Paris Olympics 2024: రజత నీరాజనం | Neeraj Chopra wins silver claims second successive Olympic medal | Sakshi
Sakshi News home page

Paris Olympics 2024: రజత నీరాజనం

Published Fri, Aug 9 2024 3:36 AM | Last Updated on Fri, Aug 9 2024 10:57 AM

Neeraj Chopra wins silver claims second successive Olympic medal

వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన నీరజ్‌ చోప్రా 

జావెలిన్‌ను 89.45 మీటర్లు విసిరి రజత పతకం సొంతం 

స్వర్ణ పతకం సాధించిన పాకిస్తాన్‌ ప్లేయర్‌ అర్షద్‌ నదీమ్‌ 

92.97 మీటర్లతో ఒలింపిక్‌ రికార్డు నెలకొల్పిన నదీమ్‌

పారిస్‌: పసిడి ఆశలతో ‘పారిస్‌’లో అడుగు పెట్టిన భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల జావెలిన్‌ త్రో ఈవెంట్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. రెండో ప్రయత్నంలో 26 ఏళ్ల నీరజ్‌ జావెలిన్‌ను 89.45 మీటర్ల దూరం విసిరి ఈ సీజన్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. చివరకు ఈ స్కోరుతోనే నీరజ్‌కు రజత పతకం ఖరారైంది.

క్వాలిఫయింగ్‌లో 89.34 మీటర్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచిన నీరజ్‌ ఫైనల్లో కాస్త ఒత్తిడికి లోనయ్యాడు. అతడి తొలి ప్రయత్నం ఫౌల్‌ అయింది. రెండో ప్రయత్నంలో నీరజ్‌ ఆందోళన చెందకుండా సంయమనంతో జావెలిన్‌ను 89.45 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత నీరజ్‌ మూడు, నాలుగు, ఐదు, ఆరో ప్రయత్నాలు కూడా ఫౌల్‌గానే నమోదయ్యాయి. దాంతో ఈ త్రోలలో నమోదైన స్కోరును పరిగణనలోకి తీసుకోలేదు. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌ స్వర్ణ పతకాన్ని సాధించాడు.  

ఎవరూ ఊహించని విధంగా జావెలిన్‌ త్రోలో పాకిస్తాన్‌కు చెందిన అర్షద్‌ నదీమ్‌ స్వర్ణ పతకాన్ని గెల్చుకొని అందర్నీ నివ్వెరపరిచాడు. 27 ఏళ్ల నదీమ్‌ తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే రెండో ప్రయత్నంలో నదీమ్‌ జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరి కొత్త ఒలింపిక్‌ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో ఆండ్రెస్‌ థోర్‌కిల్డ్‌సన్‌ (నార్వే; 90.57 మీటర్లు) నెలకొల్పిన రికార్డును నదీమ్‌ బద్దలు కొట్టాడు. ప్రపంచ మాజీ చాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా) 88.54 మీటర్లతో కాంస్య పతకాన్ని సాధించాడు.  

1 వ్యక్తిగత క్రీడాంశంలో ఒలింపిక్స్‌ చరిత్రలో పాకిస్తాన్‌కు తొలి స్వర్ణ పతకం నదీమ్‌ ద్వారా లభించింది. గతంలో పాకిస్తాన్‌ హాకీ జట్టు 3 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలు గెలిచింది. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌ రెజ్లర్‌ మొహమ్మద్‌ బషీర్‌ కాంస్యం... 1988 సియోల్‌ ఒలింపిక్స్‌లో బాక్సర్‌ హుస్సేన్‌ షా కాంస్యం సాధించారు.  

4 ఒలింపిక్స్‌ క్రీడల్లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన నాలుగో భారత ప్లేయర్‌గా నీరజ్‌ గుర్తింపు పొందాడు. గతంలో రెజ్లర్‌ సుశీల్‌ (2008 బీజింగ్‌; కాంస్యం... 2012 లండన్‌; రజతం), షట్లర్‌ పీవీ సింధు (2016 రియో; రజతం... 2020 టోక్యో; కాంస్యం), షూటర్‌ మనూ భాకర్‌ (2024 పారిస్‌; 2 కాంస్యాలు) ఈ ఘనత సాధించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement