పోటీ అనేది ఆట వరకే పరిమితం. ఆ తరువాత అంతా మనం మనం’ అని చెప్పడానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా... స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి పాకిస్తాన్ జావెలిన్ త్రో ప్లేయర్ అర్షద్ నదీమ్ గురించి, అర్షద్ నదీమ్ తల్లి రజీయా పర్వీన్ నీరజ్ చోప్రా గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడిన మాటలు క్రీడా స్ఫూర్తికి అద్దం పట్టాయి.
స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో రజతం గెల్చుకున్నాడు. అయితే ఆయన గెలుచుకున్న రజతం చాలామందికి సంతోషాన్ని ఇవ్వలేదు. అద్భుత శక్తిసామర్థ్యాలు ఉన్న, ఎంతో ఘన చరిత్ర ఉన్న నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సొంతం చేసుకోకపోవడం చాలామందిని నిరాశ పరిచింది.
మరోవైపు పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ స్వర్ణం గెలుచుకున్నాడు.
‘అర్షద్ నదీమ్ కూడా నా కుమారుడిలాంటివాడే’ అని స్పందించింది నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి. ఆ అమ్మ మాటను ప్రపంచం మెచ్చింది.
పాకిస్తాన్‌కు చెందిన క్రీడాకారుడిని సరోజ్ దేవి మెచ్చుకోవడం కొద్దిమందికి నచ్చకపోయినా, వారిని ఉద్దేశించి నీరజ్ చోప్రా వివరణ ఇచ్చినా...స్థూలంగా ఆమె మాటలు అర్షద్ నదీమ్ గెలుచుకున్న బంగారం పతకం కంటే విలువైనవి.
‘మా వాడు బంగారం పతకంతో వస్తాడనుకుంటే రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది’ అని నిట్టూర్చలేదు సరోజ్ దేవి.‘రజతం అయినా బంగారం అయినా ఒక్కటే. ఇద్దరూ నా బిడ్డలే’ అన్నది.
ఆమె మాటలు ప్రధాని నరేంద్ర మోదీకీ నచ్చాయి. ఆమె సహృదయతను ప్రశంసించారు.
మరో వైపు చూస్తే... ‘నీరజ్ నా కుమారుడిలాంటివాడు. అతడి కోసం ప్రార్థిస్తాను. నీరజ్ ఎన్నో పతకాలు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటోంది అర్షద్ నదీమ్ తల్లి రజియా పర్వీన్.
‘నా బిడ్డ తప్ప ఇంకెవరైనా బంగారు పతకం గెలుచుకోగలరా!’ అని బీరాలు పోలేదు. ఒకవైపు కుమారుడి చారిత్రక విజయానికి సంతోషిస్తూనే మరోవైపు నీరజ్ చో్ప్రా ప్రతిభను వేనోళ్ల పొగిడింది. పాకిస్తాన్, పంజాబ్‌లోని ఖనేవాల్ జిల్లాకు చెందిన అర్షద్ నదీమ్ కుటుంబం నీరజ్ చో్ప్రాను తమ ఇంటికి ఆహ్వానించింది.
పోటీలకు అతీతంగా అర్షద్, నీరజ్‌లు ఒకరినొకరు ప్రశంసించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి,.
‘ఆటకు సంబంధించి ఎలా ఉన్నా మేము మంచి స్నేహితులం, అన్నదమ్ములం... అని అర్షద్ నాతో ఎన్నోసార్లు చె΄్పాడు’ అంటుంది రజియా పర్వీన్.
‘నీరజ్ మా కుటుంబంలో ఒకరు. అతను పాకిస్తాన్‌కు వస్తే ఎయిర్ పోర్ట్ నుంచి మా ఇంటికి ఊరేగింపుగా తీసుకువస్తాం’ అంటున్నాడు పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అర్షద్ నదీమ్ సోదరుడు షాహీద్ అజీమ్.
ఇద్దరు మిత్రులు
నీరజ్ చోప్రాకు కుటుంబసభ్యులతో కలిసి కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకోవడం అంటే ఇష్టం. పండగలు వస్తే చాలు మిఠాయిల పని పట్టాల్సిందే. ఆ తరువాత బరువు పని పట్టాల్సిందే.
‘ఆటగాడికి కుటుంబ మద్దతు చాలా ముఖ్యం’ అంటాడు నీరజ్. ‘ఆటల్లో తొలి అడుగు వేసినప్పటి నుంచి ఇప్పటివరకు కుటుంబం నాకు మద్దతుగా ఉంది. నా వెనుక నా కుటుంబం ఉన్నది అనే భావన ఎంతో శక్తిని ఇస్తుంది’ అంటాడు నీరజ్. ‘నేను’ అనే అహం నీరజ్‌లో కనిపించదు. ఎదుటివారి ప్రతిభను ప్రశంసించకుండా ఉండలేడు. ముఖాముఖీగా, మీడియా ముఖంగా అర్షద్ నదీమ్‌ను ఎన్నోసార్లు ప్రశంసించాడు నీరజ్ చోప్రా. అందుకే అతడంటే నదీమ్‌కు చాలా ఇష్టం.
ఇక నదీమ్ గురించి చె΄్పాలంటే అతడు ఇంట్రావర్ట్. తక్కువగా మాట్లాడుతాడు. సాధారణ కుటుంబంలో పుట్టిన నదీమ్‌కు ఆర్థిక భారం ఎన్నోసార్లు అతడి దారికి అడ్డుగా నిలబడేది. స్నేహితులు, సన్నిహితులు అతడి విదేశీ టోర్నమెంట్‌లకు సంబంధించి ప్రయాణ, ఇతర ఖర్చులకు డబ్బును సమకూర్చేవారు. టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించి నదీమ్‌కు పాక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. ప్యారిస్ ఒలింపిక్స్‌కు ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. పాత జావెలిన్‌తోప్రాక్టిస్ చేయడం కష్టంగా ఉంది’ అంటూ సాగిన నదీమ్ సోషల్ మీడియా పోస్ట్ ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది. నీరజ్ చో్ప్రా కూడా అర్షద్ నదీమ్‌కు మద్దతుగా మాట్లాడాడు.
Comments
Please login to add a commentAdd a comment