MLA Eashwari
-
ఐనాడా.. ఐనా వస్తా..
ఉమెన్సడే స్పెషల్ vip రిపోర్టర్ నాటు పడవలో సాహస ప్రయాణం మరో గంటపాటు కాలినడక దారీతెన్నూ లేని ఐనాడను సందర్శించిన తొలి ఎమ్మెల్యే ఈశ్వరి పాడేరు మండలంలోని మారుమూల ప్రాంతమైన ఐనాడ పంచాయతీ అనేక ఏళ్ళుగా ప్రజాప్రతినిధులు, అధికారుల అలక్ష్యం వల్ల అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ పంచాయతీలోని 32 గ్రామాల్లో సుమారు 5 వేల మంది గిరిజనులు సమస్యలతో సహజీవనం సాగిస్తున్నారు. ఒక్క గ్రామానికి కూడా రహదారి సౌకర్యం లేదు. మండల కేంద్రానికి సుమారు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ పంచాయతీ గ్రామాలు దారి, తెన్ను లేని అడవి ప్రాంతంలో ఉన్నాయి. గిరిజనులు మండల కేంద్రానికి 6 మైళ్ళు అరణ్యంలో కాలిబాటలో నడిచి వస్తుంటారు. లేదంటే కోనాం రిజ ర్వాయర్‌లో నాటు పడవపై ప్రయాణించి చీడికాడ, వి.మాడుగుల మండలాల మీదుగా చుట్టూ తిరిగి పాడేరు చేరుకుంటారు. వర్షాకాలంలో రాకపోకలు చాలా కష్టం. 4 దశాబ్దాల క్రితమే ఐనాడ పంచాయతీ కేంద్రమైంది. కోనాం రిజర్వాయర్ ఒడ్డున ఉన్న ఐనాడకు రోడ్డు లేదు. మట్టిరోడ్డున్నా రవాణా యోగ్యంగా లేదు. ఆటోలు తిరగవు. అ త్యవసర పరిస్థితుల్లో నాటు పడవే వీరికి రవాణా సాధనం. లేదంటే నడిచి రావాల్సిందే. ఐటీడీఏ ఐనాడుకు ‘‘అభివృద్ధి బాట’’ వేయలేకపోయింది. అత్యవసర వైద్యసేవలు అందని పరిస్థితుల్లో గిరి జనులు మృత్యువాత పడుతున్న సంఘటనలను సాక్షి అనేకసార్లు వెలుగులోకి తెచ్చింది. ఇక్కడి గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ‘సాక్షి’ చేసిన ప్రయత్నంలో భాగంగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్పందించి ఐనాడ పంచాయతీకి నాటుపడవలో సాహసంగా వచ్చారు. సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి కాస్సేపు సాక్షి రిపోర్టర్‌గా మారిపోయారు. ఐనాడలో గిరిజనుల సమస్యలను తెలుసుకోవడానికి కదిలిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోనాం రిజర్వాయర్‌లో సాహసోపేతంగా నాటు పడవలో ప్రయాణం సాగించారు.ృఆమె వెంట వెళ్ళిన వారు కూడా పడవలో వెళ్ళడానికి భయపడ్డారు. కొందరు ఒడ్డునృ ఉండి పోయారు. ఈశ్వరి మాత్రం నాటు పడవలో ప్రయాణించి తెగువను ప్రదర్శించారు. 40 నిమిషాల పాటు నాటు పడవలో ప్రయాణం సాగించిన ఎమ్మెల్యే మరో గంటసేపు కాలినడకన కొండలెక్కి ఐనాడ వెళ్ళారు. అక్కడ గిరిజనుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఐనాడ సందర్శించిన ఈ నియోజకవర్గంపు తొలి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కావడం విశేషం. గిరిజనులతో వారి సమస్యలపై ఎమ్మెల్యే సంభాషణ ఈ విధంగా సాగింది! ఈశ్వరి: అవ్వా ఎలా ఉన్నావు? నీ పేరేంటి? మీ గ్రామంలో సమస్యలేమిటి? ఎం.లక్ష్మమ్మ: రోడ్డు లేక ఊరుదాటి ఎక్కడికి వెళ్ళ లేకపోతున్నాం. మందు, మాకు అవసొరమొచ్చినా కదల్లేకపోతున్నాం. బోటు ఎక్కలేం. నడక సాల్లేక పోతున్నాం. నువ్వే .. ఏదైనా సెయ్యాలి. ఈశ్వరి: నిత్యావసర సరుకులు సక్రమంగా అందుతున్నాయా? అశ్విని: వాటి కోసం కోనాం వెళుతున్నాం. గ్రామంలో డిఆర్ డిపో భవనం పునాదులతోనే ఆపేశారు. ఊరికి రోడ్డు లేకపోవడమే అన్నింటికి సమస్యగా ఉంది. మా ఊరొచ్చిన ఎమ్మెల్యే మీరొక్కరే. రోడ్డు వేయిస్తే రుణపడి ఉంటాం. ఈశ్వరి: వైద్యసేవలు అందుతున్నాయా? గ్రామానికి వైద్యసిబ్బంది వస్తున్నారా? సిరగం చెల్లమ్మ: నెలకోసారి వస్తున్నారు. జొరాలొచ్చినప్పుడు చూసేవాళ్ళే లేరు. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈశ్వరి: గర్భిణులను కాన్పుకోసం ఆస్పత్రులకు తీసుకెళుతున్నారా? సిరగం చెల్లమ్మ: డోలికట్టి చీడికాడ మండల కేంద్రంలోని ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు! గతేడాది నన్ను కాన్పుకోసం ఆస్పత్రికి తీసుకెళ్ళే సరికి నా కడుపులో మగబిడ్డ చనిపోయింది. అవసరానికి వైద్యసాయం అందడం లేదు. ఈశ్వరి: మంచినీటి సౌకర్యం ఉందా? వి.నారాయణమ్మ: తాగడానికి మంచినీరు దొరకడం లేదు. గెడ్డల్లో గాతలు, చెలమలు తవ్వి తాగునీళ్ళు తెచ్చుకుంటున్నాం. ఈశ్వరి: ఇందిరమ్మ గృహాలు నిర్మించుకున్నారా? కాసులమ్మ: డబ్బుల్లేక ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోలేకపోయాం. కొందరు పునాదులు వేసుకొని బిల్లు రాకపోవడంతో ఆపేసారు. చినబోయిన దేవి శ్లాబ్ వరకూ ఇల్లు పూర్తి చేసినా బిల్లు రాలేదు. కొంత మందికి ఇళ్ళు మంజూరు కాలేదు. తుపాను దెబ్బతిన్న ఇళ్ళకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఈశ్వరి: దీపం గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారా? చిన్నాలమ్మ: మాకెవరికి గ్యాస్ కనెక్షన్లు లేవమ్మా! ఇప్పుడు మంజూరు చేస్తే తీసుకుంటాం. ఈశ్వరి: కరెంట్ ఉంటుందా? చిన్నాలమ్మ: కరెంట్ ఉంది. ఎప్పుడైనా రిపేరైతే కొన్ని రోజులుండదు. ఈశ్వరి: ఏం పంటలు పండిస్తున్నారు. వాటిని ఎక్కడ అమ్ముతున్నారు? పి.రామారావు: సీతాఫలాలు, జీడిమామిడితోపాటు ఉసిరి, కరక్కాయ, కొండచీపుర్లు, కోవెల జిగురు సేకరిస్తున్నాం. మాడుగుల, కోనాం సంతలకు తీసుకు వెళుతున్నాం. రోడ్డు లేకపోవడం, వర్షాలు పడితే చాలా అవస్థలు పడుతున్నాం. గిట్టుబాటు రావడం లేదు. ఈశ్వరి: పంచాయతీ సమస్యలను ఎప్పుడైనా అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తారా? గెమ్మెలి నవరాజు: చాలాసార్లు చెప్పామమ్మా. ఒకసారి గ్రామంలోని కొంత మందిని కలిసి రోడ్డుకోసం అప్పటి మంత్రిని కోరాం. ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం గ్రామంలో మూడేళ్ళుగా పంచాయతీ భవనం, డిఆర్ డిపో, సబ్‌సెంటర్ల భవనాల నిర్మాణం మూడేళ్ళుగా పునాదులతోనే ఆగిపోయాయి. వీటిని పూర్తి చేయించాలి. ఈశ్వరి: ఐనాడ సమస్యలను కళ్ళారా చూశారు కదా! మీరేం చేస్తారు? పి.నూకరత్నం(జెడ్పీటీసీ): చాలా సమస్యలతో గిరిజనులు దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇలాంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మండలంలో ఐనాడ పంచాయతీ అభివృద్ధి ప్రాధన్యతనిచ్చి జెడ్పీ నిధులు మంజూరు చేయించి, కొన్ని సౌకర్యాలైనా కల్పించేందుకు కృషి చేస్తాను. -
ముహూర్తం ఖరారు
మే 10 నుంచి మోదకొండమ్మ ఉత్సవాలు మూడు రోజులు నిర్వహణ గ్రామ పెద్దల నిర్ణయం ఎమ్మెల్యే ఈశ్వరి ఆధ్వర్యంలో సమావేశం పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలను మే 10 నుంచి 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ చైర్పర్సన్, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధ్యక్షతన గ్రామ పెద్దలంతా గురువారం నిర్ణయించారు. ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, వర్తక సంఘం, రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆలయ పూజారి ముహూర్తాన్ని ఖరారు చేశారు మే 10,11,12 తేదీల్లో నిర్వహించేందుకు తీర్మానించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా నాగభూషణం ఉత్సవ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఇతర సభ్యులుగా మాజీ మంత్రులు ఎం.బాలరాజు, ఎం.మణికుమారి, పి.బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు జి.దేముడు, లకే రాజారావు,జెడ్పీ మాజీ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ, స్థలదాత లకే ఉమా మహేశ్వర పాత్రుడు, ఎంపీపీ వి.ముత్యాలమ్మ, సర్పంచ్ కిల్లు వెంకటరత్నం, మార్కెట్‌కమిటీ చైర్పర్సన్ బొర్రా విజయరాణి, పరిటాల నాగేశ్వరరావు, సీహెచ్ కాశీ విశ్వనాధం, బూరెడ్డి నాగేశ్వరరావు వ్యవహరిస్తారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా ఉపాధ్యాయులు కురుసా నాగభూషణం, ప్రధాన కార్యదర్శులుగా బత్తిన కృష్ణ, పూసర్ల గోపి, కోశాధికారులుగా మాగాపు కొండబాబు, ఇమ్మిడిసెట్టి అనీల్, న్యాయ సలహాదారులుగా బండారు వెంకటరమణ, ముఖ్య సలహాదారులుగా పీవీజీ కుమార్, రొబ్బా నాగభూషణరాజు, కె.గంగన్నపడాల్, బొర్రా నాగరాజు, సయ్యపురెడ్డి శ్రీను, ఉపాధ్యక్షులుగా పలాసి కృష్ణారావు, కొట్టగుల్లి సుబ్బారావు, ఎం.అప్పారావు, కె.రమేష్ నాయుడు, కె.ఈశ్వర ప్రసాద్, రొబ్బి శంకరరావు, ఎస్‌వివి రమణమూర్తి, బి.ఈశ్వరరావు, కొట్టగుల్లి రాజారావు, కె.పార్వతమ్మ, చల్లా రామకృష్ణ, కార్యదర్శులుగా డాక్టర్ లకే శివప్రసాద్పాత్రుడు, రొబ్బి రాము, కె.ఉమామహేశ్వరరావులు ఎంపికయ్యారు. వైభవంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే ఈశ్వరి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూఉత్సవాల విజయవంతానికి కమిటీకి అన్ని వర్గాల ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. ఘనంగా నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక నిర్వహిస్తున్న పండగ కావడంతో విజయవంతానికి పూర్తిస్థాయిలో పని చేస్తానన్నారు. ఉత్సవాలకు ముందే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానన్నారు. భక్తులకు అన్ని వసతులకు చర్యలు తీసుకుంటామన్నారు. మూడు రోజులు భారీ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ దీపాల అలంకరణలో కమిటీ రాజీపడరాదన్నారు. అన్ని విధాల సహకరించేలా ఐటీడీఏ, రెవెన్యూ, పోలీసు అధికారులతోనూ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే కోరారు. -
అన్నదాత ఆగ్రహం
⇒ రైతు సాధికార సదస్సులో నిరసన సెగలు ⇒ అధికారులను నిలదీసిన రైతులు ⇒ గోపాలపట్నంలో జరిగిన జిల్లా సదస్సుకు జనం కరవు ⇒ మొక్కుబడి ఏర్పాట్లపై మంత్రి గంటా మండిపాటు సాక్షి, విశాఖపట్నం: గోపాలపట్నం హైస్కూల్లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి రైతు సాధికార సదస్సు మొక్కుబడిగా సాగింది. రైతులు, బాధితులు నిరసన గళమెత్తారు. అధికారులను నిలదీశారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, సీహెచ్.అయ్యన్న పాత్రుడు, జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానితో పాటు ఎమ్మెల్యేలు గణబాబు, గణేష్‌కుమార్, విష్ణుకుమార్ రాజులు మినహా జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులంతా సదస్సుకు డుమ్మా కొట్టారు. జనం లేక ప్రాంగణం వెలవెలబోవడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు సదస్సు ప్రారంభం కాలేదు. సీఎం స్థాయి నాయకులు పాల్గొనే తరహాలో ఏర్పాట్లు చేసినా జన సమీకరణలేక వెలవెలబోయింది. చివరకు బలవంతంగా తరలించిన డ్వాక్రా సంఘ సభ్యులు, పాఠశాల విద్యార్థులతో కానిచ్చేశారు. ఈ సదస్సులను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తే మీరిలా మొక్కుబడిగా మార్చేస్తారా అంటూ మంత్రి గంటా తన ప్రసంగం ప్రారంభంలోనే అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీరిలా చేస్తారని అనుకోలేదు.. ఇందుకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోండంటూ కలెక్టర్‌ను ఆదేశించారు. అర్హుల జాబితాలేవి? ..అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే ఈశ్వరి అర్హుల జాబితాను ప్రదర్శించకుండా రైతు సాధికార సదస్సులు నిర్వహించడం వల్ల ప్రయోజనమేమిటంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధికారులపై మండిపడ్డారు. పాడేరు మండలం లగిసిపల్లి గ్రామంలో జరిగిన సదస్సులో పాల్గొన్న ఆమె జాబితాను ప్రదర్శించకుండా ఎంతమందికి ఎంత మేర మాఫీ చేశామో ఏ విధంగా చెప్పగలరని ప్రశ్నించారు. బేషరతుగా రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలని, లేకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రూ.50వేల లోపు రుణాలను ఒకేసారిమాఫీ చేస్తామని చెప్పినా ఏ ఒక్కరికి ఐదు పదివేల రూపాయలు మించి జమకాలేదని చెబుతున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇదే గ్రామంలో హుద్‌హుద్ తుపాను వల్ల తమ పంటలు పూర్తిగా దెబ్బతిన్న అర్హుల జాబితాలో మా పేర్లు లేవంటూ పలువురు బాధిత రైతులు సదస్సులోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్హుల జాబితా అవకతవకలమయం! నగర పరిధిలోని 50వ డివిజన్లో జరిగిన రైతు సాధికార సదస్సులో అధికార పార్టీ నేతలే ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. హుద్‌హుద్ సాయం పంపిణీ కోసం ఎంపిక చేసిన అర్హుల జాబితా అవకతవకలమయంగా ఉందంటూ మండిపడ్డారు. డివిజన్లో ఏడు వేల ఇళ్లు దెబ్బతింటే సగం మందికి కూడా అర్హుల జాబితాలో చోటు దక్కలేదని, వీరిలో కూడా సగం మందికి పరిహారం అందలేదని స్థానిక టీడీపీ నేతలు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎదుటే అధికారులను నిలదీశారు. డివిజన్లో 5వేల మంది అర్హులైన పింఛన్‌దారులుంటే కేవలం 1300 మందికి మాత్రమే ఇస్తున్నారని, ఇదెక్కడ న్యాయమో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని తక్షణమే ఈ అవకతవకలను సరి చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం, పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చోడవరం మండలం సీమనాపల్లిలో జరిగిన సదస్సులో మాకు రూ.50వేల లోపే రుణాలున్నప్పటికీ తొలి జాబితాలో మా పేర్లు ఎందుకు లేవో చెప్పాలని పలువురు రైతులు అధికారులను నిలదీశారు. తనకు రూ.20వేల లోపే రుణం ఉన్నప్పటికీ మాఫీ జాబితాలో లేదని అప్పలనాయుడు అనే రైతు అధికారుల ఎదుట వాపోయాడు. అర్హులైన మాకు పరిహారం ఇవ్వడం లేదని, ఒక్కసారి మా ఇళ్లకు, పంటపొలాలకు వచ్చి చూడాలంటూ పలువురు బాధితులు, రైతులు పద్మనాభం సదస్సులో అధికారులను నిలదీశారు. ఇదే రీతిలో జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.