సమితులకు ‘పత్తి’ బాధ్యత!
రైతు సమితులకు తొలి బాధ్యత అప్పజెప్పిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: పత్తి దళారులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రైతు సమన్వయ సమితులకు బాధ్యత అప్పగించింది. రైతు సమితులు ఏర్పాటయ్యాక అందు లోని సభ్యులకు ప్రభుత్వం తొలి బాధ్యత అప్పగించడం గమనార్హం. వచ్చే నెల నుంచి మార్కెట్లోకి పత్తి పెద్ద ఎత్తున తరలి రానుండటంతో ఆయా రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సమితి సభ్యులకు వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. ఇటీవల పత్తి కొనుగోళ్లపై జరిగిన వీడియో కాన్ఫరెన్సులో సమితి సేవలను వినియోగించుకుంటామని జిల్లా కలెక్టర్లు కోరారు. అందుకు వ్యవసాయ శాఖ అనుమతించింది.
శాంతి భద్రతల సమస్య రాకుండా..
రైతులకు అవసరమైన సహకారం అందించడమే సమన్వయ సమితుల ప్రధాన బాధ్యత. ఇప్పటికే గ్రామ, మండల రైతు సమితులను ఏర్పాటు చేయగా.. త్వరలో జిల్లా, రాష్ట్ర స్థాయి సమితులు ఏర్పాటు కానున్నాయి. మొత్తం ఏర్పాటైతే అన్నింట్లో కలిపి దాదాపు 1.60 లక్షల మంది సభ్యులుంటారు. విత్తనం కొనుగోలు మొదలు, పండించిన పంటకు గిట్టుబాటు ధర అందే వరకు రైతు సమితులే ముందు వరుసలో ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గతేడాది ఖమ్మంలో మిర్చి కొనుగోళ్ల సందర్భంగా మార్కెట్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సమితులపై ఉంది.
ఈసారి పత్తి భారీగా మార్కెట్లకు రానున్న నేపథ్యంలో.. ఒకేసారి అన్ని గ్రామాల రైతులు పత్తి తీసుకొస్తే శాంతి భద్రతల సమస్య రావొచ్చని, ఆ పరిస్థితి రాకుండా చూడాలని సర్కారు నిర్ణయించింది. అందు కోసం మార్కెట్ అధికారులతో సమితి సభ్యులు సమన్వ యం చేసుకుంటారు. తమ పరిధిలోని ఏ గ్రామాల రైతులు ఏ రోజున పత్తిని మార్కెట్‌కి తరలించాలో షెడ్యూల్ తయారు చేస్తారు. ఆ ప్రకారం గ్రామ సమితి సభ్యులు తమ షెడ్యూల్‌ను బట్టి పత్తి రైతులను మార్కెట్‌కు పంపిస్తారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో సక్రమంగా పత్తి కొనుగోలు చేస్తున్నారా, లేదా అనేది పర్యవేక్షిస్తారు. విక్రయించిన పత్తికి నిర్ణీత సమయంలో రైతుకు సొమ్ము అందుతున్నదో లేదో పర్యవేక్షిస్తారు.
490 మండల సమితుల ఏర్పాటు
రాష్ట్రంలో ఇప్పటివరకు 490 మండల రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ఉత్తర్వులు జారీ అయ్యాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇంకా 69 మండల సమితుల ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. మొత్తం మండల సమితులకు ఉత్తర్వులు జారీ కాగానే జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితులు ఏర్పాటు కానున్నాయి. అవి దసరా తర్వాతే ఏర్పాటు కావచ్చొని సమాచారం.