పెద్దపల్లి కె.టి.రామారావు– రాజన్న సిరిసిల్ల, జగిత్యాల టి.హరీశ్‌రావు– సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జోగు రామన్న– ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎ.ఇంద్రసేనారెడ్డి– నిర్మల్, మంచిర్యాల పి.మహేందర్‌రెడ్డి– రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జి.జగదీశ్‌రెడ్డి– నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి తుమ్మల నాగేశ్వర్రావు– ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సి.లక్ష్మారెడ్డి– మహబూబ్‌నగర్ జూపల్లి కృష్ణారావు– నాగర్‌కర్నూలు, వనపర్తి, జోగుళాంబ గద్వాల అజ్మీరా చందూలాల్– జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ సభ్యులుగా ఎందరు...? (రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం..) ► రాష్ట్రంలో 10,434 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఈ లెక్కన మొత్తం గ్రామ రైతు సమన్వయ సభ్యుల సంఖ్య– 1,56,510. అందులో మహిళా సభ్యులు 52,170 మంది ► రూరల్ మండలాల సంఖ్య 559. ఆ ప్రకారం అన్ని మండల రైతు సమితుల్లో సభ్యుల సంఖ్య–13,416. అందులో 4,472 మంది మహిళలు. ► 30 జిల్లాలకు జిల్లా స్థాయి సమన్వయ సమితులుంటాయి. వాటిలో సభ్యుల సంఖ్య– 720 మంది. వాటిల్లో 240 మంది మహిళలు ఉంటారు ► రాష్ట్రస్థాయిలో ఉండే సభ్యుల సంఖ్య 42. వాటిల్లో మహిళలు 14 మంది. ► అన్ని సమితుల్లో ఉండే మొత్తం సభ్యుల సంఖ్య–1,70,688. వాటిల్లో ఉండే మహిళా సభ్యుల సంఖ్య– 56,896. వీరి నుంచే సమన్వయకర్తలను నియమిస్తారు. -
ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన
లోక్‌సభలో సస్పెన్షన్‌పై.. రాజ్యసభలో రైతు సమస్యలపై.. న్యూఢిల్లీ: లోక్‌సభను మంగళవారం కూడా విపక్షాలు నిరసనతో హోరెత్తించాయి. సోమవారం తమ ఆరుగురు సభ్యులపై స్పీకర్ విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నిరసనలతో ముఖ్య కార్యక్రమాలేవీ చేపట్టకుండానే సభ బుధవారానికి వాయిదాపడింది. అంతకుముందు సభ మొదలు కాగానే గోరక్షకుల దాడులపై చర్చకు విపక్షాలు పట్టుబట్టి వెల్‌లోకి దూసుకెళ్లాయి. నిరసనల మధ్య స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం తర్వాత సభ మళ్లీ మొదలైంది. బీజేపీ ఎంపీలు వీరేంద్ర కుమార్, నందకుమార్ సింగ్ చౌహన్.. దళితుల విషయంలో నిరాధార ఆరోపణల చేసి తన ప్రతిష్టకు భంగం కలిగిం చారని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధి యా చెప్పారు. ‘ఆ ఆరోపణలు రుజువైతే నేను ఎంపీగా తప్పుకుంటాను. వాటిని నిరూపించలేకపోతే వారిద్దరూ రాజీనామా చేసి, క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఆయనకు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మద్దతు తెలిపారు. పలువురు కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. అధికారపక్షం అభ్యంతరం చెప్పడంతో రభస మొదలైంది. మరోపక్క.. ప్రభుత్వ విధానాలతో వ్యవసాయ రంగంలో సంక్షోభం నెలకొందని, రైతులు నష్టపోతున్నారని రాజ్యసభలో విపక్షాలు మండిపడ్డాయి. ఆహార ధాన్యాల ఎగుమతి, దిగుమతి సుంకాల నిర్ణయంలో భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. పార్లమెంటు విశేషాలు.. ♦ ఐపీఎస్‌ల పదోన్నతికి శారీరక దారుఢ్యాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచి స్తున్నట్లు హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు లోక్‌సభకు చెప్పారు. వీసా దరఖాస్తుదారుల నేరచరిత్రను తెలుసుకోవడానికి వీసా ఫార్మాట్ సవరణ ప్రక్రియ ప్రారంభించామన్నారు. ♦ దేశ సరిహద్దు రక్షణపై ఆందోళనలను తొలగించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని రక్షణ శాఖ సహాయమంత్రి సుభాష్ భామ్రే వెల్లడించారు. ♦ రద్దయిన రూ. 500, 1,000 నోట్ల నంబర్ల కచ్చితత్వాన్ని తెలుసుకోవడానికి ఆర్బీఐ ఆ నంబర్లను తనిఖీ చేస్తోందని ఆర్థిక మంత్రి జైట్లీ రాజ్యసభలో తెలిపారు. -
రైతుల్ని ఆదుకోండి: పొన్నాల
హైదరాబాద్‌సిటీ: రాజకీయ కోణంలో చూడకుండా రైతులను ఆదుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై ఇతర కాంగ్రెస్ నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి రైతుల సమస్యలను వివరించారు. కష్టాల్లో ఉన్నరైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలపై కలవటానికి కూడా సీఎం అవకాశం ఇవ్వటం లేదని విమర్శించారు. మార్కెట్ యార్డులో మిర్చిని రైతులు కలబెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కందుల ధర భారీగా పడిపోయిందని, మార్కెట్ యార్డులో కనీసం గొనె సంచులు లేవని ఆరోపించారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పొన్నాల విమర్శించారు. -
రైతు సమస్యలపై టీడీపీ పోరుయాత్ర
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యలపై తెలంగాణ టీడీపీ సమరశంఖం పూరించడానికి సిద్ధమైంది. రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, సమగ్ర వ్యవసాయ విధానం ప్రకటించాలని, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో మినీ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఆదివారం భూపాలపల్లిలో పాదయాత్రతో పోరు ప్రారంభించనుంది. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పాదయాత్ర ఉదయం ప్రారంభమై, సాయంత్రం కలెక్టరేట్ వద్ద నిరసన, బహిరంగ సభతో ముగుస్తుంది. అలాగే 9న ఖమ్మం, 12న పెద్దపల్లి, 13న మద్దూర్ (కొడంగల్), 15న సూర్యాపేటలో పాదయాత్ర, నిరసనసభ, 30న కొడంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ప్రకృతి వైపరీత్యాలవల్ల నష్టపోయిన రైతును ఆదుకోకపోగా.. రుణమాఫీ వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడంవల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. 90శాతం దళిత, గిరిజన, పేద వర్గాలు వ్యవసాయంపై ఆధారపడ్డాయని, వారిలో భరోసా నింపడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. -
కడపలో రైతు సదస్సు రసాభాస...
- కలెక్టర్- ప్రజాప్రతినిధుల వాగ్వాదం కడప(వైఎస్సార్ జిల్లా) వైఎస్సార్ జిల్లా కడప నగరంలో మంగళవారం ఏర్పాటుచేసిన ప్రధాని ఫసల్ భీమా యోజనపై రైతుల అవగాహన సదస్సు రసాభాసగా మారింది. ప్రజాప్రతినిధులు- కలెక్టర్ మధ్య వాగ్యుద్ధం జరగడంతో రైతులందరూ సదస్సును మధ్యలోనే బహిష్కరించారు. తీవ్ర గందరగోళం మధ్య సదస్సు అర్ధంతరంగా ముగిసింది. ప్రస్తుత ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను మంటకలుపుతోందని, రాజధాని కోసం కృష్ణా జిల్లాలో సేకరించిన 57వేల ఎకరాల అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా కడప జిల్లాలోని 57 వేల ఎకరాల భూములను అటవీ శాఖకు బదలాయించడాన్ని ప్రజాప్రతినిధులు వ్యతిరేకించారు. ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంధ్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లా రైతులు, ప్రజల అవసరాలకు ఉపయోగపడే 57 వేల ఎకరాల భూమిని అటవీశాఖకు బదలాయించడం దారుణమని, దీనిని తాము అంగీకరించేది లేదని, దీనిపై కలెక్టర్ వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. రైతులను నట్టేట ముంచే ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులందరూ అడ్డుకోవాలని వారు కోరారు. మధ్యలోనే జోక్యం చేసుకున్న కలెక్టర్ ఇది రాజకీయ సభ కాదని, ప్రజాప్రతినిధులకు తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడంతో రభస మొదలైంది. జిల్లా రైతుల ప్రయోజనాలు కాపాడే విషయమై తాము మాట్లాడుతుంటే రాజకీయాలనడం సరికాదని సి.రామచంద్రయ్య, రవీంద్రనాథ్‌రెడ్డి సదస్సునుంచి వెళ్లిపోయారు. వారి వెనుకే రైతులందరూ నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు. విధిలేక అధికారులు సదస్సును అర్థంతరంగా ముగించారు. -
సుదీర్ఘంగా ఏపీ కేబినెట్, రైతుల సమస్యలపై చర్చే లేదు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆరు గంటల పాటు కొనసాగినా రైతుల సమస్యలపై అసలు చర్చించలేదు. అనంతపురం జిల్లా యువరైతు కోదండరామిరెడ్డి ఆత్మహత్యపై ఏపీ కేబినెట్ చర్చించకపోవడం గమనార్హం. ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, విత్తనాల కొరతపై రాష్ట్ర కేబినేట్ దృష్టిసారించ లేదు. పంటలకు మద్ధతు ధర పెంచుతున్నట్లు కేబినేట్ లో నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఎటువంటి బోనస్ ప్రకటనలపై మంత్రులు చర్చించలేదు. సిండికేట్ బ్యాంకు మేనేజర్ వేధిస్తున్నాడంటూ మనస్తాపానికి గురైన యువరైతు ఉరవకొండలోని బ్యాంకులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. -
అమేథీ ఏ తీరుగనుందో.. చూడు రాహుల్!
విదేశాల్లో 56 రోజుల పాటు అజ్ఞాతవాసం చేసి వచ్చిన అమేథీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చీ రాగానే దేశంలోని రైతుల సమస్యలను భుజానేసుకున్నారు. పార్లమెంట్ నిండుసభలో మోదీ ప్రభుత్వాన్ని 'మీది సూటు బూటు ప్రభుత్వం, కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నారు. రైతుల ప్రయోజనాలను విస్మరిస్తున్నారు' అంటూ తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో తెగ దులిపేశారు. కానీ ఆయన స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ నియోజకవర్గంలో రైతులు కన్నీళ్లు పెడుతుంటే, ఆకలేసి కేకలు పెడుతుంటే.. అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇది అచ్చంగా అమేథీ నియోజకవర్గంలోని సెమ్రా గ్రామస్థుల మాట. ఈ గ్రామంలో అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా పంట నష్టపోయి దాదాపు 1100 మంది రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రాహుల్ గాంధీ స్వయంగా 2009, జనవరి 14వ తేదీన ఈ గ్రామాన్ని బ్రిటన్ మంత్రి డేవిడ్ మిలిబండ్తో కలిసి సందర్శించారు. అప్పుడు శివకుమారి గౌతమ్ అనే నలుగురు పిల్లల వితంతువు ఇంటిని సందర్శించి ఆమె కష్టసుఖాలు తెలుసుకున్నారు. అండగా తాను నిలబడతానని అప్పట్లో ఆమెకు భరోసా కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆమె వేసిన గోధుమ పంట అకాలవర్షాల కారణంగా దెబ్బతింది. దాదాపు ఆరువేల రూపాయలు పంటపై ఆమె పెట్టుబడి పెట్టగా కనీసం నయా పైసా కూడా ఆమెకు నష్టపరిహారం రాలేదు. తన పరిస్థితి గురించి ఆమె జిల్లా అధికారులకు మొరపెట్టుకోగా, నాసిరకం పంటకు నష్టపరిహారం రాదంటూ పోపొమ్మన్నారు. ''రాహుల్ గాంధీని ఇంటికి రప్పించుకున్న గొప్పదానివి. నీకు సాయం చేయడం ఏమిటి ?'' అంటూ ఆపదలో ఆదుకోవాల్సిన బంధువులు గేలిచేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రైతులను ఆదుకుంటానని ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిలో ఏవీ నెరవేరలేదని కర్మాదేవి అనే మరో రైతు ఆరోపించారు. ఇక అమేథీ జిల్లా కేంద్రానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలోని చతుర్భుజ్పూర్లో అమర్నాథ్ ప్రసాద్ యాదవ్ అనే రైతు అకాల వర్షాల వల్ల పంట నష్టపోయి గత మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు పెళ్లి కావాల్సిన నలుగురు కూతుళ్లు ఉన్నారు. చేతికి రావాల్సిన పంట చేజారి పోవడంతో చేసిన అప్పులు తీర్చేదారి లేక, పిల్లల భవిష్యత్తును తలుచుకొని యాదవ్ మరణించినట్టు ఆయన భార్య మీరాబాయి వాపోతోంది. యూపీ గనుల శాఖ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అమేథీ ఎమ్మెల్యే గాయత్రి ప్రసాద్ ప్రజాపతి గ్రామాన్ని సందర్శించి ఆమెకు ఆరువేల రూపాయలు ముట్టచెప్పి వెళ్లారు. తానున్న ఆ దశలో ఆ డబ్చు తీసుకున్నాను గానీ ఇప్పుడైతే ఎందుకు కొరగాని ఆ ఆరువేలను ఆయన ముఖానే విసిరి కొట్టేదాన్ననని ఆమె వ్యాఖ్యానించారు. రాహుల్ మాట పక్కన పెడితే కనీసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా వచ్చి ఈ గ్రామంలోని రైతులను పలకరించలేదట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏడాదికి తలసరి సగటు కుటుంబ ఆదాయం 26,698 రూపాయలు ఉండగా, అమేథీ నియోజకవర్గంలో అది కేవలం 15,559 రూపాయలు ఉందంటే నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -కేంద్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తాను రైతుల పక్షపాతినని చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ ఇంతవరకు పార్లమెంట్లో అమేథీ రైతుల గురించి ఎందుకు ప్రశ్నించలేదు? కనీసం ఆ నియోజకవర్గం ఎంపీగా కేంద్రానికి లేఖ కూడా రాయలేదే! రాయబరేలి రైతుల సమస్యలపై అఖిలేష్ యాదవ్‌కు సోనియా గాంధీ ఏప్రిల్ 2న లేఖ రాయడం ఇక్కడ గమనార్హం. 56 రోజుల అజ్ఞాతవాసంలో రాహుల్ ఏం నేర్చుకున్నారో తెలియదు గానీ, ఆయన తన అమేథీ నియోజకవర్గంలో ఆ రోజులు గడిపి ఉంటే రైతుల సమస్యలపై అవగాహన ఏర్పడేదన్నది నియోజకవర్గం ప్రజల మాట. -
రైతు ఆవిష్కరణ ప్రచారంలో సాక్షికి బహుమతి
-
రైతు ఆవిష్కరణల ప్రచారంలో ‘సాక్షి’కి అవార్డు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: అన్నదాతలకు ఉపయోగపడే పరికరాలు, రైతుల ఆవిష్కరణలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్న ‘సాక్షి’ దినపత్రికకు మీడియా విభాగంలో ప్రోత్సాహక అవార్డు దక్కింది. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రపతి భవన్ ఆవరణలోని కల్చరల్ సెంటర్లో గ్రామస్థాయి ఆవిష్కర్తలకు 8వ ద్వైవార్షిక పురస్కారాల ప్రదానోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఎన్ఐఎఫ్ చైర్మన్ డా.మషేల్కర్ పలువురికి పురస్కారాలు అందజేశారు. 18 రాష్ట్రాలకు చెందిన 41 మంది గ్రామీణ ఆవిష్కర్తలతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు పురస్కారాలు అందుకున్నారు. రైతులకు ఉపయోగపడే అనేక యంత్ర పరికరాల్ని రూపొందించిన కర్ణాటకకు చెందిన నడకట్టన్కు జీవితకాల సాఫల్య పురస్కారం అందజేశారు. 3 నిమిషాల్లో 50 ఇటుకల తయారు చేసే యంత్రాన్ని ఆవిష్కరించిన కె.చంద్రశేఖర్ (ధరణికోట, గుంటూరు జిల్లా)కు ఇంజినీరింగ్ విభాగంలో జాతీయ స్థాయి తృతీయ అవార్డును రాష్ట్రపతి అందజేశారు. సులభంగా నడపడానికి వీలయ్యే పవర్ వీడర్‌ను రూపొందించిన మహిపాల్‌చారి (వరంగల్ జిల్లా)కి కన్సొలేషన్ బహుమతి దక్కింది. డా.మషేల్కర్.. మీడియా విభాగంలో ‘సాక్షి’ దినపత్రికకు ప్రోత్సాహక బహుమతి అందజేశారు. జ్ఞాపిక, ప్రశంసాప్రతంతోపాటు రూ. 50 వేల నగదు పురస్కారాన్ని ‘సాక్షి’ సాగుబడి డెస్క్ ఇన్చార్జి, డిప్యూటీ న్యూస్ ఎడిటర్ పంతంగి రాంబాబు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ఈ 41 మంది ఆవిష్కరణలతో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రారంభించారు. ఇది ఈ నెల 13 వరకు ఇది కొనసాగుతుంది. దేశ సుస్థిర అభివృద్ధికి గ్రామస్థాయి ఆవిష్కరణలు (గ్రాస్‌రూట్ ఇన్నోవేషన్స్), సంప్రదాయ విజ్ఞానం ఎంతగానో దోహదపడతాయని ప్రణబ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతకుముందు మషేల్కర్ ప్రసంగిస్తూ ఈ ఏడాది 35 వేల ఎంట్రీలు రాగా.. అందులో 41 మంది ఇన్నోవేటర్లకు అవార్డులు ఇస్తున్నామన్నారు. ఎన్ఐఎఫ్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అనిల్ కే గుప్తా మాట్లాడుతూ తమ సంస్థ ఇప్పటికి 70 ఆవిష్కరణల్ని కొనుగోలు చేసి, అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డా. హర్షవర్ధన్, సహాయ మంత్రి సుజనాచౌదరి, తెలుగు రాష్ట్రాల్లో పునాదిస్థాయి ఆవిష్కర్తలను గుర్తించి, ప్రోత్సహించడంలో గణనీయమైన కృషి చేస్తున్న పల్లెసృజన సంస్థ అధ్యక్షుడు, బీడీఎల్ మాజీ డెరైక్టర్ బ్రిగేడియర్ పోగుల గణేశం తదితరులు పాల్గొన్నారు. -
మొక్కుబడి సదస్సులు
రుణవిముక్తి పత్రాల పంపిణీకే పరిమితం రైతు సాధికారతపై హోరెత్తిన నిరసనలు అన్నదాతల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులు 20 వేలకు పైగా అభ్యంతరాలు రుణమాఫీపై రణరంగంలా సాగిన రైతుసాధికార సదస్సులు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 11న ప్రారంభమైన ఇవి షెడ్యూల్ ప్రకారం మంగళవారంతో ముగిసినప్పటికీ మిగిలిపోయిన పంచాయతీలు, వార్డుల్లో బుధవారం కూడా నిర్వహించారు. రుణవిముక్తి పత్రాల పంపిణీయే వీటి లక్ష్యమైనప్పటికీ గత నెలలో నిర్వహించిన ‘జన్మభూమి-మావూరు’ యాక్షన్ టేకెన్ ప్లాన్, స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్, ఖరీఫ్ సాగు, రబీ యాక్షన్ ప్లాన్‌పై చర్చించడం, రెండు నెలలుగా మిగిలిపోయిన పింఛన్లు, హుద్‌హుద్ సాయం పంపిణీ వంటి అంశాలను చేర్చారు. ఇవేవీ లేకుండానే మొక్కుబడిగా నిర్వహించారు. మెజార్టీ సదస్సులకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాదు కదా కనీసం స్థానిక ప్రజాప్రతినిధులు రాకపోవడంతో రైతుల నిరసనలను అధికారులే ఎదుర్కోవాల్సివచ్చింది. విశాఖపట్నం: జిల్లాలోని 925 పంచాయితీలతో పాటు జీవీఎంసీ, నర్సీపట్నం, యలమంచలిమున్సిపాల్టీల్లోని వార్డుల్లో రైతుసాధికార సదస్సులు మొక్కుబడిగా నిర్వహించి అధికారులు అయిందనిపించారు. జిల్లాలో 1,30,979 రైతులకు రూ.349.34 కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో రూ.157.17కోట్లు సర్దుబాటు చేసింది. 50 వేలలోపు రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేస్తున్నామని, ఆపైన స్కేల్‌ఆఫ్ పైనాన్స్ పరిధిలో అర్హత పొందిన రుణమొత్తంలో 20 శాతం మాఫీమొత్తాన్ని తొలి విడతలో రైతుల ఖాతాలకు జమ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది. అయితే ఈ మొత్తం రుణాల వడ్డీకి కూడాసరిపోవడం లేదని రైతులు గగ్గోలుపెట్టారు. అలాగే గందరగోళంగా మారిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వ్యవహారంపై అన్నదాతలు ఈ సదస్సుల్లో గళమెత్తారు. రుణమాఫీ కాక అప్పుల ఊబిలో కూరుకు పోయిన డ్వాక్రామహిళలుసైతం ఈ సదస్సుల్లో తమ గళాన్ని వినిపించారు. నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లులో ఆంధ్రాబ్యాంకుకు తాళాలు వేసి మరీ నిరసన వ్యక్తం చేశారు. ఇదేపరిస్థితి దాదాపు 80శాతం సదస్సుల్లో కనిపించింది. వాస్తవానికి తొలివిడతలో రుణమాఫీకి అర్హులైన 1,30,979 మందికి రుణవిముక్తి కార్డులు పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ ఈ సదస్సుల్లో కేవలం 22,069 మందికి పంపిణీ చేశారు. ప్రచార ఆర్భాటంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 3.35 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామన్నారు. కానీ ఈ సదస్సుల్లో కేవలం16,212 మందికి రూ.1.84 కోట్లు విలువైన పింఛన్లు మాత్రమే పంపిణీ చేశారు. మిగిలినవారికి పోస్టల్ ద్వారా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సదస్సుల్లో స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దేందుకు 676 పంచాయతీలు అంగీకరించగా, 59 వ్యతిరేకించాయి. ఇక 86 పంచాయతీలను స్థానిక ప్రజాప్రతినిధులు, 22 పంచాయతీలను అధికారులు, మరో 86 పంచాయతీలను ఎన్ఆర్ఐలు దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. ఇక హుద్‌హుద్ వల్ల దెబ్బతిన్న 5,66,495 బాధితులు, రైతులకు రూ.320.41కోట్ల సాయం పంపిణీ చేస్తున్నట్టుగా ప్రకటించిన ప్రభుత్వం తీరా సదస్సులు పూర్తయ్యే సరికి కేవలం రూ.44.96కోట్ల సాయం పంపిణీకి సంబంధించిన ప్రొసీడింగ్ ఆర్డర్స్ మాత్రమే ఇవ్వగలిగింది. జన్మభూమి యాక్షన్ టేకెన్ ప్లాన్‌పై 704 గ్రామాల్లో అనుకూలంగా, 31 గ్రామాల్లో వ్యతిరేకంగా అభిప్రాయాలు వచ్చాయి. ఇక ఈ సదస్సు ల్లో సుమారు 20వేలకు పైగా అభ్యంతరాలు రైతుల నుంచి వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. వీటిలో ఎక్కువగా 50వేల లోపు రుణాలున్న వారు తమకు తక్కువ మొత్తమే జమైందని ఫిర్యాదు చేయగా, మిగిలిన వారిలో ఎక్కువ మంది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ విషయంలో తమకు అన్యాయం జరిగిందని మొరపెట్టు కున్నారు. ఈసదస్సుల్లో ఎక్కడికక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు, మహిళల తమ నిరసన గళం విన్పించారు. -
బాబు వస్తే... బడికి సెలవే
అరగంట దాటింది...ఇంతవరకూ బస్సు రాలేదు...అసలు వస్తుందా..రాదా అంటూ ఓ తల్లి పాఠశాలకు ఫోన్. సారీ...బస్సు బాబు మీటింగ్ కోసం జనాన్ని తరలించడానికి వెళ్ళింది...ఈ రోజు బస్సు రాదంటూ పాఠశాల నుంచి సమాధానం. మీ బస్సు రాలేదు... టైం అవుతోందని మా పాపాయిని ఆటోలో పంపించా. పాపాయి ...బడికి చేరుకుందో లేదో వెంటనే కాస్త చూసి చెప్పండంటూ ఆందోళనతో మరో తల్లి ఫోన్. మీ పాపాయి వచ్చింది కానీ సీఎం సభకు బస్సులు వెళ్ళడంతో అత్యవసరంగా సెలవు నిర్ణయం తీసుకున్నాం. దీంతో విషయం తెలియజేయలేకపోయాం. సారీ..మీరు వచ్చి పాపాయిని తీసుకువెళ్ళండి... ఇలా ఒక్కో స్కూల్‌కు ఫోన్ల పరంపర సాగింది. దీనికి కారణం విద్యార్థులను తీసుకువెళ్లాల్సిన బస్సులన్నీ చలో చంద్రబాబు సభ బాట పట్టాయి. దీంతో విద్యార్థుల్లోను, తల్లిదండ్రుల్లోనూ ఒకటే టెన్షన్. ఒంగోలు: బాబు వస్తే చాలు...బడికి సెలవే అన్నట్లుగా తయారైంది జిల్లాలో పరిస్థితి. రాష్ట్ర రవాణా శాఖా మంత్రి కూడా జిల్లావాసే కావడంతో రవాణా శాఖ అధికారులు తమ శక్తివంచన లేకుండా కృషి చేసి పార్టీ కార్యకర్తలకు భారం లేకుండా సాయం అందించారు. ప్రైవేటు యాజమాన్యాలపై పరోక్షంగా ఒత్తిడి తెచ్చి వారిచేతే కొండపిలో జరిగిన రైతు సాధికారత సదస్సులకు పాఠశాల బస్సులను తరలించారు. దీంతో అర్థ సంవత్సర పరీక్షలు జరగాల్సి ఉన్నా ప్రైవేటు విద్యా సంస్థలు పరీక్షలను వాయిదా వేసుకోవడం చూస్తుంటే బాబు వస్తారంటే చాలు...ఇక బడికి సెలవే అన్న నానుడి జోరందుకుంటోంది. కనీసం ముందస్తు సమాచారం లేకుండా బస్సులు తరలించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ విషయం ముందుగా తెలియదని, రవాణాశాఖ అధికారులు బలవంతం చేయడంతో బస్సులు పెట్టక తప్పలేదనేది ప్రైవేటు విద్యా సంస్థల వాదన. ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం సృష్టించుకునేకంటే తల్లిదండ్రులకు ఏదోలా నచ్చజెప్పుకోవచ్చునన్న ధీమాతో అలా చేయాల్సి వచ్చిందని సంబంధిత ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. రైతులు రారని తెలిసే... ఆర్టీసీ బస్సులు కేటాయింపు రుణమాఫీపై రైతులు ఇప్పటికే మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం వచ్చినా రైతులను సమీకరించడం కష్టం . అందువల్ల రైతు సాధికారత సదస్సుకు డ్వాక్రా మహిళలను తరలించాలని అధికారులు నిర్ణయించారు. అయితే దీనికి నేరుగా డ్వాక్రా మహిళలను తరలిస్తే డబ్బులకు లెక్కలు చూపించేందుకు కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో డ్వాక్రా మహిళలకు రుణాల పంపిణీని కూడా జత చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 105 కోట్ల రూపాయల చెక్కులను డ్వాక్రా మహిళలకు అందజేసే ఏర్పాటు చేశారు. దీంతో కనిగిరి, కందుకూరు, సింగరాయకొండ, పొన్నలూరు, చీమకుర్తిల నుంచి పదేసి బస్సుల చొప్పున 50 బస్సులను డీఆర్డీఏ ఏర్పాటు చేసింది. లెక్క ప్రకారమైతే రూ.7 లక్షలు వెచ్చించాల్సిందే. -
చంద్రబాబు నిలువునా ముంచేశారు
రుణమాఫీ పేరుతో మోసం చేశారు రైతు సాధికార సదస్సుల్లో అధికారులను అడ్డుకున్న రైతులు సమాధానం దాటవేసిన అధికారులు కుప్పం: ‘కరువు పరిస్థితుల్లో బ్యాంకుల్లో తీసుకున్న రుణం మాఫీ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఇప్పుడు రుణం మాఫీ చేయకుండా కనీసం దాని వడ్డీకి సరిపడా డబ్బు కూడా ఇవ్వకుండా పత్రాలు తెచ్చి చేతిలో పెడుతున్నారు. అవి మాకు అవసరం లేదు మీ దగ్గరే పెట్టుకోండి’ అంటూ కుప్పం వుండల పరిధిలోని రైతులు అధికారులపై మండిపడ్డారు. చెక్కునత్తం, వుంకలదొడ్డి, ిపీబీనత్తం, అనిమిగానిపల్లి, వెండుగంపల్లి, గోనుగూరు గ్రామ పంచాయతీల్లో శనివారం నిర్వహించిన రైతు సాధికార సదస్సుల్లో ఈ మేరకు అధికారులను నిలదీశారు. అనిమిగానిపల్లి గ్రామ సభలో సర్పంచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ బ్యాంకుల్లో ఉన్న రుణాలు చెల్లించొద్దని చెప్పారు. ఇప్పుడు వడ్డీతో కలిపి తడిసిమోపెడైంది. ప్రభుత్వం భిక్షమేసినట్టు రూ.500, రూ.1000 బ్యాంకులో వేస్తున్నారు. ఇది ఏ మూలకూ సరిపోదు. ఇదేనా రుణమాఫీ అంటే అని అధికారులను నిలదీశారు. రెండో విడతలో న్యాయం చేస్తామని ఎంపీడీవో వివరణ ఇస్తున్నా వారు పట్టించుకోలేదు. రుణం మాఫీ చేయని, సమాధానం చెప్పని ఇలాంటి సదస్సులు వద్దని రైతులు వెళ్లిపోయారు. -
‘మాఫీ’పై ఇంత మాయా..!
రుణమాఫీ అంశంలో చంద్రబాబు తీరుపై రైతుల నిప్పులు హామీని విస్మరించారని ఆరోపణ రైతు సాధికారత సదస్సులో కలెక్టర్‌కు ప్రశ్నల వర్షం కె.కోటపాడు : రైతు సాధికారత సదస్సుకు హాజరైన కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్‌కు రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు. రుణమాఫీపై ఆయన మాట్లాడుతుండగా ఒక్కసారిగా కొందరు రైతులు లేచి మాఫీ తీరుపై మండిపడ్డారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు షరతులు లేకుండా వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి, ఇప్పుడు షరతులతో రైతులను మభ్యపెడతారా అంటూ నిప్పులు చెరిగారు. కె.కోటపాడు మండలం మేడచర్లలో శనివారం రైతు సాధికారత సదస్సు ఏర్పాటైంది. ఈ సదస్సుకు హాజరైన కలెక్టర్ తొలుత మాట్లాడుతూ రైతు రుణమాఫీ అమలుపై రైతుల సందేహాలకు వచ్చే సోమవారం నాటికి పూర్తిక్లారిటీ వస్తుం దని చెప్పారు. ఇంతలో మేడచర్ల గ్రామానికి చెందిన రైతులు పూడి ప్రకాశరావు, బొడ్డు రామారావు, బొడ్డు వెంకటరమణ తదితరులు లేచి మాట్లాడుతూ ప్రస్తుతం రుణమాఫీ విధానం వల్ల బ్యాంకుల్లో రుణాలు పొందిన చాలా మంది రైతులుమాఫీకి నోచుకోలేకపోయారన్నారు. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని రేషన్ కార్డు ప్రామాణికంతో చేస్తున్న రుణమాఫీ వల్ల కుటుంబంలో బ్యాంకు రుణాలు తీసుకున్న వారిలో ఒక్కరికే మాఫీ చేపట్టడం అన్యాయమన్నారు. బ్యాంకులకు గతంలో అన్ని వివరాలు అందించినా సదరు సిబ్బంది అప్లోడ్ సక్రమంగా చేపట్టకపోవడం వల్ల 2013 డిసెంబర్ 31లోగా రుణాలు పొందిన రైతులు రుణమాఫీకి నోచుకోలేదన్నారు. వీరికి కలెక్టర్ బదులిస్తూ అర్హులైన వారందరికీ మాఫీ వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు కలెక్టర్ మాట్లాడుతూ ఈ రుణమాఫీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు వర్తింపజేయడం జరుగుతుందన్నారు. రుణమాఫీ అమలుకు నోచుకోని అర్హులైన వారు జనవరి 7లోగా ఫిర్యాదులు చేసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఆధార్‌తోనే అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. జిల్లాలో ప్రతి గ్రామాన్ని స్మార్ట్ విలేజ్‌గా అభివృద్ధి చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో ధనికులు ఆయా గ్రామాల అభివృద్ధికి ముందుకు రావాలని కోరారు. తుఫాన్ సమయంలో జిల్లాలో జరిగిన నష్టానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనట్టు చెప్పారు. ఈ నష్టపరిహారాన్ని వారివారి ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఈ సదస్సులో ఎంపీడీవో పూర్ణిమాదేవి, ఎంపీపీ సబ్బవరపు పుష్పవతి, సర్పంచ్ పూడి చిట్టెమ్మ, ఎంపీటీసీ పూడి నారాయణమూర్తి, బొడ్డు తాతయ్యబాబులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మూడో‘సారీ’ ‘రుణం’ మాటలే
⇒ జిల్లా అభివృద్ధిపై పెదవి విప్పని సీఎం ⇒ కొల్లేరుపై పాతపాటే ⇒ పోలీస్ పహారా నడుమ మొక్కుబడిగా చంద్రబాబు పర్యటన ⇒ ఎంపిక చేసిన రైతులతోనే సాధికార సదస్సు ⇒ జిల్లావ్యాప్తంగా ముందస్తు అరెస్ట్‌లు సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎప్పుడొచ్చినా అవే ‘రుణం’ మాటలు. ఈసారి కూడా అంతే. 40 నిమిషాల ప్రసంగంలో నాలుగుసార్లు ‘పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేనిది. ఈ జిల్లా తర్వాతే నాకు ఏదైనా.. జీవితంలో పశ్చిమ వాసుల ప్రేమను మరచిపోలేను’ అని చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ జిల్లా ప్రజలకు మేలు చేసే ప్రకటన ఏమీ చేయలేదు. ఆరు నెలల కాలంలో ముచ్చటగా మూడోసారి శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు ఎప్పటి మాదిరిగానే ‘రుణం’ మాటలు వల్లె వేశారు. తనకు ప్రియమైన జిల్లా అంటూనే జిల్లా అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్క ప్రకటనా చేయలేదు. అన్ని నియోజకవర్గాలూ కట్టబెట్టిన జిల్లాను ప్రగతి బాట పట్టించడం తన బాధ్యత అంటూనే ఎటువంటి వరాలు కురిపించలేదు. పరిశ్రమలకు భూముల్లేవ్ ‘ఈ ప్రాంతానికి చాలా చేయూలనే డిమాండ్లు ఉన్నాయి. చాలామందికి చాలా కోరికలున్నాయి. కానీ.. పరిశ్రమల స్థాపనకు ఇక్కడ భూముల్లేవు. సారవంతమైన, విలువైన భూములు గల ఈ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు స్థలాలు చూడవయ్యా అని కలెక్టర్‌ను ఆదేశించాను. అటవీ భూములుంటే సేకరించమన్నాను. ఆ భూముల్లో పరి శ్రమల స్థాపనకు కృషి చేస్తా. చేపల పెంపకంలో దేశంలోనే మొదటి స్థానానికి జిల్లాను తీసుకు వెళ్తాను. ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాను’ అంటూ గతంలో చెప్పిన విషయాలను శుక్రవా రం సభలోనూ ప్రస్తావించారు. ఎత్తిపోతలపై డొంక తిరుగుడు కొల్లేరును మూడో కాంటూరుకు కుదిం చడంపై రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వకుండా సరస్సును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. పోలవరం మండలం పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మాణంపై డొంక తిరుగుడుగా మాట్లాడారు. గురువారం చిత్తూరు పర్యటనలో పోలవరం కుడికాలువ ద్వారా గోదావరి జలాలను మళ్లించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పిన సీఎం శుక్రవారం పర్యటనలో మాత్రం ఆ విషయమై అస్పష్టంగా మాట్లాడారు. ఎక్కడా ఎత్తిపోతల పథకం ప్రస్తావన చేయకుండా సముద్రంలోకి వృథాగా పోతున్న 3వేల టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించే ఆలోచన చేస్తున్నామన్నారు. మాణిక్యం వినతిని పట్టించుకోని బాబు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)ని తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేస్తామని చెబుతూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు సాంకేతికపరమైన సమస్యల పేరిట దానిని వేరే జిల్లాకు తరలిస్తోందనే ప్రచారం ఉందని, ఈ జిల్లాలోనే నిట్ ఏర్పాటు చేయూలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తన ప్రసంగంలో సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత సుదీర్ఘ ప్రసంగం చేసిన బాబు మంత్రి ప్రతిపాదనపై ప్రస్తావన తేలేదు. ఉన్నా లేనట్టుగానే ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి, మిగిలిన మంత్రుల కంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముందుగానే రైతు సాధికార సదస్సు వేదికపైకి వచ్చారు. సుమారు రెండు గంటలకు పైగా జరిగిన సదస్సులో ఎవరూ ఉప ముఖ్యమంత్రి ప్రస్తావన చేయలేదు. ఆయనకు ప్రసంగించే అవకాశం కూడా ఇవ్వలేదు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, చింతమనేని ప్రభాకర్ తమ ప్రసంగాల్లో ఎక్కడా ఆయన పేరును ప్రస్తావించలేదు. ఇక సీఎం కూడా అంతే. దీంతో డెప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప వేదికపై ముభావంగా కనిపించారు. పోలీసులపై మాగంటి అలక సీఎం సభా వేదికపైకి వచ్చినా ఎంపీ మాగంటి బాబు మాత్రం రాలేదు. ఆయన సభా వేదికపైకి వస్తూ తనతోపాటు పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను వెంట తీసుకు వస్తుండగా, పోలీసు అధికారులు అడ్డుకున్నారు. దీంతో అలకబూనిన ఎంపీ వేదిక కిందే ఉండిపోయారు. మా ప్రభుత్వంలో కూడా మాకు స్వేచ్ఛ లేదంటూ వ్యాఖ్యానించారు. ఇంతలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ వెళ్లి ఎంపీ బాబును బుజ్జగించి వేదికపైకి తీసుకువచ్చారు. మొక్కుబడిగా ముగిసిన సదస్సు జిల్లాలో గత నెలలో నిర్వహించిన జన్మభూమి సభకు చంద్రబాబు రాగా, ఐకేపీ యానిమేటర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రైతు సాధికార సదస్సుకు పోలీసులు కనీవినీ రీతిలో ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేశారు. గురువారం అర్ధరాత్రి నుంచే జిల్లావ్యాప్తంగా ప్రజా సంఘాల నాయకులను, రైతు సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. కైకరంలోని సభా ప్రాంగణంలో రైతుల కంటే పోలీసులే పెద్దసంఖ్యలో ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సభకు పెద్దసంఖ్యలో ప్రైవేటు స్కూల్ బస్సుల ద్వారా టీడీపీ కార్యకర్తలను తరలించారు. సీఎం ప్రసంగంలో ఎక్కడా వరాల జల్లు లేకుండా చప్పగా సాగడంతో పార్టీ శ్రేణులు సైతం నిరుత్సాహానికి లోనయ్యూయి. గతంలో మాదిరిగా ఎక్కడా అవాంఛనీయ ఘట నలు జరగలేదన్న సంతృప్తి పోలీసు అధికారులు పార్టీ నేతలకు మిగిలింది. అధికారుల జోలికెళ్లొద్దు జిల్లా స్థాయి పోలీసు అధికారిని బదిలీ చేయాలని ఇద్దరు ప్రజాప్రతినిధులు చంద్రబాబుకు చెప్పగా తీవ్ర స్థాయిలో స్పందించినట్టు తెలిసింది. ‘నోర్ముయ్.. అధికారుల జోలికెళ్లొద్దు. వాళ్లతో పని చేయించుకోండి’ అని చంద్రబాబు మందలించినట్టు సమాచారం. -
రైతుల్లేకుండానే సదస్సులు !
* మమ అనిపిస్తున్న అధికారులు విజయనగరం కంటోన్మెంట్: రైతులకు రుణమాఫీ పత్రాలు అందించేందుకు నిర్వహిస్తున్న రైతు సాధికార సదస్సుల్లో రైతులు కానరావడం లేదు. జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులకు రైతులు హాజరు కాకపోవడంతో వెలవెలబోతున్నాయి. అప్పులున్న వారికి రుణమాఫీ వర్తించకపోవడంతో రైతులు ఈ కార్యక్రమాలపై నిరాసక్తతతో ఉన్నారు. ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ఈ సదస్సులను రైతులు కనీసం పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా అధికారులు, మం డల స్థాయి అధికారులు హాజరవుతున్న సదస్సులు జనాల్లేక చప్పగా సాగుతున్నాయి. బలిజపేట మండలం చిలకలపల్లిలో నిర్వహించిన సదస్సులో రైతులు తమకు రుణమాఫీ పత్రాలు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. అంతేకాకుండా గ్రామంలో రూ.50వేల లోపు రుణాలు కలిగి ఉన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారని, వారికి ఎందుకు మాఫీ వర్తింపజేయలేదని అధికారులను నిలదీశారు. అదేవిధంగా బలిజిపేటలో కూడా దాదాపు వందమంది రైతులకు రుణాలు వర్తింపజేయకపోవడంతో వారంతా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. పార్వతీపురం, మున్సిపాలిటీ, రూరల్ ప్రాంతాల్లో సదస్సులు పేలవంగా జరిగాయి. సాలూరు మున్సిపాలిటీ పరిధిలోని మెంటాడ వీధి, గాడి వీధుల్లో నిర్వహించిన సదస్సులకు రైతులు కరువయ్యారు. ఎక్కడ చూసినా రైతులు లేకపోవడంతో కొద్ది మంది మాత్రమే వచ్చిన అధికారులు కూడా తిరుగుముఖం పట్టారు. సాలూరు మండలం కందులపదం, కొట్టు పరుపు గ్రామాల్లో అధికారులు పర్యటించినపుడు రైతుల జాడ లేదు. వాస్తవానికి ఈ ప్రాంతాల్లో ఉన్న వారు అరటి రైతులు కావడంతో వారికి రుణమాఫీ వర్తించకపోవడంతో అక్కడున్న కొద్దిపాటి రైతులను గుర్తించి వారి చేతిలో రుణ విముక్తి పత్రాలను అధికారులు పెట్టి వెళ్లిపోయారు. అయితే పత్రాలిచ్చిన వారికి కూడా ఖాతాల్లో సొమ్ము పడకపోవడంతో నిరాశగా ఉన్నారు. బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాల్లో ఉన్న పలు గ్రామాల్లో రైతులు లేని సాధికార సదస్సులను అధికారులు మమ అనిపించారు. విజయనగరం డివిజన్లోని నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లో రైతు సాధికార సదస్సులు తూతూమంత్రంగా నడిపించారు. ఎస్‌కోట, వేపాడ, కొత్తవలస మండలాల్లో ఈ సదస్సులకు హాజరైన రైతులకు రుణమాఫీ పత్రాలు లేకపోవడం విచారకరం. చాలా మండలాల్లో అన్ని ఆధారాలు సమర్పించిన వారికి కూడా రుణమాఫీ జరగకపోవడంతో వారంతా ఇదేం రుణమాఫీ అని సణుక్కోవడం కనిపించింది. -
మీ ఎమ్మెల్యే సూపర్
- మీ అభ్యున్నతి కోసమే ఆమె తపన - ఎమ్మెల్యే కళావతి పనితీరుపై ప్రశంసలు - దోనుబాయి గిరిజనులతో కలెక్టర్ సీతంపేట: ‘మీ ఎమ్మెల్యే నిత్యం మీ కష్టాల గురించే ఆలోచిస్తుంటారు. వాటి పరిష్కారం గురించే ఎప్పుడూ నాతో మాట్లాడుతుంటారు’.. అని జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ దోనుబాయిలో గిరిజనుల వద్ద వ్యాఖానించారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతినుద్దేశించిన ఆయన ఈ వ్యాఖలు చేశారు. ఆమె కోరిక మేరకే ఇక్కడికి వచ్చానని కూడా చెప్పారు. శుక్రవారం సీతంపేట మండలం దోనుబాయిలో జరిగిన రైతు సాధికార సదస్సులో ఆయన మాట్లాడుతూ గిరిజన సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే కళావతి నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ‘ఆమె మీ పట్ల ఎంతో పాజిటివ్ మైండ్‌తో ఉన్నారు. ఎప్పటికపుడు ఇక్కడి సమస్యలపై నాతో ఫోన్లో మాట్లాడుతుంటారని చెప్పారు. ‘మా ఏజెన్సీకి ఒకసారి రావాలండి.. మా గిరిజనుల సమస్యలు చూడాలి, వారి కష్టాలు వినాలంటూ పదేపదే నాతో అంటుంటారని, అందుకే దోనుబాయి వచ్చానని’ వివరించారు. మీ సమస్యలు ఏవైనా ఉంటే చెప్పాలని కోరారు. తుపాను వల్ల నష్టపోయిన వారికి ఇంకా పరిహారం అందకపోతే అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ జన్‌ధన్ బ్యాంకు ఖాతాప్రారంభించాలన్నారు. అందరికీ ఆధార్ నంబర్లు ఉండాలన్నారు. చాలా మందికి పింఛన్లు రేషన్‌కార్డులు అందడం లేదన్న ఫిర్యాదులను ప్రస్తావిస్తూ వయస్సు తప్పుగా నమోదవడం, ఇతరత్రా కారణాలతో కొందరికి ఆగాయని త్వరలో వారందరికి మంజూరు చేస్తామన్నారు. పీటీజీలతో పాటు నాన్పీటీజీలకు కూడా 50 ఏళ్ల వయస్సు దాటితే వృద్ధాప్య పింఛన్ మంజూరుకు కృషి చేస్తానన్నారు. దోనుబాయి వంటి చోట్ల మొబైల్ బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. కాగా బీఎస్ఎన్ఎల్ సెల్‌టవర్ ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కళావతి, ఐటీడీఏ పీవో సత్యనారాయణ, ఎంపీపీ సవర లక్ష్మి, జెడ్పీటీసీ పాలక రాజబాబు, సర్పంచ్‌లు కోటేశ్వరరావు, సాయికుమార్, కోఆప్టెడ్ సభ్యుడు ఎం. మోహనరావు, ఎంపీటీసీ బి.జయలక్ష్మి, పీసా చట్టం ఉపాధ్యక్షుడు ఎన్.సోమయ్య, ఈఈ శ్రీనివాస్, ఎంపీడీవో గార రవణమ్మ, పీఏవో జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
అదే అయోమయం
రైతు సాధికారత సదస్సుల్లోనూ రుణమాఫీపై కొరవడిన స్పష్టత రైతుల ప్రశ్నలకు అధికారుల దాటవేత ధోరణి రెండో జాబితా పేరుతో తప్పించుకునే యత్నం మాఫీ పత్రాలూ కొందరికే అందజేత ‘పంట రుణాలకు అసలు అర్థమేంటో చెప్పండి..’ తోట్లవల్లూరు సదస్సులో వెల్లూరు బ్రహ్మం అనే రైతు అధికారులను అడిగిన ప్రశ్న ఇది. తమ ప్రాంతంలో అరటి, పసుపు, కంద పంటలపై తీసుకున్న రుణాలు మాఫీ కాలేదని ఆయన అధికారుల దృష్టికి తెచ్చారు. దీనిపై వారు స్పందిస్తూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు వరి, చెరకు పంటలకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. రుణమాఫీ ప్రక్రియ ఎంత అయోమయంగా జరిగిందో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. మచిలీపట్నం : రుణవిమోచన పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసిన రైతు సాధికారత సమావేశాల్లోనూ రుణమాఫీపై స్పష్టత కొరవడింది. అన్ని ఆధారాలూ సమర్పించినా రుణమాఫీ జాబితాలో తమ పేరు లేదని పలువురు రైతులు పేర్కొనగా.. ప్రభుత్వం విధించిన నిబంధనల ఆధారంగానే రుణమాఫీ జరిగిందని, ఇంతకుమించి తమకేమీ తెలియదని పలువురు బ్యాంకు అధికారులు సమాధానమిచ్చారు. మరిన్ని వివరాలు కావాలంటే ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకోవాలని తప్పించుకునే ప్రయత్నం చేశారు. పలువురు అధికారులు మాత్రం మొదటి జాబితాలో పేర్లు రానివారికి రెండో జాబితాలో వస్తుందంటూ సమాధానమిచ్చారు. మొదటి జాబితాలో పేర్లు లేని రైతులు గట్టిగా ప్రశ్నిస్తే రెండో జాబితాలో లేకుండా చేస్తారనే భయంతో మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. గురువారం ఆకాశం మేఘావృతమై ఉండి చిరుజల్లులు కురవడం, పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు అధిక శాతం పొలం పనుల్లో నిమగ్నమై ఉండ టంతో రైతుల హాజరు అంతంతమాత్రంగానే ఉంది. రూ.50 వేల లోపు రుణం ఉన్న రైతులకు రుణవిమోచన పత్రాల అందజేత కూడా మొక్కుబడిగానే సాగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గురువారం జరిగిన సదస్సుల్లో చోటుచేసుకున్న ఘటనల వివరాలివీ.. ముదినేపల్లి మండలం బొమ్మినంపాడులో ఓ రైతు తాను పంట రుణంగా రూ.40 వేలు తీసుకున్నానని, వడ్డీతో కలిపి రూ.51 వేలు అయిందని, రుణం మొత్తం రూ.50 వేలు దాటిందంటూ తన పేరుతో ఉన్న రుణమాఫీ జరగలేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వడ్డీతో కలిపి రూ.50 వేలు దాటినా.. విడతలవారీగా మాఫీ చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాడు. మైలవరం మండలం చంద్రాల సొసైటీలో రూ.50 వేల లోపు రుణమాఫీ వర్తించినవారు 150 మంది ఉండగా, పది మందికి మాత్రమే రుణవిమోచన పత్రాలు అందజేసి అధికారులు వెళ్లిపోయారు. కృత్తివెన్ను మండలం నీలిపూడిలో రుణమాఫీ పత్రాలు లేకుండా అధికారులు సమావేశాలు నిర్వహించారు. రైతులు దీనిపై ప్రశ్నించగా రుణవిమోచన పత్రాలు డౌన్లోడ్ చేస్తున్నామని, త్వరలో అందజేస్తామని చెప్పి కార్యక్రమాన్ని ముగించారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ మొత్తం చేస్తామని ప్రకటించి.. అధికారంలోకొచ్చాక రూ.50 వేల లోపు వారికి మాత్రమే చేస్తున్నట్లు పేర్కొన్నారని.. అసలు మాఫీ చేస్తారా లేదా అని పెడన మండలం బల్లిపర్రు సదస్సులో పలువురు రైతులు అధికారులను నిలదీశారు. రూ.50 వేలకు కన్నా అధికంగా పంట రుణం తీసుకున్న రైతులకు రుణవిమోచన పత్రాలు ఇవ్వకపోవడంతో వారు అయోమయానికి గురయ్యారు. మొదటి విడత రుణమాఫీ జాబితా ఏకపక్షంగా తయారుచేశారని, ఒక వర్గానికే మాఫీ జరిగినట్లుగా ఉందని, మిగిలిన రైతులకు ఎప్పటిలోగా వర్తింపచేస్తారని కంకిపాడు మండలం జగన్నాధపురం సదస్సులో పలువురు రైతులు జేసీ జె.మురళిని ప్రశ్నించారు. పెనుగంచిప్రోలు మండలం తోటచర్లలో గుమ్మడి వెంకటేశ్వరరావు అనే రైతు మాట్లాడుతూ తాను పంట రుణంగా రూ.10 వేలు తీసుకున్నానని, రుణమాఫీగా రూ. 2 వేలే జమ చేశారని అధికారుల దృష్టికి తెచ్చారు. నందిగామ మండలం కేతవీరునిపాడు తదితర గ్రామాల్లో అన్ని అర్హతలూ ఉన్నా కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదని, వారి పరిస్థితి ఏమిటని రైతులు అధికారులను ప్రశ్నించారు. రెండో జాబితాలో అర్హుల పేర్లను చేరుస్తామని, అన్ని ఆధారాలూ సమర్పించాలని అధికారులు సమాధానమిచ్చారు.ధృవీకరణ పత్రాలు ఇచ్చినా తమ రుణాలు రద్దు కాలేదని, మాఫీ విధానం ఎలా జరిగిందని పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం సదస్సులో పలువురు రైతులు అధికారులను ప్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు.