
డ్రెస్సింగ్ రూంలు.. విశ్రాంతి గదులు కూడా
రాతి స్తంభాలతో మూడు అంతస్తులు
కోరుట్లలో జైన, చాళుక్యుల నిర్మాణం
కోరుట్ల: పెద్ద పెద్ద రాతి స్తంభాలు.. వాటిపై శిలాఫలకాలతో శ్లాబ్ వంటి నిర్మాణాలు. అక్కడక్కడ చిన్నచిన్న విశ్రాంతి గదులు. దుస్తులు మార్చుకునేందుకు అనువైన నిర్మాణాలు. మూడు అంతస్తుల నిర్మాణం. భూమిపై కనిపించేది కేవలం ఒక అంతస్తు మాత్రమే.. మిగిలిన రెండు అంతస్తుల నిర్మాణం భూగర్భంలోకి వెళ్లిపోయింది. క్రీ.శ. 957–1184 మధ్య కాలం నాటి శిల్పుల ఇంజనీరింగ్ శైలికి నిదర్శనంగా నిలిచిన అద్భుతమైన నిర్మాణం జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.
జైన చాళుక్యుల కాలంలో..
క్రీ.శ. 1042–1068 వరకు వేములవాడ రాజధానిగా పరిపాలన సాగించిన జైన చాళుక్యుల కాలంలో ఈ మెట్ల బావి నిర్మించినట్లు సమాచారం. 7–10వ శతాబ్ది వరకు పరిపాలన సాగించిన కల్యాణి చాళు క్యులు, రాష్ట్రకూటుల హయాంలోనూ ఈ మెట్ల బావి (Stepwell) ఆ కాలం నాటి రాజవంశీయుల స్నానాలకు, విశ్రాంతి తీసుకోవడానికి, ఈత నేర్చుకోవడానికి వినియోగించారని చెబుతారు.
ఈ మెట్ల బావిలోని రాతి స్తంభాలపై చెక్కిన తీరు అమోఘం. రాతి స్తంభాల కింది భాగంలో భూగర్భమార్గంలో రాజకోటను చేరుకోవడానికి సొరంగం వంటి మెట్ల నిర్మా ణం ఉన్నట్లుగా ప్రచారంలో ఉంది. రాజవంశీయుల కాలంలో నిషిద్ధ ప్రాంతంగా ఉన్న ఈ మెట్ల బావి ప్రస్తుతం కోరుట్ల (Korutla) మున్సిపల్ అధీనంలో ఉంది.

ఎక్స్‌లెన్స్ సర్టిఫికెట్
కోరుట్లలోని మెట్ల బావిలో స్నానాలకు వచ్చే రాజవంశీయులకు దుస్తులు మార్చుకోవడానికి అనువుగా మెట్లబావి రెండవ అంతస్తులో చిన్నచిన్న గదులుండటం గమనార్హం. వీటితో పాటు విశ్రాంతి తీసుకోవడానికి మెట్ల బావి చుట్టూ రాతి స్తంభాల మీద నిలబెట్టిన శిలాఫలకాలతో పెద్ద వసారా ఉంది. మెట్ల బావి (stair well) చుట్టూ దీపాలు వెలిగించడానికి అవసరమైన చిన్నపాటి గూళ్లు ఉన్నాయి.

మెట్లబావిపై భాగంలో ఉన్న మెట్లకు వెంబడి ఎడమ వైపు ఉన్న ఓ రాతిపై శిలాశాసనం (Epigraphy) ఉంది. ఈ శిలాశాసనం సంపూర్ణంగా చదవడానికి వీలు కానట్లుగా సమాచారం. ఈ మధ్య కాలంలో దెబ్బతిన్న కోరుట్ల మెట్లబావిని మున్సిపల్ ఆధ్వర్యంలో బాగు చేయించి కొత్త సొబగులద్దారు. దీంతో ఈ మెట్లబావికి ఇండి గ్లోబల్ నెట్‌వర్క్ నుంచి 2022–23 సంవత్సరంలో ఎక్స్‌లెన్స్ సర్టిఫికెట్ దక్కింది.
చదవండి: వెండితెరపై మానుకోట
Comments
Please login to add a commentAdd a comment