బాబు వస్తే... బడికి సెలవే
అరగంట దాటింది...ఇంతవరకూ బస్సు రాలేదు...అసలు వస్తుందా..రాదా అంటూ ఓ తల్లి పాఠశాలకు ఫోన్. సారీ...బస్సు బాబు మీటింగ్ కోసం జనాన్ని తరలించడానికి వెళ్ళింది...ఈ రోజు బస్సు రాదంటూ పాఠశాల నుంచి సమాధానం.
మీ బస్సు రాలేదు... టైం అవుతోందని మా పాపాయిని ఆటోలో పంపించా. పాపాయి ...బడికి చేరుకుందో లేదో వెంటనే కాస్త చూసి చెప్పండంటూ ఆందోళనతో మరో తల్లి ఫోన్. మీ పాపాయి వచ్చింది కానీ సీఎం సభకు బస్సులు వెళ్ళడంతో అత్యవసరంగా సెలవు నిర్ణయం తీసుకున్నాం. దీంతో విషయం తెలియజేయలేకపోయాం. సారీ..మీరు వచ్చి పాపాయిని తీసుకువెళ్ళండి... ఇలా ఒక్కో స్కూల్‌కు ఫోన్ల పరంపర సాగింది. దీనికి కారణం విద్యార్థులను తీసుకువెళ్లాల్సిన బస్సులన్నీ చలో చంద్రబాబు సభ బాట పట్టాయి. దీంతో విద్యార్థుల్లోను, తల్లిదండ్రుల్లోనూ ఒకటే టెన్షన్.
ఒంగోలు: బాబు వస్తే చాలు...బడికి సెలవే అన్నట్లుగా తయారైంది జిల్లాలో పరిస్థితి. రాష్ట్ర రవాణా శాఖా మంత్రి కూడా జిల్లావాసే కావడంతో రవాణా శాఖ అధికారులు తమ శక్తివంచన లేకుండా కృషి చేసి పార్టీ కార్యకర్తలకు భారం లేకుండా సాయం అందించారు. ప్రైవేటు యాజమాన్యాలపై పరోక్షంగా ఒత్తిడి తెచ్చి వారిచేతే కొండపిలో జరిగిన రైతు సాధికారత సదస్సులకు పాఠశాల బస్సులను తరలించారు. దీంతో అర్థ సంవత్సర పరీక్షలు జరగాల్సి ఉన్నా ప్రైవేటు విద్యా సంస్థలు పరీక్షలను వాయిదా వేసుకోవడం చూస్తుంటే బాబు వస్తారంటే చాలు...ఇక బడికి సెలవే అన్న నానుడి జోరందుకుంటోంది.
కనీసం ముందస్తు సమాచారం లేకుండా బస్సులు తరలించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ విషయం ముందుగా తెలియదని, రవాణాశాఖ అధికారులు బలవంతం చేయడంతో బస్సులు పెట్టక తప్పలేదనేది ప్రైవేటు విద్యా సంస్థల వాదన. ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం సృష్టించుకునేకంటే తల్లిదండ్రులకు ఏదోలా నచ్చజెప్పుకోవచ్చునన్న ధీమాతో అలా చేయాల్సి వచ్చిందని సంబంధిత ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి.
రైతులు రారని తెలిసే... ఆర్టీసీ బస్సులు కేటాయింపు
రుణమాఫీపై రైతులు ఇప్పటికే మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం వచ్చినా రైతులను సమీకరించడం కష్టం . అందువల్ల రైతు సాధికారత సదస్సుకు డ్వాక్రా మహిళలను తరలించాలని అధికారులు నిర్ణయించారు. అయితే దీనికి నేరుగా డ్వాక్రా మహిళలను తరలిస్తే డబ్బులకు లెక్కలు చూపించేందుకు కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో డ్వాక్రా మహిళలకు రుణాల పంపిణీని కూడా జత చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 105 కోట్ల రూపాయల చెక్కులను డ్వాక్రా మహిళలకు అందజేసే ఏర్పాటు చేశారు. దీంతో కనిగిరి, కందుకూరు, సింగరాయకొండ, పొన్నలూరు, చీమకుర్తిల నుంచి పదేసి బస్సుల చొప్పున 50 బస్సులను డీఆర్‌డీఏ ఏర్పాటు చేసింది. లెక్క ప్రకారమైతే రూ.7 లక్షలు వెచ్చించాల్సిందే.