నేడు పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ పోటీలు
ఫేవరెట్‌గా భారత స్టార్ నీరజ్ చోప్రా
కిశోర్‌పై కూడా ఆశలు
మధ్యాహ్నం గం. 3:20 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
పారిస్: భారీ అంచనాలతో పారిస్ ఒలింపిక్స్‌లో అడుగు పెట్టిన ఒలింపిక్ డిఫెండింగ్ చాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మంగళవారం క్వాలిఫయింగ్ బరిలోకి దిగనున్నాడు. 2020 టోక్యో ఓలింపిక్స్‌లో నీరజ్ పసిడి పతకం సాధించి దేశ అథ్లెటిక్స్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. ‘పారిస్’లోనూ టోక్యో ప్రదర్శనను పునరావృతం చేయాలని పట్టుదలతో ఉన్నాడు.
టోక్యో విశ్వ క్రీడల తర్వాత అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కొనసాగించిన 26 ఏళ్ల నీరజ్ గత ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి విశ్వవిజేతగా నిలిచాడు. ‘పారిస్’ నుంచి కూడా పతకంతో తిరిగి వస్తాడని యావత్ భారతావని ఆశలు పెట్టుకోగా... వాటిని అందుకోవడమే లక్ష్యంగా నేడు నీరజ్ మైదానంలో అడుగు పెట్టనున్నాడు.
గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఆచితూచి టోరీ్నల్లో పాల్గొన్న 26 ఏళ్ల నీరజ్.. ఈ ఏడాది బరిలోకి దిగిన మూడు టోరీ్నల్లోనూ ఆకట్టుకున్నాడు. ఈ విభాగంలో భారత్ నుంచి నీరజ్ చోప్రాతోపాటు.. కిశోర్ కుమార్ జేనా కూడా పోటీ పడుతున్నాడు. రెండు గ్రూప్‌ల్లో కలిపి మొత్తం 32 మంది త్రోయర్లు బరిలోకి దిగుతున్నారు. గ్రూప్ ‘బి’లో నీరజ్... కిశోర్ గ్రూప్ ‘ఎ’లో ఉన్నారు. ఫైనల్ చేరడానికి అర్హత ప్రమాణంగా 84 మీటర్లు నిర్ణయించారు.
క్వాలిఫయింగ్ రౌండ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 12 మంది ఫైనల్‌కు అర్హత సాధించనున్నారు. ఒకవేళ 12 మంది కంటే ఎక్కువ మంది 84 మీటర్లను దాటి జావెలిన్‌ను విసిరితే ఇందులో నుంచి టాప్–12 మందికి ఫైనల్ బెర్త్‌లు లభిస్తాయి. ఫైనల్ గురువారం జరుగుతుంది. పాకిస్తాన్ త్రోయర్ నదీమ్ అర్షద్, జాకబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్), వెబర్ (జర్మనీ), ఒలీవర్ (ఫిన్‌లాండ్) నుంచి నీరజ్‌కు ప్రధాన పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి.
నీరజ్ టైటిల్ నిలబెట్టుకుంటే.. ఒలింపిక్స్‌లో ఆ ఘనత సాధించిన ఐదో జావెలిన్ త్రోయర్ కానున్నాడు. విశ్వక్రీడల చరిత్రలో ఎరిక్ లామింగ్ (స్వీడన్; 1908, 1912), జానీ మైరా (ఫిన్‌లాండ్; 1920, 1924), జాన్ జెలెన్జీ (చెక్ రిపబ్లిక్; 1992, 1996, 2000), ఆండ్రీస్ థోర్‌కిల్డ్‌సెన్ (నార్వే; 2004, 2008) స్వర్ణాన్ని నిలబెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment