- మీ అభ్యున్నతి కోసమే ఆమె తపన
- ఎమ్మెల్యే కళావతి పనితీరుపై ప్రశంసలు
- దోనుబాయి గిరిజనులతో కలెక్టర్
సీతంపేట: ‘మీ ఎమ్మెల్యే నిత్యం మీ కష్టాల గురించే ఆలోచిస్తుంటారు. వాటి పరిష్కారం గురించే ఎప్పుడూ నాతో మాట్లాడుతుంటారు’.. అని జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ దోనుబాయిలో గిరిజనుల వద్ద వ్యాఖానించారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతినుద్దేశించిన ఆయన ఈ వ్యాఖలు చేశారు. ఆమె కోరిక మేరకే ఇక్కడికి వచ్చానని కూడా చెప్పారు. శుక్రవారం సీతంపేట మండలం దోనుబాయిలో జరిగిన రైతు సాధికార సదస్సులో ఆయన మాట్లాడుతూ గిరిజన సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే కళావతి నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
‘ఆమె మీ పట్ల ఎంతో పాజిటివ్ మైండ్‌తో ఉన్నారు. ఎప్పటికపుడు ఇక్కడి సమస్యలపై నాతో ఫోన్‌లో మాట్లాడుతుంటారని చెప్పారు. ‘మా ఏజెన్సీకి ఒకసారి రావాలండి.. మా గిరిజనుల సమస్యలు చూడాలి, వారి కష్టాలు వినాలంటూ పదేపదే నాతో అంటుంటారని, అందుకే దోనుబాయి వచ్చానని’ వివరించారు. మీ సమస్యలు ఏవైనా ఉంటే చెప్పాలని కోరారు. తుపాను వల్ల నష్టపోయిన వారికి ఇంకా పరిహారం అందకపోతే అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ జన్‌ధన్ బ్యాంకు ఖాతాప్రారంభించాలన్నారు.
అందరికీ ఆధార్ నంబర్లు ఉండాలన్నారు. చాలా మందికి పింఛన్లు రేషన్‌కార్డులు అందడం లేదన్న ఫిర్యాదులను ప్రస్తావిస్తూ వయస్సు తప్పుగా నమోదవడం, ఇతరత్రా కారణాలతో కొందరికి ఆగాయని త్వరలో వారందరికి మంజూరు చేస్తామన్నారు. పీటీజీలతో పాటు నాన్‌పీటీజీలకు కూడా 50 ఏళ్ల వయస్సు దాటితే వృద్ధాప్య పింఛన్ మంజూరుకు కృషి చేస్తానన్నారు.
దోనుబాయి వంటి చోట్ల మొబైల్ బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. కాగా బీఎస్‌ఎన్‌ఎల్ సెల్‌టవర్ ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కళావతి, ఐటీడీఏ పీవో సత్యనారాయణ, ఎంపీపీ సవర లక్ష్మి, జెడ్పీటీసీ పాలక రాజబాబు, సర్పంచ్‌లు కోటేశ్వరరావు, సాయికుమార్, కోఆప్టెడ్ సభ్యుడు ఎం. మోహనరావు, ఎంపీటీసీ బి.జయలక్ష్మి, పీసా చట్టం ఉపాధ్యక్షుడు ఎన్.సోమయ్య, ఈఈ శ్రీనివాస్, ఎంపీడీవో గార రవణమ్మ, పీఏవో జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
మీ ఎమ్మెల్యే సూపర్
Published Sat, Dec 13 2014 2:20 AM | Last Updated on Mon, Oct 1 2018 4:52 PM
Advertisement
Advertisement