
ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2022లో రజత పతకం గెలిచి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం గెలిచిన రెండో భారత అథ్లెట్‌గా చోప్రా నిలిచాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితర ప్రముఖులు నీరజ్ ప్రదర్శనను కొనియాడారు
ఇక పతకం సాధించిన అనంతరం నీరజ్ చోప్రా మాట్లాడూతూ.. "కఠిన ప్రత్యర్థుల నడుమ క్లిష్ట వాతావరణ పరిస్థితుల మధ్య రజత పతకం గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒలింపిక్స్‌తో పోలిస్తే ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనే పోటీ ఎక్కువగా ఉంటుంది. తొలి మూడుప్రయత్నాల్లో జావెలిన్‌ను అనుకున్నంత దూరం విసరకపోయినా నాలుగో ప్రయత్నంలో అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నాను.
నాలుగో త్రో అనంతరం తొడలో నొప్పి కలగడంతో తర్వాతి రెండు త్రోలు సవ్యంగా చేయలేకపోయా. ఏ క్రీడాకారుడైనా బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో స్వర్ణ పతకం సాధించలేడు. ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో మినహా అన్ని ప్రముఖ టోర్నీలలో నేను బంగారు పతకాలు సాధించాను. నా ప్రదర్శనను మరింత మెరుగు పర్చుకొని వచ్చే ఏడాది హంగేరిలో జరిగే ప్రపంచ చాంపియన్ షిప్‌లో స్వర్ణ పతకం సాధించేందుకు కృషి చేస్తా" అని పేర్కొన్నాడు.
చదవండి: Neeraj Chopra: నీరజ్ చోప్రా 'రజతం'.. డ్యాన్స్‌తో ఇరగదీసిన కుటుంబసభ్యులు