Javelin thrower Neeraj Chopra
-
నీరజ్ కోచ్‌గా జాన్ జెలెజ్నీ
న్యూఢిల్లీ: జావెలిన్ త్రోలో ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకరు...ఇదే క్రీడాంశంలో సంచలన ప్రదర్శనతో దేశానికి ఒలింపిక్స్ స్వర్ణం అందించిన ఆటగాడు మరొకరు...వీరిద్దరు ఇప్పుడు మరిన్ని రికార్డులను సృష్టించే లక్ష్యంతో జోడీగా మారారు. భారత్ స్టార్ జావెలిన్ త్రోయర్, 2 ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రా తన కొత్త కోచ్‌గా చెక్ రిపబ్లిక్ దిగ్గజం జాన్ జెలెన్జీని కోచ్‌గా ఎంచుకున్నాడు.రాబోయే 2025 సీజన్‌కు ముందు జత కలిసిన నీరజ్, జెలెజ్నీ అద్భుతమైన ఫలితాలు సాధించాలని పట్టుదలగా ఉన్నారు. 58 ఏళ్ల జెలెజ్నీ 1988 సియోల్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన అనంతరం వరుసగా మూడు ఒలింపిక్స్ (1992, 1996, 2000)లలో స్వర్ణాలు గెలుచుకున్నాడు. మూడు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అతని పేరిటే జావెలిన్‌ను అతి ఎక్కువ దూరం విసిరిన వరల్డ్ రికార్డు (98.48 మీటర్లు) కూడా ఉంది.2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన నీరజ్‌కు ఇటీవలి వరకు జర్మనీకి చెందిన బయోమెకానిక్స్ ఎక్స్పర్ట్ క్లాస్ బార్టొనిట్జ్ కోచ్‌గా ఉన్నాడు. ‘చిన్నప్పటినుంచి నేను జెలెజ్నీకి వీరాభిమానిని. ఆయన టెక్నిక్ అంటే ఎంతో ఇష్టం. నా ఆటను మెరుగుపర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో ఆయన వీడియోలు చూస్తుండేవాడిని. ఇప్పుడు జెలెజీ్నతో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం.మా ఇద్దరి త్రోయింగ్ శైలి ఒకటే. మున్ముందు నా కెరీర్లో మరిన్ని అత్యుత్తమ విజయాలు సాధిస్తాననే నమ్మకం ఉంది’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు. నీరజ్ ఆట గురించి తనకు బాగా తెలుసని.. ఎంతో మంది అథ్లెట్లు కోచింగ్ కోసం తనను సంప్రదించినా వారందరినీ కాదని భారత ఆటగాడిని ఎంచుకోవడం అతనిలో ప్రతిభను చూసేనని జెలెన్జీ వెల్లడించాడు. గతంలో ఈ దిగ్గజం శిక్షణలోనే జేకబ్ వాలెజ్, విటెస్లావ్ వెసెలి, బార్బరా స్పొటకోవా లాంటి ఆటగాళ్లు ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకోవడం విశేషం. -
Paris Olympics 2024: పతకమేదైనా తల్లికి బంగారమే
పోటీ అనేది ఆట వరకే పరిమితం. ఆ తరువాత అంతా మనం మనం’ అని చెప్పడానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా... స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి పాకిస్తాన్ జావెలిన్ త్రో ప్లేయర్ అర్షద్ నదీమ్ గురించి, అర్షద్ నదీమ్ తల్లి రజీయా పర్వీన్ నీరజ్ చోప్రా గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడిన మాటలు క్రీడా స్ఫూర్తికి అద్దం పట్టాయి.స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో రజతం గెల్చుకున్నాడు. అయితే ఆయన గెలుచుకున్న రజతం చాలామందికి సంతోషాన్ని ఇవ్వలేదు. అద్భుత శక్తిసామర్థ్యాలు ఉన్న, ఎంతో ఘన చరిత్ర ఉన్న నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సొంతం చేసుకోకపోవడం చాలామందిని నిరాశ పరిచింది.మరోవైపు పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ స్వర్ణం గెలుచుకున్నాడు.‘అర్షద్ నదీమ్ కూడా నా కుమారుడిలాంటివాడే’ అని స్పందించింది నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి. ఆ అమ్మ మాటను ప్రపంచం మెచ్చింది.పాకిస్తాన్‌కు చెందిన క్రీడాకారుడిని సరోజ్ దేవి మెచ్చుకోవడం కొద్దిమందికి నచ్చకపోయినా, వారిని ఉద్దేశించి నీరజ్ చోప్రా వివరణ ఇచ్చినా...స్థూలంగా ఆమె మాటలు అర్షద్ నదీమ్ గెలుచుకున్న బంగారం పతకం కంటే విలువైనవి.‘మా వాడు బంగారం పతకంతో వస్తాడనుకుంటే రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది’ అని నిట్టూర్చలేదు సరోజ్ దేవి.‘రజతం అయినా బంగారం అయినా ఒక్కటే. ఇద్దరూ నా బిడ్డలే’ అన్నది.ఆమె మాటలు ప్రధాని నరేంద్ర మోదీకీ నచ్చాయి. ఆమె సహృదయతను ప్రశంసించారు.మరో వైపు చూస్తే... ‘నీరజ్ నా కుమారుడిలాంటివాడు. అతడి కోసం ప్రార్థిస్తాను. నీరజ్ ఎన్నో పతకాలు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటోంది అర్షద్ నదీమ్ తల్లి రజియా పర్వీన్.‘నా బిడ్డ తప్ప ఇంకెవరైనా బంగారు పతకం గెలుచుకోగలరా!’ అని బీరాలు పోలేదు. ఒకవైపు కుమారుడి చారిత్రక విజయానికి సంతోషిస్తూనే మరోవైపు నీరజ్ చో్ప్రా ప్రతిభను వేనోళ్ల పొగిడింది. పాకిస్తాన్, పంజాబ్‌లోని ఖనేవాల్ జిల్లాకు చెందిన అర్షద్ నదీమ్ కుటుంబం నీరజ్ చో్ప్రాను తమ ఇంటికి ఆహ్వానించింది.పోటీలకు అతీతంగా అర్షద్, నీరజ్‌లు ఒకరినొకరు ప్రశంసించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి,.‘ఆటకు సంబంధించి ఎలా ఉన్నా మేము మంచి స్నేహితులం, అన్నదమ్ములం... అని అర్షద్ నాతో ఎన్నోసార్లు చె΄్పాడు’ అంటుంది రజియా పర్వీన్.‘నీరజ్ మా కుటుంబంలో ఒకరు. అతను పాకిస్తాన్‌కు వస్తే ఎయిర్ పోర్ట్ నుంచి మా ఇంటికి ఊరేగింపుగా తీసుకువస్తాం’ అంటున్నాడు పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అర్షద్ నదీమ్ సోదరుడు షాహీద్ అజీమ్.ఇద్దరు మిత్రులునీరజ్ చోప్రాకు కుటుంబసభ్యులతో కలిసి కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకోవడం అంటే ఇష్టం. పండగలు వస్తే చాలు మిఠాయిల పని పట్టాల్సిందే. ఆ తరువాత బరువు పని పట్టాల్సిందే.‘ఆటగాడికి కుటుంబ మద్దతు చాలా ముఖ్యం’ అంటాడు నీరజ్. ‘ఆటల్లో తొలి అడుగు వేసినప్పటి నుంచి ఇప్పటివరకు కుటుంబం నాకు మద్దతుగా ఉంది. నా వెనుక నా కుటుంబం ఉన్నది అనే భావన ఎంతో శక్తిని ఇస్తుంది’ అంటాడు నీరజ్. ‘నేను’ అనే అహం నీరజ్‌లో కనిపించదు. ఎదుటివారి ప్రతిభను ప్రశంసించకుండా ఉండలేడు. ముఖాముఖీగా, మీడియా ముఖంగా అర్షద్ నదీమ్‌ను ఎన్నోసార్లు ప్రశంసించాడు నీరజ్ చోప్రా. అందుకే అతడంటే నదీమ్‌కు చాలా ఇష్టం.ఇక నదీమ్ గురించి చె΄్పాలంటే అతడు ఇంట్రావర్ట్. తక్కువగా మాట్లాడుతాడు. సాధారణ కుటుంబంలో పుట్టిన నదీమ్‌కు ఆర్థిక భారం ఎన్నోసార్లు అతడి దారికి అడ్డుగా నిలబడేది. స్నేహితులు, సన్నిహితులు అతడి విదేశీ టోర్నమెంట్లకు సంబంధించి ప్రయాణ, ఇతర ఖర్చులకు డబ్బును సమకూర్చేవారు. టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించి నదీమ్‌కు పాక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. ప్యారిస్ ఒలింపిక్స్‌కు ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. పాత జావెలిన్తోప్రాక్టిస్ చేయడం కష్టంగా ఉంది’ అంటూ సాగిన నదీమ్ సోషల్ మీడియా పోస్ట్ ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది. నీరజ్ చో్ప్రా కూడా అర్షద్ నదీమ్‌కు మద్దతుగా మాట్లాడాడు. -
Paris Olympics 2024: నీరజ్ వస్తున్నాడు
పారిస్: భారీ అంచనాలతో పారిస్ ఒలింపిక్స్‌లో అడుగు పెట్టిన ఒలింపిక్ డిఫెండింగ్ చాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మంగళవారం క్వాలిఫయింగ్ బరిలోకి దిగనున్నాడు. 2020 టోక్యో ఓలింపిక్స్లో నీరజ్ పసిడి పతకం సాధించి దేశ అథ్లెటిక్స్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. ‘పారిస్’లోనూ టోక్యో ప్రదర్శనను పునరావృతం చేయాలని పట్టుదలతో ఉన్నాడు. టోక్యో విశ్వ క్రీడల తర్వాత అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కొనసాగించిన 26 ఏళ్ల నీరజ్ గత ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి విశ్వవిజేతగా నిలిచాడు. ‘పారిస్’ నుంచి కూడా పతకంతో తిరిగి వస్తాడని యావత్ భారతావని ఆశలు పెట్టుకోగా... వాటిని అందుకోవడమే లక్ష్యంగా నేడు నీరజ్ మైదానంలో అడుగు పెట్టనున్నాడు. గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఆచితూచి టోరీ్నల్లో పాల్గొన్న 26 ఏళ్ల నీరజ్.. ఈ ఏడాది బరిలోకి దిగిన మూడు టోరీ్నల్లోనూ ఆకట్టుకున్నాడు. ఈ విభాగంలో భారత్ నుంచి నీరజ్ చోప్రాతోపాటు.. కిశోర్ కుమార్ జేనా కూడా పోటీ పడుతున్నాడు. రెండు గ్రూప్‌ల్లో కలిపి మొత్తం 32 మంది త్రోయర్లు బరిలోకి దిగుతున్నారు. గ్రూప్ ‘బి’లో నీరజ్... కిశోర్ గ్రూప్ ‘ఎ’లో ఉన్నారు. ఫైనల్ చేరడానికి అర్హత ప్రమాణంగా 84 మీటర్లు నిర్ణయించారు. క్వాలిఫయింగ్ రౌండ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 12 మంది ఫైనల్‌కు అర్హత సాధించనున్నారు. ఒకవేళ 12 మంది కంటే ఎక్కువ మంది 84 మీటర్లను దాటి జావెలిన్‌ను విసిరితే ఇందులో నుంచి టాప్–12 మందికి ఫైనల్ బెర్త్‌లు లభిస్తాయి. ఫైనల్ గురువారం జరుగుతుంది. పాకిస్తాన్ త్రోయర్ నదీమ్ అర్షద్, జాకబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్), వెబర్ (జర్మనీ), ఒలీవర్ (ఫిన్లాండ్) నుంచి నీరజ్‌కు ప్రధాన పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. నీరజ్ టైటిల్ నిలబెట్టుకుంటే.. ఒలింపిక్స్‌లో ఆ ఘనత సాధించిన ఐదో జావెలిన్ త్రోయర్ కానున్నాడు. విశ్వక్రీడల చరిత్రలో ఎరిక్ లామింగ్ (స్వీడన్; 1908, 1912), జానీ మైరా (ఫిన్లాండ్; 1920, 1924), జాన్ జెలెన్జీ (చెక్ రిపబ్లిక్; 1992, 1996, 2000), ఆండ్రీస్ థోర్కిల్డ్సెన్ (నార్వే; 2004, 2008) స్వర్ణాన్ని నిలబెట్టుకున్నారు. -
Doha Diamond League 2023: మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తా: నీరజ్ చోప్రా
డైమండ్ లీగ్ తొలి రౌండ్లో విజేతగా నిలిచిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ సీజన్‌లోని రాబోయే రౌండ్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అయిన నీరజ్ ఇదే తరహా నిలకడ కొనసాగిస్తానని అన్నాడు. ‘శుక్రవారం తొలి రౌండ్లో గెలుపు కోసం ఎంతో శ్రమించాను. అయితే ఫలితం ఆనందాన్నిచ్చింది. దీనిని శుభారంభంగా భావిస్తున్నా. గాలి వేగంలో మార్పు వల్ల పోటీ సవాల్‌గా మారింది. పైగా అత్యుత్తమ ఆటగాళ్లంతా బరిలో నిలిచారు. ఈ సీజన్ మొత్తం ఫిట్నెస్తో ఉండి నిలకడగా రాణించడం ముఖ్యం. తర్వాతి రౌండ్లోనూ అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తా. నాపై నమ్మకముంచి ఎంతో మంది భారత అభిమానులు ఇక్కడకు వచ్చారు. దానిని నిలబెట్టుకోగలిగినందుకు సంతోషం’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు. -
దోహా డైమండ్ లీగ్ మీట్: నీరజ్ చోప్రాకు అగ్ర స్థానం... పారిస్ ఒలింపిక్స్‌కూ అర్హత
ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ మీట్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాత్రి దోహా వేదికగా జరిగిన తొలి సిరీస్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మెరిశాడు. ఎనిమిది మంది మేటి జావెలిన్ త్రోయర్లు పోటీపడిన ఈ మీట్లో నీరజ్ చోప్రా బల్లెంను 88.67 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ ప్రదర్శనతో నీరజ్ వచ్చే ఏడాది పారిస్‌లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు కూడా అర్హత సాధించాడు. జావెలిన్ ఈవెంట్లో పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణం 85.50 మీటర్లు. నీరజ్ ఈ దూరాన్ని తొలి ప్రయత్నంలోనే నమోదు చేశాడు. ఆ తర్వాత నీరజ్ 86.04 మీటర్లు, 85.47 మీటర్లు, 84.47 మీటర్లు, 86.52 మీటర్లు నమోదు చేశాడు. ఐదో ప్రయత్నంలో నీరజ్ ఫౌల్ చేశాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ పీటర్స్ అండర్సన్ (గ్రెనెడా; 85.88 మీటర్లు) రెండో స్థానంలో... జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 88.63 మీటర్లు) మూడో స్థానంలో నిలిచారు. ఇదే మీట్లో పురుషుల ట్రిపుల్ జంప్‌లో పోటీపడిన భారత అథ్లెట్ ఎల్డోజ్ పాల్ 15.84 మీటర్ల దూరం దూకి పదో స్థానంలో నిలిచాడు. డైమండ్ లీగ్‌లో మొత్తం 14 సిరీస్‌లు జరుగుతాయి. అనంతరం సెప్టెంబర్‌లో గ్రాండ్ ఫైనల్‌ను నిర్వహిస్తారు. -
డైమండ్ లీగ్ ఫైనల్స్ బరిలో నీరజ్
ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్లో పసిడి పతకమే లక్ష్యంగా భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బరిలోకి దిగనున్నాడు. జ్యూరిక్‌లో ఈరోజు డైమండ్ లీగ్ ఫైనల్స్ జరగనుంది. జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్‌తో కలిపి మొత్తం ఆరుగురు పోటీపడనున్నారు. 2017, 2018 డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్‌కు నీరజ్ అర్హత సాధించినా పతకం సాధించలేకపోయాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో సంచలనం సృష్టించిన నీరజ్ ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతంతో మెరిశాడు. -
World Athletics Championships 2022: నీ‘రజత’ధీర..!
అమెరికాలో ఆదివారం ఉదయం భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అద్భుతం చేశాడు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని గెల్చుకున్నాడు. తద్వారా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు రజత పతకం అందించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ బాబీజార్జి కాంస్య పతకాన్ని సాధించింది. తాజా ప్రదర్శనతో నీరజ్ ఒలింపిక్స్, ఆసియా చాంపియన్‌షిప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, దక్షిణాసియా క్రీడలు, డైమండ్ లీగ్ మీట్ తదితర మెగా ఈవెంట్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా అరుదైన ఘనత సాధించాడు. కోట్లాది మంది భారతీయుల అంచనాలను నిజం చేస్తూ... మన అథ్లెట్స్లోనూ ప్రపంచస్థాయి వేదికపై పతకాలు గెలిచే సత్తా ఉందని నిరూపిస్తూ... గతంలో ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ప్రదర్శనను నమోదు చేస్తూ... అమెరికా గడ్డపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ... భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అద్భుతం ఆవిష్కరించాడు. 46 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు తొలిసారి రజత పతకాన్ని అందించాడు. 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ జార్జి కాంస్య పతకాన్ని సాధించగా... నీరజ్ తాజాగా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన అథ్లెట్‌గా ఘనత వహించాడు. యుజీన్ (అమెరికా): సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. 19 ఏళ్ల తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ మళ్లీ పతకాల బోణీ కొట్టింది. స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అందరి అంచనాలకు అనుగుణంగా రాణించి భారత్‌కు రజత పతకం అందించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) జావెలిన్‌ను 90.54 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోగా... జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్) జావెలిన్‌ను 88.09 మీటర్ల దూరం పంపించి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. జావెలిన్ త్రో ఫైనల్లో పోటీపడిన భారత్‌కే చెందిన మరో అథ్లెట్ రోహిత్ యాదవ్ (78.22 మీటర్లు) పదో స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో విఫలమైనా... జావెలిన్ త్రో ఫైనల్లో మొత్తం 12 మంది పోటీపడ్డారు. తొలి మూడు రౌండ్ల తర్వాత టాప్–8లో నిలిచిన వారు రెండో దశకు చేరగా... మిగతా నలుగురు నిష్క్రమించారు. క్వాలిఫయింగ్‌లో తొలి ప్రయత్నంలోనే అర్హత ప్రమాణాన్ని అందుకున్న 24 ఏళ్ల నీరజ్ చోప్రా ఫైనల్లో మాత్రం తొలి అవకాశంలో ఫౌల్ చేశాడు. అయితే ఆందోళన చెందకుండా నీరజ్ నెమ్మదిగా పుంజుకున్నాడు. రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 82.39 మీటర్లు... మూడో ప్రయత్నంలో 86.37 మీటర్లు విసిరిన నీరజ్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇక నాలుగో ప్రయత్నంలో నీరజ్ తన శక్తినంతా కూడదీసుకొని జావెలిన్‌ను 88.13 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు. నీరజ్ ఐదో, ఆరో ప్రయత్నాలు ఫౌల్ కాగా... 24 ఏళ్ల అండర్సన్ పీటర్స్ చివరిదైన ఆరో ప్రయత్నంలో ఈటెను 90.54 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. వాద్లెచ్, జూలియన్ వెబర్ (జర్మనీ), అర్షద్ నదీమ్ (పాకిస్తాన్) లసీ ఇటెలాటలో (ఫిన్లాండ్), ఆండ్రియన్ మర్డారె (మాల్డోవా) తదితరులు తర్వాతి ప్రయత్నాల్లో నీరజ్ దూరాన్ని అధిగమించకపోవడంతో భారత అథ్లెట్ ఖాతాలో రజతం చేరింది. నీరజ్ సాధించిన రజత పతకంతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ సంయుక్తంగా 29వ ర్యాంక్‌లో ఉంది. ఒక రజతం, ఐదుగురు ఫైనల్స్ చేరడంద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ ఈసారి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. జెలెజ్నీ తర్వాత... డిఫెండింగ్ చాంపియన్ ఆండర్సన్ పీటర్స్ ఆరు ప్రయత్నాల్లో మూడుసార్లు జావెలిన్‌ను 90 మీటర్లకంటే ఎక్కువ దూరం విసిరి ఫైనల్లో తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. చెక్ రిపబ్లిక్ దిగ్గజం జాన్ జెలెజ్నీ (1993, 1995) తర్వాత వరుసగా రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణ పతకాలు నెగ్గిన జావెలిన్ త్రోయర్‌గా అండర్సన్ గుర్తింపు పొందాడు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ అండర్సన్ చాంపియన్‌గా నిలిచాడు. ప్రశంసల వర్షం... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు తొలి రజత పతకాన్ని అందించిన నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితర ప్రముఖులు నీరజ్ ప్రదర్శనను కొనియాడారు. ‘నీరజ్‌కు శుభాకాంక్షలు. భారత క్రీడల్లో ఇదెంతో ప్రత్యేక ఘట్టం. భవిష్యత్‌లో నీరజ్ మరిన్ని విజయాలు సాధించాలి’ అని ప్రధాని ట్విటర్లో అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత, షూటర్ అభినవ్ బింద్రా, దిగ్గజ అథ్లెట్స్ పీటీ ఉష, అంజూ బార్జి కూడా నీరజ్‌ను అభినందించారు. విసిరితే పతకమే... 2016 జూలై 23న పోలాండ్‌లో జరిగిన ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి వెలుగులోకి వచ్చిన నీరజ్ చోప్రా అటునుంచి వెనుదిరిగి చూడలేదు. హరియాణాకు చెందిన నీరజ్ ఆ తర్వాత బరిలోకి దిగిన ప్రతి మెగా ఈవెంట్లో పతకంతో తిరిగి వచ్చాడు. 2016లోనే జరిగిన దక్షిణాసియా క్రీడల్లో... 2017లో ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో... 2018 జకార్తా ఆసియా క్రీడల్లో... 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో... నీరజ్ జావెలిన్ త్రోలో భారత్‌కు పసిడి పతకాలు అందించాడు. 2017లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నా ఫైనల్‌కు అర్హత పొందలేకపోయిన నీరజ్ 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మోచేయి గాయంతో బరిలోకి దిగలేదు. గత ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచి విశ్వక్రీడల అథ్లెటిక్స్‌లో బంగారు పతకం నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ తర్వాత రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకొని గత అక్టోబర్‌లో మళ్లీ శిక్షణ ప్రారంభించాడు. గత నెలలో ఫిన్లాండ్లో జరిగిన కుర్టానో గేమ్స్‌లో స్వర్ణం... పావో నుర్మీ గేమ్స్‌లో రజతం... స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్‌లో రజతం సాధించిన నీరజ్ అదే జోరును ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కొనసాగించి భారత్‌కు తొలి రజత పతకాన్ని అందించాడు. ఈనెల 28 నుంచి బర్మింగ్హమ్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా నీరజ్ బరిలోకి దిగనున్నాడు. ఎల్డోజ్ పాల్‌కు తొమ్మిదో స్థానం ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆదివారమే జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్లో భారత ప్లేయర్ ఎల్డోజ్ పాల్ నిరాశపరిచాడు. కేరళకు చెందిన పాల్ 16.79 మీటర్ల దూరం గెంతి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే హీట్స్‌ను మొహమ్మద్ అనస్ యాహియా, మొహమ్మద్ అజ్మల్, నాగనాథన్ పాండి, రాజేశ్ రమేశ్‌లతో కూడిన భారత బృందం 3ని:07.29 సెకన్లలో పూర్తి చేసి ఆరో స్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందలేకపోయింది. నీరజ్ గ్రామంలో సంబరాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా ప్రదర్శనతో... హరియాణాలోని పానిపట్‌కు సమీపంలోని ఖాండ్రా గ్రామంలో నీరజ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంబరాలు చేసుకున్నారు. ‘దేశం మొత్తం, హరియాణా రాష్ట్రం మొత్తం నీరజ్ ప్రదర్శనకు గర్వపడుతోంది. నిరంతరం శ్రమిస్తూ అతను దేశానికి పేరుప్రతిష్టలు తెస్తున్నాడు’ అని నీరజ్ తల్లి సరోజ్ వ్యాఖ్యానించారు. -
Tokyo Olympics: అందరి దృష్టి నీరజ్‌పైనే
అథ్లెటిక్స్‌లో ఊరిస్తోన్న ఒలింపిక్ పతకాన్ని భారత్‌కు ఈసారైనా లభిస్తుందా లేదా అనేది నేడు తేలిపోతుంది. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో భారత ప్లేయర్ నీరజ్ చోప్రా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. హరియాణాకు చెందిన 23 ఏళ్ల నీరజ్ చోప్రా క్వాలిఫయింగ్‌లో జావెలిన్‌ను 86.59 మీటర్ల దూరం విసిరి ‘టాపర్’గా నిలువడంతో అందరి దృష్టి అతనిపైనే కేంద్రీకృతమైంది. నీరజ్ ఫైనల్లోనూ తన ప్రావీణ్యాన్ని పునరావృతం చేసి పతకం సాధిస్తాడా లేదా అనేది నేటి సాయంత్రానికల్లా తెలిసిపోతుంది. నీరజ్‌తోపాటు జోనస్ వెటెర్ (జర్మనీ), జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్), వితెస్లా వెసిలీ (చెక్ రిపబ్లిక్), వెబెర్ (జర్మనీ) కూడా పతకాల రేసులో ఉన్నారు. 12 మంది పోటీపడుతున్న ఈ ఫైనల్లో తొలుత అందరికీ మూడు అవకాశాలు లభిస్తాయి. టాప్–8లో నిలిచిన వారికి మరో మూడు అవకాశాలు ఇస్తారు. అనంతరం టాప్–3లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఇస్తారు. -
‘ఖేల్‌రత్న’ బరిలో నీరజ్
న్యూఢిల్లీ: భారత మేటి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి కూడా ‘రాజీవ్ ఖేల్‌రత్న’ బరిలో నిలిచాడు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) 2018 కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల చాంపియన్ అయిన నీరజ్‌ను అత్యున్నత క్రీడా పురస్కారానికి వరుగా మూడో ఏడాదీ నామినేట్ చేసింది. 2016లో ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ అండర్–20 చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం నెగ్గిన నీరజ్ 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం దక్కించుకున్నాడు. గత రేండేళ్లుగా నీరజ్‌ను ఏఎఫ్ఐ నామినేట్ చేస్తున్నప్పటికీ చివరకు ‘ఖేల్‌రత్న’ వరించడం లేదు. 22 ఏళ్ల నీరజ్‌కు 2018లో ‘అర్జున అవార్డు’ దక్కింది. మహిళా స్ప్రింటర్ ద్యుతీ చంద్‌తో పాటు ఆసియా క్రీడల స్వర్ణ విజేతలు అర్పిందర్ సింగ్ (ట్రిపుల్ జంప్), మన్జీత్ సింగ్ (800 మీటర్ల పరుగు), మిడిల్ డిస్టెన్స్ రన్నర్ పి.యు.చిత్రలను ‘అర్జున’ అవార్డుకు సిఫారసు చేసింది. డిప్యూటీ చీఫ్ కోచ్ రాధాకృష్ణన్ నాయర్‌ను ‘ద్రోణాచార్య’... కుల్దీప్ సింగ్ భుల్లర్, జిన్సీ ఫిలిప్‌లను ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారం కోసం ఏఎఫ్ఐ ప్రతిపాదించింది. స్వయంగా దరఖాస్తు చేసుకోండి... ఆటగాళ్లు తమ తమ అర్హతలు, పతకాలు చరిత్రతో సొంతంగా కూడా నామినేట్ చేసుకోవచ్చని క్రీడాశాఖ తెలిపింది. బుధవారంతో ముగియాల్సిన నామినేషన్ల గడువును ఈ నెల 22 వరకు పొడిగించింది. కరోనా మహమ్మారి విలయతాండవం దృష్ట్యా ఈసారి క్రీడాశాఖ కేవలం ఈ–మెయిల్ల ద్వారానే దరఖాస్తుల్ని కోరుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక అవార్డుల కమిటీ ఎంపిక చేసే విజేతలకు ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి భవన్లో అవార్డుల్ని ప్రదానం చేస్తారు. ‘అవార్డులు... ఓ ప్రహసనం’: ప్రణయ్ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)పై స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ అసంతృప్తి వెళ్లగక్కాడు. ఈ ఏడాదీ తనను ‘అర్జున’కు నామినేట్ చేయకపోవడంపై ఈ కేరళ ప్లేయర్ ట్విట్టర్లో స్పందించాడు. ‘అవార్డుల నామినేషన్లలో పాత కథే! కామన్వెల్త్ గేమ్స్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో పతకాలు నెగ్గిన షట్లర్‌ను విస్మరిస్తారు. దేశం తరఫున ఇలాంటి మెగా ఈవెంట్స్‌లో కనీసం పోటీపడని ఆటగాడినేమో నామినేట్ చేస్తారు. ‘అవార్డులు ఈ దేశంలో ఓ ప్రహసనం...’ అని ట్వీట్ చేశాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణం సాధించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ప్రణయ్... అదే ఏడాది వుహాన్‌లో జరిగిన ఆసియా చాంపియన్íషిప్లో కాంస్య పతకం సాధించాడు. ఈ ఏడాది ‘బాయ్’ ప్రతిపాదించిన ముగ్గురిలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు కామన్వెల్త్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణం, పురుషుల డబుల్స్‌లో రజతం గెలిచారు. కానీ సమీర్‌వర్మ మాత్రం ఇప్పటి వరకు దేశం తరఫున మెగా ఈవెంట్స్‌లో బరిలోకి దిగలేదు. ప్రణయ్‌కు మద్దతుగా భారత మరో స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ వ్యాఖ్యానించాడు. ‘జాతీయ క్రీడా అవార్డుల కోసం దరఖాస్తు చేసే విధానం ఇప్పటికీ అర్థంకాదు. ఈ పద్ధతిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. ధైర్యం కోల్పోకుండా దృఢంగా ఉండు సోదరా’ అని ప్రణయ్‌కు కశ్యప్ మద్దతుగా నిలిచాడు. -
ఆర్మీ కొలువు... కష్టాలకు సెలవు
►ఇక లక్ష్యాలే మిగిలాయి ►జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా న్యూఢిల్లీ: చిన్నప్పటి నుంచి కష్టాలతోనే సహవాసం. పూటగడవని జీవితం... ఇవన్నీ అనుభవిస్తూనే... ఆనందాన్ని ఆటలో వెతుక్కున్నాడు. అదే అన్నం పెడుతుందని, సరదా ఆటే తనకు సర్వస్వం అవుతుందని, పేరు తెస్తుందని ఆనాడు ఊహించలేదు. కానీ ఆటలో కష్టపడితే... పోటీల్లో ప్రతిభ చాటితే... విజేత అవుతాడని ప్రపంచ రికార్డుతో చాటిచెప్పాడు యువ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా. 19 ఏళ్ల ఈ అథ్లెట్ ప్రదర్శన బక్కచిక్కిన రైతు కుటుంబంలో ఎక్కడలేని సంతోషాన్ని తెచ్చిపెట్టింది. హరియాణా రాష్ట్రం పానిపట్‌కు సమీపంలోని ఖాంద్రా గ్రామంలో నీరజ్ తండ్రిది నిరుపేద రైతు కుటుంబం. ఏడాదంతా ఎండల్లో వానల్లో కష్టపడినా... పైరు పండితేనే అతని కుటుంబం గడుస్తుంది. ఇలాంటి కష్టాల నడుమ చదువు సంధ్యలతో పాటు అతడెంచుకున్న జావెలిన్ త్రో అతనికి ఇపుడు ప్రొఫెషన్ అయింది. పోలాండ్‌లో గతేడాది జరిగిన అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతను 86.48 మీటర్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇది రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేతకంటే మెరుగైన ప్రదర్శన కావడం విశేషం. ఈ ఒక్క రికార్డు అతనికి ఎనలేని కీర్తి తెచ్చింది. నీరజ్ చోప్రాకు ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా ఉద్యోగం లభించింది. అతని కుటుంబ కష్టాలను కడతేర్చింది. అంతేనా... అంటే! నిజమే! ఇంకా వుంది మరి... వచ్చిన జాబ్‌తో సరి అనుకోలేదు. సాధించిన ప్రపంచ రికార్డుతో బ్రేకు వేయలేదు. మరింత మెరుగైన ప్రదర్శనతో మరిన్ని పతకాలతో రాణించాలనుకుంటున్నాడు. అతని ఆశయాన్ని గుర్తించిన ఆర్మీ ఉన్నతాధికారులు సెలవు మంజూరు చేస్తూ బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రానికి పంపారు. బంగారు భవిష్యత్తు కోసం బెస్టాఫ్ లక్ చెప్పారు. వారిచ్చిన ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా శిక్షణలో కష్టపడుతున్నాడు. అలాగని చదువూ మానేయలేదు. దూరవిద్యలో డిగ్రీపై కన్నేశాడు. కెరీర్‌కు బాటలు వేసుకుంటూనే ఉన్నత చదువుకు జైకొడుతున్నాడు. ‘మా కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం లేదు. నాకొచ్చిన ఉద్యోగం వాళ్లను సంతోషంలో ముంచేసింది. మెరుగైన ప్రదర్శన కోసం అత్యుత్తమ శిక్షణ తీసుకుంటున్నా. నా లక్ష్యం వచ్చే ఆగస్టులో లండన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించడం. వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలతోపాటు... 2020లో టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడం నా జీవితాశయం. వర్ధమాన అథ్లెట్లకు నేను చెప్పేదొక్కటే... నిషిద్ధ ఉత్ప్రేరకాల ఉచ్చులో పడి దేశ ప్రతిష్టను దిగజార్చవద్దు.’ – నీరజ్ చోప్రా