పెనుగంచిప్రోలు: ఏపీలో అమలవుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని ఇథియోపియా ప్రతినిధి బృందం పేర్కొంది. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇథియోపియా బృందంలోని ఆరుగురు సభ్యులు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో సాగవుతున్న డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించారు. రైతు పెద్ది మోహనరావుతో మాట్లాడి సాగు వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహకాలు రైతులకు ఎంతో మేలు కలిగేలా ఉన్నాయన్నారు. ఆంధ్రా రైతులు రకరకాల ఉత్పత్తులు లాభసాటిగా పండిస్తున్నారన్నారు. ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు ఎన్నో రకాల సేవలందిస్తున్నాయని ప్రశంసించారు.
ఇక్కడ వ్యవసాయ రంగంలో అమలవుతున్న ప్రతి కార్యక్రమం తమ దేశంలో రైతులకు అందించేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. ఇథియోపియో ప్రతినిధులు రోసి, ఎల్షడే, అబ్రహాం, ఆలీ, ఏడీఆర్ డాక్టర్ జీఎంవీ ప్రసాదరావు, డీడీఈ డాక్టర్ బి.ముకుందరావు, ఏడీ శివప్రసాద్, గరికపాడు కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment