మొహమ్మద్ అబ్దుల్ హాది
ఏమీ చేతకాని, ఏ పనీ చేయలేని బతుకూ ఒక బతుకేనా? దీనికంటే ఆత్మహత్య నయమంటూ, మరుగుజ్జు అంటూ హేళన చేసిన వాళ్లంతా ఇప్పుడు అతని మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. కారణం.. పారిస్ పారాలింపిక్స్‌లో అతను జావెలిన్ త్రోలో స్వర్ణాన్ని అందుకోవడమే! ఆ క్రీడాకారుడు 23 ఏళ్ల నవదీప్ సింగ్. విజయానంతరం ఆ జావెలిన్ త్రోయర్ భారత్ తిరిగి వచ్చాక, దేశ ప్రధాని నరేంద్ర మోదీ అతనితో సరదాగా మాట్లాడిన తీరు చూస్తే.. నవదీప్ తన ఆటతో ప్రపంచం దృష్టిని ఎలా ఆకర్షించాడో అర్థమవుతుంది. పారాలింపిక్స్‌లో అతను సాధించిన విజయం సామాన్యమైంది కాదు. ఆత్మన్యూనతాభావంతో బతికే ఎంతోమంది నేర్చుకోవాల్సిన పాఠం. ఆ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.
హరియాణాలోని పానిపట్ సమీపంలో బువానా లాఖు నవదీప్ సొంత ఊరు. తండ్రి దల్వీర్ సింగ్ స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఉద్యోగి. జన్యుపరమైన లోపాలతో పుట్టడం వల్ల నవదీప్ వయసుకు తగ్గట్టు ఎదగలేకపోయాడు. పిల్లాడికి రెండేళ్లు వస్తేగానీ పరిస్థితి తీవ్రత తల్లిదండ్రులకు అర్థం కాలేదు. అప్పుడు కొడుకు చికిత్స కోసం వాళ్లు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఊర్లో అతను మరుగుజ్జు నవదీప్‌గా స్థిరపడిపోయాడు. దాంతో బాల్యం నుంచే అతను అత్యంత అవసరమైతే తప్ప బయటకు రాకుండా, ఇంట్లోనే ఉండిపోసాగాడు. ‘కొన్నిసార్లు మాతో కూడా మాట్లాడకుండా గదికి గడియ పెట్టుకుని, ఏడుస్తూ ఉండిపోయేవాడ’ని అతని పెద్దన్న మన్‌దీప్ గుర్తు చేసుకుంటాడు. కొడుకును సాధారణ స్థితికి తెచ్చేందుకు నవదీప్ తండ్రి తనకు సాధ్యమైనంతగా ప్రయత్నించాడు. నవదీప్ చదువుకునేందుకు మంచి మంచి పుస్తకాలను తెచ్చివ్వడంతో పాటు, ఇతర అంశాలపై అతను దృష్టి సారించేలా చేశాడు.
రాష్ట్రపతి అవార్డుతో..
నవదీప్‌ని ఒంటరితనం నుంచి బయటపడేసేవి ఆటలే అని భావించారంతా! దాంతో ఇంట్లోవాళ్లు అతణ్ణి ఆటల వైపు ప్రోత్సహించారు. నవదీప్ తండ్రికి రెజ్లింగ్‌లో స్థానిక పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉంది. నవదీప్ కూడా ముందుగా రెజ్లింగ్‌లోనే సాధన చేశాడు. అయితే అక్కడా అతనికి తన ఆరోగ్యం కొంత సమస్యగా మారింది. వెన్ను నొప్పి కారణంగా రెజ్లింగ్ సాధ్యం కాదని అర్థమవడంతో దానిని వదిలేశాడు. స్థానిక గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతున్నప్పుడు స్పోర్ట్స్‌పై మరింత ఆసక్తి పెరిగింది. పీఈటీ ప్రోత్సాహంతో అతను అథ్లెటిక్స్ వైపు మళ్లాడు. అందులో అందరితో పోటీపడుతూ సాధించిన విజయాలు నవదీప్‌కు గ్రామంలో మంచి పేరు తెచ్చి పెట్టాయి. అతని క్రీడా ప్రతిభ హరియాణాను దాటింది. వైకల్యాన్ని అధిగమించి పలు జాతీయ స్థాయి పోటీల్లోనూ మంచి ప్రదర్శన నమోదు చేశాడు. 12 ఏళ్ల వయసులో అతను కేంద్ర ప్రభుత్వం అందించే ‘రాష్ట్రీయ బాల్‌పురస్కార్’ అవార్డుకు ఎంపికయ్యాడు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్న ఈ అవార్డు తన మరుగుజ్జుతనాన్ని మరచిపోయేలా చేసింది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
ప్రత్యేక శిక్షణతో ..
బాల్‌పురస్కార్ అవార్డు తర్వాత క్రీడలపై పూర్తిగా దృష్టి సారించవచ్చని నవదీప్‌కు నమ్మకం కలిగింది. మరికొంత కాలం అథ్లెటిక్స్‌పై మరింత సాధన చేసి ఆటలో పదును పెంచుకున్నాడు. ఆ తర్వాత శ్రేయోభిలాషులందరూ అండగా నిలవడంతో పెద్దస్థాయిలో శిక్షణ కోసం, నవదీప్ తన 16వ ఏట ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడి కోచ్ నావల్ సింగ్ వద్ద అథ్లెటిక్స్‌లో కోచింగ్, ప్రాక్టీస్ సాగింది. నవదీప్‌కి ఇంకా తోడుగా ఉండటం వల్ల అతను పైకి రాలేడని, అతను స్వతంత్రంగా ఉండే ఏర్పాట్లు చేయాలని పెద్దన్న మన్‌దీప్ తన తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. దాంతో తండ్రి ఎల్‌ఐసీ పాలసీ ద్వారా అప్పు చేసి మరీ కొడుకు కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ కొడుకు ఒలింపిక్ విజయానికి కొన్ని నెలల ముందే ఆయన కన్నుమూశాడు. కొడుకు గెలుపును చూడలేకపోయాడు.
కఠోర సాధనతో..
ఢిల్లీలో శిక్షణ పొందే క్రమంలో అథ్లెటిక్స్‌లో ఏదైనా ఒక ఈవెంట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన టైమ్ వచ్చింది. అప్పుడే హరియాణాకే చెందిన నీరజ్ చోప్రా.. అండర్–20 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించడం నవదీప్‌ను ఆకర్షించింది. దాంతో తనూ జావెలిన్ త్రో వైపు మొగ్గు చూపాడు. అక్కడి జావెలిన్ కోచ్ విపిన్ కసానా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ‘నా కెరీర్‌లో నేను ఎంతో మందికి శిక్షణనిచ్చాను. కానీ ఇంత తక్కువ ఎత్తు ఉన్న ఆటగాళ్లెవరూ నా వద్దకు రాలేదు. దాంతో నవదీప్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. 2.2 మీటర్ల పొడవు ఉన్న జావెలిన్‌ను పట్టుకోవడం మొదలు భుజాలపై భారం ఉంచి విసిరే వరకు అంతా భిన్నమే. జావెలిన్‌ను విసిరే కోణాల్లో కూడా మార్పు చేయాల్సి వచ్చింది. కానీ ఏం చేసినా అతని పట్టుదల ముందు అన్నీ చిన్నవిగా అనిపించాయి. కఠోర సాధనకు నవదీప్ ఏ దశలోనూ వెనుకాడలేదు’ అని విపిన్ చెప్పారు.
ఒలింపిక్ పతకాన్ని ముద్దాడి..
నవదీప్ కష్టానికి ప్రతిఫలం కొద్దిరోజులకే దక్కింది. 17 ఏళ్ల వయసులో ఆసియా యూత్ పారా గేమ్స్‌లో స్వర్ణంతో అతని విజయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత వరల్డ్ పారా గ్రాండ్ ప్రీలో స్వర్ణం గెలిచిన అతను ఈ ఏడాది ఆరంభంలో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించి ఒలింపిక్స్‌పై ఆశలు రేపాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జావెలిన్ త్రో ఎఫ్ 41 విభాగంలో (తక్కువ ఎత్తు ఉన్న ఆటగాళ్ల కేటగిరీ) స్వర్ణం గెలుచుకున్నాడు. చిన్నప్పటి నుంచి చేస్తూ వస్తున్నట్లే ఈసారి కూడా తన ఊర్లో అందరికీ ఆ పతకాన్ని చూపించి గర్వంగా నిలబడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment