రైతు సమితి సభ్యులపై సీఎం కేసీఆర్ స్పష్టీకరణ
- రైతులకు సహకారం మాత్రమే అందిస్తారని వెల్లడి
- తామూ రైతు కమిటీలు వేస్తామని కాంగ్రెస్ అనడంపై మండిపాటు
- దసరా నాటికల్లా 20 లక్షల గొర్రెలను పంపిణీ చేస్తాం..
- విదేశాలకు మాంసం ఎగుమతి చేసే రాష్ట్రంగా వృద్ధి చెందాలని ఆకాంక్ష
- ప్రాజెక్టులకు ఈ ఏడాది రూ.45 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
- 100 సంచార పశు వైద్య శాలల వాహనాలను ప్రారంభించిన సీఎం
- అత్యవసర సేవలకు 1962 నంబర్ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితుల్లోని సభ్యులకు ఎలాంటి అధికారాలు ఉండబోవని, వారు రైతులకు వారధులుగానే ఉంటారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ఎలాంటి అధికారం చలాయించరని, సహకారం మాత్రమే అందిస్తారని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర తెచ్చేందుకు, రైతులను సంఘటితం చేసేందుకు ఈ సమితులు విశేషంగా కృషి చేస్తాయని వెల్లడించారు. ఈ సమితులు ఇతరుల హక్కులను హరించడం లేదని, సమితులపై కొందరు కోర్టుకు వెళ్లడం ‘విపరీత ధోరణి’ అని మండిపడ్డారు. ‘ప్రభుత్వం కమిటీలు వేస్తే తామూ ప్రత్యామ్నాయంగా కమిటీలు వేస్తామని కొన్ని పార్టీల (కాంగ్రెస్) వారు అంటున్నారు. వాళ్లకు దేవుడు ఏం తెలివి ఇచ్చిండో వాళ్లకే తెలియాలి.
ఎక్కడైనా ప్రభుత్వం కమిటీలు వేస్తుంది. కానీ వాళ్లు (కాంగ్రెస్) కూడా కమిటీలు వేస్తామంటే జనం నవ్వుకుంటున్నారు’ అని సీఎం ఎద్దేవా చేశారు. అనవసరంగా రాద్ధాంతానికి పోయి ప్రగతి నిరోధకులుగా మారొద్దని హితవు పలికారు. పశుసంవర్ధక శాఖ చేపట్టిన సంచార పశు వైద్యశాలల వాహనాలను శుక్రవారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద కేసీఆర్ ప్రారంభించారు. వాహనాల లోపలి భాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ, 60 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీల పాలనల్లో రైతుల గురించి ఆలోచించే పరిస్థితే లేదన్నారు. మరో వందేళ్లయినా.. రైతుకు పెట్టుబడి పథకం కింద రూ.8 వేలు ఇచ్చే ఆలోచన కూడా చేయరని విమర్శించారు. ఇనుము ముక్కలు ఏరుకునే వారికి కూడా సంఘం ఉందని, కానీ రైతులకు లేదని అందుకే తాము సమితులు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వివరించారు. గ్రామీణ వ్యవస్థను పరిపుష్టం చేయాలన్న కొత్త పంథాలో ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు.
మాజీ ప్రధాని దేవెగౌడ ప్రశంసించారు..
రైతులకు పెట్టుబడి పథకం కింద ఆర్థిక సాయం చేయడంపై మాజీ ప్రధాని దేవెగౌడ అభినందించారని కేసీఆర్ పేర్కొన్నారు. ‘నేను సీఎంగా పనిచేశా. ప్రధానిగా చేశా. కానీ పెట్టుబడి పథకం ఆలోచన రాలేదు. భారత దేశ రైతుల తరఫున మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. చంద్రశేఖర్‌రావు నేను హైదరాబాద్ వస్తా. మీ ఇంటికి వచ్చి అభినందిస్తా’ అని దేవెగౌడ అన్నట్లు సీఎం తెలిపారు. కానీ మాజీ ప్రధానిని రప్పించుకోవడం బాగుండ దని, తానే బెంగళూరు వస్తానని చెప్పినట్లు వివరిం చారు. సాగు నీటి ప్రాజెక్టుల కోసం బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయించామని, బ్యాంకుల సహకారం తో రూ.20 వేల కోట్లు రుణంగా తీసుకున్నామని తెలిపారు. అలా ఈ ఏడాది రూ.45 వేల కోట్లు ఖర్చు చేయడం దేశంలో రికార్డు అని సీఎం వివరించారు. కేంద్ర బడ్జెట్‌లోనూ ఇంత కేటాయించలేదన్నారు.
మూడు ప్రాజెక్టులు.. కోటి ఎకరాలు..
రైతులకు నీరు, పెట్టుబడి, గిట్టుబాటు ధర కీలకమని సీఎం పేర్కొన్నారు. నీటి కోసం నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని, ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాదిలో కాళేశ్వరం నీళ్లు ఏడు జిల్లాలకు వచ్చే ఆస్కారముందని, పాలమూరు ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు త్వరలోనే పూర్తి కాబోతున్నాయని తెలిపారు. ఈ మూడు ప్రాజెక్టులు రాబోయే ఏడాదిన్నరలో పూర్తి చేసి కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసుకోవచ్చని వివరించారు. రాష్ట్రంలో 20 నుంచి 25 లక్షల వరకు బోరు బావులున్నాయని చెప్పారు. ‘పూర్తిస్థాయి కరెంటు ఇవ్వడానికి రెండు మూడేళ్లు పడుతుందని ఎన్నికల్లో చెప్పా. కానీ ఆరు నెలల్లోనే కరెంటు ఇచ్చాం. ఇప్పుడు కరెంటు ఉంటే వార్త కాదు. పోతేనే వార్త. 24 గంటల కరెంటు వద్దని పూర్వ నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ రైతులు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. అందరితో చర్చించాక చూద్దామని వారితో అన్నా’ అని సీఎం వివరించారు.
మానవ వనరులు గుర్తించడంలో కొత్త ట్రెండ్
మానవ వనరులను గుర్తించడంలో రాష్ట్రంలో కొత్త ట్రెండ్ మొదలైందని కేసీఆర్ అన్నారు. ‘రాష్ట్రంలో 30 లక్షల మంది గొల్లకుర్మలుంటే, రోజుకు 650 లారీల గొర్రెలను దిగుమతి చేసుకోవడం శోచనీయం. అలాగే పాడి పశువులు దండిగా ఉన్నా గుజరాత్, కర్ణాటకల నుంచి రోజుకు 8 లక్షల లీటర్ల పాలు దిగుమతి చేసుకుంటున్నాం. ఇది ఒకరకంగా మనకు సిగ్గుచేటు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు పాడి–పంటను అభివృద్ధి చేస్తున్నాం.
అందులో భాగంగానే రూ.5 వేల కోట్లతో గొర్రెలను పంపిణీ చేస్తున్నాం. ఇప్పటివరకు 18.74 లక్షల గొర్రెలను పంపిణీ చేశాం. ఇది దేశంలోనే ఆల్ టైం రికార్డు. దసరా నాటికి 20 లక్షల గొర్రెలను పంపిణీ చేస్తాం. 4 లక్షల యూనిట్లు అనుకుంటే, 7 లక్షల యూనిట్లకు దరఖాస్తులు వచ్చాయి. వారందరికీ గొర్రెలు ఇస్తాం. తెలంగాణలో ఎక్కువ గొర్రెలు పెంచడమే రూలు’ అని సీఎం పేర్కొన్నారు. దేశానికి అవసరమైన మాంసం, అంతర్జాతీయ స్థాయిలో మాంసం ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణను సీఎం ప్రశంసించారు.
రూ.వెయ్యి కోట్లతో చేపల పెంపకం
రాష్ట్రంలో చేపల పెంపకాన్ని రూ.వెయ్యి కోట్లతో పెద్ద ఎత్తున చేపడుతామని సీఎం అన్నారు. గతేడాది 27 కోట్ల చేపలను పంపిణీ చేస్తే, ఈసారి 70 కోట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గతంలో రాష్ట్రంలో చేప ఉత్పత్తి కేంద్రాలను ధ్వంసం చేశారని, హుసేన్‌సాగర్ కింద ఉన్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. అలాంటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను పునరుద్ధరించడంతోపాటు ప్రతీ రిజర్వాయర్ కింద చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్‌కు, కాల్ సెంటర్ ప్రతినిధికి మధ్య సంభాషణ
కాల్ సెంటర్: నమస్తే.. పశు ఆరోగ్య సేవకు మేం ఏ విధంగా సహాయపడగలం సార్.. చెప్పండి సార్..
సీఎం: మీరు ఏ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నారమ్మా?
కాల్ సెంటర్: చెప్పండి సార్
సీఎం: అమ్మా మీరు ఎక్కడున్నారు? ఎంత సేపట్లో రాగలుగుతారు?
కాల్ సెంటర్: 30 నిమిషాల్లో రాగలుగుతాం.. మీ పశువుకు ఏమైందో చెప్పగలుగుతారా? సార్..
సీఎం: ఇక్కడ పశువు లేదమ్మా.. ఇది ప్రారంభోత్సవం.. కంగ్రాట్యులేషన్స్ గో హెడ్.
కాల్ సెంటర్: ధన్యవాదాలు సార్.. 1962 నంబ ర్‌కు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు సార్..
100 సంచార పశు వైద్యశాలలు ప్రారంభం
దేశంలోనే 100 సంచార పశు వైద్యశాలల వాహనాలను ప్రారంభించడంపై సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. ఒక్క ఫోన్ కొడితే డాక్టరే రైతు ఇంటి ముంగిటకు వస్తారని, అన్ని పరిక రాలు, మందులు వాహనంలోనే ఉంటాయన్నా రు. సంచార వైద్య శాలల డిజైన్ మార్చాలని, నెలకు ఇంత దూరం తిరగాలన్న నిబంధన పెట్టా లని అధికారులకు ఆదేశించారు. రైతులు ఫోన్ చేసినప్పుడు సర్వీసులు అందిస్తూనే వ్యాక్సినేషన్ తదితర కార్యక్రమాలు చేయాలన్నారు. కార్యక్రమంలో మంత్రులు నాయిని, పోచారం, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం సంచార వైద్య శాల హెల్ప్‌లైన్ నంబర్ 1962కు ఫోన్ చేశారు.