మొక్కుబడి సదస్సులు
రుణవిముక్తి పత్రాల పంపిణీకే పరిమితం
రైతు సాధికారతపై హోరెత్తిన నిరసనలు
అన్నదాతల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులు
20 వేలకు పైగా అభ్యంతరాలు
రుణమాఫీపై రణరంగంలా సాగిన రైతుసాధికార సదస్సులు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 11న ప్రారంభమైన ఇవి షెడ్యూల్ ప్రకారం మంగళవారంతో ముగిసినప్పటికీ మిగిలిపోయిన పంచాయతీలు, వార్డుల్లో బుధవారం కూడా నిర్వహించారు. రుణవిముక్తి పత్రాల పంపిణీయే వీటి లక్ష్యమైనప్పటికీ గత నెలలో నిర్వహించిన ‘జన్మభూమి-మావూరు’ యాక్షన్ టేకెన్ ప్లాన్, స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్, ఖరీఫ్ సాగు, రబీ యాక్షన్ ప్లాన్‌పై చర్చించడం, రెండు నెలలుగా మిగిలిపోయిన పింఛన్లు, హుద్‌హుద్ సాయం పంపిణీ వంటి అంశాలను చేర్చారు. ఇవేవీ లేకుండానే మొక్కుబడిగా నిర్వహించారు. మెజార్టీ సదస్సులకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాదు కదా కనీసం స్థానిక ప్రజాప్రతినిధులు రాకపోవడంతో రైతుల నిరసనలను అధికారులే ఎదుర్కోవాల్సివచ్చింది.
విశాఖపట్నం: జిల్లాలోని 925 పంచాయితీలతో పాటు జీవీఎంసీ, నర్సీపట్నం, యలమంచలిమున్సిపాల్టీల్లోని వార్డుల్లో రైతుసాధికార సదస్సులు మొక్కుబడిగా నిర్వహించి అధికారులు అయిందనిపించారు. జిల్లాలో 1,30,979 రైతులకు రూ.349.34 కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో రూ.157.17కోట్లు సర్దుబాటు చేసింది. 50 వేలలోపు రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేస్తున్నామని, ఆపైన స్కేల్‌ఆఫ్ పైనాన్స్ పరిధిలో అర్హత పొందిన రుణమొత్తంలో 20 శాతం మాఫీమొత్తాన్ని తొలి విడతలో రైతుల ఖాతాలకు జమ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది. అయితే ఈ మొత్తం రుణాల వడ్డీకి కూడాసరిపోవడం లేదని రైతులు గగ్గోలుపెట్టారు. అలాగే గందరగోళంగా మారిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వ్యవహారంపై అన్నదాతలు ఈ సదస్సుల్లో గళమెత్తారు. రుణమాఫీ కాక అప్పుల ఊబిలో కూరుకు పోయిన డ్వాక్రామహిళలుసైతం ఈ సదస్సుల్లో తమ గళాన్ని వినిపించారు. నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లులో ఆంధ్రాబ్యాంకుకు తాళాలు వేసి మరీ నిరసన వ్యక్తం చేశారు. ఇదేపరిస్థితి దాదాపు 80శాతం సదస్సుల్లో కనిపించింది. వాస్తవానికి తొలివిడతలో రుణమాఫీకి అర్హులైన 1,30,979 మందికి రుణవిముక్తి కార్డులు పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ ఈ సదస్సుల్లో కేవలం 22,069 మందికి పంపిణీ చేశారు. ప్రచార ఆర్భాటంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 3.35 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామన్నారు. కానీ ఈ సదస్సుల్లో కేవలం16,212 మందికి రూ.1.84 కోట్లు విలువైన పింఛన్లు మాత్రమే పంపిణీ చేశారు. మిగిలినవారికి పోస్టల్ ద్వారా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సదస్సుల్లో స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దేందుకు 676 పంచాయతీలు అంగీకరించగా, 59 వ్యతిరేకించాయి. ఇక 86 పంచాయతీలను స్థానిక ప్రజాప్రతినిధులు, 22 పంచాయతీలను అధికారులు, మరో 86 పంచాయతీలను ఎన్‌ఆర్‌ఐలు దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు.
ఇక హుద్‌హుద్ వల్ల దెబ్బతిన్న 5,66,495 బాధితులు, రైతులకు రూ.320.41కోట్ల సాయం పంపిణీ చేస్తున్నట్టుగా ప్రకటించిన ప్రభుత్వం తీరా సదస్సులు పూర్తయ్యే సరికి కేవలం రూ.44.96కోట్ల సాయం పంపిణీకి సంబంధించిన ప్రొసీడింగ్ ఆర్డర్స్ మాత్రమే ఇవ్వగలిగింది. జన్మభూమి యాక్షన్ టేకెన్ ప్లాన్‌పై 704 గ్రామాల్లో అనుకూలంగా, 31 గ్రామాల్లో వ్యతిరేకంగా అభిప్రాయాలు వచ్చాయి. ఇక ఈ సదస్సు ల్లో సుమారు 20వేలకు పైగా అభ్యంతరాలు రైతుల నుంచి వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. వీటిలో ఎక్కువగా 50వేల లోపు రుణాలున్న వారు తమకు తక్కువ మొత్తమే జమైందని ఫిర్యాదు చేయగా, మిగిలిన వారిలో ఎక్కువ మంది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ విషయంలో తమకు అన్యాయం జరిగిందని మొరపెట్టు కున్నారు. ఈసదస్సుల్లో ఎక్కడికక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు, మహిళల తమ నిరసన గళం విన్పించారు.