Olympics–2024: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ ఈవెంట్‌లో తొలి అడుగు..! | Sports News: Indian Team Qualified For Paris Olympics-2024 | Sakshi
Sakshi News home page

Olympics–2024: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ ఈవెంట్‌లో తొలి అడుగు..!

Published Sun, Mar 17 2024 11:29 AM | Last Updated on Sun, Mar 17 2024 11:43 AM

Sports News: Indian Team Qualified For Paris Olympics-2024 - Sakshi

కొత్తగా దూసుకొచ్చిన టీటీ బృందం

ఒలింపిక్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఈ పది మంది ప్లేయర్లు

వరుస విజయాలతో భారత జట్టు పారిస్‌ ఒలింపిక్స్‌–2024కు అర్హత

'ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ ఈవెంట్‌లో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాంశంలో భారత్‌ నుంచి టీమ్‌ ప్రాతినిధ్యం ఎన్నడూ లేదు. వ్యక్తిగత విభాగాల్లో మన ప్లేయర్లు బరిలోకి దిగినా ఏనాడూ పతకానికి చేరువగా రాలేదు. అయితే ఈతరంలో కొత్తగా దూసుకొచ్చిన టీటీ బృందం ఆశలు రేపుతోంది. ఇటీవల వరుస విజయాలతో భారత జట్టు పారిస్‌ ఒలింపిక్స్‌–2024కు అర్హత సాధించింది. సమష్టి ప్రదర్శనలతో మన ప్యాడ్లర్లు ఆకట్టుకున్నారు. అటు పురుషుల, ఇటు మహిళల విభాగాల్లోనూ తొలిసారి భారత జట్టు.. టీమ్‌ ఈవెంట్స్‌ బరిలోకి దిగనుండటం విశేషం. దేశం తరఫున ఒలింపిక్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఆ పది మంది ప్లేయర్ల వివరాలను చూస్తే..'

ఆచంట శరత్‌ కమల్‌: భారత టేబుల్‌ టెన్నిస్‌లో నిస్సందేహంగా ఆల్‌టైమ్‌ గ్రేట్‌. చెన్నైకి చెందిన 41 ఏళ్ల శరత్‌ కమల్‌కి ఏకంగా 10సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన ఘనత ఉంది. సుదీర్ఘ కాలంగా భారత టీటీకి దిక్సూచిలా, మార్గదర్శిలా ముందుండి నడిపిస్తున్నాడు.

అంతర్జాతీయ స్థాయిలో పలు కీలక విజయాలతో ప్రతిసారీ మన దేశ ఆశలు మోస్తున్న సీనియర్‌ ప్లేయర్‌. 2006 నుంచి 2022 మధ్య ఆరుసార్లు కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్న శరత్‌ కమల్‌ 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు గెలుచుకున్నాడు. రెండు ఆసియా క్రీడల కాంస్యాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. 2004 ఒలింపిక్స్‌లో పాల్గొన్న అతను ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌ బరిలోకి దిగుతుండటం విశేషం. క్రీడా పురస్కారాలు అర్జున, ఖేల్‌రత్నలతో పాటు పౌర పురస్కారం పద్మశ్రీ కూడా అందుకున్నాడు.

సత్యన్‌ జ్ఞానశేఖరన్‌: 31 ఏళ్ల సత్యన్‌ స్వస్థలం చెన్నై. నాలుగేళ్ల క్రితం ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో 24వ స్థానానికి చేరిన సత్యన్‌.. టాప్‌–25లోకి అడుగు పెట్టిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటికీ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ తరఫున అతనే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు సాధించిన సత్యన్‌ ఆసియా క్రీడల్లోనూ ఒక కాంస్యం అందుకున్నాడు. 2018లో అతనికి అర్జున అవార్డు దక్కింది.

మానవ్‌ ఠక్కర్‌: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ అండర్‌–18 స్థాయి ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌కు చేరుకోవడంతో మానవ్‌ ఠక్కర్‌కు తొలిసారి చెప్పుకోదగ్గ గుర్తింపు లభించింది. ఆ తర్వాత అండర్‌–21లోనూ అతను నంబర్‌వన్‌గా నిలిచాడు.

23 ఏళ్ల ఠక్కర్‌ స్వస్థలం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌. ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో ఒక కాంస్యం, ఆసియా చాంపియన్‌షిప్‌లో 3 కాంస్యాలు సాధించాడు. శరత్‌ కమల్, సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ తర్వాత ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక టీటీ లీగ్‌ బుందేస్‌లిగాలో ఆడిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. భారత వర్ధమాన ఆటగాళ్లలో అందరికంటే ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఠక్కర్‌ ఒలింపిక్స్‌లో పతకం గెలవడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు.

హర్మీత్‌ దేశాయ్‌: గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన హర్మీత్‌ దేశాయ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో 2 స్వర్ణాలు, 1 కాంస్యంతో పాటు ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించాడు. ఆసియా చాంపియన్‌షిప్‌లో 3 కాంస్యాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న భారత జట్టులో హర్మీత్‌ సభ్యుడిగా ఉన్నాడు. 30 ఏళ్ల హర్మీత్‌ గుజరాత్‌ నుంచి జాతీయ విజేతగా నిలిచిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. క్రీడా పురస్కారం అర్జున అవార్డు అతని ఖాతాలో ఉంది.

మనుష్‌ షా: 22 ఏళ్ల మనుష్‌ షా స్వస్థలం గుజరాత్‌లోని వడోదరా. రెండేళ్ల క్రితం సీనియర్‌ నేషనల్స్‌లో కాంస్యం సాధించడంతో వెలుగులోకి వచ్చిన అతను అంతే వేగంగా దూసుకుపోయాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి టాప్‌–100లోకి వచ్చిన పిన్న వయస్కుడిగా అతను గుర్తింపు పొందాడు.

10 ఏళ్ల క్రికెటర్‌గా మారే ప్రయత్నంలో అతను సాధన కొనసాగించాడు. అయితే స్కూల్‌లో ఎత్తు నుంచి పడిపోవడంతో డాక్టర్ల సూచనతో అవుట్‌డోర్‌ ఆటకు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. అప్పుడు అతను టేబుల్‌ టెన్నిస్‌ను ఎంచుకున్నాడు. నిలకడైన ప్రదర్శనతో ఇప్పుడు భారత్‌ తరఫున టీమ్‌ ఈవెంట్లలో రెగ్యులర్‌ సభ్యుడిగా మారాడు.

ఆకుల శ్రీజ: హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల ఆకుల శ్రీజ ఇప్పుడు భారత్‌ తరఫున అత్యంత విజయ వంతమైన ప్లేయర్‌గా కొనసాగుతోంది. 2021 సీనియర్‌ నేషనల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన శ్రీజ తర్వాతి ఏడాది మరింత మెరుగైన ప్రదర్శన కనబరచింది. 2022లో జాతీయ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో ఆమె విజేతగా నిలిచింది.

1964లో మీర్‌ ఖాసిం అలీ తర్వాత హైదరాబాద్‌ నుంచి టీటీలో జాతీయ చాంపియన్‌గా నిలిచిన తొలి ప్లేయర్‌ శ్రీజ కావడం విశేషం. రెండేళ్ల క్రితం బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించడం ఆమె కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన. చదువులో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్న శ్రీజ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగిగా పని చేస్తోంది. ప్రస్తుతం భారత నంబర్‌వన్‌గా ఉన్న ఈ అమ్మాయి ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా సన్నద్ధమవుతోంది. రెండేళ్ల క్రితం శ్రీజ అర్జున అవార్డు కూడా గెలుచుకుంది.

మనికా బత్రా: రెండేళ్ల క్రితం అర్చనా కామత్‌తో కలసి మనికా బత్రా ప్రపంచ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి చేరింది. ఏ విభాగంలోనైనా ఇప్పటి వరకు భారత్‌ తరఫున ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్‌. సుదీర్ఘ కాలంగా వరుస విజయాలతో భారత టేబుల్‌ టెన్నిస్‌లో తనదైన ముద్ర వేసింది. కామన్వెల్త్‌ క్రీడల్లో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం గెలుచుకున్న ఆమె ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించింది.

ఇంట్లో సోదర, సోదరీలను చూసి టీటీ వైపు ఆసక్తి పెంచుకున్న 28 ఏళ్ల మనికా ఇప్పుడు భారత జట్టులో కీలక సభ్యురాలు. అర్జున, ఖేల్‌రత్న అవార్డులను అందుకున్న ఈ ఢిల్లీ ప్లేయర్‌కు మున్ముందు మరిన్ని ఘనతలు సాధించగల సత్తా ఉంది. ఆటతో పాటు అందం ఉన్న మనికకు మంచి బ్రాండింగ్‌ సంస్థల నుంచి మోడలింగ్‌ అవకాశాలు వచ్చినా.. టీటీపైనే దృష్టి పెట్టేందుకు వాటన్నింటినీ తిరస్కరించింది.

ఐహికా ముఖర్జీ: కోల్‌కతా శివార్లలోని నైహతి ఐహికా స్వస్థలం. గత ఏడాది ఆసియా క్రీడల్లో మహిళల డబుల్స్‌లో సుతీర్థ ముఖర్జీతో కలసి ఐహికా సెమీఫైనల్‌కు చేరింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో గెలిచి కాంస్యం సొంతం చేసుకున్న ఈ జోడి ఆసియా క్రీడల మహిళల డబుల్స్‌లో భారత్‌కు తొలిసారి పతకాన్ని అందించింది. వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో చైనా దిగ్గజం సున్‌ యింగ్‌షాపై సాధించిన పలు విజయాలు ఐహిక ఖాతాలో ఉన్నాయి. ఇటీవలే ఐహికకు అర్జున అవార్డు కూడా దక్కింది.

దియా చిటాలే: ముంబైకి చెందిన 21 ఏళ్ల దియా చిటాలే జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ ప్రదర్శనలతో గుర్తింపులోకి వచ్చింది. అండర్‌–15 స్థాయి నుంచి వరుసగా కేడెట్, జూనియర్‌ స్థాయిలలో వేర్వేరు వయో విభాగాల్లో ఆమె విజేతగా నిలిచింది.

ఆటతో పాటు రెండేళ్ల క్రితం చెలరేగిన ఒక వివాదంతో దియా వార్తల్లో నిలిచింది. 2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల కోసం ఎంపిక చేసిన భారత జట్టులో తనకు చోటు దక్కకపోవడంతో దియా కోర్టును ఆశ్రయించింది. తన ప్రదర్శన, రికార్డులతో ఆమె కోర్టులో పోరాడింది. చివరకు న్యాయస్థానం ఆదేశాలతో దియాకు భారత జట్టులో స్థానం లభించడం విశేషం.

అర్చనా కామత్‌: 23 ఏళ్ల అర్చనా కామత్‌ స్వస్థలం బెంగళూరు. తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. 11 ఏళ్ల వయసులో రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్‌ అండర్‌–12, అండర్‌–18 టైటిల్స్‌ సాధించి సంచలనం సృష్టించింది. 14 ఏళ్లకే అండర్‌–21లో కూడా విజేతగా నిలవడంతో మరింత గుర్తింపు లభించింది.

2018లో తొలిసారి సీనియర్‌ నేషనల్స్‌ గెలిచిన తర్వాత ఆమె వేగంగా దూసుకుపోయింది. 2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడలకు ముందుగా జట్టులో ఎంపికై ఆ తర్వాత దియా చిటాలేకు వచ్చిన అనుకూల కోర్టు తీర్పుతో చోటు కోల్పోయింది. అయితే తర్వాతి ఏడాది సీనియర్‌ జాతీయ ర్యాంకింగ్‌ టోర్నీలో విజేతగా నిలిచి సత్తా చాటింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో డబుల్స్‌లో కొంతకాలంగా టాప్‌–15లో కొనసాగుతోంది. — మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది

ఇవి చదవండి: PSL 2024: నిరాశపరిచిన బాబర్‌.. ఫైనల్‌కు చేరిన షాదాబ్‌ ఖాన్‌ జట్టు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement