తాను ఈ ఏడాది ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని.. తిరిగి పూర్తి ఫిట్‌నెస్‌తో మళ్లీ బరిలోకి దిగుతానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అన్నాడు. 2024లో తాను పాల్గొనబోయే చివరి టోర్నీని విజయంతో ముగించాలనకున్నానని.. అయితే, అంచనాలు అందుకోలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు. పోటీకి ముందు తాను గాయపడ్డాడని.. అయినప్పటికీ తన టీమ్ సహకారం వల్ల రెండో స్థానంలో నిలవగలిగానని పేర్కొన్నాడు.
కాగా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ మీట్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్‌లో నీరజ్ చోప్రా రెండో స్థానాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. బ్రసెల్స్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో గ్రెనెడాకు చెందిన వరల్డ్ మాజీ చాంపియన్ అండర్సన్ పీటర్స్ విజేతగా నిలిచాడు.
అతడే టైటిల్ విన్నర్
పీటర్స్ జావెలిన్‌ను 87.87 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకోగా.. నీరజ్ ఈటెను 87.86 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో రెండో స్థానంలో నిలిచిన అతడికి ప్రైజ్‌మనీగా 12 వేల డాలర్లు (రూ. 10 లక్షలు) లభించాయి.ఇక జర్మనీకి చెందిన జూలియన్ వెబెర్ 85.97 మీటర్లు జావెలిన్‌ను విసిరి మూడో స్థానంలో నిలిచాడు.
ఒలింపిక్స్‌లోనూ రెండోస్థానంలో
కాగా ఈ ఏడాది నీరజ్ మెరుగ్గానే రాణించాడు. అయితే, ఒలింపిక్స్‌లో రెండో స్వర్ణం గెలవాలన్న అతడి కల నెరవేరలేదు. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్.. అర్షద్ నదీం పసిడి పతకం గెలవగా.. నీరజ్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక డైమండ్ లీగ్‌లోనైనా అగ్రస్థానంలో నిలుస్తాడనుకుంటే.. అక్కడే రెండో స్థానమే దక్కింది.
అయితే, ఓవరాల్‌గా నీరజ్ డైమండ్ లీగ్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్‌లో టాప్–3లో నిలువడం ఇది మూడోసారి. 2022 గ్రాండ్ ఫైనల్లో విజేతగా నిలిచిన నీరజ్... 2023 గ్రాండ్ ఫైనల్లో రెండో స్థానాన్ని పొందాడు. ఈసారి డైమండ్ లీగ్ ఫైనల్లో ఈ సీజన్ మొత్తం నీరజ్ నిలకడగా రాణించాడు. ఆరు టోర్నీల్లో పోటీపడి ఐదింటిలో రెండో స్థానాన్ని, ఒక టోర్నీలో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
అథ్లెట్‌గా.. వ్యక్తిగా మరింత మెరుగయ్యాను
ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘‘ఈ ఏడాది మిశ్రమ భావనలతో ముగిసింది. సోమవారం.. నేను గాయపడ్డాను. నా ఎడమఅరచేతిలోని ఎముక ఫాక్చర్ అయినట్లు ఎక్స్ రే ద్వారా తేలింది. పోటీకి ముందు ఇలా కావడం తీవ్రంగా బాధించింది. అయితే, నా టీమ్ నన్ను బ్రసెల్స్ లీగ్‌లో పాల్గొనేలా సమాయత్తం చేసింది.
ఈ ఏడాది ఇదే చివరి కాంపిటీషన్. టైటిల్‌తో ముగించాలని కోరుకున్నా. కానీ అలా జరుగలేదు. ఏదేమైనా ఈ ఏడాది ఎన్నో కొత్త పాఠాలు నేర్చుకున్నాను. త్వరలోనే మళ్లీ పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి వస్తా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
ఈ ఏడాది అథ్లెట్‌గా.. వ్యక్తిగా మరింత మెరుగయ్యాను. 2025లో కలుసుకుందాం’’ అని ఉద్వేగపూరిత నోట్ రాశాడు. ఈ క్రమంలో.. ప్యారిస్ ఒలింపిక్స్ కాంస్య పతకాల విజేత, షూటర్ మనూ భాకర్ బదులిస్తూ.. నీరజ్ చోప్రాను అభినందించింది.
స్పందించిన మనూ భాకర్
‘‘2024 సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నావు నీరజ్ చోప్రా. నువ్వు త్వరగా కోలుకోవాలని.. వచ్చే ఏడాది మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’’ అని మనూ భాకర్ ఆకాంక్షించింది.
కాగా ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల తర్వాత నీరజ్ చోప్రా.. మనూ భాకర్, ఆమె తల్లితో ముచ్చటించిన దృశ్యాలు వైరలైన విషయం తెలిసిందే. దీంతో ఈ హర్యానా అథ్లెట్ల మధ్య మంచి అనుబంధం ఉందంటూ వార్తలు రాగా.. మనూ భాకర్ తండ్రి స్పందిస్తూ.. నీరజ్ తమ కుమారుడి లాంటి వాడని పేర్కొన్నారు.
చదవండి: ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
Comments
Please login to add a commentAdd a comment