revenu division
-
మూడో ఏడాదిలోకి ‘మెదక్ జిల్లా’
మెదక్ నూతన జిల్లాగా అవతరించి నేటితో రెండేళ్లు పూర్తయింది. పలువురు అభివృద్ధి జరిగిందని ఆనందపడుతుంటే.. కొందరు మాత్రం మరిన్ని కష్టాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాటుకు ముందు ప్రతీ పనికి సంగారెడ్డికి పరుగులు తీయాల్సిన పరిస్థితి. దీంతో అభివృద్ధి ఆమడ దూరంలో ఉండేది. దూరాభారంతో ప్రజలకు అనేక ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రత్యేక జిల్లా కోసం డిమాండ్ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనతో మెదక్ ప్రాంత ప్రజల చిరకాల కల నెరవేరింది. 11 అక్టోబర్, 2016లో తెలంగాణ చిత్రపటంపై మెదక్ ప్రత్యేక జిల్లాగా అవతరించింది. అప్పటి నుంచి ప్రజలకు పాలన చేరువైంది. సాక్షి, మెదక్: ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయిన తర్వాత మెదక్ వడివడిగా అభివృద్ధి వైపు పయనిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా జిల్లా అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. దీంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసింది. జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. అలాగే కొత్తగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా శంకుస్థాపన చేశారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. జిల్లాను అధికారుల, సిబ్బంది కొరత వేధిస్తోంది. పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, 157 కొత్త పంచాయతీలను కూడా ఏర్పాటు చేసింది. కాగా ప్రతిపక్ష పార్టీలు మాత్రం మెదక్ జిల్లా ఏర్పడినా సమస్యలు మాత్రం ఎక్కడిక్కడే ఉన్నాయని విమర్శిస్తున్నాయి. యువతకు ఉపాధి కల్పన, ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం అమలులో అమలులో ప్రభుత్వం విఫలమైందని విపక్ష పార్టీలు చెబుతున్నాయి. భారీగా నిధులు .. నూతన కలెక్టరేట్‌ను రూ.60.62 కోట్లతో నిర్మిస్తున్నారు. ఆర్‌ఆండ్‌బీ, పంచాయతీరాజ్‌శాఖ ద్వారా జిల్లాలో రహదారుల, భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.300 కోట్ల నిధులు విడుదల చేసింది. రూ.47 కోట్ల వ్యయంతో బాలానగర్–నర్సాపూర్–మెదక్ జాతీయ రహదారి నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. సంగారెడ్డి–అకోలా జాతీయరహదారి నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. మెదక్ చుట్టూరా రింగ్‌రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మెదక్‌లో రూ.2.25 కోట్లతో ఆధునిక రైతుబజార్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మెదక్, నర్సాపూర్, తూప్రాన్‌లో మినీట్యాంక్‌బండ్‌ల నిర్మాణం సాగుతోంది. ఇటీవలే మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్ల యుడీఎస్ఎంటీ నిధులు మంజూరు చేసింది. రైతు సంక్షేమానికి ప్రాధాన్యం వ్యవసాయ ప్రధానమైన జిల్లాలో సాగునీటి రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. రైతు పొలాలకు సాగునీరు అందించేందుకు వీలుగా ఘనపురం ఎత్తు పెంచటంతోపాటు మిషన్‌కాకతీయ ద్వారా చెరువులు, కుంటల మరమ్మతులు చేస్తున్నారు. ఘనపురం ప్రాజెక్టు ఎత్తుపెంచేందుకు రూ.100 కోట్ల నిధులు కేటాయించగా పనులు కొనసాగుతున్నాయి. మిషన్‌కాకతీయ ద్వారా రూ.456 కోట్లతో 1893 చెరువులు, కుంటల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల భూసేకరణ జరుగుతోంది. మంజీరా నదిపై రూ.94 కోట్లతో 14 చెక్‌డ్యామ్‌లు నిర్మించనున్నారు. ప్రతిష్టాత్మకమైన కంటివెలుగు పథకానికి సీఎం కేసీఆర్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. ఎక్కడి పనులు అక్కడే.. కొత్త జిల్లా ఏర్పడినా.. అభివృద్ధి మాత్రం ఎక్కడవేసిన గొంగడి అక్కడే ఉందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. నిధుల విడుదల్లో జాప్యం, పర్యవేక్షణలోపం తదితర కారణాలతో జిల్లాలో పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. చాలాచోట్ల రహదారు నిర్మాణం పనులు ఆశించిన స్థాయిలో సాగని పరిస్థితి ఉంది. మిషన్‌భగీరథ పనులు కూడా పలు చోట్ల నత్తనడకన సాగుతున్నాయి. ఆగస్టు నాటికి ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఘనపురం ఆనకట్ట ఎత్తుపెంపు పనులు ముందుకు సాగడం లేదని, మిషన్ కాకతీయ పనులు ఆశించిన స్థాయిలో అమలు కాకపోవటంపైనా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ, యువతకు ఉపాధి, పరిశ్రమల ఏర్పాట్లులో ప్రభుత్వం విఫలమైందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఒక్క పరిశ్రమలేదు.. నర్సాపూర్: జిల్లా ఏర్పాటుతో సంతోషం మిగిలిందికాని ఎలాంటి అభివృద్ధి జరగకలేదు. ఇక్కడ ఉన్న పరిశ్రమలను తరలించారు. జిల్లా ఏర్పాటు తర్వాత ఒక్క పరిశ్రమ కూడ జిల్లాకు రాలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ జిల్లాకే తలమానికం కాగా ఎన్నికల్లో హామీ ఇచ్చి కొత్త జిల్లా ఏర్పడ్డాక సైతం వాటిని తెరిపించడంలో ప్రభుత్వం విఫలమైంది. జిల్లా కేంద్రంలోని అథ్లెటిక్ కేంద్రం ఇతర జిల్లాలకు తరలించారు. జిల్లా రైతులకు దక్కాల్సిన సింగూర్ జలాలు ఇతర జిల్లాకు తరలిపోయాయి. ఘనపురం ఆనకట్టకింద రైతులు పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు. నర్సాపూర్‌లోని పీజీ కళాశాలలో ఉన్న కోర్సులు తగ్గించారు. –ఎ మల్లేశం, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రజలకు ఒరిగిందేమీ లేదు నర్సాపూర్: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ప్రభుత్వ శాఖలలో ఉద్యోగుల భర్తీ చేయకపోవడంతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినప్పటికి డివిజన్ కేంద్రాల్లో ఉండాల్సిన ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేయలేదు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. –ఖాలెక్, సీపీఐ జిల్లా కార్యదర్శి అభివృద్ధిలో వెనుకబాటు నర్సాపూర్: కొత్త జిల్లా ఏర్పాటు చేసిన ప్రభుత్వం అభివృద్ధిని మాత్రం పట్టించుకోలే దు. రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తానని స్వయంగా ప్రకటించినప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదు. జిల్లా, డివిజన్, మండల ఏర్పాటులో అన్నిశాఖలలో ఉద్యోగులు ఖాళీలే దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల విభజనతో కొన్ని మండలాలు అటు ఇటుగా మారడంతో ప్రజలకు కొత్త చిక్కులు వచ్చాయి. – మాజీ ఎమ్మెల్యే సునీతారెడ్డి,డీసీసీ అధ్యక్షురాలు ప్రగతి వైపు అడుగులు నర్సాపూర్: కొత్త జిల్లా ఏర్పాటుతో జిల్లా వాసుల కల నెరవేరింది. పరిపాలన ప్రజల చెంతకు చేరింది. జిల్లా ప్రగతి వైపు పయనిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కొత్త జిల్లాలో జిల్లా కలెక్టర్, ఎస్సీ ప్రజలకు అందుబాటులో ఉండగా ప్రజల చెంతకు పరిపాలన వచ్చింది. పరిపాలనతోపాటు లాండ్ఆర్డర్ అందుబాటులో ఉంది. ప్రభుత్వం చేపట్టిన భూప్రక్షాళ, పాస్బుక్కుల పంపిణీ రైతుబంధు, రైతుబీమ తదితర అభివృద్ధి కార్యక్రమాలు సులభ తరమైయ్యాయి. –మురళీధర్‌యాదవ్, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు -
పత్తికొండను రెవిన్యూ డివిజన్ చేస్తాం
–డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కృష్ణగిరి: డోన్‌తోపాటు పత్తికొండను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. మండల పరిధిలోని మన్నెకుంట, ఎస్‌హెచ్‌ఎర్రగుడి గ్రామాల్లో సోమవారం జరిగిన జనచైతన్యయాత్రల్లో ఆయన పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. డోన్ రెవిన్యూ డివిజన్లో పత్తికొండను కలుపకుండా పత్తికొండనే రెవిన్యూ డివిజన్ తప్పక చేస్తామన్నారు. పొదుపు సంఘాల బలోపేతానికి వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు గుడిసె కృష్ణమ్మ, కేఈ శ్యాంబాబు, ఎంపీపీ సుంకులమ్మ, జడ్పీటీసీ లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు. -
పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి
∙ర్యాలీలతో హోరెత్తిన పోరుగడ్డ ∙జేఏసీ బంద్ సంపూర్ణం ∙స్తంభించిన జనజీవనం పరకాల: పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని పార్టీలకతీతంగా ప్రజలు నినదించారు. ర్యాలీలు, రాస్తారోకోలతో పోరుగడ్డ హోరెత్తింది. జేఏసీ, డివిజన్ సాధన సమితి ఇచ్చిన బంద్ శనివారం విజయవంతమైంది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా పాల్గొని తమ ఆకాంక్షను తెలిపారు. బంద్ సందర్భంగా పట్టణంలోని బట్టల దుకాణాలు, విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, పెట్రోల్‌బంక్‌లు, కిరాణషాపులు, హోటళ్లు మూతపడ్డాయి. బంద్‌లో జనజీవనం స్తంభించింది. వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, డీవైఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుంచి ఆర్టీసీ డిపోవరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు నక్క చిరంజీవి, దుప్పటి సాంబయ్య మాట్లాడుతూ నాడు చందూలాల్ ప్రాంతీయ అభిమానంతో ఆర్డీవో కార్యాలయాన్ని తరలించుకుపోయారన్నారు. కార్యక్రమంలో నాయకులు ఇల్లందుల రాములు, మహేందర్, కృష్ణంరాజు, మల్లయ్య, చంద్రమౌళి, వినయ్, కళ్యాణ్, రమేష్, సంజీవ్, ఐలయ్య, కుమార్, భద్రయ్య పాల్గొన్నారు. న్యాయవాద జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో.. రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ న్యాయవాద జేఏసీ ఆధ్వర్యంలో పరకాల–హన్మకొండ ప్రధానరోడ్డుపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ డివిజన్ కోసం ప్రజాప్రతినిధులు ప్రయత్నించాలన్నారు. విజయపాల్‌రెడ్డి, వెంకటరమణ, చంద్రమౌళి, శ్రీనివాస్, పరమేశ్వర్, సుదర్శన్‌రెడ్డి, రమేష్ పాల్గొన్నారు. డివిజన్ ప్రకటించే వరకు పోరాటం ఆపేది లేదు : ‘ఇనుగాల’ పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించే వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంకట్రామ్రెడ్డి స్పష్టం చేశారు. డివిజన్ ఏర్పాటు కోసం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నగర పంచాయతీ వద్ద ఇనుగాల శనివారం 48 గంటల నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ నుంచి ర్యాలీగా వచ్చి దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రెవెన్యూ డివిజన్ కోసం పోరాడడం లేదన్నారు. గతంలో ఉన్న హోదానే తిరిగి కల్పించాలని కోరుతున్నామన్నారు. భవిష్యత్‌లో మూడు జిల్లాలకు కేంద్రం కాబోతున్న పరకాలను డివిజన్‌గా ప్రకటించాలన్నారు. ఈ విషయంలో స్పీకర్ మధుసూధనాచారి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిల వైఖరిని స్పష్టం చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి అనుకూల ప్రకటన రాకపోతే అధికార పార్టీ ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరుగనివ్వమని హెచ్చరించారు. పుట్టగతులుండవ్ : గన్నోజు శ్రీనివాసచారి, టీడీపీ ఇన్చార్జి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేయకపోతే ఎమ్మెల్యే ధర్మారెడ్డికి పుట్టగతులుండవని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గన్నోజు శ్రీనివాసచారి అన్నారు. ఇనుగాల చేపట్టిన నిరవధిక దీక్షను సందర్శించి సంఘీభావం ప్రకటించారు. దీక్షల్లో పట్టణ అధ్యక్షుడు బండి సారంగపాణి, డీసీసీ ప్రధాన కార్యదర్శి బొచ్చు కష్ణారావు, పీఏపీఎస్ చైర్మన్ కట్కూరి దేవేందర్‌రెడ్డి, ఆత్మకూరు జెడ్పీటీసీ లేతాకుల సంజీవరెడ్డి, ఓడీసీఎంఎస్ వైస్ చైర్మన్ గోల్కొండ సదానందం, పి.సంతోష్, రజాక్, శ్రీనివాస్, శ్రీను, రమేష్, రఘుపతి, సాంబశివుడు, సుమన్ పాల్గొన్నారు. దీక్షకు పలువురి సంఘీభావం ఇనుగాల చేపట్టిన దీక్షకు బీజేపీ నుంచి మేకల రాజవీరు, కానుగుల గోపినాథ్, ఆర్పీ జయంత్‌లాల్, సీపీఐ నుంచి దుప్పటి సాంబయ్య, సీపీఎం నుంచి నక్క చిరంజీవి, బీఎంఎస్ నుంచి జనార్ధన్‌రావు, నాన్‌పొలిటికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ శ్రీనివాసచారి, కిరాణావర్తక సం ఘం, ఫర్టిలైజర్స్ వ్యా పారులు, బట్టల వర్తక సంఘం, పా¯Œషాపు యాజమానుల సంఘం, నాÄæూబ్రాహ్మణుల సంఘం, పండ్ల వ్యాపారులు, ఆర్యవైశ్య సంఘం, నగర పంచాయతీ కార్మికులు సంఘీభావం ప్రకటించారు. -
హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ సాధిస్తా
ఎమ్మెల్యే వి.సతీష్‌కుమార్ హుస్నాబాద్‌రూరల్ : హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్ చేసి సిద్దిపేట జిల్లాలో కలపనున్నట్లు ఎమ్మెల్యే వి.సతీష్‌కుమార్ తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హుస్నాబాద్‌లో అఖిలపక్షం నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకుంటే అత్యధికంగా రెవెన్యూ డివిజన్ చేసి సిద్దిపేటలో కొనసాగించాలని చెప్పినట్లు స్పష్టం చేశారు. మద్దూరు, చేర్యాల, నంగునూర్, కోహెడ, హుస్నాబాద్, హుస్నాబాద్ కొత్త మండలంతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఏదేమైనా హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ సాధిస్తామని హామీ ఇచ్చారు. జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపీపీలు భూక్య మంగ, సంగ సంపత్, ఉప్పుల స్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ లింగాల సాయన్న, కోహెడ జెడ్పీటీసీ పొన్నాల లక్ష్మణ్, వైస్ ఎంపీపీ రాంగోపాల్‌రావు, పార్టీ మండలాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, బీలునాయక్ పాల్గొన్నారు. -
కోరుట్ల..రెవెన్యూ డివిజన్!
ప్రభుత్వ ప్రతిపాదనలు.. నేతలపైనే మెట్పల్లి ఆశలు కోరుట్ల : ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న కోరుట్ల పట్టణం.. త్వరలోనే రెవెన్యూ డివిజన్ హోదా సంతరించుకోనుంది. కొత్తగా ఏర్పాటుకానున్న జగిత్యాల జిల్లాలో రెండో రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కోరుట్ల ఆవిర్భవించనుంది. డివిజన్ కేంద్రాల కోసం కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం చివరకు కోరుట్లకే మెుగ్గుచూపింది. జనాభా, భౌగోళిక పరిస్థితులు, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం, సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ, ప్రభుత్వ భూముల లభ్యత అంశాలను దృష్టిలో ఉంచుకుని కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా మార్చడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీంతో కోరుట్ల ప్రాంతవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. డివిజన్ స్వరూపం ఇదీ.. కొత్తగా ఏర్పాటయ్యే జగిత్యాల జిల్లా కేంద్రానికి కోరుట్ల 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోరుట్ల, మెట్పల్లి అర్బన్, రూరల్ మండలాలతోపాటు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలాపూర్, మేడిపల్లి మండలాలు కోరుట్ల డివిజన్లో చేర్చే ప్రతిపాదనలున్నాయి. రెవెన్యూ డివిజన్ పరిధిలో మూడు లక్షల పైచిలుకు జనాభా ఉంది. చుట్టుపక్కల ఉన్న మండలాలు అన్నింటికి కోరుట్ల పట్టణం సుమారు 20–25 కిలోమీటర్ల లోపు దూరంలో ఉంటుంది. కోరుట్లలో సుమారు ఎనిమిది వందల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. పశువైద్య కళాశాల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల పరిసరాల్లో డివిజన్ కేంద్రానికి చెందిన కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. దీంతోపాటు కోరుట్ల ఎమ్మెల్యే క్వార్టర్ నిర్మాణానికి ప్రతిపాదించిన ఎస్సారెస్పీ క్వార్టర్ల సమీపంలో అనుకూలంగా ఉన్న స్థలాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. మూడేళ్లుగా ఉద్యమాలు మొదట జిల్లా కేంద్రం కోసం మూడేళ్ల క్రితం కోరుట్లలో ఉద్యమం మొదలైంది. కరీంనగర్–నిజామాబాద్ జిల్లాలకు మధ్యలో ఉన్న కోరుట్లను జిల్లాగా మార్చాలని అనేక నిరసన కార్యక్రమాలు జరిగాయి. సీఎం కేసీఆర్ జగిత్యాల ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ఉద్యమ దిశను మార్చుకున్న సాధన సమితి కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం పోరు మొదలెట్టింది. కోరుట్లలో జిల్లా సాధన ఉద్యమం ప్రారంభమైన కొన్నాళ్లకే మెట్పల్లిలో డివిజన్ సాధన కోసం ఉద్యమం ఊపందుకుంది. స్వాతంత్య్రోద్యమం, నిజాం కాలం నుంచి చారిత్రక ప్రాధాన్యత కల్గి ఉండటంతోపాటు భౌగోళికంగా మెట్పల్లి డివిజన్ ఏర్పాటుకు అనుకూలమని సాధన సమితి ప్రతినిధులు ఉద్యమాన్ని ఉధృతంగా సాగించారు. ఈ క్రమంలో ఒకే సెగ్మెంట్లో ఉన్న కోరుట్ల, మెట్పల్లి పట్టణాల మధ్య డివిజన్ కేంద్రం కోసం పోరు మొదలైంది. ఎక్కడిక్కడే ఉద్యమాలు జోరుగా సాగాయి. చివరికి ప్రభుత్వం కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ప్రతిపాదిస్తూ తీసుకున్న నిర్ణయం మెట్పల్లి ప్రాంత నాయకులు, ప్రజల్లో కొంత నిరుత్సాహాన్ని నింపింది. మెట్పల్లి కోసం నేతలపై ఆశలు కోరుట్ల సెగ్మెంట్లోని కీలక నేతలంతా మెట్‌పల్లికి చెందినవారు కావడంతో రెవెన్యూ డివిజన్ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తారన్న ఆశల్లో ఆ ప్రాంతవాసులు ఉన్నారు. వారం రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన పునర్విభజన కమిటీ సమావేశంలో ప్రజాప్రతినిధిగా కోరుట్ల సెగ్మెంట్‌కు సంబంధం లేకున్నా మెట్పల్లి పట్టణవాసిగా పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మెట్‌పల్లిని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు. దీనికి కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ మద్దతు పలికినట్లు ప్రచారం జరుగుతోంది. మెట్‌పల్లికి చెందిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తనకు కోరుట్ల, మెట్పల్లి పట్టణాలు రెండు కళ్లవంటివని చెబుతూ డివిజన్ విషయంలో ఏ నిర్ణయాన్నీ ప్రకటించడం లేదు. ఈ సెగ్మెంట్లోని కీలక నేతలంతా మెట్పల్లి వాసులే కావడంతో చివరి నిమిషంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రెవెన్యూ డివిజన్ నిర్ణయాన్ని మారుస్తారన్న గట్టి నమ్మకంతో ఆ ప్రాంత వాసులు ఉండటం గమనార్హం. కోరుట్ల ప్రాంత వాసులు మాత్రం అన్ని అర్హతలు ఉండి ప్రభుత్వ పరిశీలనలో ఉన్న కోరుట్ల రెవెన్యూ డివిజన్‌పై వివక్ష చూపి మెట్‌పల్లికి మద్దతుగా మాట్లాడుతున్న నేతలపై మండిపడుతున్నారు. దీంతో కోరుట్ల, మెట్పల్లి ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. నాయకులు సహకరించాలి – చెన్న విశ్వనాథం, కోరుట్ల డివిజన్ సాధన సమితి అధ్యక్షుడు అసెంబ్లీ సెగ్మెంట్ కేంద్రంగా, సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అన్ని అర్హతలున్న కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి సెగ్మెంట్ నాయకులు సహకరించాలి. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ఎంతటి వారైనా సహించం. గతంలో కోరుట్లపై నేతలు వివక్ష చూపారు. కోరుట్లకు రావాల్సిన వసతులన్నింటిని మెట్‌పల్లికి తరలించారు. మళ్లీ డివిజన్ వచ్చే సమయంలో అడ్డుకునే యత్నాలు చేయడం తగదు. మెట్‌పల్లికి ప్రాధాన్యత ఇవ్వాలి – నాంపల్లి గట్టయ్య, మెట్పల్లి డివిజన్ సాధన సమితి అధ్యక్షులు స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి మెట్‌పల్లికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. నిజాం పాలన కాలంలో మెట్పల్లి జిల్లా కేంద్రంగా 130 గ్రామాల్లో పాలన పర్యవేక్షణ జరిగింది. పంచాయితీ సమితిగా, అసెంబ్లీ సెగ్మెంట్ కేంద్రంగా 2009 సంవత్సరం వరకు కొనసాగింది. ఇంతటి చారిత్రక వారసత్వం ఉన్న మెట్పల్లి ప్రస్తుతం సబ్ డివిజన్‌గా ఉంది. అందుకే రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.