- ప్రభుత్వ ప్రతిపాదనలు..
- నేతలపైనే మెట్‌పల్లి ఆశలు
కోరుట్ల..రెవెన్యూ డివిజన్!
Published Fri, Aug 19 2016 9:58 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
కోరుట్ల : ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న కోరుట్ల పట్టణం.. త్వరలోనే రెవెన్యూ డివిజన్ హోదా సంతరించుకోనుంది. కొత్తగా ఏర్పాటుకానున్న జగిత్యాల జిల్లాలో రెండో రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కోరుట్ల ఆవిర్భవించనుంది. డివిజన్ కేంద్రాల కోసం కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం చివరకు కోరుట్లకే మెుగ్గుచూపింది. జనాభా, భౌగోళిక పరిస్థితులు, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం, సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ, ప్రభుత్వ భూముల లభ్యత అంశాలను దృష్టిలో ఉంచుకుని కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా మార్చడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీంతో కోరుట్ల ప్రాంతవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
డివిజన్ స్వరూపం ఇదీ..
కొత్తగా ఏర్పాటయ్యే జగిత్యాల జిల్లా కేంద్రానికి కోరుట్ల 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోరుట్ల, మెట్‌పల్లి అర్బన్, రూరల్ మండలాలతోపాటు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలాపూర్, మేడిపల్లి మండలాలు కోరుట్ల డివిజన్‌లో చేర్చే ప్రతిపాదనలున్నాయి. రెవెన్యూ డివిజన్ పరిధిలో మూడు లక్షల పైచిలుకు జనాభా ఉంది. చుట్టుపక్కల ఉన్న మండలాలు అన్నింటికి కోరుట్ల పట్టణం సుమారు 20–25 కిలోమీటర్ల లోపు దూరంలో ఉంటుంది. కోరుట్లలో సుమారు ఎనిమిది వందల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. పశువైద్య కళాశాల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల పరిసరాల్లో డివిజన్ కేంద్రానికి చెందిన కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. దీంతోపాటు కోరుట్ల ఎమ్మెల్యే క్వార్టర్ నిర్మాణానికి ప్రతిపాదించిన ఎస్సారెస్పీ క్వార్టర్ల సమీపంలో అనుకూలంగా ఉన్న స్థలాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం.
మూడేళ్లుగా ఉద్యమాలు
మొదట జిల్లా కేంద్రం కోసం మూడేళ్ల క్రితం కోరుట్లలో ఉద్యమం మొదలైంది. కరీంనగర్–నిజామాబాద్ జిల్లాలకు మధ్యలో ఉన్న కోరుట్లను జిల్లాగా మార్చాలని అనేక నిరసన కార్యక్రమాలు జరిగాయి. సీఎం కేసీఆర్ జగిత్యాల ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ఉద్యమ దిశను మార్చుకున్న సాధన సమితి కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం పోరు మొదలెట్టింది. కోరుట్లలో జిల్లా సాధన ఉద్యమం ప్రారంభమైన కొన్నాళ్లకే మెట్‌పల్లిలో డివిజన్ సాధన కోసం ఉద్యమం ఊపందుకుంది. స్వాతంత్య్రోద్యమం, నిజాం కాలం నుంచి చారిత్రక ప్రాధాన్యత కల్గి ఉండటంతోపాటు భౌగోళికంగా మెట్‌పల్లి డివిజన్ ఏర్పాటుకు అనుకూలమని సాధన సమితి ప్రతినిధులు ఉద్యమాన్ని ఉధృతంగా సాగించారు. ఈ క్రమంలో ఒకే సెగ్మెంట్‌లో ఉన్న కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల మధ్య డివిజన్ కేంద్రం కోసం పోరు మొదలైంది. ఎక్కడిక్కడే ఉద్యమాలు జోరుగా సాగాయి. చివరికి ప్రభుత్వం కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ప్రతిపాదిస్తూ తీసుకున్న నిర్ణయం మెట్‌పల్లి ప్రాంత నాయకులు, ప్రజల్లో కొంత నిరుత్సాహాన్ని నింపింది.
మెట్‌పల్లి కోసం నేతలపై ఆశలు
కోరుట్ల సెగ్మెంట్‌లోని కీలక నేతలంతా మెట్‌పల్లికి చెందినవారు కావడంతో రెవెన్యూ డివిజన్ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తారన్న ఆశల్లో ఆ ప్రాంతవాసులు ఉన్నారు. వారం రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన పునర్విభజన కమిటీ సమావేశంలో ప్రజాప్రతినిధిగా కోరుట్ల సెగ్మెంట్‌కు సంబంధం లేకున్నా మెట్‌పల్లి పట్టణవాసిగా పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మెట్‌పల్లిని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు. దీనికి కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ మద్దతు పలికినట్లు ప్రచారం జరుగుతోంది. మెట్‌పల్లికి చెందిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తనకు కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలు రెండు కళ్లవంటివని చెబుతూ డివిజన్ విషయంలో ఏ నిర్ణయాన్నీ ప్రకటించడం లేదు. ఈ సెగ్మెంట్‌లోని కీలక నేతలంతా మెట్‌పల్లి వాసులే కావడంతో చివరి నిమిషంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రెవెన్యూ డివిజన్ నిర్ణయాన్ని మారుస్తారన్న గట్టి నమ్మకంతో ఆ ప్రాంత వాసులు ఉండటం గమనార్హం. కోరుట్ల ప్రాంత వాసులు మాత్రం అన్ని అర్హతలు ఉండి ప్రభుత్వ పరిశీలనలో ఉన్న కోరుట్ల రెవెన్యూ డివిజన్‌పై వివక్ష చూపి మెట్‌పల్లికి మద్దతుగా మాట్లాడుతున్న నేతలపై మండిపడుతున్నారు. దీంతో కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
నాయకులు సహకరించాలి
– చెన్న విశ్వనాథం, కోరుట్ల డివిజన్ సాధన సమితి అధ్యక్షుడు
అసెంబ్లీ సెగ్మెంట్ కేంద్రంగా, సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అన్ని అర్హతలున్న కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి సెగ్మెంట్ నాయకులు సహకరించాలి. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ఎంతటి వారైనా సహించం. గతంలో కోరుట్లపై నేతలు వివక్ష చూపారు. కోరుట్లకు రావాల్సిన వసతులన్నింటిని మెట్‌పల్లికి తరలించారు. మళ్లీ డివిజన్ వచ్చే సమయంలో అడ్డుకునే యత్నాలు చేయడం తగదు.
మెట్‌పల్లికి ప్రాధాన్యత ఇవ్వాలి
– నాంపల్లి గట్టయ్య, మెట్‌పల్లి డివిజన్ సాధన సమితి అధ్యక్షులు
స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి మెట్‌పల్లికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. నిజాం పాలన కాలంలో మెట్‌పల్లి జిల్లా కేంద్రంగా 130 గ్రామాల్లో పాలన పర్యవేక్షణ జరిగింది. పంచాయితీ సమితిగా, అసెంబ్లీ సెగ్మెంట్ కేంద్రంగా 2009 సంవత్సరం వరకు కొనసాగింది. ఇంతటి చారిత్రక వారసత్వం ఉన్న మెట్‌పల్లి ప్రస్తుతం సబ్ డివిజన్‌గా ఉంది. అందుకే రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
Advertisement