మెదక్ నూతన జిల్లాగా అవతరించి నేటితో రెండేళ్లు పూర్తయింది. పలువురు అభివృద్ధి జరిగిందని ఆనందపడుతుంటే.. కొందరు మాత్రం మరిన్ని కష్టాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాటుకు ముందు ప్రతీ పనికి సంగారెడ్డికి పరుగులు తీయాల్సిన పరిస్థితి. దీంతో అభివృద్ధి ఆమడ దూరంలో ఉండేది. దూరాభారంతో ప్రజలకు అనేక ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రత్యేక జిల్లా కోసం డిమాండ్ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనతో మెదక్ ప్రాంత ప్రజల చిరకాల కల నెరవేరింది. 11 అక్టోబర్, 2016లో తెలంగాణ చిత్రపటంపై మెదక్ ప్రత్యేక జిల్లాగా అవతరించింది. అప్పటి నుంచి ప్రజలకు పాలన చేరువైంది.
సాక్షి, మెదక్: ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయిన తర్వాత మెదక్ వడివడిగా అభివృద్ధి వైపు పయనిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా జిల్లా అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. దీంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసింది. జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. అలాగే కొత్తగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా శంకుస్థాపన చేశారు.
అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. జిల్లాను అధికారుల, సిబ్బంది కొరత వేధిస్తోంది. పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, 157 కొత్త పంచాయతీలను కూడా ఏర్పాటు చేసింది. కాగా ప్రతిపక్ష పార్టీలు మాత్రం మెదక్ జిల్లా ఏర్పడినా సమస్యలు మాత్రం ఎక్కడిక్కడే ఉన్నాయని విమర్శిస్తున్నాయి. యువతకు ఉపాధి కల్పన, ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం అమలులో అమలులో ప్రభుత్వం విఫలమైందని విపక్ష పార్టీలు చెబుతున్నాయి.
భారీగా నిధులు ..
నూతన కలెక్టరేట్‌ను రూ.60.62 కోట్లతో నిర్మిస్తున్నారు. ఆర్‌ఆండ్‌బీ, పంచాయతీరాజ్‌శాఖ ద్వారా జిల్లాలో రహదారుల, భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.300 కోట్ల నిధులు విడుదల చేసింది. రూ.47 కోట్ల వ్యయంతో బాలానగర్–నర్సాపూర్–మెదక్ జాతీయ రహదారి నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. సంగారెడ్డి–అకోలా జాతీయరహదారి నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. మెదక్ చుట్టూరా రింగ్‌రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మెదక్‌లో రూ.2.25 కోట్లతో ఆధునిక రైతుబజార్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మెదక్, నర్సాపూర్, తూప్రాన్‌లో మినీట్యాంక్‌బండ్‌ల నిర్మాణం సాగుతోంది. ఇటీవలే మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్ల యుడీఎస్‌ఎంటీ నిధులు మంజూరు చేసింది.
రైతు సంక్షేమానికి ప్రాధాన్యం
వ్యవసాయ ప్రధానమైన జిల్లాలో సాగునీటి రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. రైతు పొలాలకు సాగునీరు అందించేందుకు వీలుగా ఘనపురం ఎత్తు పెంచటంతోపాటు మిషన్‌కాకతీయ ద్వారా చెరువులు, కుంటల మరమ్మతులు చేస్తున్నారు. ఘనపురం ప్రాజెక్టు ఎత్తుపెంచేందుకు రూ.100 కోట్ల నిధులు కేటాయించగా పనులు కొనసాగుతున్నాయి. మిషన్‌కాకతీయ ద్వారా రూ.456 కోట్లతో 1893 చెరువులు, కుంటల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల భూసేకరణ జరుగుతోంది. మంజీరా నదిపై రూ.94 కోట్లతో 14 చెక్‌డ్యామ్‌లు నిర్మించనున్నారు. ప్రతిష్టాత్మకమైన కంటివెలుగు పథకానికి సీఎం కేసీఆర్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు.
ఎక్కడి పనులు అక్కడే..
కొత్త జిల్లా ఏర్పడినా.. అభివృద్ధి మాత్రం ఎక్కడవేసిన గొంగడి అక్కడే ఉందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. నిధుల విడుదల్లో జాప్యం, పర్యవేక్షణలోపం తదితర కారణాలతో జిల్లాలో పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. చాలాచోట్ల రహదారు నిర్మాణం పనులు ఆశించిన స్థాయిలో సాగని పరిస్థితి ఉంది. మిషన్‌భగీరథ పనులు కూడా పలు చోట్ల నత్తనడకన సాగుతున్నాయి. ఆగస్టు నాటికి ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఘనపురం ఆనకట్ట ఎత్తుపెంపు పనులు ముందుకు సాగడం లేదని, మిషన్ కాకతీయ పనులు ఆశించిన స్థాయిలో అమలు కాకపోవటంపైనా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ, యువతకు ఉపాధి, పరిశ్రమల ఏర్పాట్లులో ప్రభుత్వం విఫలమైందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
ఒక్క పరిశ్రమలేదు..
నర్సాపూర్: జిల్లా ఏర్పాటుతో సంతోషం మిగిలిందికాని ఎలాంటి అభివృద్ధి జరగకలేదు. ఇక్కడ ఉన్న పరిశ్రమలను తరలించారు. జిల్లా ఏర్పాటు తర్వాత ఒక్క పరిశ్రమ కూడ జిల్లాకు రాలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ జిల్లాకే తలమానికం కాగా ఎన్నికల్లో హామీ ఇచ్చి కొత్త జిల్లా ఏర్పడ్డాక సైతం వాటిని తెరిపించడంలో ప్రభుత్వం విఫలమైంది. జిల్లా కేంద్రంలోని అథ్లెటిక్ కేంద్రం ఇతర జిల్లాలకు తరలించారు. జిల్లా రైతులకు దక్కాల్సిన సింగూర్ జలాలు ఇతర జిల్లాకు తరలిపోయాయి. ఘనపురం ఆనకట్టకింద రైతులు పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు. నర్సాపూర్‌లోని పీజీ కళాశాలలో ఉన్న కోర్సులు తగ్గించారు. –ఎ మల్లేశం, సీపీఎం జిల్లా కార్యదర్శి
ప్రజలకు ఒరిగిందేమీ లేదు
నర్సాపూర్: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ప్రభుత్వ శాఖలలో ఉద్యోగుల భర్తీ చేయకపోవడంతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినప్పటికి డివిజన్ కేంద్రాల్లో ఉండాల్సిన ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేయలేదు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. –ఖాలెక్, సీపీఐ జిల్లా కార్యదర్శి
అభివృద్ధిలో వెనుకబాటు
నర్సాపూర్: కొత్త జిల్లా ఏర్పాటు చేసిన ప్రభుత్వం అభివృద్ధిని మాత్రం పట్టించుకోలే దు. రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తానని స్వయంగా ప్రకటించినప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదు. జిల్లా, డివిజన్, మండల ఏర్పాటులో అన్నిశాఖలలో ఉద్యోగులు ఖాళీలే దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల విభజనతో కొన్ని మండలాలు అటు ఇటుగా మారడంతో ప్రజలకు కొత్త చిక్కులు వచ్చాయి. – మాజీ ఎమ్మెల్యే సునీతారెడ్డి,డీసీసీ అధ్యక్షురాలు
ప్రగతి వైపు అడుగులు
నర్సాపూర్: కొత్త జిల్లా ఏర్పాటుతో జిల్లా వాసుల కల నెరవేరింది. పరిపాలన ప్రజల చెంతకు చేరింది. జిల్లా ప్రగతి వైపు పయనిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కొత్త జిల్లాలో జిల్లా కలెక్టర్, ఎస్సీ ప్రజలకు అందుబాటులో ఉండగా ప్రజల చెంతకు పరిపాలన వచ్చింది. పరిపాలనతోపాటు లాండ్‌ఆర్డర్ అందుబాటులో ఉంది. ప్రభుత్వం చేపట్టిన భూప్రక్షాళ, పాస్‌బుక్కుల పంపిణీ రైతుబంధు, రైతుబీమ తదితర అభివృద్ధి కార్యక్రమాలు సులభ తరమైయ్యాయి. –మురళీధర్‌యాదవ్, టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment