‘మాఫీ’పై ఇంత మాయా..! | In the context of loan waiver for farmers Chandrababu people fire | Sakshi
Sakshi News home page

‘మాఫీ’పై ఇంత మాయా..!

Published Sun, Dec 14 2014 12:32 AM | Last Updated on Mon, Oct 1 2018 4:52 PM

‘మాఫీ’పై ఇంత మాయా..! - Sakshi

‘మాఫీ’పై ఇంత మాయా..!

రుణమాఫీ అంశంలో చంద్రబాబు తీరుపై రైతుల నిప్పులు
హామీని విస్మరించారని ఆరోపణ
రైతు సాధికారత సదస్సులో కలెక్టర్‌కు ప్రశ్నల వర్షం

 
కె.కోటపాడు : రైతు సాధికారత సదస్సుకు హాజరైన కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్‌కు రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు. రుణమాఫీపై ఆయన మాట్లాడుతుండగా ఒక్కసారిగా కొందరు రైతులు లేచి మాఫీ తీరుపై మండిపడ్డారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు షరతులు లేకుండా వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి, ఇప్పుడు షరతులతో రైతులను మభ్యపెడతారా అంటూ నిప్పులు చెరిగారు. కె.కోటపాడు మండలం మేడచర్లలో శనివారం రైతు సాధికారత సదస్సు ఏర్పాటైంది. ఈ సదస్సుకు హాజరైన కలెక్టర్ తొలుత మాట్లాడుతూ రైతు రుణమాఫీ అమలుపై రైతుల సందేహాలకు వచ్చే సోమవారం నాటికి పూర్తిక్లారిటీ వస్తుం దని చెప్పారు. ఇంతలో మేడచర్ల గ్రామానికి చెందిన రైతులు పూడి ప్రకాశరావు, బొడ్డు రామారావు, బొడ్డు వెంకటరమణ తదితరులు లేచి మాట్లాడుతూ ప్రస్తుతం రుణమాఫీ విధానం వల్ల బ్యాంకుల్లో రుణాలు పొందిన చాలా మంది రైతులుమాఫీకి నోచుకోలేకపోయారన్నారు. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని రేషన్ కార్డు ప్రామాణికంతో చేస్తున్న రుణమాఫీ వల్ల కుటుంబంలో బ్యాంకు రుణాలు తీసుకున్న వారిలో ఒక్కరికే మాఫీ చేపట్టడం అన్యాయమన్నారు. బ్యాంకులకు గతంలో అన్ని వివరాలు అందించినా సదరు సిబ్బంది అప్‌లోడ్ సక్రమంగా చేపట్టకపోవడం వల్ల 2013 డిసెంబర్ 31లోగా రుణాలు పొందిన రైతులు రుణమాఫీకి నోచుకోలేదన్నారు. వీరికి కలెక్టర్ బదులిస్తూ అర్హులైన వారందరికీ మాఫీ వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు కలెక్టర్ మాట్లాడుతూ ఈ రుణమాఫీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు వర్తింపజేయడం జరుగుతుందన్నారు.

రుణమాఫీ అమలుకు నోచుకోని అర్హులైన వారు జనవరి 7లోగా ఫిర్యాదులు చేసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఆధార్‌తోనే అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు.  జిల్లాలో ప్రతి గ్రామాన్ని స్మార్ట్ విలేజ్‌గా అభివృద్ధి చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో ధనికులు ఆయా గ్రామాల అభివృద్ధికి ముందుకు రావాలని కోరారు. తుఫాన్ సమయంలో జిల్లాలో జరిగిన నష్టానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనట్టు చెప్పారు.  ఈ నష్టపరిహారాన్ని వారివారి ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఈ సదస్సులో ఎంపీడీవో పూర్ణిమాదేవి, ఎంపీపీ సబ్బవరపు పుష్పవతి, సర్పంచ్ పూడి చిట్టెమ్మ, ఎంపీటీసీ పూడి నారాయణమూర్తి, బొడ్డు తాతయ్యబాబులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement