ఐనాడా.. ఐనా వస్తా.. | Woman's Day Special | Sakshi
Sakshi News home page

ఐనాడా.. ఐనా వస్తా..

Published Sun, Mar 8 2015 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

ఐనాడా..  ఐనా వస్తా..

ఐనాడా.. ఐనా వస్తా..

ఉమెన్‌‌సడే  స్పెషల్  vip రిపోర్టర్
 
నాటు పడవలో సాహస ప్రయాణం
మరో గంటపాటు కాలినడక
దారీతెన్నూ లేని ఐనాడను సందర్శించిన తొలి ఎమ్మెల్యే ఈశ్వరి

 
పాడేరు మండలంలోని మారుమూల ప్రాంతమైన ఐనాడ పంచాయతీ అనేక ఏళ్ళుగా ప్రజాప్రతినిధులు, అధికారుల అలక్ష్యం వల్ల అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ పంచాయతీలోని 32 గ్రామాల్లో సుమారు 5 వేల మంది గిరిజనులు సమస్యలతో సహజీవనం సాగిస్తున్నారు. ఒక్క గ్రామానికి కూడా రహదారి సౌకర్యం లేదు. మండల కేంద్రానికి సుమారు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ పంచాయతీ గ్రామాలు దారి, తెన్ను లేని అడవి ప్రాంతంలో ఉన్నాయి. గిరిజనులు మండల కేంద్రానికి 6 మైళ్ళు అరణ్యంలో కాలిబాటలో నడిచి వస్తుంటారు. లేదంటే కోనాం రిజ ర్వాయర్‌లో నాటు పడవపై ప్రయాణించి చీడికాడ, వి.మాడుగుల మండలాల మీదుగా చుట్టూ తిరిగి పాడేరు చేరుకుంటారు. వర్షాకాలంలో రాకపోకలు చాలా కష్టం. 4 దశాబ్దాల క్రితమే ఐనాడ పంచాయతీ కేంద్రమైంది. కోనాం రిజర్వాయర్ ఒడ్డున ఉన్న ఐనాడకు రోడ్డు లేదు. మట్టిరోడ్డున్నా రవాణా యోగ్యంగా లేదు. ఆటోలు తిరగవు.

అ త్యవసర పరిస్థితుల్లో నాటు పడవే వీరికి రవాణా సాధనం. లేదంటే నడిచి రావాల్సిందే. ఐటీడీఏ ఐనాడుకు ‘‘అభివృద్ధి బాట’’ వేయలేకపోయింది. అత్యవసర వైద్యసేవలు అందని పరిస్థితుల్లో గిరి జనులు మృత్యువాత పడుతున్న సంఘటనలను సాక్షి అనేకసార్లు వెలుగులోకి తెచ్చింది. ఇక్కడి గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ‘సాక్షి’ చేసిన ప్రయత్నంలో భాగంగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్పందించి ఐనాడ పంచాయతీకి నాటుపడవలో సాహసంగా వచ్చారు. సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి కాస్సేపు సాక్షి రిపోర్టర్‌గా మారిపోయారు.
 
ఐనాడలో గిరిజనుల సమస్యలను తెలుసుకోవడానికి కదిలిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోనాం రిజర్వాయర్‌లో సాహసోపేతంగా నాటు పడవలో ప్రయాణం సాగించారు.ృఆమె వెంట వెళ్ళిన వారు కూడా పడవలో వెళ్ళడానికి భయపడ్డారు. కొందరు ఒడ్డునృ ఉండి పోయారు. ఈశ్వరి మాత్రం నాటు పడవలో ప్రయాణించి తెగువను ప్రదర్శించారు. 40 నిమిషాల పాటు నాటు పడవలో ప్రయాణం సాగించిన ఎమ్మెల్యే మరో గంటసేపు కాలినడకన కొండలెక్కి ఐనాడ వెళ్ళారు. అక్కడ గిరిజనుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఐనాడ సందర్శించిన ఈ నియోజకవర్గంపు తొలి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కావడం విశేషం. గిరిజనులతో వారి సమస్యలపై ఎమ్మెల్యే సంభాషణ ఈ విధంగా సాగింది!

ఈశ్వరి: అవ్వా ఎలా ఉన్నావు? నీ పేరేంటి? మీ గ్రామంలో సమస్యలేమిటి?

ఎం.లక్ష్మమ్మ: రోడ్డు లేక ఊరుదాటి ఎక్కడికి వెళ్ళ లేకపోతున్నాం. మందు, మాకు అవసొరమొచ్చినా కదల్లేకపోతున్నాం. బోటు ఎక్కలేం.  నడక సాల్లేక పోతున్నాం.  నువ్వే .. ఏదైనా సెయ్యాలి.

ఈశ్వరి: నిత్యావసర సరుకులు సక్రమంగా అందుతున్నాయా?
 
అశ్విని: వాటి కోసం కోనాం వెళుతున్నాం. గ్రామంలో డిఆర్ డిపో భవనం పునాదులతోనే  ఆపేశారు. ఊరికి రోడ్డు లేకపోవడమే అన్నింటికి సమస్యగా ఉంది. మా ఊరొచ్చిన ఎమ్మెల్యే మీరొక్కరే. రోడ్డు వేయిస్తే రుణపడి ఉంటాం.
 
ఈశ్వరి: వైద్యసేవలు అందుతున్నాయా? గ్రామానికి వైద్యసిబ్బంది వస్తున్నారా?

సిరగం చెల్లమ్మ: నెలకోసారి వస్తున్నారు. జొరాలొచ్చినప్పుడు చూసేవాళ్ళే లేరు. ఎవరూ పట్టించుకోవడం లేదు.
 
ఈశ్వరి: గర్భిణులను కాన్పుకోసం ఆస్పత్రులకు తీసుకెళుతున్నారా?
 
సిరగం చెల్లమ్మ: డోలికట్టి చీడికాడ మండల కేంద్రంలోని ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు! గతేడాది నన్ను కాన్పుకోసం ఆస్పత్రికి తీసుకెళ్ళే సరికి నా కడుపులో మగబిడ్డ చనిపోయింది. అవసరానికి వైద్యసాయం అందడం లేదు.
 
ఈశ్వరి: మంచినీటి సౌకర్యం ఉందా?


వి.నారాయణమ్మ:  తాగడానికి మంచినీరు దొరకడం లేదు. గెడ్డల్లో గాతలు, చెలమలు తవ్వి తాగునీళ్ళు తెచ్చుకుంటున్నాం.

ఈశ్వరి: ఇందిరమ్మ గృహాలు నిర్మించుకున్నారా?

కాసులమ్మ:  డబ్బుల్లేక ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోలేకపోయాం. కొందరు పునాదులు వేసుకొని బిల్లు రాకపోవడంతో ఆపేసారు. చినబోయిన దేవి శ్లాబ్ వరకూ ఇల్లు పూర్తి చేసినా బిల్లు రాలేదు. కొంత మందికి ఇళ్ళు మంజూరు కాలేదు. తుపాను దెబ్బతిన్న ఇళ్ళకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు.

ఈశ్వరి: దీపం గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారా?

చిన్నాలమ్మ: మాకెవరికి గ్యాస్ కనెక్షన్లు లేవమ్మా! ఇప్పుడు మంజూరు చేస్తే తీసుకుంటాం.
 
ఈశ్వరి: కరెంట్ ఉంటుందా?
 
చిన్నాలమ్మ: కరెంట్ ఉంది. ఎప్పుడైనా రిపేరైతే కొన్ని రోజులుండదు.
 
ఈశ్వరి: ఏం పంటలు పండిస్తున్నారు. వాటిని ఎక్కడ అమ్ముతున్నారు?

పి.రామారావు: సీతాఫలాలు, జీడిమామిడితోపాటు ఉసిరి, కరక్కాయ, కొండచీపుర్లు, కోవెల జిగురు సేకరిస్తున్నాం. మాడుగుల, కోనాం సంతలకు తీసుకు వెళుతున్నాం. రోడ్డు లేకపోవడం, వర్షాలు పడితే చాలా అవస్థలు పడుతున్నాం. గిట్టుబాటు రావడం లేదు.
 
ఈశ్వరి: పంచాయతీ సమస్యలను ఎప్పుడైనా అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తారా?

 
గెమ్మెలి నవరాజు: చాలాసార్లు చెప్పామమ్మా. ఒకసారి గ్రామంలోని కొంత మందిని కలిసి రోడ్డుకోసం అప్పటి మంత్రిని కోరాం. ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం గ్రామంలో మూడేళ్ళుగా పంచాయతీ భవనం, డిఆర్ డిపో, సబ్‌సెంటర్ల భవనాల నిర్మాణం మూడేళ్ళుగా పునాదులతోనే ఆగిపోయాయి. వీటిని పూర్తి చేయించాలి.
 
ఈశ్వరి: ఐనాడ సమస్యలను కళ్ళారా చూశారు కదా! మీరేం చేస్తారు?


పి.నూకరత్నం(జెడ్పీటీసీ): చాలా సమస్యలతో గిరిజనులు దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇలాంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మండలంలో ఐనాడ పంచాయతీ అభివృద్ధి ప్రాధన్యతనిచ్చి జెడ్పీ నిధులు మంజూరు చేయించి, కొన్ని సౌకర్యాలైనా కల్పించేందుకు కృషి చేస్తాను.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement