
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతు సమన్వయ సమితిని లాభాపేక్షలేని సంస్థ(కార్పొరేషన్)గా నమోదు చేసినట్లు ఉత్తర్వులో పేర్కొంది. రైతు సమన్వయ సమితిలో ఐదుగురిని డైరెక్టర్లుగా నియమించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి డైరెక్టర్, చైర్మన్ హోదాలో ఉంటారు.
వ్యవసాయ శాఖ కమిషనర్ ఎం.జగన్‌మోహన్‌ను రైతు సమన్వయ సమితి ఎండీగా, ఉద్యాన శాఖ డైరెక్టర్ ఎల్.వెంకట్రామిరెడ్డి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సి.హెచ్.వి.సాయిప్రసాద్‌ను రైతు సమన్వయ సమితి డైరెక్టర్లుగా నియమించారు. నియామక ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, విధి విధానాలను త్వరలో ఖరారు చేస్తామని తెలిపారు. కాగా, రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా నియమితులైన గుత్తా సుఖేందర్‌రెడ్డి మార్చి 12న బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment