రేపట్నుంచే రైతు సమన్వయ సమితులు
- మొదటి రోజు పలుచోట్ల నామినేటెడ్ సభ్యులతో సమావేశాలు
- అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసే ప్రక్రియ శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. గ్రామ, మండల, జిల్లాస్థాయి రైతు సమన్వయ సమితులను 9వ తేదీ నాటికి పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటిరోజున అన్ని జిల్లాల్లోని కొన్ని ముఖ్యమైన గ్రామాలను ఎంపిక చేసి వాటిల్లో సమన్వయ సమితి సభ్యులను నామినేట్ చేసి లాంఛనంగా సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ కమిషనర్ జగన్‌మోహన్ తెలిపారు. ఎంపిక చేసిన గ్రామాల్లో సమావేశాలకు మంత్రులు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యేలా ప్రణాళిక రచించినట్లు ఆయన వివరించారు. తొమ్మిది రోజుల్లో అన్ని రెవెన్యూ గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో సమన్వయ సభ్యులను మంత్రులు నామినేట్ చేస్తారు.
వాటికి సమన్వయకర్తలను కూడా ఏర్పాటు చేయనున్నారు. మండల, జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసే సమన్వయ సమితుల్లో గ్రామాల్లో నియమితులైన సభ్యులను కూడా నామినేట్ చేసే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అయితే అది మంత్రులపై ఆధారపడి ఉందని వివరించాయి. గ్రామ సమన్వయ సమితిలో 15 మంది, మండల, జిల్లా సమితుల్లో 24 మంది సభ్యులను నామినేట్ చేస్తారు. రాష్ట్ర సమన్వయ సమితిలో 42 మంది సభ్యులుంటారు. ఆయా సభ్యుల నుంచే సమన్వయకర్తలను నియమిస్తారు. రాష్ట్ర సమన్వయ సమితిని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా నియమించనున్నారు. దాని సమన్వయకర్తకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది. ఆయన కార్పొరేషన్ చైర్మన్ స్థాయిని కలిగి ఉంటారని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఇది పూర్తిగా సీఎం పరిధిలోది కాబట్టి ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆ వర్గాలు వివరించాయి.
వ్యవసాయశాఖ అధికారులకు నేడు సీఎం శిక్షణ
సమన్వయ సమితుల ఏర్పాటు తర్వాత వాటి నిర్వహణ, పెట్టుబడి పథకం అమలు తదితర అంశాలపై వ్యవసాయశాఖ అధికారులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం వ్యవసాయాధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల యంలో మండల స్థాయి ఏవోలు మొదలు రాష్ట్రస్థాయి అధికారుల వరకు ఈ శిక్షణలో పాల్గొంటారు. సహకా ర, ఉద్యానశాఖ అధికారులు కూడా పాల్గొంటారు.