⇒ రైతు సాధికార సదస్సులో నిరసన సెగలు
⇒ అధికారులను నిలదీసిన రైతులు
⇒ గోపాలపట్నంలో జరిగిన జిల్లా సదస్సుకు జనం కరవు
⇒ మొక్కుబడి ఏర్పాట్లపై మంత్రి గంటా మండిపాటు
సాక్షి, విశాఖపట్నం: గోపాలపట్నం హైస్కూల్‌లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి రైతు సాధికార సదస్సు మొక్కుబడిగా సాగింది. రైతులు, బాధితులు నిరసన గళమెత్తారు. అధికారులను నిలదీశారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, సీహెచ్.అయ్యన్న పాత్రుడు, జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవానితో పాటు ఎమ్మెల్యేలు గణబాబు, గణేష్‌కుమార్, విష్ణుకుమార్ రాజులు మినహా జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులంతా సదస్సుకు డుమ్మా కొట్టారు. జనం లేక ప్రాంగణం వెలవెలబోవడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు సదస్సు ప్రారంభం కాలేదు.
సీఎం స్థాయి నాయకులు పాల్గొనే తరహాలో ఏర్పాట్లు చేసినా జన సమీకరణలేక వెలవెలబోయింది. చివరకు బలవంతంగా తరలించిన డ్వాక్రా సంఘ సభ్యులు, పాఠశాల విద్యార్థులతో కానిచ్చేశారు. ఈ సదస్సులను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తే మీరిలా మొక్కుబడిగా మార్చేస్తారా అంటూ మంత్రి గంటా తన ప్రసంగం ప్రారంభంలోనే అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీరిలా చేస్తారని అనుకోలేదు.. ఇందుకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోండంటూ కలెక్టర్‌ను ఆదేశించారు.
అర్హుల జాబితాలేవి? ..అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే ఈశ్వరి
అర్హుల జాబితాను ప్రదర్శించకుండా రైతు సాధికార సదస్సులు నిర్వహించడం వల్ల ప్రయోజనమేమిటంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధికారులపై మండిపడ్డారు. పాడేరు మండలం లగిసిపల్లి గ్రామంలో జరిగిన సదస్సులో పాల్గొన్న ఆమె జాబితాను ప్రదర్శించకుండా ఎంతమందికి ఎంత మేర మాఫీ చేశామో ఏ విధంగా చెప్పగలరని ప్రశ్నించారు.
బేషరతుగా రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలని, లేకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రూ.50వేల లోపు రుణాలను ఒకేసారిమాఫీ చేస్తామని చెప్పినా ఏ ఒక్కరికి ఐదు పదివేల రూపాయలు మించి జమకాలేదని చెబుతున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇదే గ్రామంలో హుద్‌హుద్ తుపాను వల్ల తమ పంటలు పూర్తిగా దెబ్బతిన్న అర్హుల జాబితాలో మా పేర్లు లేవంటూ పలువురు బాధిత రైతులు సదస్సులోనే అసంతృప్తి వ్యక్తం చేశారు.
అర్హుల జాబితా అవకతవకలమయం!
నగర పరిధిలోని 50వ డివిజన్‌లో జరిగిన రైతు సాధికార సదస్సులో అధికార పార్టీ నేతలే ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. హుద్‌హుద్ సాయం పంపిణీ కోసం ఎంపిక చేసిన అర్హుల జాబితా అవకతవకలమయంగా ఉందంటూ మండిపడ్డారు. డివిజన్‌లో ఏడు వేల ఇళ్లు దెబ్బతింటే సగం మందికి కూడా అర్హుల జాబితాలో చోటు దక్కలేదని, వీరిలో కూడా సగం మందికి పరిహారం అందలేదని స్థానిక టీడీపీ నేతలు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎదుటే అధికారులను నిలదీశారు. డివిజన్‌లో 5వేల మంది అర్హులైన పింఛన్‌దారులుంటే కేవలం 1300 మందికి మాత్రమే ఇస్తున్నారని, ఇదెక్కడ న్యాయమో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే జోక్యం చేసుకుని తక్షణమే ఈ అవకతవకలను సరి చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం, పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చోడవరం మండలం సీమనాపల్లిలో జరిగిన సదస్సులో మాకు రూ.50వేల లోపే రుణాలున్నప్పటికీ తొలి జాబితాలో మా పేర్లు ఎందుకు లేవో చెప్పాలని పలువురు రైతులు అధికారులను నిలదీశారు.
తనకు రూ.20వేల లోపే రుణం ఉన్నప్పటికీ మాఫీ జాబితాలో లేదని అప్పలనాయుడు అనే రైతు అధికారుల ఎదుట వాపోయాడు. అర్హులైన మాకు పరిహారం ఇవ్వడం లేదని, ఒక్కసారి మా ఇళ్లకు, పంటపొలాలకు వచ్చి చూడాలంటూ పలువురు బాధితులు, రైతులు పద్మనాభం సదస్సులో అధికారులను నిలదీశారు. ఇదే రీతిలో జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.
అన్నదాత ఆగ్రహం
Published Fri, Dec 12 2014 1:24 AM | Last Updated on Mon, Oct 1 2018 4:52 PM
Advertisement