
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతు కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందా..? ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి చైర్మన్‌గా త్వరలో రాష్ట్ర రైతు సమితి ఏర్పాటు కానుందా..? పరిస్థితులు అందుకు అవుననే సమాధానం చెబుతున్నాయి. ‘రైతులకు పెట్టుబడి పథకం’అమలుతీరుపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం.. జిల్లా సమన్వయ సమితులను త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు ఇటీవల అందజేసిన నివేదికలో సిఫార్సు చేసింది. దీంతో జిల్లా సమితులతోపాటు రాష్ట్ర రైతు కార్పొరేషన్ కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో రైతు కార్పొరేషన్ చైర్మన్ చాంబర్‌నూ సిద్ధం చేయడం ఇందుకు ఊతమిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇదంతా జరిగినట్లు తెలిసింది. ఎంపీ గుత్తా సూచనల మేరకు వాస్తు ప్రకారంగా చాంబర్‌ను తీర్చిదిద్దారని.. ఆయన అనుచరుల కనుసన్నల్లోనే చాంబర్, మీటింగ్ హాలు సిద్ధమైందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో త్వరలోనే గుత్తాకు చైర్మన్ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం ఊపందుకుంది.
కార్పొరేషన్ పర్యవేక్షణలో..: పెట్టుబడి పథకం కింద రైతులకు ఎకరాకు రూ. 4 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వచ్చే మే 15 నాటికి చెక్కుల రూపంలో ఈ సొమ్మును సర్కారు అందించనుంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు సమన్వయ సమితుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియను చేపడతారని సమాచారం. అంతేకాదు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని పర్యవేక్షణలోనే పథకం అమలయ్యే అవకాశముందన్న ప్రచారమూ జరుగుతోంది. గ్రామ, మండల రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ఇప్పటికే పూర్తయింది.
లక్షన్నర మందికిపైగా రైతులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర స్థాయి సమితులను ఏర్పాటు చేయా ల్సి ఉంది. వీటిని ముఖ్యమంత్రే స్వయంగా పరిశీలించే అవకాశముంది. రాష్ట్రస్థాయి సమితిని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశాక దానికి చైర్మన్‌ను నియమిస్తారు. కార్పొరేషన్ పరిధిలోకి కిందిస్థాయి సమితులను ఎలా తీసుకురావాలని తర్జనభర్జన జరుగుతోంది.
విత్తనం మొదలు గిట్టుబాటు వరకు..: రాష్ట్రస్థాయి సమితి మూలధనం రూ. 500 కోట్లని గతంలో సీఎం పేర్కొన్న నేపథ్యంలో కార్పొరేషన్‌కు విస్తృత అధికారాలే ఉండే అవకాశం ఉంది. కార్పొరేషన్‌కు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించడంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కార్పొరేషన్‌ను కంపెనీ యాక్టు కిందే ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.
విత్తనం మొదలు పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర వచ్చే వరకూ రైతులకు అండగా ఉండాలన్నదే కార్పొరేషన్ ముఖ్య ఉద్దేశం. పంటకు గిట్టుబాటు ధర రాకుంటే కార్పొరేషనే కొనుగోలు చేస్తుంది. అందుకు అవసరమైన నిధులు కంపెనీ యాక్టు ద్వారానే వస్తాయంటున్నారు. కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రత్యేకంగా చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఉత్తర్వు సరిపోతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment