వచ్చే నెలలో ప్యారిస్ ఒలింపిక్స్. అన్ని దేశాల ఆటగాళ్లే కాదు మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా కెమెరాలతో బయలుదేరుతారు. కాని ‘ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ’ (ఐ.ఓ.సి) గుర్తింపు పొందిన వారికే అన్ని మైదానాల్లో ప్రవేశం. అలాంటి అరుదైన గుర్తింపును పొందిన మొదటి భారతీయ మహిళా ఫొటోగ్రాఫర్ గీతికా తాలూక్‌దార్. అస్సాంకు చెందిన స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ గీతికా తాలూక్‌దార్ పరిచయం.
‘స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ని ఎంచుకోవడానికి స్త్రీలు పెద్దగా ముందుకు రారు. ఎందుకంటే అది మగవాళ్ల రంగం చాలా రోజులుగా. అక్కడ చాలా సవాళ్లు ఉంటాయి. నేను వాటన్నింటినీ అధిగమించి ఇవాళ గొప్ప గుర్తింపు పొందగలిగాను’ అని సంతోషం వ్యక్తం చేసింది గీతికా తాలూక్‌దార్. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకూప్యారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్ పోటీల్లో ఫొటోలు తీయడానికి ఆమెకు అక్రిడిటేషన్ లభించింది.
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటి (ఐ.ఓ.సి) చాలా తక్కువ మంది ఫొటోగ్రాఫర్లకు మాత్రమే ఒలింపిక్స్‌ను కవర్ చేసే అధికారిక గుర్తింపు ఇస్తుంది. ఈసారి ప్రపంచవ్యాప్తంగా అతి కొద్దిమంది మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్లు ఈ గుర్తింపు పొందితే మన దేశం నుంచి మొదటి, ఏకైక మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌గా గీతికా తాలూక్‌దార్ చరిత్ర సృష్టించింది.
ఫ్రీ లాన్సర్‌గా...
‘స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ అంటే విస్తృతంగా పర్యటించాలి. సంస్థలో ఉద్యోగిగా ఉన్నప్పుడు సంస్థలు ఒక్కోసారి అనుమతిస్తాయి, మరోసారి అనుమతించవు. అందుకని నేను ఫ్రీలాన్సర్‌గా మారాను. స్వేచ్ఛ పొందాను. నా సేవలు కావాల్సిన సంస్థలు నన్ను సంప్రదిస్తాయి’ అంది గీతిక. ఫ్రీ లాన్సర్‌గా ఉంటూనే ఆమె ఇంకా చదువు కొనసాగించింది.
కొలంబోలో డిప్లమా కోర్సు చేసింది. అలాగే సౌత్ కొరియా స్పోర్ట్స్ మినిస్ట్రీ వారి స్కాలర్‌షిప్ పొంది సియోల్ నేషనల్ యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ‘కొలంబోలో చదువుకునే సమయంలో సర్ రిచర్డ్ హ్యాడ్లీని ఇంటర్వ్యూ చేయడం గొప్ప అనుభవం. అక్కడ ఆయన పేద పిల్లలకు క్రికెట్ నేర్పేందుకు అకాడెమీ నిర్వహిస్తున్నారు. నేను వెళ్లిన రోజు బాల్ ఎలా విసరాలో నేర్పుతున్నారు. నేను ఇంటర్వ్యూ అడిగితే ఇచ్చారు’ అని చెప్పింది గీతిక.
కోవిడ్ రిస్క్ ఉన్నా...
ప్రపంచంలో ఎక్కడ భారీ క్రీడా వేడుకలు జరుగుతుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంది గీతిక. ఆస్ట్రేలియా ఫీఫా విమెన్స్ వరల్డ్ కప్, ఖతార్‌లో జరిగిన ఫీఫా వరల్డ్ కప్ పోటీలను ఆమె కవర్ చేసింది. 2020 సియోల్ ఒలింపిక్స్‌కు కోవిడ్ కారణంగా చాలా మంది అక్రిడిటెడ్ ఫొటో జర్నలిస్టులు వెళ్లడానికి భయపడ్డారు. కాని అక్రిడిటేషన్ లేకున్నా గీతిక అక్కడకు వెళ్లి ప్రాణాలకు తెగించి ఫొటోలు తీసి గుర్తింపు పొందింది.
తన వృత్తి పట్ల ఆమెకు ఉన్న ఈ అంకిత భావాన్నే ఒలింపిక్స్ కమిటీ గుర్తించింది. అందుకే ఈసారి అధికారికంగా ఆహ్వానం పలికింది. జూలై 23న ప్యారిస్ బయలుదేరి వెళ్లనుంది గీతిక. ‘గేమ్స్ వైడ్ ఓపెన్’ అనేది ఈసారి ఒలింపిక్స్ థీమ్. మరిన్ని వర్గాలను కలుపుకుని ఈ క్రీడలు జరగాలనేది ఆశయం. తక్కువ గుర్తింపుకు నోచుకునే మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌లను ప్రత్యేకంగా ఆహ్వానించడం కూడా ఈ ఆశయంలో భాగమే.
‘నాకొచ్చిన అవకాశం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మరింత కష్టపడి పని చేస్తాను. స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ను ఎంచుకోవాలనుకునేవారికి క్రమశిక్షణ అవసరం. అంతర్జాతీయ క్రీడాపోటీలు టైముకు మొదలయ్యి టైమ్‌కు ముగుస్తాయి. వాటిని అందుకోవాలంటే క్రీడల్లోని ఉత్తమ క్షణాలను కెమెరాలో బంధించాలంటే ఏకాగ్రత, క్రమశిక్షణ చాలా అవసరం. అవి ఉన్నవారు ఈ రంగంలో నిస్సందేహంగా రాణిస్తారు’ అంటోంది గీతిక.
‘టీ సిటీ’ అమ్మాయి
అస్సాంలోని డూమ్‌డుమా పట్టణాన్ని అందరూ ‘టీ సిటీ’ అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ తేయాకు తోటలు విస్తారం. హిందూస్తాన్ లీవర్ టీ ఎస్టేట్ అక్కడే ఉంది. ఆ ఊళ్లో చిన్న ఉద్యోగి కుమార్తె అయిన గీతిక చిన్నప్పటి నుంచి కెమెరాతో ప్రేమలో పడింది. అందుకు కారణం ఆమె మేనమామ
చంద్ర తాలూక్‌దార్ ఫిల్మ్‌మేకర్‌గా గుర్తింపు పొందడం.
అతను కెమెరాలో నుంచి చూస్తూ రకరకాల దృశ్యాలను అందంగా బంధించడాన్ని బాల్యంలో గమనించిన గీతిక తాను కూడా అలాగే చేయాలనుకుంది. పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేశాక మాస్ కమ్యూనికేషన్‌లో డి΄÷్లమా చేసింది. క్రీడలంటే ఆసక్తి ఉండటంతో స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా, ఫొటోగ్రాఫర్‌గా మారి 2005 నుంచి డీఎన్‌ఏ, బీబీసీ, ఇండియా టుడే, పీటీఐ వంటి సంస్థలతో పనిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment