అమెరికాలో ఆదివారం ఉదయం భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అద్భుతం చేశాడు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని గెల్చుకున్నాడు. తద్వారా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు రజత పతకం అందించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ బాబీజార్జి కాంస్య పతకాన్ని సాధించింది. తాజా ప్రదర్శనతో నీరజ్ ఒలింపిక్స్, ఆసియా చాంపియన్‌షిప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, దక్షిణాసియా క్రీడలు, డైమండ్ లీగ్ మీట్ తదితర మెగా ఈవెంట్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా అరుదైన ఘనత సాధించాడు.
కోట్లాది మంది భారతీయుల అంచనాలను నిజం చేస్తూ... మన అథ్లెట్స్‌లోనూ ప్రపంచస్థాయి వేదికపై పతకాలు గెలిచే సత్తా ఉందని నిరూపిస్తూ... గతంలో ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ప్రదర్శనను నమోదు చేస్తూ... అమెరికా గడ్డపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ... భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అద్భుతం ఆవిష్కరించాడు. 46 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు తొలిసారి రజత పతకాన్ని అందించాడు. 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ జార్జి కాంస్య పతకాన్ని సాధించగా... నీరజ్ తాజాగా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన అథ్లెట్‌గా ఘనత వహించాడు.
యుజీన్ (అమెరికా): సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. 19 ఏళ్ల తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ మళ్లీ పతకాల బోణీ కొట్టింది. స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అందరి అంచనాలకు అనుగుణంగా రాణించి భారత్‌కు రజత పతకం అందించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) జావెలిన్‌ను 90.54 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోగా... జాకుబ్ వాద్‌లెచ్ (చెక్ రిపబ్లిక్) జావెలిన్‌ను 88.09 మీటర్ల దూరం పంపించి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. జావెలిన్ త్రో ఫైనల్లో పోటీపడిన భారత్‌కే చెందిన మరో అథ్లెట్ రోహిత్ యాదవ్ (78.22 మీటర్లు) పదో స్థానంలో నిలిచాడు.
తొలి ప్రయత్నంలో విఫలమైనా...
జావెలిన్ త్రో ఫైనల్లో మొత్తం 12 మంది పోటీపడ్డారు. తొలి మూడు రౌండ్‌ల తర్వాత టాప్–8లో నిలిచిన వారు రెండో దశకు చేరగా... మిగతా నలుగురు నిష్క్రమించారు. క్వాలిఫయింగ్‌లో తొలి ప్రయత్నంలోనే అర్హత ప్రమాణాన్ని అందుకున్న 24 ఏళ్ల నీరజ్ చోప్రా ఫైనల్లో మాత్రం తొలి అవకాశంలో ఫౌల్ చేశాడు. అయితే ఆందోళన చెందకుండా నీరజ్ నెమ్మదిగా పుంజుకున్నాడు. రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 82.39 మీటర్లు... మూడో ప్రయత్నంలో 86.37 మీటర్లు విసిరిన నీరజ్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇక నాలుగో ప్రయత్నంలో నీరజ్ తన శక్తినంతా కూడదీసుకొని జావెలిన్‌ను 88.13 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు.
నీరజ్ ఐదో, ఆరో ప్రయత్నాలు ఫౌల్ కాగా... 24 ఏళ్ల అండర్సన్ పీటర్స్ చివరిదైన ఆరో ప్రయత్నంలో ఈటెను 90.54 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. వాద్‌లెచ్, జూలియన్ వెబర్ (జర్మనీ), అర్షద్ నదీమ్ (పాకిస్తాన్) లసీ ఇటెలాటలో (ఫిన్‌లాండ్), ఆండ్రియన్ మర్డారె (మాల్డోవా) తదితరులు తర్వాతి ప్రయత్నాల్లో నీరజ్ దూరాన్ని అధిగమించకపోవడంతో భారత అథ్లెట్ ఖాతాలో రజతం చేరింది. నీరజ్ సాధించిన రజత పతకంతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ సంయుక్తంగా 29వ ర్యాంక్‌లో ఉంది. ఒక రజతం, ఐదుగురు ఫైనల్స్ చేరడంద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ ఈసారి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది.
జెలెజ్నీ తర్వాత...
డిఫెండింగ్ చాంపియన్ ఆండర్సన్ పీటర్స్ ఆరు ప్రయత్నాల్లో మూడుసార్లు జావెలిన్‌ను 90 మీటర్లకంటే ఎక్కువ దూరం విసిరి ఫైనల్లో తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. చెక్ రిపబ్లిక్ దిగ్గజం జాన్ జెలెజ్నీ (1993, 1995) తర్వాత వరుసగా రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణ పతకాలు నెగ్గిన జావెలిన్ త్రోయర్‌గా అండర్సన్ గుర్తింపు పొందాడు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ అండర్సన్ చాంపియన్‌గా నిలిచాడు.
ప్రశంసల వర్షం...
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు తొలి రజత పతకాన్ని అందించిన నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితర ప్రముఖులు నీరజ్ ప్రదర్శనను కొనియాడారు. ‘నీరజ్‌కు శుభాకాంక్షలు. భారత క్రీడల్లో ఇదెంతో ప్రత్యేక ఘట్టం. భవిష్యత్‌లో నీరజ్ మరిన్ని విజయాలు సాధించాలి’ అని ప్రధాని ట్విటర్‌లో అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత, షూటర్ అభినవ్ బింద్రా, దిగ్గజ అథ్లెట్స్ పీటీ ఉష, అంజూ బార్జి కూడా నీరజ్‌ను అభినందించారు.
విసిరితే పతకమే...
2016 జూలై 23న పోలాండ్‌లో జరిగిన ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి వెలుగులోకి వచ్చిన నీరజ్ చోప్రా అటునుంచి వెనుదిరిగి చూడలేదు. హరియాణాకు చెందిన నీరజ్ ఆ తర్వాత బరిలోకి దిగిన ప్రతి మెగా ఈవెంట్‌లో పతకంతో తిరిగి వచ్చాడు. 2016లోనే జరిగిన దక్షిణాసియా క్రీడల్లో... 2017లో ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో... 2018 జకార్తా ఆసియా క్రీడల్లో... 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో... నీరజ్ జావెలిన్ త్రోలో భారత్‌కు పసిడి పతకాలు అందించాడు. 2017లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నా ఫైనల్‌కు అర్హత పొందలేకపోయిన నీరజ్ 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మోచేయి గాయంతో బరిలోకి దిగలేదు.
గత ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచి విశ్వక్రీడల అథ్లెటిక్స్‌లో బంగారు పతకం నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ తర్వాత రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకొని గత అక్టోబర్‌లో మళ్లీ శిక్షణ ప్రారంభించాడు. గత నెలలో ఫిన్‌లాండ్‌లో జరిగిన కుర్టానో గేమ్స్‌లో స్వర్ణం... పావో నుర్మీ గేమ్స్‌లో రజతం... స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్‌లో రజతం సాధించిన నీరజ్ అదే జోరును ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కొనసాగించి భారత్‌కు తొలి రజత పతకాన్ని అందించాడు. ఈనెల 28 నుంచి బర్మింగ్‌హమ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా నీరజ్ బరిలోకి దిగనున్నాడు.
ఎల్డోజ్ పాల్‌కు తొమ్మిదో స్థానం
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆదివారమే జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్లో భారత ప్లేయర్ ఎల్డోజ్ పాల్ నిరాశపరిచాడు. కేరళకు చెందిన పాల్ 16.79 మీటర్ల దూరం గెంతి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే హీట్స్‌ను మొహమ్మద్ అనస్ యాహియా, మొహమ్మద్ అజ్మల్, నాగనాథన్ పాండి, రాజేశ్ రమేశ్‌లతో కూడిన భారత బృందం 3ని:07.29 సెకన్లలో పూర్తి చేసి ఆరో స్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందలేకపోయింది.
నీరజ్ గ్రామంలో సంబరాలు
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా ప్రదర్శనతో... హరియాణాలోని పానిపట్‌కు సమీపంలోని ఖాండ్రా గ్రామంలో నీరజ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంబరాలు చేసుకున్నారు. ‘దేశం మొత్తం, హరియాణా రాష్ట్రం మొత్తం నీరజ్ ప్రదర్శనకు గర్వపడుతోంది. నిరంతరం శ్రమిస్తూ అతను దేశానికి పేరుప్రతిష్టలు తెస్తున్నాడు’ అని నీరజ్ తల్లి సరోజ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment