గ్రామ సభ్యుల్లోంచే మండల సభ్యులు
రైతు సమన్వయ సమితుల ఏర్పాటులో కీలక మార్పులు
సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, సభ్యుల నియామక ప్రక్రియకు సంబంధించి నెలకొన్న గందరగోళంపై వ్యవసాయ శాఖ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు కలెక్టర్లకు స్పష్టతనిస్తూ ఆ శాఖ కార్యదర్శి పార్థసారథి లేఖ రాశారు. అలాగే కొన్ని కీలక మార్పులు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ రైతు సమన్వయ సమితిలో 15 మంది.. మండల, జిల్లా సమితుల్లో 24 మంది చొప్పున సభ్యులుండగా వారిని మంత్రులే నామినేట్ చేస్తారని ఇదివరకు పేర్కొన్నారు.
అయితే తాజా ఉత్తర్వుల ప్రకారం.. మండల రైతు సమన్వయ సమితి సభ్యులను వివిధ గ్రామాలకు ఎంపికైన∙సమితి సభ్యుల నుంచే ఎంపిక చేయనున్నారు. జిల్లా సమన్వయ సమితి సభ్యులను మండల సమితి సభ్యుల నుంచి నియమిస్తారు. ఇప్పటివరకు గ్రామ, మండల, జిల్లా కమిటీలకు ఆమోదం తెలిపే అధికారం వ్యవసాయ శాఖ కార్యదర్శికే ఉండేది. అయితే గ్రామ, మండల రైతు సమన్వయ సమితులను మంత్రులు నామినేట్ చేశాక, వాటిని ఆమోదిస్తూ ఉత్తర్వులిచ్చే బాధ్యత కలెక్టర్లకు అప్పగించినట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా సమితులను ఆమోదించే అధికారం వ్యవసాయ శాఖ కమిషనర్‌కు అప్పగించినట్లు వివరించారు.
ఇప్పటివరకు 2,274 సమితులే..
రైతు సమన్వయ సమితుల ఏర్పాటు మందకొడిగా సాగుతోంది. ప్రక్రియ ప్రారంభమై 4 రోజులైనా 2,274 సమితులే ఏర్పాటయ్యాయి. ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిడులు, పార్టీ కార్యకర్తల విన్నపాలతో ప్రక్రియ ఆలస్యమవుతున్నట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు. నామినేషన్‌కు సంబంధించి చివరి రోజు (9వ తేదీ) వరకు ఆగాలని మంత్రులు భావిస్తున్నారు.