అమేథీ ఏ తీరుగనుందో.. చూడు రాహుల్!
విదేశాల్లో 56 రోజుల పాటు అజ్ఞాతవాసం చేసి వచ్చిన అమేథీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చీ రాగానే దేశంలోని రైతుల సమస్యలను భుజానేసుకున్నారు. పార్లమెంట్ నిండుసభలో మోదీ ప్రభుత్వాన్ని 'మీది సూటు బూటు ప్రభుత్వం, కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నారు. రైతుల ప్రయోజనాలను విస్మరిస్తున్నారు' అంటూ తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో తెగ దులిపేశారు. కానీ ఆయన స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ నియోజకవర్గంలో రైతులు కన్నీళ్లు పెడుతుంటే, ఆకలేసి కేకలు పెడుతుంటే.. అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇది అచ్చంగా అమేథీ నియోజకవర్గంలోని సెమ్రా గ్రామస్థుల మాట.
ఈ గ్రామంలో అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా పంట నష్టపోయి దాదాపు 1100 మంది రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రాహుల్ గాంధీ స్వయంగా 2009, జనవరి 14వ తేదీన ఈ గ్రామాన్ని బ్రిటన్ మంత్రి డేవిడ్ మిలిబండ్‌తో కలిసి సందర్శించారు. అప్పుడు శివకుమారి గౌతమ్ అనే నలుగురు పిల్లల వితంతువు ఇంటిని సందర్శించి ఆమె కష్టసుఖాలు తెలుసుకున్నారు. అండగా తాను నిలబడతానని అప్పట్లో ఆమెకు భరోసా కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆమె వేసిన గోధుమ పంట అకాలవర్షాల కారణంగా దెబ్బతింది. దాదాపు ఆరువేల రూపాయలు పంటపై ఆమె పెట్టుబడి పెట్టగా కనీసం నయా పైసా కూడా ఆమెకు నష్టపరిహారం రాలేదు.
తన పరిస్థితి గురించి ఆమె జిల్లా అధికారులకు మొరపెట్టుకోగా, నాసిరకం పంటకు నష్టపరిహారం రాదంటూ పోపొమ్మన్నారు. ''రాహుల్ గాంధీని ఇంటికి రప్పించుకున్న గొప్పదానివి. నీకు సాయం చేయడం ఏమిటి ?'' అంటూ ఆపదలో ఆదుకోవాల్సిన బంధువులు గేలిచేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రైతులను ఆదుకుంటానని ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిలో ఏవీ నెరవేరలేదని కర్మాదేవి అనే మరో రైతు ఆరోపించారు.
ఇక అమేథీ జిల్లా కేంద్రానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలోని చతుర్భుజ్‌పూర్‌లో అమర్‌నాథ్ ప్రసాద్ యాదవ్ అనే రైతు అకాల వర్షాల వల్ల పంట నష్టపోయి గత మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు పెళ్లి కావాల్సిన నలుగురు కూతుళ్లు ఉన్నారు. చేతికి రావాల్సిన పంట చేజారి పోవడంతో చేసిన అప్పులు తీర్చేదారి లేక, పిల్లల భవిష్యత్తును తలుచుకొని యాదవ్ మరణించినట్టు ఆయన భార్య మీరాబాయి వాపోతోంది. యూపీ గనుల శాఖ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అమేథీ ఎమ్మెల్యే గాయత్రి ప్రసాద్ ప్రజాపతి గ్రామాన్ని సందర్శించి ఆమెకు ఆరువేల రూపాయలు ముట్టచెప్పి వెళ్లారు. తానున్న ఆ దశలో ఆ డబ్చు తీసుకున్నాను గానీ ఇప్పుడైతే ఎందుకు కొరగాని ఆ ఆరువేలను ఆయన ముఖానే విసిరి కొట్టేదాన్ననని ఆమె వ్యాఖ్యానించారు.
రాహుల్ మాట పక్కన పెడితే కనీసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా వచ్చి ఈ గ్రామంలోని రైతులను పలకరించలేదట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏడాదికి తలసరి సగటు కుటుంబ ఆదాయం 26,698 రూపాయలు ఉండగా, అమేథీ నియోజకవర్గంలో అది కేవలం 15,559 రూపాయలు ఉందంటే నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
-కేంద్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తాను రైతుల పక్షపాతినని చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ ఇంతవరకు పార్లమెంట్‌లో అమేథీ రైతుల గురించి ఎందుకు ప్రశ్నించలేదు? కనీసం ఆ నియోజకవర్గం ఎంపీగా కేంద్రానికి లేఖ కూడా రాయలేదే! రాయబరేలి రైతుల సమస్యలపై అఖిలేష్ యాదవ్‌కు సోనియా గాంధీ ఏప్రిల్ 2న లేఖ రాయడం ఇక్కడ గమనార్హం. 56 రోజుల అజ్ఞాతవాసంలో రాహుల్ ఏం నేర్చుకున్నారో తెలియదు గానీ, ఆయన తన అమేథీ నియోజకవర్గంలో ఆ రోజులు గడిపి ఉంటే రైతుల సమస్యలపై అవగాహన ఏర్పడేదన్నది నియోజకవర్గం ప్రజల మాట.